18, ఆగస్టు 2026, మంగళవారం

శ్రీమద్భాగవతం - 24/42*

  **శ్రీమద్భాగవతం - 24/42* 


*దశమ స్కంధ ప్రవేశం – కృష్ణ జన్మ పూర్వరంగం & దేవతల గర్భస్తుతి*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత యాత్రలో 

 శ్రీమద్భాగవతానికే ప్రాణమైన దశమస్కందం లోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఇందులో నారాయణుని పూర్ణావతర స్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అవతార విశేషాలు, లీలలు సమగ్రంగా ఇవ్వబడ్డాయి, కృష్ అంటే ఆకర్షించేవాడు ఆయన లీలలు,కథలు మనసును తొందరగా ఆకర్షిస్తాయి,అలా ఆకర్షించి మనకే తెలియకుండా మన మనస్సు అనే వెన్న దోచి,ఇంద్రియాలు అనే అయిదు తలలపై నాట్యం చేసి, నేను నేను అనే విషాన్ని విరిచి అంతా తానే అనే అయి మనల్ని ఆయనలో కలిపేసుకుంటాడు, అందుకు భాగవతం వినడం, చదవడం. కేవలం స్మరణ చేత ముక్తి ఇచ్చే ఏకైక గ్రంథం భాగవతం..


స్వామి చేసే పనులు చిలిపిగా ఇలా ఉన్నాయి ఏంటండీ అనేట్టు కనపడతాయి.అలా చూసే వాడు దాన్ని విమర్శించే నెపం తో అయినా నన్ను పట్టుకున్నాడు అలానే వాడికి ముక్తి ఇస్తాను అంటాడు స్వామి.


 అలాగని అలా చేయమని అనటం లేదు ఇవన్ని ఈశ్వర లీలలు అనే విషయం మనసులో ఉంచుకుని చదవండి అని చెప్తున్నాను ఇక్కడ అంత పెద్దలు ఉన్నారు అన్ని తెలిసిన వారే అయిన చెప్పటం నా బాధ్యత కనుక చెప్తున్న.


 లీల అర్దం అయితే అయినట్టు చదవండి, అర్దం అవ్వకపోతే నమస్కారం చేయండి, అంతే కానీ అబ్బే ఇలా చేస్తాడా అండి అని అనకండి ఈశ్వర చర్యలు ఊహలకు అందవు, అన్ని వివరించే అవకాశం నాకు రావచ్చు, రాకపోవచ్చు(అన్ని తెలిసిన పండితుని కూడా కాదు నేను) అయినా మీకు అలాంటి అనుమానం రాకుండానే చెప్పే ప్రయత్నం చేస్తాను,అలా స్వామి నా చేత చెప్పించాలి అని ప్రార్ధిస్తున్నాను..


కానీ ముందుగానే మీకు విషయం చెప్పి ప్రారంభం చేస్తే మీకు స్పష్టత ఉంటుంది అని ఇక కథలోకి వెళ్దాం.. శ్రీ కృష్ణ శరణం మమ 


1. దశమ స్కంధ విశిష్టత & భూదేవి ఆర్తనాదం 


శ్రీమద్భాగవతంలోని పన్నెండు స్కంధాలలో **దశమ స్కంధం** సాక్షాత్తు భగవంతుని **హృదయం (ఆశ్రయ తత్త్వం)** గా భావిస్తారు. పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని ప్రాధేయపడుతూ: "మహర్షీ! చంద్రవంశంలో అవతరించిన స్వయం భగవానుడైన శ్రీకృష్ణుని దివ్య లీలలను సమగ్రంగా, యథాతథంగా నాకు వినిపించండి" అని వేడుకున్నాడు.


ద్వాపరయుగాంతంలో రాక్షసాంశలతో జన్మించిన రాజుల సైన్యాల భారానికి తాళలేక భూదేవి గోరూపాన్ని (ఆవు రూపాన్ని)ధరించి కన్నీళ్లతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది.


* **క్షీరసాగర తీరాన ప్రార్థన:** బ్రహ్మదేవుడు, పరమశివుడు మరియు దేవతలను వెంటబెట్టుకుని క్షీరసాగర తీరానికి వెళ్లి 'పురుష సూక్తం'తో శ్రీమహావిష్ణువును స్తుతించారు.


ఆ సమయంలో బ్రహ్మదేవునికి సమాధి స్థితిలో భగవంతుని దివ్యవాణి వినిపించింది


"దేవతలారా! భూదేవి దుఃఖాన్ని నేను ఎరుగుదును. నేను స్వయంగా యదువంశంలో వసుదేవుని ఇంట దేవకీ గర్భాన ఆవిర్భవిస్తాను. దేవతలందరూ భూలోకంలో యదువంశీయులుగా, గోపాలురుగా జన్మించి నా లీలలలో భాగస్వాములు కండి!"అని చెపితే ఆ విషయాలు బ్రహ్మగారు దేవతలకు చెప్పి, స్వయంగా నారాయణుడే నీ బాధా తీరుస్తాను అన్నాడు అని భూదేవిని ఊరడించి తన లోకానికి తిరిగి వెళ్ళాడు


2. దేవకీ-వసుదేవుల వివాహం


పూర్వం యధువంశ ప్రభువైన శూరసేనుడు మధురా నగరంలో నివసిస్తూ ఉన్నాడు, యాదవ మహారాజులు అందరికీ మధురా నగరం రాజధాని.


ఒకానొక సమయంలో శూరసేన మహారాజు కుమారుడైన వసుదేవునికి ఉగ్రసేన మహారాజు సోదరుడైన దేవకుని కుమార్తె దేవకీదేవితో అత్యంత వైభవంగా వివాహం జరిగింది.


చెల్లెలు అయిన దేవకి అంటే కంసునికి ఎంతో అభిమానం. ఆమెకు సంతోషం చేకూర్చడం కోసం వివాహానంతరం నూతన దంపతులను తన రథంపై కూర్చోబెట్టుకుని, స్వయంగా తానే రథసారథియై మధురా నగరంలో ఊరేగిస్తున్నాడు. దేవకుడు కూడా ఎన్నో విలువైన ఆభరణాలు, దాసీలను కూతురు పై ప్రేమతో ఇచ్చాడు.


చక్కగా శంఖా నాదాలు, మృదంగ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగావెళ్తూ రథం మధ్య మార్గంలో ఉండగా, ఆకాశం నుండి భయంకరమైన గంభీర ధ్వనితో ఆకాశవాణి పలికింది:


 *"ఓరి మూర్ఖుడా! కంసా! ఎవరినైతే ఇంత గారాబంగా రథంపై ఊరేగిస్తున్నావో... **ఆమె ఎనిమిదో గర్భం (8వ సంతానం) నిన్ను సంహరిస్తుంది!**"*అన్నది.


 3. కంసుని క్రూరత్వం & వసుదేవుని సత్య ప్రతిజ్ఞ 


ఆకాశవాణి మాటలు విన్న కంసుడు తీవ్రమైన భయంతో, ఆగ్రహంతో రగిలిపోయాడు.కంసుడు సహజంగా క్రూర స్వభావం గల వాడు, వంశానికే మచ్చ తెచ్చిన దూర్తుడు,ఆ మహాపాపి ఆ మాటలు విన్నంతనే తన ఖడ్గాన్ని దూసి, తోబుట్టువైన దేవకి జుట్టు పట్టుకుని ఆమె తలను నరకడానికి సిద్ధమయ్యాడు.


అది చూసి పరమ ధర్మాత్ముడుఅయిన వసుదేవుడు. కంసుని శాంతింపజేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలతో ఎంతో నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.అయినా ఆ క్రూరుడు వినలేదు దాంతో..


 "కంసరాజా! దేవకి నీ ప్రియమైన సోదరి. స్త్రీహత్య మహాపాపం. పైగా నీకు భయం దేవకి వల్ల కాదు, ఆమెకు పుట్టబోయే కుమారుల వల్లనే కదా! మాకు పుట్టిన సంతానాన్ని పుట్టిన వెంటనే నీ చేతుల్లో పెడతాను. ఆమెను విడిచిపెట్టు!"అన్నాడు.


వసుదేవుని సత్యవాక్పరిపాలనను ఎరిగిన కంసుడు ఆ సమయానికి దేవకిని విడిచిపెట్టాడు.


కాలక్రమేణా దేవకి, వసుదేవులకు ప్రతి సంవత్సరం కి ఒక పుత్రుడు చొప్పున వరుసగా ఎనిమిది మంది కుమారులు, పిదప ఒక కుమార్తెను కన్నది.


వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం మొదటి కుమారుడు జన్మించిన వెంటనే కంసునికి అప్పగించాడు. కంసుడు మొదట "నాకు ఎనిమిదో వాడితోనే భయం కదా"తీసుకువెళ్ళు బావా అన్నాడు. కానీ వసుదేవునికి మనసులో అనుమానం గానే ఉంది కంసుడు దుష్టుడు, పైగా మనసు నిలకడలేనివాడు, ఇతని వల్ల ఎప్పుడూ ఏ ముప్పు వస్తుందో అని చింతిస్తూనే ఉన్నాడు.


ఒకానొకప్పుడు నారదమహర్షి కంసుని దగ్గరకు వచ్చి - "కంసా! గోకులమునందు ఉండె నందుడు మొదలగు గోపాలురు, వారి భార్యలు, వృష్టివంశమునకు చెందిన వసుదేవుడు మొదలగువారు, యదువంశమునకు చెందిన దేవకి మొదలగు స్త్రీలు, నంద వసుదేవులయొక్క | (ఉభయ వంశములకు చెందిన) జ్ఞాతులు, బంధుమిత్రులు అందరును దైవాంశసంభూతులు. నిన్ను సేవించుచున్న వారందరు అసురులు. (ఆసురీసంపదగలవారు). ఆసురీస్వభావముతో భూమికి భారమైన ఈ దైత్యులను వధించే ప్రయత్నము దేవతల వలన జరుగుచున్నది”.అని చెప్పి వెళ్ళిపోయాడు.


అది విని భయంతో ఉన్మాదియైన కంసుడు తన తండ్రి ఉగ్రసేనుడిని కారాగారంలో బంధించి తానే రాజయ్యాడు. దేవకీ-వసుదేవులకు సంకెళ్లు వేసి కారాగారంలో బంధించాడు. దేవకికి పుట్టిన మొదటి ఆరుగురు శిశువులను (షట్గర్భులను) రాతిపై వేసి క్రూరంగా సంహరించాడు! (వీరు పూర్వజన్మలో బ్రహ్మదేవుని శాపం పొందిన మరిచి పుత్రులైన కాలనేమి సంతానం).


* **ఏడవ గర్భం – శ్రీ బలరాముడు:** దేవకి ఏడవసారి గర్భం దాల్చగా, అది ఆదిశేషుని అంశ. భగవంతుడు తన యోగమాయనుఆజ్ఞాపించి: "నువ్వు దేవకి గర్భంలో ఉన్న పిండాన్ని గోకులంలో నందుని పాలనలో ఆశ్రయం పొందుతూ ఉన్న వసుదేవుని భార్య అయిన రోహిణీ దేవి గర్భంలోకి సంకర్షణ (మార్పిడి) చేయి. నేనూ స్వయంగ పూర్ణ అంశతో దేవకి దేవికి తదుపరి గర్భంలో జన్మిస్తాను,అలాగే నీవు స్వయంగ నంద గోవుని భార్య యశోద గర్భాన ఆవిర్భవించు" అని ఆదేశించి లోకుల కోర్కెలు తీరుస్తావు.భూలోకమునందలి మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక మొదలగు నామములతో ఆయా ప్రదేశములలో ప్రస్తుతించుచుందురు.


దేవకీదేవి గర్భమునుండి సంకర్షణమువలన (వెలికితీయబడుటవలన) 'సంకర్షణుడు' అనియు, లోకులను రంజింపజేయువాడు గావున, 'రాముడు' అనియు, బలవంతులలో మేటియగుటవలన 'బలభద్రుడు' అనియు, అతడు (బలరాముడు) భూతలమున వ్యవహరింపబడును.


సర్వేశ్వరుడైన శ్రీహరి ఆదేశమును అందుకొనిన పిదప 'సరే' అని ఆయన ఆజ్ఞను శిరసావహించి, ఆ ప్రభువునకు ప్రదక్షిణమొనర్చి, యోగమాయ భూలోకమునకు చేరి భగవంతుని ఆనతిని నెరవేర్చెను


లోకులు దేవకికి గర్భస్రావం అయిందని భావించారు. ఆ పిండం నుండే బలరాముడు ఆవిర్భవించాడు.


5. ఎనిమిదవ గర్భం – దివ్య గర్భస్తుతి


ఆ తర్వాత స్వయం భగవానుడైన శ్రీహరి దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించాడు. దేవకీదేవి ముఖంలో సూర్యచంద్రుల తేజస్సు వెల్లివిరిసింది. ఆమె ఉన్న కారాగారమే ఒక దివ్య దేవాలయంలా ప్రకాశించసాగింది. అది చూసి కంసుడు ఆమె వద్దకు రావడానికి కూడా భయపడసాగాడు.


దేవకీదేవి కడుపులో శ్రీహరి తన దివ్యాంశతో పెరుగుచుండెను. ఆమెముఖమునందు దరహాసశోభలు వెల్లివిరియుచుండెను ఆమె దేహకాంతులు చెఱసాల మందిరమున వెలుగులను నింపుచుండెను.


అటు కంసుడు భగవంతుడైన శ్రీహరియెడ వైరభావమును వీడక ఆ స్వామి జన్మించుటకై అనుక్షణము నిరీక్షించుచుండెను.


 శ్రీహరిపైగల వైర కారణముగా కంసునకు ఇతర ధ్యాసయే లేకుండెను. తిరుగుచున్నను, ఆహారము తినుచున్నను, పానీయములను త్రాగుచున్నను, అటునిటు కదలుచున్నను, కూర్చొనియున్నను, లేచినను, ఇంత ఏల, నిరంతరము ఎంతకును చల్లారని పగతో అతడు శ్రీహరినే తలంచుచుండెను. ఈ 'జగత్తంతయును, హరిమయమే' అని అతనికి అనిపింపసాగెను.


పిమ్మట బ్రహ్మదేవుడు, పరమశివుడు, సమస్త దేవతలు మరియు నారదాది మహర్షులు అదృశ్య రూపాలలో ఆ కారాగారానికి వచ్చి, దేవకీ గర్భంలో ఉన్న జగన్నాథుని దివ్యంగా 'గర్భస్తుతి' చేశారు:


**"సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే |**

**సత్యస్య సత్యమృతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః ||"**


**తాత్పర్యం:** "ఓ పరమాత్మా! నీవు సత్యస్వరూపుడవు. సృష్టి, స్థితి, లయములలో మార్పులేని త్రిసత్యానివి. సత్యానికి జన్మస్థానానివి. అట్టి పరమ సత్య స్వరూపుడవైన నిన్ను మేము శరణువేడుతున్నాము! భూభారాన్ని హరించి, ధర్మాన్ని రక్షించడానికి త్వరగా ఆవిర్భవించు ప్రభో!"అని స్తుతించి వారి వారి లోకాలకు వెళ్ళి పోయారు..


అఖిలాండకోటి బ్రహ్మాండ లోకాలను ఉదరంలో దాచుకునే పరమాత్మ పసిబిడ్డగా దేవకి దేవి గర్భంలో దాగి ఉన్నాడు. ,జన్మలు, కర్మలు లేని స్వామి మన కర్మ బంధాలు తెంచడం కోసం అవతారాలు స్వీకరించాడు.


మనవి కర్మ జనిత శరీరాలు, స్వామివి మన జనన మరణ చక్రానికి స్వస్తి చెప్పే అవతారాలు.అంతటి కరుణతో ఆయన వచ్చింది మనకోసం ఆయన గురించి చెప్పుకుని,విని, చదవడం ద్వారా ఇక మళ్ళీ పుట్టుక చావు లేని స్థితి పొందటమే ఈ జన్మకు సార్థకత. 


కోరికలు కోట్లకొలది ఉంటాయి కానీ అవి శాంతిని ఇవ్వలేవు భగవత్ కథలు మనసుకు శాంతిని, జీవుడికి శాశ్వతత్వాన్ని ఇస్తాయి.. కనుక విని తరించే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ 🙏 


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **ఆశ్రయ తత్త్వం:** దశమ స్కంధం శ్రీకృష్ణ లీలామృతం. ఇక్కడ ప్రతి లీల జీవుడిని భౌతిక బంధాల నుండి విముక్తం చేసి భగవంతుని పాదాల చెంత ఆశ్రయం కల్పిస్తుంది.


2. **వసుదేవుని సత్యనిష్ఠ:** ప్రాణాపాయ స్థితిలో కూడా సత్యాన్ని, ధర్మాన్ని వీడకపోవడమే భగవంతుడు తన ఇంట అవతరించడానికి మార్గం సుగమం చేసింది.


3. **సత్యమే దైవం:** దేవతలు చేసిన గర్భస్తుతి మనకు భగవంతుని నిత్య సత్య తత్వాన్ని, అచంచల శరణాగతిని బోధిస్తుంది.


రేపు శ్రీమద్భాగవతంలోనే అత్యంత ఆనందదాయకమైన పరమ మహోత్సవం – శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి శ్రీ కృష్ణ పరమాత్మ ఆవిర్భావం విని తరిద్దాం వేచి ఉండండి...


....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

కామెంట్‌లు లేవు: