16, జులై 2025, బుధవారం

Panchaag


 

పంచపునీతులు

 *పంచపునీతులు.....*


*⭐ వాక్ శుద్ధి*

*⭐ దేహ శుద్ధి* 

*⭐ భాండ శుద్ధి* 

*⭐ కర్మ శుద్ధి* 

*⭐ మన శుద్ధి*


*💠 వాక్ శుద్ధి :*

*వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు... పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు... మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.*


*💠 దేహ శుద్ధి :*

*మన శరీరం దేవుని ఆలయం వంటిది... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, రెండు పూటలా స్నానం చెయ్యాలి... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.*


*💠 భాండ శుద్ధి :*

*శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది.*


*💠 కర్మ శుద్ధి :*

*అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు.*


*💠 మనశ్శుద్ధి :*

*మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి... మనస్సు చంచలమైనది... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి.*


*👉ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!*


*👉ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!*


*👉నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!*


*👉యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!*


*👉సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!*


*👉గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!*


*👉సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!*


*👉పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!*


*👉మనిషిలో భక్తి ప్రవేశిస్తే మనిషి మాధవుడు అవుతాడు !!*


*┈┉┅━❀꧁హరే కృష్ణ ꧂❀━┅┉┈*

         *ఆధ్యాత్మిక అన్వేషకులు*

🦚📿🦚 🙏🕉️🙏 🦚📿🦚

ఆంజనేయ స్తుతి

 🌸ఆంజనేయ స్తుతి🙏

సీస పద్యం

రామభక్త హనుమ రావయ్య వేగమే 

పావన హనుమయ్య పరమ పురుష

సంజీవ రాయుడా సర్వజ్ఞ సామీర

సత్వరమే రమ్ము సాధు చరిత 

పవనతనయ మము పాలింప వయ్యనీ

సేవయే మాకును చింత తీర్చు

జలధిని దాటియు జానకి జాడను 

తెలిపిన తేజస్వి ధీరహనుమ

తే,గీ సూర్యుని దరికి చేరియు శ్రుతులు నేర్చి

వ్యాకరణపండితుడవైన వాయుపుత్ర

రామసుగ్రీవులకుమైత్రి లక్షణముగ

నెరిపినట్టిప్రసన్నాంజనేయ శరణు 

సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

పాండవ బీడు

 *పాండవ బీడు: (మాటల మూటలు - బూదరాజు రాధాకృష్ణ)*



భారత కథను ఉగ్గుబాలతో నేర్చినందువల్ల కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన పాండవులూ, వారి పరిపాలనలో అనాథలు, విధవలు, వృద్ధులు, యుద్ధంతో సంబంధంలేని వ్యక్తులూ ఉన్నందువల్ల దేశం బీడుగా మారిందనే భావమూ ఒంటపట్టి ఈ మాటకు విశేషార్థం వచ్చింది. నిజానికి పాడవ/ పాండవ అనే తెలుగు మాటకు 'దున్నని భూమి' అని అర్థం. వ్యవసాయానికి పనికిరాని బంజరు నేలనూ ఊసర క్షేత్రాలనూ మరుభూములనూ పాడవ భూములు.. తెలంగాణలో పడావు భూములు అంటారు. పాండవ అనేది దానికి రూపాంతరం. పాడవ/పాండవ బీడు అని ఈ అర్థాల్లో నిఘంటువులకెక్కిన మాట ఇది. ధ్వని సాదృశ్యంవల్ల తెలుగు సంస్కృతాల్లోని పాండవ శబ్దమూ పాండురాజు సంతానమూ ఒకటేనన్న భ్రమ కలిగిందన్నమాట. యువకులందరూ యుద్ధంలో హతులైనారు కాబట్టి పాండవుల పరిపాలనలో సేద్యం మందగించి రాజ్యం బీడుగా మారిందన్న భావం ఈ భ్రమకు ప్రధాన కారణం. పాదవ శబ్దం పాడు (బడిన) నేల అనే సమాసంలోని ' "పాడు'కు సంబంధించింది. పురాణకథలకున్న ప్రాబల్యమటువంటిరి.


సేకరణ

ఈశ్వరేచ్ఛ

 *_“ఈశ్వరేచ్ఛ” అంటే...ఏంటి???_*

=================



*ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు. ఆయన నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది. దాన్నే మనం "ఈశ్వరేచ్ఛ" అంటాం.* 


*దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం......* 


*ఎవరు ఏ కర్మ చేస్తే వారికి దానికి తగిన ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి. కాబట్టే ఈ కర్మలు నమోదై, ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాం.*


*ప్రతి మనిషికీ ప్రతీ సంఘటనకీ తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. భక్తుడే కావచ్చు, జ్ఞాని కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్థును పరిథిని అతిక్రమించకూడదు.*


*అంతస్థు అంటే ధనం, ఐశ్వర్య సంబంధితం కాదు. ఉద్యోగం చేస్తున్నచోట మనతో కలిసి పనిచేసే వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మం కాదు. (అవతల వ్యక్తి సేవకా వృత్తిలో ఉన్నప్పటికీ) ఒకరు సేవ్యుడు, ఒకరు సేవకుడు. అంతవరకే. ఆ హద్దు మీరవద్దు. ఏ అంతస్థులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో ఉన్నా మన పరిధి దాటకూడదు. దాన్ని దాటితే ధర్మాన్నిఅతిక్రమించిన దోషం కలుగుతుంది.*


*శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు. మానవుడుగా జీవించాడు. యుద్ధంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే, ఆ "ఈశ్వర" అంశ అని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడు గానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిథి దాటలేదు. తన పరిథిని అతిక్రమించలేదు.*


*శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిథేమిటో తెలియవచ్చేలా చేసాడు. భీష్ముడు దైవీశక్తులు కలవాడు. దైవాంశ సంభూతుడు. వసువులలో ఒకడు.*


*కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళుమరచి తన దైవీశక్తులను ప్రకటిస్తూ, పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేసాడు. భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిథిని మించి దైవీ శక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆయుధం పట్టనన్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు.*

*భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు.*


*సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిథిని మీరలేదు.* 

*గీతలో "నీ కర్తవ్యం యుద్ధం చేయడం. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం , ఓడితే స్వర్గం" అన్నాడు తప్ప.. “ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడతా" అని చెప్పలేదు.*

*నువ్వు చేయవలసింది, నీ పరిథిలో చేయమని చెప్పాడు. ’ధర్మంపాటించు’ అన్నాడంతే. కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు.*


*కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు...”నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు. నువ్వు యుద్ధం చేయబోతున్నావు. మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు. మీరు రాజ్యం చేస్తారు" అని చూపించాడే తప్ప “నేను మీకిచ్చేస్తున్నాను" అని చెప్పలేదు. అలా ఐతే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు కదా…! అలా చేయలేదు.*


*అంటే... మనం చేసే కర్మలకు తగిన ఫలితమే మనకు వస్తుంది. “ఈశ్వరేచ్ఛ" అంటే కూడా అదే. ఏ కర్మకు ఏ ఫలితాన్నివ్వాలో నిర్దేశించడం తప్ప మరోటికాదు.*

నినుసేవించిన కష్టముల్ గలుగనీ

 శు భో ద యం 🙏


నినుసేవించిన కష్టముల్ గలుగనీ

నిత్యోత్సవంబ్బనీ జనిమాత్రుండననీమహాత్ముడననీ సంసారమోహంబు పై

కొననీ జ్ఞానముగలుగనీ గ్రహగతుల్గుదింపనీకీడు వ

చ్చిన రానీ అవినాకు భూషణములే!శ్రీకాళహస్తీశ్వరా!!

-శ్రీకాళహస్తీశ్వరశతకము-మహాకవి ధూర్జటి.


     స్వామీ! శ్రీకాళహస్తీశ్వరా! కష్టములే రానిమ్ము నష్టములేరానిమ్ము.సుఖములేరానిమ్ము దుఃఖములేరానిమ్ము సంసారవ్యామోహము ఆక్రమింపనిమ్ము,.గ్రహదుర్దోషములేకలుగనిమ్ము. మేలురానీ కీడు రానీ అవియెల్ల నీ ప్రసాదములేయని భావింతును. నిన్నువిడువను .నీసేవమరువనని దీనిభావము.

 భక్తునకు ఉండవలసినది

ఇటువంటి నమ్మకము.పట్టుదల.దీక్ష!

                         స్వస్తి!!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌟🌷🌟🌷🌷🌷🌷🌷

శ్రీమద్భాగవత కథలు*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌹మంగళవారం 15 జూలై 2025🌹*

          ఈ రోజు నుంచి 

                   2️⃣``    

           *ప్రతిరోజూ...* 

  *మహాకవి బమ్మెర పోతనామాత్య..*

``

                  

     *శ్రీమద్భాగవత కథలు*               

```

వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి తెనిగించి, ఆ అమృత భాండాగారాన్ని అచ్చతెలుగు వారందరికీ అందించారు. 


సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. 

```

‘పలికెడిది భాగవతమటనే పలికిన భవహర మగునట’``` అని తన 

వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో పోతన చెప్పారు.```

 

*భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలి కైన దమ్మిచూలి కైన*

*విభుదజనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపఱతు!*

```

పోతనార్యుని కవితా వైదుష్యానికి మచ్చుతునక ఈ పద్యం. ఈ చిన్న పద్యంలో ఎంతో గొప్ప భావం ఉన్నది. భాగవతం పురాణ గ్రంధమే కాక వేదాంత ధోరణి, తత్త్వము నిబిడీకృతమయిన మహా కావ్యము. దీనిలో భక్తితో పాటు వేదాంత ధోరణి అంతటా కనిపిస్తుంది. అందుకే భాగవతాన్ని అర్థం చేసుకొనుట కష్టమని పోతన విన్నవించుకున్నాడు. అదియునూ సామాన్యముగానా! శివునికి, బ్రహ్మకు కూడా సాద్యం కాదన్నాడు. మరి మహావిష్ణువు గురించి ఎందుకు చెప్పలేదు? 


ఈ కావ్యములో గాధలన్నియూ ఆయనవే కదా! అతని కధ చెప్పుకోవడం అతనికే సాద్యం. మరి పండితులకు కవులకు సామాన్యులకు కొరక బడేది కాదని సున్నితముగా చెబుతూ ఆ నారాయణుని కీర్తించాడు. భక్త శిఖామణి కృతికర్త. భక్త రక్షకుడు కృతి భర్త, కధానాయకుడు. దీనిలో ఇన్ని మర్మాలున్నాయి కనుకనే బ్రహ్మకు శివునకు మాత్రమే తప్ప నేనెంతవాడిని ‘విభుధ జనుల వలన విన్నంత కన్నంత’ అని సెలవిచ్చి తప్పించుకున్నాడు కాని వారెవరో చెప్పలేదు. 


ఆ కాలంలో విష్ణు కధలను చాలమంది పండితులు కధలు కధలుగా చెప్పుకునే సంప్రదాయముండెనేమో? ఆ వివరాలను సేకరించి, కావ్య రచనకు పూనుకున్నాడు. కాని అంతకు ముందే మూల భాగవతానికి (వ్యాసభాగవతం) వ్యాఖ్యానం వ్రాసిన శ్రీధర పండితుని మాత్రం చాలా వరకు కావలసిన చోట్ల వినియోగించుకున్న వివరాలు కావ్యమంతటా కనిపిస్తుంది. కొన్ని ఘట్టాలలో అతనిని మించి, సాహసించి, స్వతంత్రించి, ప్రయోగించిన, ఘాటుదనం కనిపిస్తుంది. ఇది ఈ భక్తకవి కవితారీతి.


```

*ఎన్నిసార్లు విన్నా.. పఠించినా.. పారాయణం* *చేసినా తనివితీరనివి భాగవత కథలు. పౌరాణికులు* *ధార్మికులు, మహాత్ములు ఈ కథలను సప్తాహంగానో, ప్రసంగాల ద్వారానో, సత్సంగాల్లోనో ప్రవచనాలందించడం సంప్రదాయం. ఈ భాగవత కథలను ఎంతో సరళంగా, ఆసక్తికరంగా, తమ కలం ద్వారా అందించారు*

 *ఆధ్యాత్మిక రచయిత శ్రీ వనం జ్వాలానరసింహారావు గారు*

``

*చదివెడిది భాగవతమిది, చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్*

*చదివినను ముక్తి కలుగును, చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై*```

 

అంటూ సాక్షాత్తూ పోతనామాత్యులు ఆవహించినట్లుగా ఎంతో భక్తితో, అనురక్తితో, మీదు మిక్కిలి శ్రద్ధతో, దీక్షగా భాగవత కథాస్రవంతిని తమ కలం ద్వారా ఈ పుస్తకాన్ని, గళం ద్వారా సామాజిక మాధ్యమాల్లో అందించి అందరినీ ముగ్ధులను, పునీతులను చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న విపత్కర సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమై స్వీయనిర్బంధంలో ఏదో వ్యాపకంతో కాలక్షేపం చేస్తుండగా, వనం జ్వాలానరసింహారావు గారు కేవలం ఆధ్యాత్మిక వ్యాపకంతో గత ఆరునెలలుగా క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. 


జ్వాలాగారు మొదట వేదభాష్య గ్రంథాలనన్నిటినీ తిరగేసి, తర్వాత భాగవత కథారచనను ఆరంభించి అంకితభావంతో ఒక పవిత్రయజ్ఞంలా పూర్తిచేశారు. గతంలో ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారు (వాసుదాసస్వామి) తెనిగించిన ‘మందరం’ రామాయణం (పూర్వ) ఆరుకాండలను ఎంతో సరళంగా వచనంతో ‘మందర మకరందం’ గ్రంథాలుగా వెలువరించగా, దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రికలో ధారావాహికగా ఇస్తూ ఆరు గ్రంథాలను రామకార్యంగా సభాక్తికంగా ప్రచురించింది. దర్శనమ్ సహా వివిధ పత్రికల్లో వారు రాసిన వ్యాసాల సంకలనం ‘ధర్మధ్వజం’ అనే గ్రంథాన్ని కూడా దర్శనమ్ వెలువరించి పాఠకలోకానికి ఉచితంగా అందించింది. ప్రస్తుతం ప్రతిఒక్కరూ చదవదగిన, ప్రతి ఇంటిలో దాచుకోదగిన

``` *శ్రీవనం జ్వాలానరసింహారావు* గారి *కలం నుంచి జాలువారిన ‘శ్రీమద్భాగవత కథలు'* పవిత్ర గ్రంథాన్ని కూడా ప్రచురించే భాగ్యం కలగటం దర్శనమ్ పరివారం భాగ్యం. ఈ అవకాశాన్ని కల్పించిన 

శ్రీ వనం జ్వాలానరసింహారావు గారికి మనఃపూర్తిగా ధన్యవాదాలు. వారి ఆధ్యాత్మిక రచనాస్రవంతి ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పుస్తకానికి లేఔట్ సెట్టింగ్ అందించిన శ్రీనివాసరావు త్రిపురాన గారికి, అందమయిన ముఖచిత్రాన్ని అందించిన రామోజు గణేశ్ గారికి, పుస్తకాన్ని ముద్రించిన శ్రీ సాయి తిరుమల ప్రింటర్స్ అధినేత లక్ష్మి నర్సు గారికి ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు.

``

                              

             *(సశేషం)*


*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)

__________________ 

     *జ్వాలా వారి విశిష్ట* 

     *వ(ర)చనామృతం* 

                      

  *‘శ్రీమద్భాగవత కథలు'*


*మరుమాముల వెంకటరమణ శర్మ (పబ్లిషర్)

*సంపాదకులు, దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక.```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వ్రాసెను ఖడ్గసృష్టి కృతి

 *వ్రాసెను ఖడ్గసృష్టి కృతి వంగ కవీంద్రుడునౌ రవీంద్రుcడే*

ఈ సమస్యకు నా పూరణ. 


వేసట నొందె నా సఖుడు విప్పడు చూపడు వాని పత్రమున్ 


వ్రాసితి నేదొ తోచినటు వాస్తవ మెంతయొ యీ పరీక్షలో 


కూసితి పిమ్మటన్ వినగ కూరిమి మిత్రుల ముందు నిట్లుగా


"వ్రాసెను ఖడ్గసృష్టి కృతి వంగ కవీంద్రుడునౌ రవీంద్రుcడే".


అల్వాల లక్ష్మణ మూర్తి.

చమత్కార పద్యం

 చమత్కార పద్యం


ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం


*అంచిత చతుర్ధ జాతుడు*

*పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్*

*గాంచి, తృతీయం బక్కడ*

*నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!*


*భావం:*

గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.... 


ఏమీ అర్థం కాలేదు కదా!? 


ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం. 


ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి. 


చతుర్థ జాతుడు అంటే *వాయు నందనుడు,*

 పంచమ మార్గము అంటే *ఆకాశ మార్గము,*

ప్రధమ తనూజ అంటే *భూమిపుత్రి సీత,*

 తృతీయము అంటే *అగ్ని ,*

 ద్వితీయము దాటి అంటే *సముద్రం దాటి* ఇప్పుడు భావం చూడండి.... 


*హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని... భావం* 


 *ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవి గారికి నమస్సుమాంజలి.!!!* 🙏

కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 ఐదవ భాగం

 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 

                ఐదవ భాగం

యోగులు తరచుగా ఓంను ధ్యానం చేస్తారు.

 సన్యాసం తీసుకున్నవారు కేవలం ఓం మాత్రమే జపిస్తారు. రుద్ర నమకం ఒక్కటి పారాయణం చేయవచ్చు. ఇంక ఏ మంత్రములు చూడరు.

 సాధారణంగా ఓం అని ఉచ్ఛరించినప్పటికీ, మంత్రం వాస్తవానికి మూడు అక్షరాలను కలిగి ఉంటుంది, అ , ఉ మరియు o( మ్ .) ఉన్నాయి.


చంద్రుని యొక్క కళలు పదహారు. పాడ్యమి నుంచి పూర్ణమి వరకు తిథులు పదిహేను. కాగా పదహారవ కళ సాక్షాత్తూ ఆ పరమేశ్వరి అయి ఉన్నది.అదే కామకళ 


షోడశీ తు కళా జేయా సచ్చిదానంద రూపిణీ ||


అంటే పరమేశ్వరియే షోడశీకళ. సాదాఖ్యకళ, చిత్కళ, ధృవకళ, బ్రహ్మకళ, పరమాకళ, కామకళ అని పిలువబడుతోంది. 

కామము అంటే కోరిక. సాధకుని కోరికలు తీర్చేకళ. అదే కామకళ. సాధకుడి కోరికలు అనేకానేకాలు ముఖ్యంగా అవి రెండు రకాలు 1. ఇహము 2. పరము. ఇహానికి సంబంధించినవి అర్ధకామాలు. పరానికి సంబంధించినవి ధర్మమోక్షాలు. సంసార లంపటంలో కూరుకుపోయిన మానవుడు తన కష్టాలన్నీ తీరిపోవాలని, సుఖాలు పొందాలనుకుంటాడు. అందుకోసం ధన సంపాదన కావాలి. ఈ రెండింటి కోసమే అతడు ప్రాకులాడతాడు. అయితే ఉత్తర జన్మ ఉత్తమ జన్మ కావాలంటే ధర్మము తప్పనిసరి.

దానిద్వారానే మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ రకంగా భక్తులకు చతుర్విధ పురుషార్ధాలను తీర్చేది ఆ పరమేశ్వరియే. అందుచేతనే ఆమె భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంది. కాబట్టి

కామకళ అనబడుతుంది.


ఇది సచ్చిదానంద స్వరూపము. కాబట్టి బిందుమండలంలో ఉంటుంది. అనగా శ్రీచక్రంలోని బిందువులో ఈ పరమేశ్వరి ఉంటుంది. మరి అక్కడ ఒక్క పరమేశ్వరియే ఉంటుందా? అన్నప్పుడు ఆ దేవి పరబ్రహ్మ స్వరూపము. అంటే శివశక్తుల సమ్మేళనము. కాబట్టి 'శివేన వినాశక్తిః' శివుడు లేకుండా శక్తి లేదు.

 శివశక్తులు ఇద్దరూ కలిసిన లలితా సహస్ర నామాలలో కామకళను వివరించటం జరిగింది.ఆ నామాలు ఇక్కడ చూద్దాము 

కామ్యా - కోరదగినటువంటిది.

జ్ఞానముచే పొందబడినది. ముముక్షువులచే కోరదగినది.

పరమేశ్వరి జ్ఞానరూపిణి. సాధకులు జ్ఞానభావంతో జీవాత్మ పరమాత్మ వేరుకాదు అని ఆ పరమేశ్వరుణ్ణి అర్చించినట్లైతే, అట్టివారికి మోక్షం ప్రసాదిస్తుంది. అందుచేత దేవి కామ్యా అనబడుతుంది. సృష్టి ప్రారంభం కాక ముందు పరమేశ్వరుణ్ణి సృష్టికి సుముఖునిగా చేసిన రూపవిశేషము ఆ దేవి. అందుకే ఆమె కామ్యా అనబడుతోంది.

కామము అనగా కోరిక. ఈ కోరికలన్నీ బుద్ధివలన కలుగుతాయి. బుద్ధికి చైతన్యము కలిగినప్పుడు పూర్వజన్మలలో చేసిన కర్మానుసారము ఈ కోరికలు కలుగుతాయి. అంటే జీవుల స్థాయిని బట్టే కోరికలు కలుగుతాయి..

అయితే ఈ కోరికలు నాలుగురకాలుగా ఉంటాయి. వీటిని ధర్మ, అర్ద కామ మోక్షలు అనే క్రమంలో కాకుండా వారి స్వభావాన్ని వేరే విధంగా వ్రాయవలసి వచ్చింది అవి

1. తాత్కాలికంగా ఇప్పుడున్న కష్టాలు తొలగిపోయి సుఖాలు పొందాలి అనుకోవటం. ఇది కామము. సాధారణంగా ఎక్కువ మంది ఈ మార్గంలో ఉంటారు కదా 


2. జీవించి ఉన్నంతవరకు దుఃఖము లేకుండా ఉండటము, సుఖాలు పొందాలి అనుకోవటము ఇది అర్ధము.


3. తనకు రాబోయే జన్మలలో దుఃఖం లేకుండా సుఖం పొందేటట్లు కోరటం. ఇది ధర్మము.


4. అన్ని జన్మలలోను నిత్య నిరతిశయ ఆనందాన్నే కోరటం. ఇది మోక్షము.


వీటిలో ధర్మాన్ని కోరేవాడు - ఉత్తముడు

అర్ధాన్ని కోరేవాడు - మధ్యముడు

కామాన్ని కోరేవాడు - అధముడు

మోక్షాన్ని కోరేవాడు - ఉత్తమోత్తముడు

జీవులు వారి కర్మఫలాన్ననుసరించే ఈ కోరికలు కోరతాయి. ఈ కోరికలు అన్నీ తీరుస్తుంది. ఆ పరమేశ్వరి. అందుచేతనే ఆమె కామ్యా అనబడుతుంది.

కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది.కామేశ్వరుని యొక్క కళా రూపమే కామకళారూపా అనే నామము 

కదంబకుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.

కళ్యాణీ - శుభ లక్షణములు కలది.

జగతీకందా - జగత్తుకు మూలమైనటువంటిది.

కరుణా రససాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది.

                       సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ