18, ఆగస్టు 2026, మంగళవారం

శ్రీమద్భాగవతం - 25/42*

 *


*శ్రీమద్భాగవతం - 25/42* 


*శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


నిన్నటి రోజున దశమ స్కంధములోకి ప్రవేశించాము, శ్రీ కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అంశ తో దేవకీ దేవి గర్భంలో పెరుగుతున్నాడు, దేవతలు కారాగారం దగ్గరకే వచ్చి పరమాత్మని స్తుతించడం వరకు తెలుసుకున్నాం ఈరోజు శ్రీమద్భాగవతానికే పరమ మహోత్సవమైన **శ్రీకృష్ణ పరమాత్మ దివ్యావిర్భావం, యమునా నది దాటుట, యోగమాయ హెచ్చరిక మరియు గోకులంలో నందోత్సవ వైభవం** గురించి తెలుసుకుందాం.


---


1. శ్రీకృష్ణ దివ్యావిర్భావం – చతుర్భుజ రూపం


జన్మరహితుడు అయిన శ్రీహరి ఆవిర్భవించు సమయం ఆసన్నమైంది.ఆ సమయంలో చంద్రుడు రోహిణీ నక్షత్రము లో ఉన్నాడు, యావత్ భూమండలం మొత్తం మంగళ మయమై నిర్మలంగా ఉంది, కంసుని భయంతో ఆగిపోయిన అగ్నిహోత్రాలు ప్రజ్వరిల్లాయి. అసురుల బాధలతో తల్లడిల్లి పోతున్న దేవతల, సాధు పురుషుల హృదయాల్లో శాంతి నెలకొంది. దేవతలు పుష్ప వర్షం కురిపిస్తూ ఉండగా, విద్యాధర స్త్రీలు నాట్యం చేస్తుండగా

శ్రావణ బహుళ అష్టమి తిథి, రోహిణీ నక్షత్ర యుక్త అర్ధరాత్రి వేళ, నిబిడమైన అంధకారంలో ఉన్న సమస్త దిక్కుల చీకట్లను తొలగించే అఖండ ఆత్మ స్వరూపుడు అయిన శ్రీహరి  కారాగారంలో దేవకీదేవి గర్భం నుండి నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా, పద్మాలు ధరించి వక్షః స్థలంలో శ్రీవత్స చిహ్నం తో, కంఠం లో కౌస్తుభమణి మెరుస్తూ ఉండగా, పట్టు పీతాంబరలు ధరించి శ్యామసుందర దేహుడై,కిరీటం, కుండలాల కాంతులు ఇంపు కొలుపుతూ ఉండగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ పూర్ణ పురుషోత్తమ రూపంతో శ్రీహరి వసుదేవుడుకి దర్శనమిచ్చాడు.


* **తల్లిదండ్రుల స్తుతి:**

స్వామిని చూసినంత మాత్రం చేత వారికి కంస భయం,బంధనాలు తొలగి పోయాయి ఆ దివ్యరూపాన్ని చూసి దేవకీ-వసుదేవులు చేతులు జోడించి పరమానందంతో స్తుతించారు. 


అయితే కంసుని క్రూరత్వం గుర్తొచ్చి, "స్వామీ! కంసుడి నుండి నిన్ను దాచడం మా వల్ల కాదు. నీ ఈ దివ్య చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించి, సాధారణ పసిబాలుని రూపాన్ని ధరించు" అని ప్రార్థించారు. 


భగవంతుడు చిరునవ్వుతో తల్లి స్వాయంభువ మన్వంతరం లో నీవు ప్రుశ్ని అను సాధ్వీమణివి, మహాత్ముడైన ఈ వసుదేవుడు సుతపుడు అను ప్రజాపతి, మీరు ఇద్దరు సృష్టి విస్తరణ కోసం బ్రహ్మ గారి ఆదేశం మేరకు ఘోర తపస్సు ఆచరించారు అది అనితర సాధ్యమైన తపస్సు, దానికి మెచ్చి నేను ప్రత్యక్షం అయ్యాను మీరు నా వంటి పుత్రుడు కావాలీ అని కోరారు,నా వంటి పరమాత్మ ప్రత్యక్షం అయినా మోక్షం కోరక నా మాయ చేత విషయ సుఖాలు కోరారు.అది నా సంకల్పం.శీల,గుణ సంపదలో నావంటి వారు మరొకరు లేరు కనుక నేనీ ప్రుశ్నీగర్భుడు అనే పేరుతో ఖ్యాతి వహించి మీకు పుత్రుడను అయ్యను.


ఆ తదుపరి జన్మలో నీవు అదితిగా,వసుదేవుడు కశ్యపుడు గా వచ్చారు అప్పుడు ఉపేంద్రుడు అను పేర వామన అవతారం లో మీకు జన్మించాను.


ఇక ఇది మూడవ జన్మ ఈసారి మీ కోరిక పరిపూర్ణం చేసి మిమ్ము అనుగ్రహించడం కోసం పూర్ణంగా చతుర్భుజాలతో అవతరించాను,ఆ విషయాలు మీకు తెలుపుట కోసమే ఈ రూపంలో కనపడ్డాను. మళ్ళీ సాధారణ శిశు రూపంలోకి వచ్చాక మీకు నా అవతార వైశిష్ట్యం గుర్తుకు ఉండదు.


మీరు ఎల్లపుడు పుత్ర వాత్సల్యం ప్రదర్శిస్తూనే అప్పుడపుడు నన్ను పరబ్రహ్మంగా భావిస్తే ఇక మీకు నా పరంధామం లభిస్తుంది అని చెప్పి పరమాత్మ పసిపాపగా మానవ శిశువుగా మారిపోయాడు..


---


2. యమునా నది దాటుట – గోకులానికి ప్రయాణ


ఆ తరువాత వెంటనే భగవంతుని సంకల్పంతో అద్భుతాలు జరిగాయి:

1. కారాగార కావలిభటులందరూ మాయ చేత గాఢ నిద్రలోకి జారుకున్నారు.

2. వసుదేవుని కాళ్లకు, చేతులకు ఉన్న ఇనుప సంకెళ్లు తమంతట తామే విడిపోయాయి.

3. తాళాలు వేసి ఉన్న బరువైన రాతి తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి.


వసుదేవుడు భగవంతుని ప్రేరణ మేరకు పసికందును ఒక వెదురు బుట్టలో పెట్టుకుని, తలపై ఎత్తుకుని గోకులం వైపు నడిచాడు.


* **ఆదిశేషుని గొడుగు:** కుండపోతగా వర్షం కురుస్తుండగా, భగవంతునికి వర్షపు చినుకులు తగలకుండా సాక్షాత్తు ఆదిశేషుడు తన వేయి పడగలను గొడుగులా విప్పి వసుదేవుని వెనుక నడిచాడు.


* **యమునా నది దారి ఇచ్చుట:** ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది పరమాత్మ పాదస్పర్శ కాగానే రెండు పాయలుగా విడిపోయి మోకాలి లోతుకు తగ్గి వసుదేవునికి మార్గం ఇచ్చింది.


---


3. గోకులంలో శిశువుల మార్పిడి


వసుదేవుడు అర్ధరాత్రి వేళ గోకులంలోని నందమహారాజు భవనానికి చేరుకున్నాడు. యోగమాయ ప్రభావంతో యశోదతో సహా గోకులమంతా గాఢ నిద్రలో ఉంది. యశోద అప్పుడే ఒక ఆడశిశువుకు (యోగమాయకు) జన్మనిచ్చి అలసటతో నిద్రపోతోంది.


వసుదేవుడు నిశ్శబ్దంగా బాలకృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి, ఆమె పక్కనున్న ఆడపిల్లను తీసుకుని తిరిగి మధురా నగర కారాగారానికి వచ్చాడు. వసుదేవుడు లోపలికి రాగానే తలుపులు మళ్లీ మూసుకున్నాయి, సంకెళ్లు పడ్డాయి. మునుపటి వలె ఉన్నాడు.


---


4. కంసుని రాక & యోగమాయ దివ్య హెచ్చరిక 


వసుదేవుడు మరలి వచ్చిన తరువాత మళ్ళీ ద్వారాలు, బంధనాలు యధాతద స్తితిలో మూసుకున్నాయి అప్పుడు ఆడశిశువు ఏడుపు వినగానే కావలిభటులు మేల్కొని కంసునికి సమాచారం అందించారు.మృతుభీతిలో కంసుడు పిచ్చివాడిలా పరుగెత్తుకుంటూ వచ్చి, దేవకి ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆ పసికందును లాక్కున్నాడు. అన్నా అనుంగు కోడలు పుట్టెను విడువు అన్నా వినకుండా..శిశువు కాళ్లు పట్టుకుని రాతిబండపై కొట్టడానికి పైకి ఎత్తాడు. కానీ ఆ శిశువు కంసుని చేతుల నుండి జారి ఆకాశంలోకి ఎగిరిపోయింది! అంతట విష్ణు సోదరి అయిన యోగమాయ దేవి. .


* **అష్టభుజ దుర్గాదేవి:** ఆ శిశువు ఎనిమిది చేతులలో శంఖ, చక్ర, త్రిశూలాది ఆయుధాలను ధరించిన దివ్యమైన **యోగమాయగా (దుర్గాదేవిగా)** ఆవిర్భవించింది.


* **కంసునికి హెచ్చరిక:**

 **"కిం మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్ |**

**యత్ర క్వ వా పూర్వశత్రుర్మా హింసీః కృపణాన్ వృథా ||"**


*"ఓరి మూర్ఖుడా! కంసా! నన్ను చంపి నువ్వు సాధించేది ఏమీ లేదు. **నిన్ను సంహరించే నీ పూర్వశత్రువు వేరొక చోట ఇప్పటికే జన్మించాడు!** అమాయకులైన ఈ దేవకీ-వసుదేవులను హింసించకు!"*


అలా పలికి యోగమాయ అంతర్థానమైంది.(ఈ తల్లి భూతలం లో అనేక పేర్లతో ప్రసిద్ధి వహించింది)


కంసుడు భయంతో వణికిపోయి దేవకీ-వసుదేవులను తాత్కాలికంగా విడుదల చేశాడు.


మరుసటి రోజు మంత్రులతో ఆలోచించి, రాజ్యంలో పుట్టిన పసిపిల్లలందరినీ సంహరించడానికి రాక్షసులను ఆజ్ఞాపించాడు.


---


5. గోకులంలో నందోత్సవం – ఆనంద తాండవం


మరుసటి రోజు ఉదయం యశోదకు పండంటి మగపిల్లాడు పుట్టాడని తెలిసి గోకులమంతా ఆనంద సాగరంలో మునిగిపోయింది. **నంద మహారాజు** బ్రాహ్మణులకు వేలాది గోవులను, సువర్ణాన్ని దానం చేసి జాతకర్మలు నిర్వహించాడు.


* **గోపికల ఆనందం:** గోపికలు దివ్యాంబరాలు, నగలు ధరించి పెరుగు, పాలు, పసుపు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ నాట్యాలు చేశారు. ఆరోజు నంద వ్రజము మొత్తం పండగ లా చేశారు. ప్రతి ఇల్లు అలంకరించారు, గోపికలు చిన్నారి కన్నయ్య ను చూడటం కోసం తరలి వచ్చారు. రక్షణ కోసం దైవ ప్రార్థన చేశారు, జోలపాటలు పాడారు.


* నారదుడు, దేవతలు ఆకాశం నుండి వీక్షిస్తూ ఆనందించారు. పరమాత్మ తన లీలలతో గోకులాన్ని వైకుంఠంగా మార్చివేశాడు!


రాజా! శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండియు, ఆ నందగోకులము పాడిపంటలతో, సమస్త ధనకనక వస్తువాహనములతో కలకలలాడసాగెను. శ్రీహరి అవతారమైన కృష్ణపరమాత్మయొక్క నివాసమునకు నోచుకొనుటతో ఆ ప్రదేశము లక్ష్మీదేవికి విహారభూమి అయింది.


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **హరి రాకతో బంధనాల విముక్తి:** భగవంతుడు హృదయంలోకి ప్రవేశించగానే కర్మ బంధాలు (సంకెళ్లు), అజ్ఞానమనే తలుపులు తమంతట తామే తెరుచుకుంటాయి.


2. **భగవద్రక్షణ:** భగవంతుడిని తలపై మోసే భక్తునికి (వసుదేవునికి) ఉప్పొంగే యమున(కాలం) కూడా దారి ఇస్తుంది; ఆదిశేషుడే గొడుగు పడతాడు.


3. **కర్మఫలం అమోఘం:** అధర్మాత్ముడైన కంసుడు ఎంత ప్రయత్నించినా భగవత్ సంకల్పాన్ని, మృత్యువును తప్పించుకోలేకపోయాడు.


రేపటి నుంచి స్వామి లీలలు ప్రారంభం తెలుసుకుని తరిద్దాం రండి🙏


....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

కామెంట్‌లు లేవు: