1, ఆగస్టు 2023, మంగళవారం

Sri. Sarmada

 


Archana


 

అనుభవిస్తే కానీ నశించదని

 శ్లోకం:☝️

*అన్యక్షేత్రే కృతమ్పాపం*

  *తీర్థక్షేత్రే వినశ్యతి |*

*తీర్థక్షేత్రే కృతమ్పాపం*

  *వజ్రమాపే చ లిప్యతి ||*


భావం: ఇతర ప్రాంతాలలో చేసిన పాపం పుణ్యక్షేత్రానికి వచ్చిన తర్వాత నశిస్తుంది. కాని పుణ్య తీర్థ క్షేత్రాలలో చేసిన పాపం వజ్ర సమానంగా మారుతుంది. అంటే పుణ్యతీర్ధాలలో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, అది అనుభవిస్తే కానీ నశించదని భావం.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

 ఆగస్టులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు


తిరుపతి, 30 జూలై 2023: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.


– ఆగస్టు 1 మరియు 28వ తేదీలలో ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.


– ఆగస్టు 4, 11, 18వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం అమ్మవారు తిరుచ్చిపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.


– ఆగస్టు 6న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ సుందరాజస్వామివారు తిరుచ్చి వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.


– ఆగస్టు 20న సూర్యనారాయణస్వామివారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.


– ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరుగుతుంది.


టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

దైవాన్ని కోరాలి

 *దైవాన్ని కోరిక ఎలా కోరాలి*


*1.నువ్వు బతికి* *ఉన్నంత కాలం* *ధార్మిక* *కార్యాలు నీ సంపదతో చేయాలి అని* *కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.*


2. *నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.*


3. *నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..*


4. *నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.*


5. *నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..*


6. *భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...*


7. *కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..*


*8 *చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..*

*మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.*


*శుభమస్తు*

సన్యాసాశ్రమం

 శాస్త్రం విధించిన సన్యాసాశ్రమం


మన దేశంలో నానావిధాలవారు సన్యాసులెందరో వున్నారు. వీరెవ్వరూ ఫలప్రదం, లాభకరం అయినపని ఏదీ చేయరు. గృహస్తులు పెట్టే భిక్షవల్లజీవిస్తూ వుంటారు. ఈ భిక్షసన్యాసులందరు పరోపజీవనులనీ, వీరివల్ల దేశానికేమీ లాభించదనీ మనపరిపాలకులలోనే కొందరు అభిప్రాయపడుతూ వుంటారు. ఈ సన్యాసి జనసమూహాన్ని కూడగట్టి ప్రజోపయోగకరమైనపని చేయిస్తే మంచిదను తలంపుతో “అఖిల భారత సాధు సంఘమ”నే సమాజాన్ని ఇటీవల నెలకొల్పారు. వీరిలో కొందరిని సంచార ప్రచారకులుగా నియమించి వారికి కొంత ప్రతిఫలం ముట్టచెప్పుతూ ప్రజాహితం సాధించాలని ఆలోచించారు.


అవును, దేశంలో ఈ సన్యాసిమూక ఎక్కువగా నున్నమాటనిజమే. వీరు పరోపజీవనం చేస్తున్నమాట నిజమే. అలావుండటం మంచిది కానిమాట సత్యమే. కాని సన్యాసులు పరోపజీవనం చేయకూడదనే అభిప్రాయాన్నీ, సన్యాసులు భిక్షాటనవల్లనే జీవించాలనే శాస్త్రవిధిని- ఈరెంటినీ సమన్వయించడం ఎలాగూ అనేదే ప్రశ్న.


నాలుగాశ్రమాలవారిలో సన్యాసులకు, బ్రహ్మచారులకూ మాత్రమే భిక్షాజీవనం అర్హమనీ, విహితమనీ శాస్త్రం చెప్పుతున్నది. బ్రహ్మచారులు గురుకులవాసం చేసేటప్పుడు చాలా కొలది గృహములందు 'భవతిభిక్షాందేహి' అని ఇల్లాండ్రనడిగి, తమకోసం గురువుకోసం అన్నమును తెచ్చుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నవి. విద్యార్థి తన చదువుకోసం వినియోగించుకోడానికి ఎంతో కాలమూ, శక్తి దీనివల్ల కలిసివస్తవనేది ఒకటి; రెండోది విద్యార్జనకవసరమైన వినయమూ, చిత్తశుద్ధీ దీనివల్ల అలవడుతవనేది. గురుకుల వాసమందు ఈ భిక్షాటనం రాచబిడ్డలకూ విధింపబడింది. బ్రహ్మచారులిలా తెచ్చిన భిక్షాన్నమును గురువుకర్పిస్తే దానిని గురువు అందరికీ పంచిపెడతాడు. విద్యార్థులు గురువులకు జీతాలివ్వడమనేది ఆనాడులేదు. విద్య పూర్తి చెందిన పిమ్మట శిష్యుడు గురువునకు శక్తి కొలది దక్షిణ సమర్పిస్తాడు. దేశంలో ఉన్న రాజులవల్ల, సంపన్నులవల్ల శిష్యులు ఈ దక్షిణను సంపాదించి భక్తిపూర్వకంగా గురువులకు అర్పించేవారు.


సన్యాసి గూడా ఇలా భిక్షాన్నంవల్ల జీవించవలసిందే. చిత్తవృత్తులను విషయజాలమునుండి మరలించి పరమాత్మ ధ్యానమందు నిరంతరంగా లగ్నం చేసివుంచడమే అతనికి విహిత కృత్యం, సన్యాసులు జీవనార్థం ఏదో వృత్తి నవలంబించి అందరివలె లాభకరమైన పనులుచేస్తూ ఉంటే, వారికి విహితమైన బ్రహ్మనిష్ఠకు భంగం కలిగితీరుతుంది. సన్యాసి సప్తభిక్ష చేసి జీవించాలని శాస్త్రం విధించింది. సప్తభిక్ష అంటే ఏడు ఇండ్లయందు మాత్రమే భిక్షనర్థించాలి. ఆ అర్థించడం గూడా ఇంటి ముందు నిలిచి అడగాలి. ఆ నిలవడం గూడా గోదోహనకాలమాత్రం నిలవాలి అంటే, ఆవును పాలుపిదుకుట కెంతకాలము పట్టునో అంతసేపే నిలవాలి. ఈ విధంగా లభించిన భిక్షాన్నముచే అతడు జీవించాలి భిక్ష దొరకనినాడు ఉపవసించాలి. సన్యాసి అల్పాహారముతో బ్రతకాలని, కష్టించి విద్యార్జనం చేయవలసిన బ్రహ్మచారి కడుపునిండా తినవలెనని కూడా దీనివల్ల ఏర్పడుతున్నదని మనం గ్రహించాలి.


''యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్నస్వామినా వుభౌ||''


అనే శాస్త్రం యతులకు, బ్రహ్మచారులకు పక్వాన్న జీవనం విధిస్తున్నది. కనుక వారికి అన్నం పెట్టే బాధ్యతను గృహస్థులకు కూడా విధిస్తున్నదన్నమాట. ఇలాభిక్షాన్నముచే జీవించే ఈ ఉభయుల వల్లా సంఘానికి కలిగే హాని ఏమీ లేకపోగా, ఎంతో మేలు కలుగుతున్న విషయం మనం గమనించాలి భిక్షాటనంచేస్తూ చదువుకొన్న విద్యార్థి వినీతుడగుటేకాక, అట్లు సంపాదించిన విద్యావినయములచే సద్గృహస్థుడై సంఘానికి మిక్కిలి ఉపయోగిస్తాడు. ఇక సన్యాసుల మాట అడుగుతారా? సంసారభారం మోయలేక భిక్ష వల్ల అనాయాస జీవనం జరుగుతుందికదా అని కావులుగట్టిన వారందరు సన్యాసులు కారు. అట్టివారు భిక్షార్హులు కారు. ఐహికాముష్మిక ఫ భోగవిరాగియై ఆలుబిడ్డలను, ఇల్లూవాకిలిని, సౌఖ్యములను విడనాడి, యధావిధిగా ఆశ్రమస్వీకారం చేసినవారే నిక్కపు సన్యాసులు. అట్టిసన్యాసం అందరికి సుకరంగాదు. అట్టియతులే భిక్షార్హులు. బ్రహ్మనిష్ఠతో కాలంగడిపే అట్టి మహనీయులు ఉత్తమగతులకు మార్గం చూపెట్టుతూ వుంటారు. కనుక వారి వల్ల లోకాలకి మేలే కలుగుతుంది. అట్టి యతులు అరుదుగా ఉంటారు. వారిని భరించడం సంఘాని కొక కష్టంలోదికాదు.


లోకంలో మనకు కన్పించే సన్యాసులందరు అట్టి మహనీయులు కారు. బౌధ్ధమతాన్ని అవలంబించినకొన్ని దేశాలలో ప్రజలందరు నియమనిగ్రహముల కోసం కొన్నాళ్ళు భిక్షుక వృత్తి స్వీకరించాలనే నియమం ఉన్నది. వ్రతపరిసమాప్తియైన పిమ్మట కొందరు గృహస్థాశ్రమం స్వీకరిస్తారు. తక్కినవారు భిక్షులుగానే ఉండిపోతారు. అట్టి యథార్ధభిక్షులనుచూచి, పనిపాటులొల్లని సోమరులు గూడా కొందరాదేశాలలో కావులుగట్టి భిక్షాటనం వల్ల ఆశ్రమజీవనం చేస్తూ ఉండడం కద్దు.


ఆట్లే మన దక్షణ దేశంలో కొందరు పరదేశులమనీ, ఉత్తరదేశంలో సాధులమనీ బయలుదేరి భిక్షాటనముచే సుఖంగాజీవిస్తూ ఉంటారు. సన్యాసులకువిహితమైన వ్రతపాలనంకానీ, నియమనిష్ఠలుకాని, సంప్రదాయంకాని, ఆశ్రమస్వీకారంగాని వీరికక్కరలేదు. పొట్టకోసం దేవులాటేతప్ప వీరికి బ్రహ్మనిష్ఠతో పనిలేదు. పరోపజీవనం చేసే ఈ సోమరులను పరిహరించవలసిందే. మేము కాదనము. కానీ ఈ కలుపు మొక్కలను ఊడబెరికేయత్నంలో పైరు మొక్కలనుగూడా పీకివేయవలదనే మేము చెప్పేది. లోకసంగ్రహార్థం ఆశ్రమస్వీకారం చేసిన యధార్థ యతులను సోమరులని తెగనాడదగదు. దండ కమండులు ధారణంవల్ల, వైరాగ్యవర్తనంవల్ల గుర్తింపదగిన యదార్థసన్యాసులు ఒకానొక అచ్చమైన సంప్రదాయంలో వారై ఉంటారని కూడా మనం గ్రహించాలి.


సన్యాసులకొక సంఘమంటూ అక్కరలేదు. ఏకాంతవాసం చేయుటేతప్ప సంఘాలుగాకూడటం సన్యాసుల లక్షణంకాదు. సంఘములుగగూడిన సన్యాసులు ఆశ్రమధర్మభ్రష్ఠులై తామూ లోకసామాన్యంలో చేరిపోతారు.


కాబట్టి సన్యాసులకు, బ్రహ్మచారులకేతప్ప ఇతరులకు భిక్షాజీవనం పనికిరాదు. పనిపాటులొల్లక భిక్షాటనంచేసే సోమరితనాన్ని మాన్పుటకు రెండు ఉపాయములు కన్పిస్తున్నవి (1) బహుజనులకు విరివిగా పనికల్పించటం (2) సంపన్నల భోగానుభవాలకు నిరుపేద కష్టజీవనానికి వుండే వ్యత్యాసాన్ని తగ్గించడం వీనిలో మొదటిపని ప్రభుత్వానిది, రెండవది ప్రజలది జీవనపుటంతస్తు (స్టాండర్డు ఆఫ్ లివింగ్) పెరుగవలెనంటూ నేడుపఠించే మంత్రాలకు ఫలితమేమిటంటే, భోగసక్తి పెరగడమే భోగాలను విడనాడి, గ్రాసవాసోదైన్యం లేకుండా, మితంగా, సౌమ్యంగా బ్రతకడమే నిజమైన సోషలిజమనిపించుకుంటుంది. శీతావాతాతపముల నుండి రక్షించే సముచిత వస్త్రధారణం, జిహ్వచాపల్యం కోసం కాక శరీరధారణం కోసం భుక్తి. ఇదే సోషలిజపు లక్షణము దేహధారణ మాత్రమైన భుక్తియే అపరిగ్రహమనిపించుకొంటుంది. దేశసంపదను విజ్ఞానాభివృద్ధికి, దేశరక్షణకు వినియోగించాలేకాని భోగానుభవాలకై వెచ్చించకూడదు. జీవనవ్యయాన్ని సరళజీవనానికిసరిపడేటట్లుతగ్గించాలిగాని పెంచకూడదు. అలాచేస్తే ప్రజలందరకు సరిపడ్డ కూడు గుడ్డలు, నివాసమూ లభిస్తవి.


నేడు అదనపు సంపదగల దేశాలు, పురుషులు ఆ సంపదను రాజకీయంగా తమతో ఏకీభవించే దేశాలకు, యుధ్ధంలో తమకు తోడ్పడే దేశాలకు పంచిపెట్టడం జరుగుతూ ఉంది. ఇది కూడనిపని. అదనపుసంపదను పేదదేశాలకు, ప్రజలకు ఇవ్వడం న్యాయం. ఏ దేశానికాదేశం తమకున్న సంపదతో తృప్తి పడటం నేర్చుకుంటే, జీవనపుటంతస్థుననుభవించే దేశాలు ఆ యంతస్తును కాపాడుకోవడాని కెప్పటికప్పుడు విదేశ విపణులను ఆక్రమించుకొంటూ వుండటం, ఆ కృత్రిమపు వాపు ఎప్పుడు బుస్సున తీసిపోతుందో అని భయపడతూ వుండడం తప్పదు. మింటిఎత్తు పెరిగినవానికి పడిపోతానేమో అనే భీతి వెంటాడుతూనే వుంటుంది. ఇతర దేశాలను అనుకరిస్తే, ఎప్పటికైనా మనకూ ఈ దురవస్థ పట్టుతుంది.


ఇంతకూ సన్యాసానికి, సంఘటనకు చుక్కెదురనేది ప్రస్తుతం. సన్యాసులను పోషించే భారాన్ని సంఘం వహించక తప్పదు. పొట్టకోసం భిక్షాటనం చేసేవారికి పనిపాటులు చూపించాలి. యధావిధిగా ఆశ్రమ స్వీకారం చేసిన సన్యాసులను, పరోపజీవనం చేసే సోమరులను నిందింపరాదు. సన్యాసులను సంఘటితపరచి, ప్రభుత్వం చేయవలసిన పనులను వారిచే చేయింప బూనడం కూడా యుక్తంగాదు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శయన నియమాలు

 *శయన నియమాలు*

~~~


*పడుకోవాలంటే పాటించే 15 సూత్రాలు*


🔹1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో, ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు. *( మనుస్మృతి )*


🔹2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు *( విష్ణుస్మృతి )*


🔹 3. విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలప వచ్చును.*( చాణక్య నీతి )*


🔹4. ఆరోగ్యవంతులు ఆయు రక్ష కోసం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలి (దేవీ భాగవతము). పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. *( పద్మ పురాణము )*


🔹5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది. *(అత్రి స్మృతి)*


విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం. *( మహాభారతం )*


🔹6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు. *( గౌతమ ధర్మ సూత్రం )*


🔹7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది. *( ఆచార మయూఖ్ )*


🔹8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో  1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగ హేతువు మరియు ఆయు క్షీణత కలుగ చేస్తుంది)


🔹9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు. *( బ్రహ్మా వైవర్తపురాణం )*


🔹10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాతనే పడుకోవాలి.


🔹11. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.


🔹12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు. యముడు మరియు దుష్ట గ్రహముల నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.


🔹13. గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.


🔹14. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.


🔹15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసక బారుతుంది.


🔸*ఈ 15 నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు* 🔸

*సేకరణ*

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

పంచాంగం 01.08.2023 Tuesday

 ఈ రోజు పంచాంగం 01.08.2023  Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస శుక్ల పక్ష: పౌర్ణమి తిధి భౌమ  వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం ప్రీతి యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


పౌర్ణమి రాత్రి 12:00 వరకు.

పూర్వాషాఢ సాయంత్రం 04:01 వరకు.

సూర్యోదయం : 05:59

సూర్యాస్తమయం : 06:46

వర్జ్యం : రాత్రి 07:30 నుండి 08:54 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:32 నుండి 09:24 నుండి తిరిగి రాత్రి 11:15 నుండి 12:00  వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

కువలయము

 శుభోదయం🙏


వెన్నెల వెలుగులు 

                                                     ---------------------------- 


                     చ :  వడిగొని  ఱేకు లుప్పతిల  వాలిన కేసరముల్  దలిర్పఁ  ,బు

                              

                            ప్పొడిఁ దలమెక్కి,  తేనియలు పొంగి  తఱంగలుఁ గాఁ జెలంగి  పైఁ


                            బడు  నెలదేఁటిదాఁటులకుఁ  బండువులై   నవసౌరభంబు  లు


                            గ్గడువుగ  నుల్ల  సిల్లె   ఘన కైరవ షండము  నిండు  వెన్నెలన్ ;


                               ఆవెన్నెలలో  సరోవరాలలో   కానవచ్చే ప్రకృతి విలాసాన్ని  కవి వర్ణిస్తున్నాడు. సరోవరాలలో  చంద్రుని కిరణాలు

ప్రసారం కాగానే  కలువలు  రేకులు విప్పుతున్నాయి. ఆరేకుల వెనుకే  కింజల్కాలు ప్రక్కలకు వ్రాలుతున్నాయి. ఆకింజల్కాలనుండి పుప్పొడి రాలుతోంది. ఆపుప్పొడి ప్రక్కనుండి మకరందం జారులు వారుతోంది.. అపుప్పొడి పీకవరకూ మెక్కి, తేనెత్రాగి  తుమ్మెదలు

అటూ ఇటూ పరిభ్రమిస్తున్నాయి. ఆవాతా వరణానికి పండుగ శోభను కలిగిస్తూ  కలువలనుండి గమ్మత్తుగా మత్తుగా , పరిమళాలు నలువైపుల  నలుముకుంటున్నాయి .


      ఇదీ ప్రకృతిలోని పరిణామము!


                దీనినే    కవి తన భాషలో భావనాత్మకముగా వర్ణించినాడు. వడిగొని రేకులుప్పతిల-గబగబా రేకులు విచ్చు కున్నాయట. వెంటనే కేసరములు వాలాయట,కలువలు,  రేకులు విప్పగానే తుమ్మెదలు సిధ్ధంగా ఉన్నాయి ఆహారంకోసం ఆనందంకోసం. పుప్పొడిఁ దలమెక్కాయట.పీకల వరకూ మెక్కాయన్నమాట. తేనెకెరటాలుగా వస్తోంది తప్పించుకుంటానికి అటునిటు గెంతుతున్నాయి. వాటికి 'పండుగులవలె' కలువల నుండి సువాసనలు వ్యాపిస్తున్నాయట; ఇదంతా జరుగ టానికి ప్రధానమైనవి కైరవ షండములు.( కలువల సముదాయము. )


                     కలువకు  'కుముద' మని మరోపేరు. కు- అంటే భూమి , భూమికి ఆనందాన్ని కలిగించేవి అనియర్ధం.

                     కలువకు కువలయము  అనేది పర్యాయపదం. దానికి భూమి యని యర్ధం!


                          కలువకూ చంద్రునకూ  ప్రకృతిగత సంబంధం. భూమికీ కలువకూ సామ్యం. అందువలన కలువలు వికసించాయీ అంటే  భూలోక  మంతా ఆనందంగా ఉన్నదని వ్యగ్యం! చంద్రుని రాకతో  మనస్సుకు ప్రశాంతత కల్గుతుంది." చంద్రమా మనసోజాతః"-అనివేదం!  ఆఆనందమయ జగత్తునే కవి యిక్కడ ఆవిష్కరించాడు.


                   కలువలు, తుమ్మెదలు,పుప్పొడి, తేనె, పరిమళాలు, ఇత్యాదులన్నీ '  రసమయ' జగదా విష్కరణలోని భాగాలు. 


                                       ఇదంతా ప్రకృతి  సౌందర్య స్వరూపం! 


                   మొత్తంమీద  సంధ్యాకాలం -సూర్యస్తమయం- చంద్రోదయం- వెన్నెల వెలుగులు. వీనియన్నింటి యందు ఎఱ్ఱన కవి

త్రిగుణాత్మక మైన ప్రకృతి దర్శనముతో బాటు త్రిగుణాత్మక స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి కూడా దర్శించినాడని మొన్ననే విన్న వించాను.

సాంధ్య వర్ణనలోని చీకటి  తమోగుణం. సంధ్యాకాంతి.(ఎఱుపు) రజోగుణం. వెన్నెలలోని తెల్లదనం  సత్వగుణం. యీమాదిరిగా నున్నప్రకృతిలో పరమాత్మ దర్శన మన్నమాట! 


                              స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:34/150 


హైమో హేమకరో యజ్ఞ 

స్సర్వధారీ ధరోత్తమః I 

లోహితాక్షో మహాక్షశ్చ 

విజయాక్షో విశారదః ॥ 34 ॥  


* హైమః = బంగారు (వికార) మయమైనవాడు, 

* హేమకరః = బంగరమును చేయువాడు, 

* యజ్ఞః = యజ్ఞపురుష రూపుడు, 

* సర్వధారీ = సమస్తమును ధరించువాడు, 

* ధరోత్తమః = (ప్రపంచమును) ధరించువారిలో ఉత్తముడు, 

* లోహితాక్షః = ఎర్రని వర్ణముగల కన్నులు కలవాడు, 

* మహాక్షః = గొప్పదైన దృష్టి కలవాడు, 

* విజయాక్షః = విజయంపై దృష్టి కలవాడు, 

* విశారదః = బాగుగా తెలిసినవాడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం