24, జులై 2026, శుక్రవారం

తిరుమల వైభవం

 🔔 *తిరుమల వైభవం* 🔔


 *ఓం నమో వేంకటేశాయ 🙏*


రామానుజుల కాలంలో తిరుమల మూలమూర్తి శివుడని, అమ్మవారని, వీరభద్రుడని రకరకాల వాదనలు ఉండేవి. వాగ్వాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొని ఉండేది. అన్నింటికంటే, మూలమూర్తిని శివునిగా భావించే శైవుల వాదం ప్రబలంగా ఉండేది. రామానుజులవారు అప్పటి పాలకుడు, తన శిష్యుడైన యాదవరాజు సమక్షంలో పురాణ, ఇతిహాసాల ప్రామాణికతతో, హేతుబద్ధమైన తర్కంతో ఆ మూలమూర్తి విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వేంకటేశ్వరుడేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు.


🍃🌹రామానుజులవారి తర్కాన్ని యాదవరాజు విశ్వసించాడు గానీ, కరుడుగట్టిన శైవులు మాత్రం నమ్మలేదు. వాదోపవాదాలతో విసిగిపోయిన యాదవరాజు, రామానుజుల చొరవతో వైష్ణవులను, శైవులను సమావేశపరచగా వారిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం ఒకరోజు సుదర్శన చక్రం, శంఖం వంటి వైష్ణవ చిహ్నాలను చేయించి భగవంతుని సన్నిధిలో ఉంచారు.


🍃🌹అలాగే త్రిశూలం, డమరుకం వంటి శైవ చిహ్నాలను కూడా ఆలయంలో ఉంచారు. ఆనాటి రాత్రి కట్టుదిట్టమైన కాపలాతో ఆలయ ద్వారాలు మూసి ఉంచారు. తెల్లవారేసరికి స్వామి ఏ చిహ్నాలను ధరిస్తే అదే అవతారంగా అందరూ అంగీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆరోజు రాత్రి తన తపశ్శక్తితో శ్రీనివాసుణ్ణి సాక్షాత్కారం చేసుకున్న రామానుజులు, శంఖు చక్రాలను స్వీకరించాల్సిందిగా శ్రీవారిని పరిపరివిధాలుగా వేడుకున్నారు.


🍃🌹మరునాడు ఉదయం ఆలయ ద్వారాలు తెరిచేటప్పటికి స్వామివారు కరుణించి ఉభయహస్తాలతో శంఖు-చక్రాలు ధరించి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. దాంతో శైవుల వాదం వీగిపోయింది. రామానుజులవారు ఆలయానికి మహాసంప్రోక్షణ గావించి, తిరుమల నిర్ద్వంద్వంగా వైష్ణవ క్షేత్రమేనని, అందులో కొలువుండేది సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీనివాసుడేనని దేశమంతటా ప్రచారం చేశారు.


🍃🌹తిరుమల వైష్ణవ క్షేత్రమేనని నిరూపించబడటంతో, వైఖానస ఆగమ కైంకర్యాలు పూర్తిస్థాయిలో జరగడం మొదలయ్యాయి. రామానుజులు పంచరాత్ర ఆగమ సంప్రదాయానికి చెందినవారైనప్పటికీ, ఎలాంటి పక్షపాతం చూపకుండా, అనూచానంగా వస్తున్న ఆలయ ఆచారం ప్రకారం వైఖానస ఆగమ సంప్రదాయాన్నే కొనసాగించారు.




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: