5, సెప్టెంబర్ 2026, శనివారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము



శ్రీ భగవానువాచ ।

మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః ।

అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ।। 1 ।।




ప్రతిపదార్థ:



శ్రీ భగవాన్ ఉవాచ — భగవంతుడు ఇలా పలికెను; మయి — నా పట్ల; ఆసక్త-మనాః — ఆసక్తి కలిగిన మనస్సు తో; పార్థ — అర్జున, ప్రిథ పుత్రుడా; యోగం — భక్తి యోగము; యుంజన్ — అభ్యాసము చేస్తూ; మద్-ఆశ్రయః — నన్ను శరణుజొచ్చి ; అసంశయం — సందేహము లేకుండా; సమగ్రం — పూర్తిగా; మాం — నన్ను; యథా — ఎట్లా; జ్ఞాస్యసి — నీవు తెలుసుకొనగలవో; తత్ — అది; శృణు — వినుము.



తాత్పర్యము:

 


భగవంతుడు పలికెను: ఓ అర్జునా, నాయందు మాత్రమే మనస్సు నిలిపి, భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.



వివరణ:



మనస్సు తన యందు అనన్య భక్తితో లగ్నం చేసి భక్తితో తనను సేవించువారు, యోగులలో శ్రేష్ఠులు అని 6వ అధ్యాయం ముగింపులో, శ్రీ కృష్ణుడు చెప్పి ఉన్నాడు. సహజంగా ఈ ప్రతిపాదన కొన్ని ప్రశ్నలకు దారితీయవచ్చు: భగవంతుడిని గూర్చి తెలుసుకునే మార్గం ఏమిటి? ఆయనపై ధ్యానం చేయటం ఎలా? భక్తుడు భగవత్ ఆరాధన ఎలా చేయాలి? అర్జునుడు ఈ ప్రశ్నలను అడగకపోయినా, తన కరుణచే, భగవంతుడు ముందే ఊహించి చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఆయన 'శృణు' అన్న పదం వాడాడు, అంటే ‘వినుము’ అని అర్థం, అంతేకాక మద్-ఆశ్రయః అని కూడా లక్షణం చేర్చాడు అంటే ‘నీ మనస్సు నాయందే లగ్నంచేసి’ అని అర్థం.

కామెంట్‌లు లేవు: