99ఫ4;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*వినడమూ మోక్షమార్గమే!*
➖➖➖✍️
```
జ్ఞానేంద్రియాల్లో 'శ్రవణం' ఒకటి. శ్రవణం అంటే వినటం. ఇదో ఆధ్యాత్మిక, నైతిక ప్రక్రియ. భక్తిసాధన, జ్ఞానార్జన, మోక్షప్రాప్తి కోసం శ్రవణం మార్గదర్శనం చేయిస్తుంది.
బమ్మెర పోతన రాసిన భాగవతంలో ధ్రువుడు తన తల్లి సునీతి మాటలు ఆలకించి అడవులకు వెళ్తాడు. నారద మహర్షి వినిపించిన శ్రీహరి స్తోత్రం అవిరామంగా జపించి ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకుంటాడు.
భక్తి సాధనలో శ్రవణం పోషించే ముఖ్య పాత్రను తెలియచెప్పే పురాణ గాథలు చాలా ఉన్నాయి.
విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి ఉప దేశాలను ఆసక్తిగా ఆలకించాడు. కన్నతండ్రి దాష్టీకాలకు ఎదురొడ్డి భగవంతుడి సన్ని ధానం సాధించాడు. శ్రవణ జ్ఞానమే బాలభక్తుడికి ఆ శక్తిని ప్రసాదించింది.
పరీక్షిత్తు మహారాజు మృత్యువును ఎదుర్కొనే సందర్భంలో శుకమహర్షి చెప్పిన భాగవత కథలను అమిత శ్రద్ధగా విన్నాడు. ఆ శ్రవణభక్తి ఆ చక్రవర్తికి మోక్షప్రాప్తిని సులభతరం చేసింది.
'విన్నవారికి మోక్షము విందుగాదా?' అని రామదాసు అన్నది ఈ తరహా కథలు విన్నందు వల్లే.
యోగశాస్త్రం జ్ఞానసాధనకు మూడు ప్రధాన మార్గాలను సూచించింది. అందులో జ్ఞానుల ఉపదేశాలను వినే శ్రవణ మార్గం మొదటిది.
వినడం అంటే కేవలం శబ్దాలను గ్రహించడం కాదు, అది అర్థవంతమైన చర్యకు పురిగొల్పే ప్రక్రియ.
అన్నమయ్య వినటాన్ని ఆధ్యాత్మిక సాధ నగా అభివర్ణించాడు.
ఒకరు చెప్పింది విని వేరొకరు వినేందుకు తిరిగి చెప్పినవి వేదాలు. అందుకే అవి 'శ్రుతులు' అయ్యాయి.
నారదుడి సంక్షేప రామాయణం విన్న తరవాత వాల్మీకి విస్తృత రామాయణ రచనకు పూనుకున్నాడు.
'బుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక అన్నాడు త్యాగ రచనకు రాజు.
మంచి మాటలు వినక చెడినవారు చరిత్రలో చాలా మందే ఉన్నారు. సత్పురు షుల, మహర్షుల హితబోధలను పెడచెవిని పెట్టరాదు. దుర్మార్గుల, దుష్ట బుద్ధుల మాటలకు చెవినొగ్గరాదు.
విదురుడి సద్బోధలు వినక, కురుక్షేత్ర యుద్ధానికి, కౌరవ వంశ వినాశనానికి కారకుడయ్యాడు ధృతరాష్ట్రుడు.
మంధర దుర్బోధలు విని రాముడి అరణ్యవాసానికి, దశరథుడి మరణానికి కారణమైంది కైకేయి.
వినడం ఒక కళ. ఎవరు చెప్పినా వినాలి. విన్నది విన్నట్లుగా గాక వివరంగా విచారించాలి. మంచి చెడ్డలు గ్రహించి, ఆనక చిత్తశుద్దితో ఆచరించాలి. ఇదే నీతి మంతుల లక్షణం అని సుమతీ శతకం బోధించింది.
మేధస్సుకు అందే సమాచారం మూడొంతులు శ్రవణం ద్వారా లభించేదే. నిమిషానికి వెయ్యి మాటల వరకు ఆలోచిస్తే, కేవలం నూట పాతిక మాటలు మాత్రమే ఆలకించగలం.
బ్రహ్మ సృష్టి ఒక నాలుక, రెండు చెవులు.
తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలని విధాత ఆదేశం.
చెవుల కన్నా నాలుకకు ఎక్కువ పని పెట్టడం మూర్ఖత్వం.
వినే ఓర్పు కలవాడే అంతిమంగా విజయం సాధిస్తాడు.✍️
-కర్లపాలెం హనుమంతరావు.```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి