🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
*🌼శ్రీ విష్ణు ధర్మోత్తర మహా పురాణం*
*🌼132.అధ్యాయం*
*🌼ప్రధమ ఖండము:*
*🌼చంద్రోదయ వర్ణనము:*
*🌼మార్కండేయుడనియె:-*
రంభ చంద్రోదయమున కెదురు నూచుచున్న యూర్వశింగని వినోదము కొఱకామె కావనమున జూపించెను. చెలీ? ఈ తోటలో పూవులతో నిలపుగుల్కు నీ చంపక ద్రుమముం జూడవె. ఇది నీ మేని రంగునకు సరియగు నిండ జూచిన విరుల నిండుకొని యున్నది. ఓ వామనయనా! ఇదిగో పుష్పించిన యీ దానిమ్మ చెట్టు గనవె. పువ్వులతో నిది నీ యధర బింబము సొంపుగొని యుల్నది. ఇరిదె జూడు మీ సహకారము పంచశర శరాకారమెంత మనోహరముగ నున్నది! నీ మెఱుగు చెక్కిళ్లు కొక క్రొత్తయనుందల వరించు పువ్వులతో నున్న మదూకమును (ఇప్పచెట్లును) గనుము. నీ పయోధరములట్లతి రమ్యములయిన పండ్ల బరువెక్కి మనసున కెంతేని వేడుక గూర్చు నీ తాటిచెట్టు వంక చూపు నిల్పుము. కల్యాణీ? నీ యూరపులకు సరైయై నిల్భు నీయరటింగ గనుగొనవె. విశ్వకర్మ దీనికి చక్కని వన్నె గూర్ఛి సర్వాంగ సుందరముగ నిర్మించినాడు. పువ్వుల విరియబూచి మనసుందొంగిలుచున్న యీ యవిముక్తలతికం దిలకింపవే. ఇది వేనలి కెనయై తుమ్మెదలు ముసరనెంతేని ముచ్చట గొల్పుచున్నది. విశాలాక్షీ! ఇటుచూడు మీమొల్ల తరువు. నీ పలువరుస కీడుగా చక్కని హపుల మిగుల రాణించుచున్నది. ఇది యుం గనుగొనవె. ఈ కలువపూ దీగ నీ కనుల కెనయగు విరిసిన కలువలడెందమున కానందము నించుచున్నది చక్కగ విరసిన కమలములతో నిండిన యీ తామర తీగనో సుందరీ! కాంచు మిది నీ యూర్పులనెత్తావుల జిమ్ముచు బంగారు కింజల్కముల నొల్లసిల్లు విప్పారిన కమలము నెంతేని సొంపు నింపుచున్నది. తామర కొలని దరులందరిసిన యీ రాయచలం గనుమివి నీ మనోహర మందగమనము పిలాసము పేర్చికొన్నట్టున్నవి. నీ కెంగేలి రంగు గొనిన లేజిపురులం దేజిరిల్లు పలురకము లయిన తరుపులనలము కొన్న యీ క్రీడా శైలమును నీక్షింపుము. ఈ విహార గిరిపై నున్న తీయ మావిగున్నపై నుండి మరునూరక యెస కొల్పుచుం నీ మథుర కంఠ స్వరమునకు సరిగ గూయుచు మనసు నాచికొనుచున్నధదిగో కోకిల. క్రీడాద్రి నుండి వెడలుచున్న యీనదిం జూడుమిది నీ మనసు వలె నతి స్వచ్ఛమైన చల్లని తేట నీట గాటముగ దనియంచుచున్నది. ఎంతయు వింత గొల్పుచు నెంతేని జూడ ముచ్చటయగు నీ చల్లని పూదోట నాలో కింపు ముదిమదిగో నీవు కాము బారికిం జిక్కితవని తెలిసి జాలిం గొని కాబోలు జగద్భంధువు తన కరముల నిమిడించి కొని రవి చాటగు చున్నాడు. ఓ సుందరి! ఎంతచిరు సైనవియు చెట్ల యాకులం జివురాకులును సూర్యాస్తమయ సమయ తాపమున తాయెఱుపెక్కి మిక్కిలి దీపించుచున్నవి. దినకరుడు గిరి శిఖరముల నెరుపార జేయుచున్నాడు.
రవి స్వధర్మము నిర్వర్తించి దివసాన మందస్త మించి నాడు. కల్యాణీ! అదురక్తిమైన సంధ్యా కాలము తనంత నొక కాముకు డొక్క కామిని నట్ట ప్రాగ్దిక్కును కౌగిలించు కొనుచున్నదల్లదిగో చూడుము! ద్విజశ్రేష్ఠులు నీయమముగొని సత్పురుషుల మార్గముననువర్తించుచు నిపుడు సంధ్యాకాలము నుపాసించుచున్నారు. (సాయం సంధ్యా వందనము సేయుచున్నారన్నమాట.) అస్తంగతుడైనను సూర్య ప్రభువును కులీనయమునస్వినయు నగు సాధ్వివలె సంధ్యా దేవి అనువర్తించు చున్నది. ఓ నునాసోరూ! (చక్కని ముక్కు చక్కని ఊరువులును గలదానా!) చూడు మిది. భూతలము తుమ్మోదలలముకొన్న తాపింఛ వృక్షములతో పోలికగ చీకటిం గ్రమ్ముకొన్నది. సర్వము గాఢాంధకార బంధురమై యేమియు గనిపించుట లేదు. సర్వజగత్తు మాలిన్యముచేనేకరూప మయినది. సఖీ! ఇత్తఱి బిత్తఱులు కామాయత్తలై నల్లని చీరలు గట్టుకొని నగలుపెట్టుకొని కాంతులు గదియ జనుచున్నారు. ఓ సుందరీ! అల్లదిగో చూడు చంద్ర బింబముదయించినది. అది పౌన్మతవైన మత్తకాశినుల నెమ్మోములతో సమముగ ప్రభలొల్కు చున్నది. ఇంచుకగ గగన మాక్రమించి యది తెల్లదన మంది నయనానందకరమగుచు చంద్రుని జూడుము. శశాంకు డొక సత్త్వ మట్టీ జగమ్ము నలము కొన్న తమస్సును (చీకటిని) దూరి పాటి అచ్చము తెలికాంతి గులుకు నాకసమున స్వచ్ఛముగ రాజిల్లు చున్నాడు. అనగా తమోగుణవశుడైన వాడు. పుడమి విడిచి కేనలసత్త్వగుణ సంపన్నుడై మీది కేగి పుణ్య లోకముల రాజిల్ల బూనిన పుణ్యాత్ము నట్లున్నాడని భావము. చంద్రుడిరు వంకల నేకరూపముగ వెన్నెలల జిమ్ముచు కామబాణ నిహతలైన నీ చెక్కిశుల తళుకు గొని యున్నాడు. ఈ తూర్పుదిశ చంద్రుడును వెండిబిందెందాల్చి ఈ భూదేవి వెన్నెల నెపమున కేవల రజతమయయో యన్నట్లు (కేవలం వెండితో చేసినదో యన్నట్లు) రాజిల్లు చున్నది.
చంద్రుడుదయింప విప్పారిన కునుదిని (నల్లకలువ తీగ) నీ చిఱు నవ్వుల సరిపుచ్చు పువ్వులతో మిక్కిలి శోభించు చున్నదల్లదె చూడుము. విశహము గొని యీ చక్రవాక వక్షి మిక్కిలి దుఃఖము గని పిరహ తాప శాంతికి కాబోలు చల్లని తెల్ల గలువ గతీ లోనికి జొచ్చుచున్నట్లున్నది.
ఈచంద్రకాంతసదసమునుండి చంద్రకిరణసమప్రభలును చంద్రకిరణ సంఘృఫ్టములునైన నీటిచినుకులుపడుచున్నవి. విరహదశలో నాయకుడు గురియు నశ్రుబిందువులో యన్నట్లు మంచు బిందువులు గురియు చున్న వన్నమాట. చంద్రునిచే గౌగిలికిం దార్చబడి రాత్రి (కాముని కౌగిట నున్న కామినివలె) తమః పటమును (చీకటి యను పలువను) విప్పికొన్నది.
ఓ చంద్రాసనా! ఈ చంద్రోదయమందు ప్రమదామనోహరుడైన యీ నరేంద్ర చంద్రునందూర్వశీ! నీవు జీవితాశను దర్శింపుము (బతుకుతెఱువు గమనింపు మన్నమాట) అంతియకాదాతని యందు ప్రాణములమీది యాశనుబెట్టుకొనుము. అని రెండవయర్థము (ఇది నీ భాగ్య విశేషమున తటాలున నీకు తారసిల్లినది.)
*ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున చంద్రోదయవర్ణనమను నూటముప్పదిరెండవ అధ్యాయము.*
🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి