21, మార్చి 2026, శనివారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శుక్రవారం 20 మార్చి 2026*


          *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *31వ భాగం*``


*మత్స్యావతార కథ*  


*జలప్రళయం -వేదాల అపహరణ సప్తఋషుల నావను సత్య వత్రుడు అధిరోహించుట:*```


సత్యవ్రతుడు మహావిష్ణువు చెప్పినట్లు ధాన్య ఫల ఆహార పదార్థాల విత్తనాలు ఒక పెద్ద భాండంలో సేకరించి, ఆ భాండంతో మహాసముద్ర తీరానికి చేరుకున్నాడు. దర్భలతో ఒక దర్భాశయనం చేసుకుని తూర్పు దిశగా తల ఉంచి కూర్చున్నాడు. విత్తనాల భాండం పక్కన పెట్టుకుని మనస్సులో అష్టాక్షరి మంత్రం జపం చేస్తూ జల ప్రళయం జరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు.


శ్రీహరి చెప్పినట్టు ఏడురోజులు భూకాలమానం ప్రకారం గడిచింది. బ్రహ్మకు పగటికాలం పూర్తి అయ్యి రాత్రి రాగానే నిద్రాదేవత బ్రహ్మదేవుని ఆవహించింది. సృష్టి కార్యం ఆపి పద్మం మీదనే చేయి తలగడగా చేసుకుని నిదురించసాగాడు. భూమి పై కుంభవృష్టిగా ఏడు రోజుల నుండి కురిసే వర్షం వలన సముద్రాలు పొంగిభూమిని ముంచేస్తూ జలప్రళయం ఏర్పడింది.


నిద్రిస్తున్న బ్రహ్మదేవుని నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు బయటకు వచ్చాయి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న సోమకాసురుడు అనే రాక్షసుడు నీటి నుంచి బయటకు వచ్చి వేదాలు సంగ్రహించి నీటిలోకి వెళ్లి పోయాడు. 


దేవలోకాలు అన్ని కంపించాయి. బ్రహ్మ నిదురలోకి వెళ్లిన సమయంలో వేద ప్రక్రియల వలన దేవతలు సురక్షితంగా ఉంటారు.


దేవతలందరు విష్ణువుని రక్షించమని శరణు వేడతూ ప్రార్థించారు. భక్తవత్సలుడైన మహావిష్ణువు మహాజలథిలో వేల యోజనాలు పరిమాణం గల మత్స్యరూపంలో ప్రత్యక్ష మైనాడు. దేవతలు స్తుతించి వేదాలను సోమకాసురుని నుండి రక్షించమని ప్రార్ధించారు.


మత్స్యావతారుడు దేవతలకు అభయం ఇస్తూ “దేవతలారా! సోమకాసురుడు రాక్షసరాజైన పులస్త్య బ్రహ్మ మనవడు, విశ్రవసు కుమారుడు. విశ్రవసు సంధ్యాసమయంలో సోమరసం త్రాగి భార్యతో కలవడం వలన సోమకాసురుడు పుట్టాడు. పులస్త్య బ్రహ్మ వంశంలో పుట్టడం వలన అమేయ బలవంతుడై ముత్తాత అయిన బ్రహ్మదేవుని ముఖాల నుంచి వెలువడిన వేదాలు అపహరించాడు. నేను ఆ అసురుని సంహరించి వేదాలను కాపాడుతాను” అని జలర్ణావంలో ఈదుతూ ముందుకు వెళ్ళాడు.


భూమి అంతా నీటిలో మునిగి సత్యవత్రుడు కూర్చున్న దర్భాసనం తేలుతూ ప్రవాహముతో పాటు ముందుకు పయనించసాగింది. ఆకాశానికి చిల్లు పడినట్లు వాన పడుతోంది. మేఘాలు దట్టంగా కమ్మటం వలన జగత్తంతా అంధకార మయం అయ్యింది. భయానక వాతావరణంలో కూడా సత్యవత్రుడు నారాయణ మంత్రం జపిస్తున్నాడు. చీకటిలో దర్భాసనం నీటి పైన ఎటువైపు వెళుతోందో తెలియడం లేదు.


గాఢాంధకారంలో ఒక దివ్య కాంతి పుంజం దూరాన కనిపించింది. సత్యవ్రతుడు ఆ కాంతిపుంజం తనవైపు రావడం గమనించాడు. విష్ణువు చెప్పి నట్లు అది సప్త ఋషుల తేజస్సు యొక్క ప్రకాశము అని అర్థం చేసుకున్నాడు. కాంతిపుంజం కంటిచూపు దగ్గరకు రాగానే పెద్ద నావ ఆవెలుగులో కనిపించింది. నావలో కూర్చున్న సప్తఋషుల తేజస్సే కాంతిలాగా ప్రసరిస్తోంది అని గ్రహించాడు.


నావ దగ్గరకు వచ్చింది. దివ్య తేజస్సుతో వెలుగుతున్న సప్త ఋషులకి సత్యవ్రతుడు నమస్కరించాడు. నావని చుట్టుకుని ఒక మహాసర్పం కనిపించింది. ఆ మహాసర్పం భూమిని ప్రళయానంతరం తలమీద మోసే నారాయణాంశుడైన అనంతుడు (ఆదిశేషుడు) అని గ్రహించి నమస్కారం చేశాడు.


మీనావతారుడైన నారాయణుడు నీటి నుంచి బయటకు వచ్చి దర్శనమిచ్చాడు. సత్యవ్రతుడు నమస్కరించి శరణు కోరుతూ స్తుతించాడు. మీనావతారుడు సంతసించి “సత్యవ్రతా! పేరుకు తగ్గట్టు సత్యాన్నే జీవిత ధర్మము గా పాటిస్తూ,నా నామము జపిస్తూ ప్రియ భక్తుడవి అయ్యావు. అందుకే చేపపిల్లగా కనిపించి నీకు మార్గదర్శనం చేసాను. నిన్ను జల ప్రళయం నుండి రక్షించడానికి సంకల్పించాను.


నీ భక్తికి మెచ్చి వరము ఇస్తున్నాను. వచ్చే శ్వేతవరాహ కల్పములో నీవు సూర్యుడికి వైవస్వత నామముతో పుత్రుడిగా జన్మిస్తావు. సప్తమ మన్వంతరానికి మనువు అయ్యి ప్రసిద్దుడివి అవుతావు. నీ కీర్తి ప్రతిష్టలు వర్ధిల్లుతాయి” అని సత్యవ్రతునికి సాంఖ్యయోగ ప్రక్రియతో పురాణ సంహిత ఉపదేశించాడు.


అనంతరం సత్యవత్రుడు నారాయణుని ఆదేశం పాటించి బీజ విత్తన భాండాన్ని నావలోకి చేర్చి తాను నావను అధిరోహించాడు. మత్స్యావతారుడు తన చేప కొమ్ముని నావను చుట్టుకున్న సర్పరాజు శరీరానికి, నావకు మధ్యన చేర్చి తన యోజనాల శరీరం పై నావను అటుఇటూ పడకుండా చేసి ముందుకు ఈదుతూ వేగంగా వెళ్ళ సాగాడు.

        

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పాశుపతాస్త్రం

  🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మహాభారత కాలం నాటి పాశుపతాస్త్రం:*

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

 అతిశక్తివంతమైన ఒక అస్త్రం ఇది. తపస్సుతో శివుని మెప్పించి అర్జునుడు పొందాడు దీన్ని. అర్జునునికి శివుడు ఈ అస్త్రాన్ని ఇస్తూ "పాశుపతానికి అసాధ్యమైనది ఏదీలేదని, అయితే దాన్ని శక్తిహీనులపై ప్రయోగిస్తే లోకాన్ని తగలబెడుతుందనీ, అది అన్నివేళలా అందరిమీదా ప్రయోగించేది కాదనీ" చెప్పాడు. అస్త్రంగా ఇది మారణహోమాన్ని సృష్టించగలదు. అంతేకాదు, దేనినైనా నిర్ణీతస్థానానికి చేర్చే 'మిస్సైల్'గా కూడా పనికొస్తుంది. ఇది టు- ఇన్- వన్ లాంటి ఆయుధం అన్నమాట. మారణాస్త్రంగా దీన్ని ప్రయోగిస్తే, బ్రహ్మశిరాస్త్రం మాదిరిగానే ప్రకృతి ఉత్పాతాల్ని కల్పిస్తుంది. అందువల్ల ఈ పాశుపతాన్ని కూడా ఎప్పుడుపడితే అప్పుడు వాడరాదని ఆనాటి పెద్దలు (ఋషులు) ఆంక్ష విధించారు. కాబట్టే అర్జునుడు మారణాస్త్రంగా తన పాశుపతాన్ని కురుక్షేత్ర యుద్ధంలో వాడలేదు. మారణాయుధంగా దాన్ని కనుక ఉపయోగించి ఉంటే, అర్జునుడు కేవలం ఒక్కక్షణంలోనే కౌరవుల్ని నశింపజేసేవాడు. పాశుపతాస్త్రాన్ని మిస్సైల్గా మాత్రం ఒకసారి వాడాడు అర్జునుడు. ఆ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కౌరవులకూ, పాండవులకూ బావమరిది 'సైంధవుడు'. సైంధవుడికి అతని తండ్రి అయిన వృద్ధక్షత్రుడు, ఒక వరం ప్రసాదించాడు. “ఎవరివల్ల తన తనయుని తల నేలపై పడుతుందో, వారియొక్క శిరస్సు ముక్కముక్కలై పేలిపోవాలని” తన తపశ్శక్తితో శాసించాడు. ఈ విషయం కృష్ణునికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బాణంతో సైంధవుడి తలను తెగనరుకుతాడు. ఆ 'తల' క్రిందపడిందంటే, అర్జునుని శిరస్సు ప్రేలిపోయి ఉండేదే! ప్రమాదాన్ని పసిగట్టాడు శ్రీకృష్ణుడు. సైంధవుని తలను నేలపై పడనివ్వవద్దని అర్జునుడితో చెప్పాడు. అర్జునుడు తన బాణాలను ఉపయోగిస్తూ, సైంధవుడి తలతో బంతి ఆట ఆడసాగాడు. "ఈ తలను ఏం చెయ్యమంటావు? అయినా ఎందుకూ ఇదంతా?" అంటూ కృష్ణుణ్ణి అడిగాడు. కృష్ణుడు అసలు విషయం చెప్పాడు. “అయితే ఏం చేద్దాం మరి?" అన్నాడు అర్జునుడు. "సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు శమంతపంచకంలో తపస్సు చేసుకుంటున్నాడు. అతని తొడపై ఈ తలకాయ పడేలా చెయ్యి. ఆ పని ఒక్క పాశుపతాస్త్రం వల్లనే సాధ్యం" అని చెప్పాడు శ్రీకృష్ణుడు. పాశుపతాన్ని తీసి మంత్రించి వదిలాడు అర్జునుడు. ఆ అస్త్రం సైంధవుని తలను ఎక్కడోఉన్న శమంత పంచకానికి తీసుకొనిపోయి, వృద్ధక్షతుని తొడపై పడేసింది. దాన్ని తన కుమారుని శిరస్సుగా గుర్తించలేకపోయాడు వృద్ధక్షతుడు. ఉలిక్కిపడి క్రిందకు నెట్టేశాడు. సైంధవుని తల ఆ విధంగా నేలపై పడింది. ఆ తలను నేలపై పడగొట్టినవాడు వృద్ధక్షత్రుడు కాబట్టి, అతని తల ముక్కముక్కలుగా ప్రేలిపోయింది. తాను ఇచ్చిన వరానికి తానే బలి అయ్యాడు వృద్ధక్షత్రుడు. ఈ సందర్భంలో పాశుపతాస్త్రం ఒక “క్షిపణి" గా పనిచేయడం మనం గమనించవచ్చు.


పాశుపతాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం ఈ రెండూ కూడా జగత్ సంహారం చెయ్యగలవు. మారణాయుధాలుగా వీటిని ఉపయోగిస్తే అనేక లక్షల శూలాలూ, గదలూ, సర్పాల్లాంటి బాణాలూ వాటినుండి పుడతాయి. వీటిని మనుషులపై ప్రయోగిస్తే ఎన్నో ఆపదలు వస్తాయి. ఎంత ప్రమాదం వచ్చినా, ఇతరితర ఉపాయాలవల్లనే తప్పించుకోవాలి గాని, ఈ అస్త్రాల్ని ప్రయోగించకూడదు. మారణాయుధములుగా వీటిని ప్రయోగించడాన్ని నిషేధించారు నాటి విజ్ఞులు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

ప్రపంచ కవితా దినోత్సవం

 🌸 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా


తేటగీతి పద్యము


వెలిగెనన్నయ్యపద్యముల్ వేంగిలోన 

తాటి యాకుల పై వ్రాసె నాటికవులు 

గద్యమున చిన్నయ రచన ఘనతగాంచె

నీతి చంద్రిక నిత్యమై నిలిచిపోయె

నేటి కవుల కవిత లుండె మేటిగాను

తెలుగురచనలువ్యాపించె దేశమంత


సాహితీ శ్రీ,,

 జయలక్ష్మి

21-03-2026 శనివారం రాశి ఫలితాలు21-03-2026 శనివారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

21-03-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం.

నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------


వృషభం


చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

---------------------------------------


మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

---------------------------------------


కర్కాటకం


వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------


సింహం


నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


కన్య


ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి , ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


తుల


కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------


ధనస్సు


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంబందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


మకరం


వ్యాపారాలు మరింత మందగిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------


కుంభం


ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


మీనం


వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

---------------------------------------

శ్రీరామ స్తుతి🙏

  🌸శ్రీరామ స్తుతి🙏


సీ. జానకీ వల్లభా ! జగదభి రామయ్య !

               సజ్జన సేవితా ! సాధు పోష !

     సేతుబంధన రామ ! సేవిత కపిబృంద !

              పతితపావననామ ! పరమపురుష !

     నీలమేఘశ్యామ ! నిరుపమ గుణధామ !

               నిను నమ్మి యుంటిని నిచ్చ లందు  

     నీ శరధాటికి నిక్కమ్ము జలనిధి 

               భయమంది లంకకు బాట చూపె

తే.జప తపమ్ముల నొనరించ శక్తి లేదు 

    వేరు దైవంబె నెఱుగ నే విమల చరిత !

    నీవే దిక్కని నమ్మితి నీరజాక్ష !

    దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !



       జయలక్ష్మి పిరాట్ల

స్వధర్మాన్ని

  శ్రీరామ (118)

శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ధర్మమే మనల్ని కాపాడుతుంది కాబట్టి, ఎవరి స్వధర్మాన్ని వారు ఆచరించాలి.

 అదే ధర్మాన్ని కాపాడటం అంటే.

ఆ ధర్మాచరణలోని భాగమే బంధుమిత్రులందరిని ఎల్లప్పుడు ఆదరించడము, మరియు కష్టాల్లో ఉన్న బంధుమిత్రులకు సహాయం చేయడము.

శ్రీరాముడు అలా చేసేవాడని వాల్మీకి మహర్షి చెబుతున్నారు.


శ్లో// రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా //


(రాముడు ఎల్లప్పుడు తనవంశాచారాలను కాపాడుకునే వాడు (రక్షితా స్వస్య ధర్మస్య).

 తన బంధు, మిత్రులందరినీ కాపాడుకునే వాడు (స్వజనస్య చ రక్షితా).

(అత్యాసన్నం పరిత్యజ్య మునేర్దత్తం తు 

నిష్ఫలమ్ = దగ్గర బంధువును,లేదా ఆశ్రితుని, కాదని మునీశ్వరునికి దానం చేసినను అది నిష్ఫలమే, అను ధర్మశాస్త్రము ననుసరించి శ్రీరాముడు ఆశ్రిత బాంధవులను విశేషించి రక్షించువాడు అని అర్థం)


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

21-3-'26.

రామాయణ పారాయ‌ణం*

 ‌శ్రీ‌శ్రీ‌శ్రీ

*ఇంటింటా సంక్షిప్త* *రామాయణ పారాయ‌ణం*


****

*3 వ రోజు*


*అర‌ణ్య కాండ*


శ్రీ‌రాఘ‌వం ద‌శ‌ర‌థాత్మ‌జ మ‌ప్ర‌మేయం

సీతాప‌తిం, ర‌ఘుకులాన్వ‌య‌ర‌త్న‌దీపం

ఆజానుభాహుం అర‌వింద ద‌ళాయ‌తాక్షం

రామం నిశాచ‌ర వినాశ‌క‌రం న‌మామి

                     ****


*శ్రీరామ రామ రామేతి* *రమేరామే మనోరమే*

*సహస్రనామ తత్తుల్యం* *రామనామ వరాననే*

                       ****

*దండ‌కార‌ణ్య ప్ర‌వేశం.....*


     అత్రి మ‌హ‌ర్షి ఆశ్ర‌మం నుంచి బ‌య‌లుదేరిన సీతారామ ల‌క్ష్మ‌ణులు దండ‌కార‌ణ్యంలోకి ప్ర‌వేశించారు. అక్క‌డ మ‌హ‌ర్షుల ఆశ్ర‌మాలు సంద‌ర్శిస్తూ ముందుకు క‌దులుతున్నారు.

 శ్రీ‌రామ‌చంద్రా , "ఈ దుర్గ‌మార‌ణ్యంలోనూ రాక్ష‌సుల బారి నుంచి మ‌మ్మ‌ల్ని ర‌క్షించాల్సింది నువ్వే" అంటూ మునులు శ్రీ రామ‌చంద్రుడిని కోరారు.వారి వద్ద‌ సెల‌వుతీసుకుని భీక‌రార‌ణ్యం మ‌ధ్య సీతారామ ల‌క్ష్మ‌ణులు సాగుతున్నారు. 

*విరాధ వధ*

సీతారామ లక్ష్మణులు అరణ్యం లో ముందుకు సాగుతుండగా...

 విరాధుడ‌నే రాక్ష‌సుడు ఒక్క ఉదుటున వారిమీద దాడి చేసి సీత‌మ్మ‌ను  పిడికిట బంధించాడు.వాడిపై ఎన్ని అస్త్రాలు ప్ర‌యోగించినా  వాడు చావ‌లేదు. ఆ ద‌శ‌లో వాడిని కాలికింద‌వేసి తొక్కి, గొయ్యి తీయించి అందులో పూడ్చిపెట్టడానికి రామ‌ల‌క్ష్మ‌ణులు  సిద్ధ‌మ‌య్యారు. 

అప్పుడు విరాధుడు,...."వ‌చ్చిన వాడు రామ‌చంద్ర‌మూర్తి అని, ఆయ‌న చేతిలోనే త‌న‌కు శాప‌విమోచ‌న‌మ‌ని" తెలుసుకున్నాడు .

 శాప‌విమోచ‌నం పొందిన విరాధుడు రామచంద్ర‌మూర్తికి న‌మ‌స్క‌రించి గంధ‌ర్వ‌లోకానికి వెళ్లాడు. సీత ఊ పిరి పీల్చుకున్న‌ది. అక్క‌డి నుంచి వారు శ‌ర‌భంగ మ‌హ‌ర్షి ఆశ్ర‌మానికి , అటు నుంచి సుతీక్ష‌ణుడి ఆశ్ర‌మానికి వెళ్లారు. వారి ద‌ర్శ‌నం చేసుకుని అటునుంచి అగ‌స్త్యుల‌వారి ఆశ్ర‌మానికి వెళ్లారు. అగ‌స్త్యుల‌వారి సూచ‌న మేర‌కు వారు గోదావ‌రి తీరంలోని పంచ‌వ‌టి వైపు అడుగులు వేస్తున్నారు. 

*జ‌టాయువు....*

ఇంత‌లో మ‌హాకాయుడైన జ‌టాయువు సీతారామ ల‌క్ష్మ‌ణుల‌కు తార‌స‌ప‌డ్డాడు. రాముడిని చూసి "నాయ‌నా, నేను మీ తండ్రి ద‌శ‌ర‌ధుడికి స్నేహితుడిని. మా అన్న సంపాతి. మీ నాన్న గారు పుత్రులు క‌ల‌గాల‌ని పుత్ర‌కామేష్ఠి యాగం చేసేట‌పుడు నేను వారిని చూశాను. ఇప్పుడు పుత్ర‌శోకంతో వారు మ‌ర‌ణించార‌ని తెలుసుకున్నాను", అంటూ ద‌శ‌ర‌థ మ‌హారాజు చేసిన అద్భుత పుత్ర‌కామేష్ఠి యాగం, ఆ యాగ‌ఫ‌లితంగా ద‌శ‌ర‌థ త‌న‌యుల జ‌న‌నం గురించి ఆ నాటి ఆయాగ విశేషాల గురించీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు సీతారామ ల‌క్ష్మ‌ణుల‌కు తెలియ‌జేశాడు. మిత్రుడైన ద‌శ‌ర‌థ మ‌హారాజు కుమారులు క‌నుక ఈ అర‌ణ్యంలోవారికి తాను ర‌క్ష‌ణ‌గా ఉంటానని అన్నాడు జ‌టాయువు.


*ప‌ర్ణ‌శాల‌...*


  గోదావ‌రి న‌దీతీరంలో పంచ‌వ‌టి అనే సుంద‌ర ప్ర‌దేశంలో అన్న‌గారి ఆదేశం మేర‌కు ల‌క్ష్మ‌ణుడు అంద‌మైన ప‌ర్ణ‌శాల‌ను నిర్మించాడు. కాలం గ‌డుస్తోంది. ఒక‌రోజు సీతారామ ల‌క్ష్మణులు మాట్లాడుకుంటుండ‌గా  రావ‌ణాసురుని సోద‌రి శూర్ప‌ణ‌ఖ అనే రాక్ష‌సి అక్క‌డ ఊడిప‌డింది. రాముడి అందానికి ముగ్థురాలైంది. "నిన్ను భ‌ర్త‌గా పొందాల‌ను కుంటున్నాను" అన్న‌ది. రాముడు కాద‌నేస‌రికి ల‌క్ష్మ‌ణుడి వెంట ప‌డింది. చివ‌ర‌కు శూర్ఫ‌ణ‌ఖ ముక్కూ చెవుల‌ను కోసి లక్ష్మ‌ణుడు దాని‌ని అక్క‌డి నుంచి పంపించివేశాడు. శూర్ప‌ణ‌ఖకు జ‌రిగిన‌ ప‌రాభ‌వంతో త‌మ‌పైకి వ‌చ్చిన శూర్ఫ‌ణ‌ఖ సోద‌రులు ఖ‌ర‌,దూష‌ణాదుల‌ను, అక్క‌డి రాక్ష‌స‌మూక‌ను రాముడు మ‌ట్టుపెట్టాడు. రావ‌ణాసురుడి కి విష‌యం తెలిసింది.అతిలోక సుంద‌రి సీత‌ను అపహరించి తెచ్చుకోమ‌ని శూర్ప‌ణ‌ఖ రావ‌ణుడికి నూరిపోసింది. 


*మారీచుడు.....*

 శూర్ప‌ణ‌ఖ మాట‌లు విన్న రావ‌ణాసురుడు సీతను అపహరించడానికి ప్ర‌ణాళిక ర‌చించాడు. అందుకు సాయం కోరి మారీచుడి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. . అయితే రాముడి దెబ్బ ఏమిటో విశ్వామిత్ర మ‌హ‌ర్షియాగ స‌మ‌యంలోనే రుచి చూసి ఉన్న మారీచుడు, రాముడితో యుద్ధం కొని తెచ్చుకుని, వంశ నాశ‌నానికి పాల్ప‌డ‌కు అని రావణుణ్ణి హెచ్చ‌రించాడు. సీతాప‌హ‌ర‌ణ అనే పాడు ఆలోచ‌న‌ను విర‌మించుకోమ‌న్నాడు. "రాముడు మాన‌వ మాత్రుడు,అతడెంత "అని రావణాసురుడు అన్నాడు. రావ‌ణా, "నువ్వు రాముడిని త‌క్కువ‌గా అంచనా వేస్తున్నావు. నీ వంశం స‌ర్వ‌నాశ‌నం కావ‌డానికే నీకు ఇలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తున్న‌ట్టున్నాయి. ఇక నిన్ను ఎవ‌రూ ర‌క్షించ‌లేరు "అని మారీచుడు అన్నాడు. 


 *రామో విగ్రహవాన్ ధర్మః* 

*సాధుః సత్యపరాక్రమః* 

 *రాజా సర్వస్యలోకస్య*

 *దేవానాం మఘవానివ ॥*


శ్రీరాముడంటే ఏమిటో ఒక్క శ్లోకంలో నే క‌ళ్ల‌కు క‌ట్టాడు మారీచుడు.

*మారీచుడి హిత వచనాలు*

 “శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రామ‌చంద్ర‌మూర్తి.

 సకలప్రాణికోటికి హితవుకలిగించే సాధుజీవనుడు. అతని పరాక్రమానికి తిరుగులేదు. దేవేంద్రుడు దేవతల‌కు ప్రభువైనట్టే, ఈ సమస్త చరాచరసృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ శ్రీ‌రాముడు”

రాముడు మూర్తీభ‌వించిన ధ‌ర్మం. అతనితోపెట్టుకోకు అని హిత వ‌చ‌నాలు ప‌లికాడు మారీచుడు.

అయినా రావ‌ణుడు వినిపించుకోలేదు. నీ ద‌గ్గ‌ర హిత‌వ‌చ‌నాలు చెప్పించుకోవ‌డానికి రాలేద‌న్నాడు .

 అప్పుడు మారీచుడు ,లంకేశ్వ‌రా....


*సుల‌భాః పురుషా రాజ‌న్* *స‌త‌తం ప్రియ‌వాదినః*

*అప్రియ‌స్య చ ప‌థ్య‌స్య వ‌క్తా* *శ్రోతాచః దుర్ల‌భాః*


 ఈలోకం చాలా చిత్ర‌మైన‌ది, 

చుట్టూ చేరి , మ‌న మ‌న‌సుకు న‌చ్చే విధంగా తియ్య‌తియ్య‌గా ఉండే మాట‌లు మాట్లాడేవాళ్లు చాలామందే దొరుకుతారు. అవి మ‌న‌కు ఇష్టం గా ఉంటాయి. కానీ మ‌న‌సుకు క‌ష్ట‌మైనా మంచి చెప్పేవాడు ఒక్క‌డూ దొర‌క‌డు. దొరికినా మ‌నం వాటిని ప‌ట్టించుకోం. అవి మ‌న‌కు ఏనాడూ రుచించ‌వు. ఇక నేను చేసేది ఏమీ లేదు అన్నాడు.

 రావ‌ణుడి మాట విన‌కుంటే అత‌ని చేతిలో చావు త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన మారీచుడు, రావ‌ణుడి చేతిలో చావ‌డం క‌న్న ,ఆ చావు ఏదో రామ‌చంద్ర మూర్తి చేతిలో చ‌నిపోయినా పుణ్యం వ‌స్తుంద‌నుకున్నాడు .


*మారీచుడు-మాయలేడీ*

రావణాసురుడు చెప్పినట్టుగా,

మారీచుడు మాయా బంగారు లేడి రూపంలో ప‌ర్ణ‌శాల వ‌ద్ద తిరిగి 'మాయం కావ‌డానికి అంగీక‌రించాడు. అలా  ‌ ప‌ర్ణ‌శాల వ‌ద్ద తిరుగుతున్న మాయా లేడిని సీత‌మ్మ‌వారు చూశారు. ఇంత అంద‌మైన లేడి చెంగు చెంగున గెంతులు వేస్తూ మ‌న ప‌ర్ణ శాల‌లో ఉంటే ఎంతో బాగుంటుంది క‌దా అని రామ‌ల‌క్ష్మ‌ణుల‌తో సీత‌మ్మ‌వారు అన్నారు. ల‌క్ష్మ‌ణుడు వెంటనే,"ఇది మారీచుడి మాయ‌. ఇలాంటి విద్య‌లు వాడికి బాగా తెలుసు మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి" అన్నాడు. అయినా సీత‌మ్మ‌వారు బంగారు లేడి గురించి చెబుతూనే ఉన్నారు. ఇంత‌గా ఆ లేడిపై సీత‌మ్మ‌వారు మ‌న‌సుపడ్డారు క‌నుక దానిని తీసుకురావాల‌ని రామ‌చంద్ర‌మూర్తి నిర్ణ‌యించుకున్నాడు. "రాక్ష‌సుడైతే వ‌ధిస్తాను, లేడి అయితే తెస్తానని అంటూ రాముడు బ‌య‌లుదేరాడు, అది చిక్కిన‌ట్టే చిక్కి పొద‌ల‌మాటున జారుకుంటున్న‌ది .అలా రాముడిని అడవిలో చాలా దూరం తీసుకువెళ్లింది. ఇక త‌ప్ప‌ద‌నుకుని రాముడు బాణం సంధించాడు. పెద్ద పెట్టున "హా ల‌క్ష్మ‌ణా.... హా సీతా "అని అరుస్తూ మాయా మారీచుడు నేల‌కూలాడు. మారీచుడు ఇలా త‌న గొంతుక‌తో హా ల‌క్ష్మ‌ణా...హా సీతా అని కూల‌బ‌డ‌డం వెనుక ఏదో జ‌ర‌గ‌రానిది జ‌ర‌గ‌బోతున్న‌ద‌ని రాముడు వెంట‌నే ప‌ర్ణ‌శాల‌కు వ‌స్తున్నాడు. ఇంత‌లో హా ల‌క్ష్మ‌ణా ...హా సీతా అన్న ఆర్త‌నాదం విన్న సీతమ్మ‌త‌ల్లి క‌ల‌వ‌ర ప‌డింది. భ‌ర్త‌కు ఏదో అపాయం జ‌రిగింద‌ని భావించి, ల‌క్ష్మ‌ణుణ్ణి ఉన్న‌ ఫళంగా బ‌య‌లుదేరి వెళ్ల‌మ‌నింది. ల‌క్ష్మ‌ణుడు ఇదంతా మాయా లేడి నాట‌కంలో భాగ‌మ‌ని, ఇది రాక్ష‌స మాయ అని, శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తికి ఈ భూ మండ‌లం లో తిరుగేలేద‌ని చెప్పాడు. అన్న ఆర్త‌నాదం వినిపించినా క‌ద‌ల‌కుండా కూర్చున్న "నీకంటె శ‌త్రువు మ‌రొక‌డు లేడని" సీత‌మ్మ వారు నిందించారు. ఈ సీత, రామ‌చంద్ర‌మూర్తి సొంతం. ప్రాణాలైనా విడుస్తాను కాని మ‌రొక‌రికి ద‌క్క‌ను అన్న మాట‌ల‌కు ల‌క్ష్మ‌ణుడు నిశ్చేష్ఠుడ‌య్యాడు. సీతామాత పాదాల‌కు న‌మ‌స్క‌రించి స‌మ‌స్త దేవ‌త‌ల‌కు న‌మ‌స్క‌రించి, వ‌న‌దేవ‌త‌లారా మీరే సీతామాత‌కు ర‌క్ష అన్నాడు. త‌గిన‌జాగ్ర‌త్త‌లు చెప్పి ప‌ర్ణ‌శాల వెలుప‌ల‌కు రావ‌ద్ద‌ని సూచించి ల‌క్ష్మ‌ణ రేఖ‌ను గీచి, అన్న‌య్య కోసం బ‌య‌లుదేరాడు. 

ఇదే అద‌నుగా రావ‌ణాసురుడు ప‌ర్ణ‌శాల ప్రాంగ‌ణంలో అడుగుపెట్టాడు. సాధువు రూపంలో వెళ్లి , సీత‌మ్మ‌ను ల‌క్ష్మ‌ణ రేఖ‌ దాటి వెలుప‌ల‌కు ర‌ప్పించి ఉన్న‌ఫ‌ళంగా అప‌హ‌రించి గ‌గ‌న‌మార్గాన బ‌య‌లుదేరాడు.

ఈ హ‌ఠాత్ప‌రిణామానికి మూర్ఛ‌పోయిన సీతామ‌హాసాధ్వి ఆ త‌ర్వాత తేరుకుని రావ‌ణా "నీ ప్రాణాలమీద ఆశ‌వ‌దులుకోనే ఈ ప‌నిచేశావా. రాముడు నిన్ను నీ వంశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తాడు. కోరి ప్రాణాల‌మీదికి తెచ్చుకుంటున్నావు" అని హెచ్చ‌రించింది. రావ‌ణుడు ఆ మాట‌ల‌ను తేలిక‌గా కొట్టిపారేశాడు . "ల‌క్ష్మ‌ణా నిన్ను ఎన్ని మాట‌లు అన్నాన‌య్యా అందుకే అనుభ‌విస్తున్నాను. రామా , ల‌క్ష్మ‌ణా ...ర‌క్షించండి" అని సీత వేడుకుంటూ ఉంది. వ‌న‌దేవ‌త‌లారా నా దీన స్థితిని రామ ల‌క్ష్మ‌ణుల‌కు తెలియ‌జేయండి అంటూ పెద్ద‌గా అరుస్తూ ఏడుస్తూ ఉంది. 


*జ‌టాయువు.....*


సీతాదేవి ఆర్త‌నాదాలు జ‌టాయువు చెవిలో ప‌డ్డాయి. జ‌ర‌గ‌రానిది జ‌రిగింద‌ని గ్ర‌హించిన జ‌టాయువు వాయువేగంతో గ‌గ‌న‌తలానికి వెళ్లి గ‌మ‌నించాడు. రావ‌ణాసురుడు సీత‌మ్మ‌వారిని అప‌హ‌రించుకు పోతున్నాడ‌ని గ్ర‌హించి రావ‌ణాసురుడితో భీక‌రంగా త‌ల‌ప‌డ్డాడు. రావ‌ణాసురుడు జ‌టాయువు రెక్క‌లు తెగ‌న‌రికి ముందుకు సాగాడు. జ‌టాయువు కుప్ప‌కూలాడు. 

రావ‌ణాసురుడు సీత‌మ్మ‌ను తీసుకుని గ‌గ‌న మార్గంలో సాగుతున్నాడు. కిందికి చూస్తే ఐదుగురు వాన‌రులు ఒక కొండ‌పై మాట్లాడుకుంటూ క‌నిపించారు. వారిని చూడ‌గానే సీత‌మ్మ‌వారు త‌న ఆభ‌ర‌ణాల‌ను మూట‌గ‌ట్టి వారి వ‌ద్ద వదిలింది. మ‌ళ్లీ ఎవ‌రో మ‌హిళ‌ను రావ‌ణాసురుడు అప‌హ‌రించుకుపొతున్నాడ‌ని వాన‌రులు గుర్తించారు. అలా పంపా మార్గాన సాగి సముద్రం దాటి త‌నతో తెచ్చుకున్న త‌న‌మృత్యుదేవ‌త‌ను అంతఃపురంలో దింపి ఆమె చుట్టూ కాప‌లాఉంచాడు రావ‌ణాసురుడు. ఆమె మ‌న‌సు మార్చ‌మ‌ని సేవ‌కులను పుర‌మాయించాడు. ఇవేవీ ప‌నిచేయ‌లేదు.సీత‌మ్మ‌వారిఇక‌ 12 మాసాలు గ‌డువు ఇచ్చాడు. త‌న‌నుస్వీక‌రించ‌డ‌మా లేక త‌న‌కు ఆహారంగా మార‌డ‌మా తేల్చుకోమ‌న్నాడు. 


*రామ విర‌హం....*

రాముడు మారీచుడిని సంహ‌రించి, ప‌ర్ణ‌శాల వైపు వ‌స్తున్నాడు. అప‌శ‌కునాలు కనిపించాయి. మారీచుడి అరుపు విని ల‌క్ష్మ‌ణుడు సీత‌ను విడిచి రావ‌డం లేదు క‌దా . రాక్ష‌సుల‌నుంచి సీత‌కు ఏ ఆప‌దా క‌ల‌గ‌కుండు గాక అని మ‌న‌సులో అనుకుంటూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఎదురుగా ల‌క్ష్మ‌ణుడు క‌నిపించాడు. రాముడి గుండె గుభిల్లుమ‌నింది. ల‌క్ష్మణా ఈ అర‌ణ్యంలో సీత‌ను ఒంట‌రిగా విడిచి వ‌చ్చావా అన్నాడు. జ‌రిగిన విష‌యం అన్న‌కు చెప్పి ఇద్ద‌రూ వేగంగా ప‌ర్ణ‌శాల‌కు వ‌చ్చారు.ప‌ర్ణ‌శాల‌లో సీతమ్మ క‌నిపించ‌లేదు. చుట్టూ గాలించారు. అయినా క‌నిపించ‌లేదు. ల‌క్ష్మ‌ణా , సీత లేకుండా నేను బ‌త‌క‌లేను అన్నాడు రాముడు. అన్న‌య్యా నీవే ఇలా అయిపోతే ఎలా అంటూ ధైర్య‌వ‌చ‌నాలు చెప్పాడు. జంతువులు తినేశాయో, రాక్ష‌సులు అప‌హ‌రించారు ఏమీ తెలియని అయొమ‌య స్థితి. ఇద్ద‌రూ ధైర్యం తెచ్చుకుని సీత జాడ తెలుసుకునేందుకు ముందుకు సాగుతున్నారు. ఇంత‌లో రెక్క‌లు తెగి కొన ఊపిరితో ఉన్న జ‌టాయువు వారికి క‌నిపించాడు. జ‌టాయువు జ‌రిగిన విష‌యం చెప్పాడు. రావ‌ణుడు సీత‌ను అప‌హ‌రించాడ‌ని చెప్పి క‌న్నుమూశాడు . జ‌టాయువుకు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించి స్నేహ‌ధ‌ర్మం నిర్వ‌ర్తించాడు రాముడు. అక్క‌డ నుంచి మ‌తంగ ఆశ్ర‌మం దాటి ముందుకుసాగుతున్న వారిపైకి క‌బంధుడ‌నే రాక్ష‌సుడు రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను పిడికిట బంధించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. వాడి రెండు చేతుల‌నూ తెగ‌న‌రికేశారు. వాడొక గంధ‌ర్వుడు. శాప‌వ‌శంతో రాక్ష‌సుడ‌య్యాడు. కబంధుడికి శాప‌విమోచ‌నం క‌లిగింది. అప్పుడు ఆ గంధ‌ర్వుడు మీ క‌ష్టాలు త్వ‌ర‌లోనే తొల‌గి పోతాయి. మీకు ఒక మంచి స్నేహితుడు అవ‌స‌రం . ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లో రుష్య‌మూక ప‌ర్వ‌తంపై సుగ్రీవుడ‌నే వాన‌ర రాజు ఉన్నాడు . అతనితో మైత్రి మీకు శుభాన్ని చేకూరుస్తుంది అని చెప్పి మాయ‌మ‌య్యాడు. 

*శ‌బ‌రి.....*

క‌బంధుడు చెప్పిన దిక్కుగా రామ‌ల‌క్ష్మ‌ణులు న‌డుస్తున్నారు. మార్గ‌మ‌ధ్యంలో ఒక ఆశ్ర‌మం క‌నిపించింది. అది శ‌బ‌రి ఆశ్ర‌మం. రామ‌చంద్ర‌మూర్తి కోస‌మే వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్న‌ది. రామ‌చంద్రుడికి అతిథి స‌త్కారాలు చేసింది. నాయ‌నా రామ‌చంద్రా నీ ద‌ర్శనంతో నా త‌ప‌స్సు ఫ‌లించింది అనింది. అక్క‌డ కొంత సేపు విశ్ర‌మించి స‌ప్త సాగ‌ర తీర్థంలో స్నానం చేసి పితృదేవ‌త‌ల‌కు త‌ర్ప‌ణాలు విడిచారు.

మ‌న‌సు కుదుట‌ప‌డిన‌ట్టు అనిపించింది. చెడ్డ రోజులు దాటి అంతా శుభం జ‌ర‌గ‌బోతున్న‌ద‌న్న సూచ‌నుల క‌నిపిస్తున్నాయ‌ని రాముడు ల‌క్ష్మ‌ణుడుతో అన్నాడు.అలా మాట్లాడుకుంటూ వారు రుష్య‌మూక ప‌ర్వ‌తం వైపు ప్ర‌యాణం సాగిస్తున్నారు. అల్లంత దూరంలో రుష్య‌మూక ప‌ర్వ‌తం క‌నిపిస్తోంది.........


                          *******


ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.

                            

        ****

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

       *****

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే 

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

 శ్రీరామ రామ 

రఘునందన రామ రామ!

 శ్రీరామ రామ 

భరతాగ్రజ రామ రామ! 

శ్రీరామ రామ 

రణకర్కశ రామ రామ!

 శ్రీరామ రామ శరణం

 భవ రామ రామ!

 శ్రీరామ చంద్ర చరణౌ

 మనసా స్మరామి!

 శ్రీరామ చంద్ర చరణౌ

 వచసా గృహ్ణామి! 

శ్రీరామ చంద్ర చరణౌ

 శిరసా నమామి! 

శ్రీరామ చంద్ర చరణౌ 

శరణం ప్రపద్యే!.

                      

   


  **** (అర‌ణ్య‌కాండ స‌మాప్తం)****

పంచాంగం

 


గ్యాస్ సిలిండర్ ఉందా?

 రాత్రి సెలవుల హడావుడి జాగరణ లో ఉండగా.. 


ఎన్నో ఏళ్ల తర్వాత, నిన్న రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఆమె నుండి ఫోన్ వచ్చింది... ఇప్పటికీ ఆ గొంతులో అదే మాధుర్యం.......


"ఎలా ఉన్నావు?"


నేను బదులిచ్చాను, "నేను బాగున్నాను!"


ఆమె అంది, "ఇంకా నిద్రపోలేదా?"


నేను సమాధానమిచ్చాను, "లేదు, ఇంకా నిద్రపోలేదు!"


ఆమె అంది, "ఈ సాయంత్రం పార్టీలో నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు!"


నేను సంతోషంగా అన్నాను, "ధన్యవాదాలు!"


ఆమె మాటలు కొనసాగిస్తూ, "ఈ రోజు కూడా నువ్వు అదరగొట్టేస్తున్నావు!"


నేను చిరునవ్వుతో అన్నాను, "ఓ అవునా!"


ఆమె అంది, "ఈ రోజు ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నీతో మాట్లాడదామని అనుకున్నాను!"


నేను అడిగాను, "ఏంటి విశేషాలు? దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు?"


ఆమె గొంతులో కాస్త సిగ్గు వినిపించింది, "నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా? నువ్వు కాదనవు కదా?"


నేను వెంటనే అన్నాను, "కాదనే ప్రసక్తే లేదు, అసలు విషయం ఏంటి?"


అప్పుడు ఆమె అంది, "నా మీద ఒట్టు పెట్టు!"


నా సమాధానం, "నేను నీ మీద ఒట్టు పెడుతున్నాను... అసలు విషయం చెప్పు!"


ఆమె అంది, "నాకు కాస్త సిగ్గుగా అనిపిస్తోంది!"


నేను అన్నాను, "సిగ్గుపడాల్సిన పనేమీ లేదు... నిర్భయంగా చెప్పు!"


ఆమె తడబడుతూ అడిగింది, "నీ దగ్గర ఏమైనా అదనపు గ్యాస్ సిలిండర్ ఉందా?"


నేను ఫోన్ కట్ చేసేశాను!

పరాభవ ఉగాది*

 *పరాభవ ఉగాది*

✍🏼 గోగులపాటి కృష్ణమోహన్


పచ్చని తోరణం పలుకగా — పండుగ చేరింది

షడ్రుచుల రుచిలోనే — జీవితం నేర్పింది


తీపి విజయానందం — చేదు గుణపాఠం

ఉప్పు బంధాల రుచి — కారం ధైర్యపాఠం


పులుపు పరిణామం — వగరు విరక్తి

ఆరు రుచుల మధ్యే — జీవన సత్యం


ఆదాయ వ్యయాల మధ్య — ఆత్మగణితం

రాజపూజ్య అవమానం — కాలచరితం


జీతం నేలమీద — ధరలు నింగిమీద

మధ్యతరగతి మౌనం — నిశ్శబ్ద గానం


పిల్లల నవ్వుల్లోనే — రేపటి వెలుగు

యుద్ధాల నీడల్లోనూ — శాంతి తలపు


పంచాంగ పుటలలో — జాతక సంకేతం

మనసే తీర్చేది — జీవన గమ్యం


ఆకురాలిపోయినా — చిగురు నవ్వుతుంది

పరాభవమన్న పేరు — విజయం చెబుతుంది


ఉగాది ప్రతి సారి — మార్పు సంకేతం

మనసులో స్థైర్యమే — జీవిత నేత్రం


**లోకా సమస్తా సుఖినోభవంతు**


*తెలుగు నూతన సంవత్సరాది..*

*పరాభవ నామ సంవత్సర ఉగాది...*

*శుభాకాంక్షలతో...*


మీ

*గోగులపాటి కృష్ణమోహన్*

కవి, రచయిత, జర్నలిస్ట్ 

ఫౌండర్ : నా టీవి, నా ఫౌండేషన్ 

సురారం కాలనీ, హైదరాబాద్ 

మొబైల్: 9700007653