27, ఆగస్టు 2022, శనివారం

అన్నదానం

 అన్నదానం మహిమ చెప్పే కథ.


ఒక కథ ప్రకారం పూర్వ కాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రిళ్లు బస చేస్తూ వెళ్లేవారు.

ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటిపడే సమ యానికి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలే పోయాడు. చీకటిపడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకుని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాప లాగా

ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడి చేసి చంపి వేసి దేహాన్నితీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి తన దారిన తాను వెళ్లాడు.

కాశీ చేరాడు. దైవ దర్శనం చేసు కున్నాడు. ఈ బ్రాహ్మణునికి ఎప్పటి నుంచోె అన్న దానం అంత గొప్పదా అన్న అను మానం ఉండేది. తన ఇష్ట దైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వ దించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు.

రాజ కుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మ ణున్ని చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా, నన్ను గుర్తు పట్టావా. నేను కోయవాణ్నౖన శంబరుణ్ని. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజ యోగం సిిద్ధించింది అన్నాడు. మరు క్షణం అతనికి మళ్లిd పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.


అన్నం గురించి ఓ ఉపాఖ్యానం వుంది.

అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద , దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రానించరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవెద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటంవల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.

25, ఆగస్టు 2022, గురువారం

ఆచార్య నాగార్జునుడు

 ఆచార్య నాగార్జునుడు  - 


      నాగార్జునుడు ప్రపంచ ప్రసిద్ది చెందిన మహా పురుషుడు . ఆయన విద్యావేత్త , రసవేత్త , మంత్రవేత్త , తంత్రవేత్త , యంత్రవేత్త , ప్రజావేత్త  మరియు కాయసిద్ధి పొంది జరా మరణాలు ను జయించి అతీంద్రియ శక్తులు సాధించి అదృష్యరుపుడు అయ్యి సంచరిస్తున్న అమరవేత్త. ఆయన జననం గురించి వాదోపవాదాలు ఉన్నా ఆయన పక్కా ఆంద్రుడు అనే వాదన బలంగా ఉంది. 


         గౌరనకవి రచించిన నవనాధ చరిత్ర అనే ద్వీపకావ్యంలో సిద్ద నాగార్జుని చరిత్ర వర్ణింప బడినది. దాని ప్రకారం నాగార్జునుడు ఒక రాజపుత్రుడు. ఒకనాడు వేటకి పోయి విధివశాన సర్పరూపమ్ పొంది మద్దిచెట్టు తొర్రలో దాగినాడు. శాపం నుండి బయటపడే మార్గం కోసం అన్వేషిస్తుండగా కొంతకాలానికి అటుగా వచ్చిన ప్రసిద్ధ రసశాస్త్రవేత్త మీననాధుడు అనే రసయోగి నాగార్జునిని గమనించి శాపనివ్రుత్తి చేసాడు. ఆనాటి నుండి ఆయన నాగార్జున నామముతో మీననాధ మహర్షికి ప్రియశిష్యుడు అయినాడు. గురువు వద్ద అణిమాది అష్టసిద్దులను అభ్యసించి అదేవిదంగా ఔషద , తంత్ర, మంత్ర , యంత్ర రహస్యాలు అభ్యసించి గురువు ఆనతిమేరకు లోకసంచారానికి బయలుదేరాడు నాగార్జునుడు సిద్ధి పొందడం వలన సిద్ధనాగార్జునుడు అయ్యాడు.


              ఈయన శాతవాహన రాజుల గౌరవం పొంది వారి రాజ్యంలోని నేటి నాగార్జున కొండ వద్ద ఒక మహావిశ్వ విద్యాలయాన్ని స్థాపించి విద్యాబోధన చేశాడు . ఆ సమయంలో శాతవాహన రాజులు ఆర్ధిక ఇబ్బందులకు గురికాగా తన రసవిద్యా నైపుణ్యంతో శ్రీ పర్వతమును బంగారంగా మార్చివేశాడు. అప్పుడు కాళికా దేవి ప్రత్యక్షం అయ్యి సృష్టి స్వభావానికి విరుద్దం అయిన కార్యం తగదు అని వారించగా నాగార్జునుడు మళ్లి ఆ బంగారుకొండ ని రాతికొండగా మార్చివేశాడు . 


              ఆ తరువాత ఈయన టిబెట్ మరియు చైనా మొదలయిన ప్రాంతాలలో పర్యటించి బౌద్ధ సన్యాసిగా అనేకమందికి విద్యాదానం చేశాడు . అచ్చట 200 సంవత్సరాలు గడిపి దక్షిణ భారతదేశంలో మరొక 200 సంవత్సరాలు గడిపి ఆ తరువాత నేటి శ్రీశైలం కొండపైన 120 సంవత్సరాలు గడిపాడు అని టిబెట్ ఆచార్యుడు తారానాధ పండితుడు పేర్కొన్నాడు . 


              మన్దాన భైరవుడు రచించిన ఆనంధకంధం అనే గ్రంథంలో సిద్ధనాగార్జుని వంటి ఎందరెందరో సిద్ధులు , భైరవులు  అతిమానుష ప్రజ్ఞ సంపాదించిన వారై జీవన్మ్రుతులుగా పవన భక్షులుగా గగన వీధుల్లో సంచరిస్తున్నారు అని వివరించబడింది.


  సిద్ధనాగార్జునుడు రచించిన గ్రంథాలు  - 


 *  సుశ్రుత ఉత్తర తంత్రం .


 *  రసవైశేషిక సూత్రం 


 *  లోహశాస్త్రం .


 *  కచ్చపుట తంత్రం.


 *  రస కచ్చపుట .


 *  ఆరోగ్య మంజరి.


 *  యోగాసారం .


 *  రసేంద్ర మంగళం 


 *  రతి శాస్త్రం . 


 *  సిద్ధ నాగార్జునీయం .


          మొదలయిన అధ్బుత గ్రంథాలు రచించారు.


      ఈయన అతి సులువయిన , ఔషద ప్రక్రియలని రూపొందించి ఆనాటి అనేక పట్టణాలలో , గ్రామాలలో ప్రజల ఉపయోగార్ధం ఆ ప్రక్రియలను రాతి పలకాల మీద చెక్కిన్చాడని నేటికి దొరుకుతున్న అనేక శాసనాల వల్ల తెలుస్తుంది.


  

 

24, ఆగస్టు 2022, బుధవారం

మగువ "ముక్కుపుడక

 👆

🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *మగని ప్రేమకు గుర్తు*             

    *మగువ "ముక్కుపుడక"*           

  (చొప్పకట్ల సత్యనారాయణ గారు)

                  🌷🌷🌷

'మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక' అన్నాడో కవి. ఆడవారు ముక్కుపుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు ముక్కుపుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా? సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అని అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు, పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట.


ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఎడమవైపున చంద్రనాడి టుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు.ముక్కు, చెవులకు రంధ్రాలు చేయడం శరీరారోగ్యానికి మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.


కొండగాలి తగలడం వల్ల తరచూ ముక్కుకు సంబంధించిన రొంప, పార్శ్వ నొప్పి, ముక్కు దిబ్బడ, సైనస్‌లు పూడుకుపోవడ వంటి సమస్యలు వస్తుంటాయి. వీటినుంచి రక్షణ కోసం గిరిజన మహిళలు ముక్కుపుడక వంటివి విధిగా ధరిస్తారు.మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. పురుటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు ధరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు.


ఇంకా అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలు ఎక్కువ. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది. దేవతలందరికీ అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.


అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.


పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు .

                             స్వస్తి!

 #పిప్పలాదుడు


#పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని!!

#జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు

#మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు,ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది.  ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు.కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు.ఏమీ కనిపించకపోవడం,ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు.  తరువాత,ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది.

   

#ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు.  నారదుడు,రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు-

#నారదుడు- నువ్వు ఎవరు?

#అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.

#నారదుడు- నీ తండ్రి ఎవరు?

#అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

# అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్యపోయి హే అబ్బాయి!  నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి.  నీ తండ్రి అస్తిక తో  దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి(వజ్రాయుధం) రాక్షసులను జయించారు.  మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు.

#అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి?

 #నారదుడు- మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది.

 #పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి?

 #నారదుడు- శనిదేవుని మహాదశ.

   

#ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను ఇచ్చాడు.

 #నారదుని నిష్క్రమణ తరువాత, పిల్లవాడు పిప్పలడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు.  బ్రహ్మాదేవుడు బాల పిప్పలాద ను వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాద తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు.అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు.శని దేవుడి శరీరంలో మండడం ప్రారంభించాడు.  విశ్వంలో కలకలం రేగింది.  సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.


#సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు.చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు.బ్రహ్మాదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు. అడగటానికి  అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది రెండు వరాలను అడిగాడు-


 1- పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు.తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు.


 2- అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది.  కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు.

 

దానికి   బ్రహ్మాదేవుడు 'తథాస్తు' అని వరం ఇచ్చాడు.అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు.శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు.అందుకే శని

 "శనిః చరతి య: శనైశ్చరః" అంటే మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి.

        శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే.తరువాత పిప్పలాదుడు ప్రశ్న_ఉపనిషత్తును రచించాడు, ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది.


#సర్వోజనా సుఖినోభావంత్

చేబదులు

 "నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?" తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! 


ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! 


కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి 

టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు ! 


అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని !


సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు ! 


ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు ! 


చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు ! 


లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో " నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా.." అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! 


వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! 


ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!


దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? 


ముఖ్యమంత్రి పదవి అంటే  తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి  ముఖ్యమంత్రిని చూడగలమా ? 

చూడగలమా ? 


అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ! 


ఆ తరం వేరు 

నేటి తరం వేరు !


ఆనాటి రాజకీయాలు వేరు 

ఈనాటి అరాచకీయాలు వేరు ! 


డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు  రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !


దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !


ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు !

23, ఆగస్టు 2022, మంగళవారం

కాఫీగురించి

 *కాఫీగురించి రెండుపద్యాలు.....*  



కప్పు కాఫిని లొట్టలేయుచు కాంక్ష తోడుత త్రాగగా 

సిప్పు సిప్పున మోదమందుట చిత్రమౌట నటుంచుమా!

ఎప్పుడైన పరాయి యిండ్లకు నేగ కాఫిని పోయమిన్ 

చిప్పమోమట దిక్కుగా మన సిగ్గు పోవదె తల్చగా 


చింతజేయగ కాఫి త్రావుట చిత్రమౌ వ్యసనమ్ముగా 

వింతచేష్టలు పుట్టి వ్రేల్చును వేళలందున త్రావమిన్ 

గొంతు లెండును జీరవోవును క్రుంగిపోవును ప్రాణముల్ 

సుంతయైనను శాంతముండదు స్రుక్కి త్రెళ్ళుగ మానవుల్ 

*~శ్రీశర్మద*

నిత్య సంతోషపరుడు

 

నిత్య సంతోషపరుడు

ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని సదా కోరుకుంటాడు కానీ ఎంతమంది సంతోసహాయంగా ఉన్నారు అని విచారిస్తే ప్రతి వారు తాను సంతోషంగా లేను అనే అంటారు.  ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పరు. దీనికి కారణం ఏమిటో విచారిద్దాం. ఒక విద్యార్థి దగ్గరకు వెళ్లి అడిగితే తాను పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానో  లేదో అనే దిగులు వుంది అందుకే నేను సంతోషంగా లేను అంటారు.  ఒక గృహస్తు వద్దకు వెళ్లి అడిగితే తన సంపాదన తన అవసరాలకు సరిపోవటం లేదు అందుకే నేను సంతోషంగా లేను అని అంటాడు .  ఇలా ప్రతివానికి ఏదో ఒక దిగులు, వెలితి జీవితంలో చోటు చేసుకుంటుంది.  లేని వారికి లేదని దిగులు.  ఉన్నవానికి ఉన్న దాన్ని కాపాడుకోవడం ఎలా అనే దిగులు.  ఇలా చెప్పుకుంటూ పోతే దిగులు, విచారం, అసంతృప్తి లేని మనిషి లేనే లేడనేది సత్యం.  ఎన్ని బాధలు ఉన్నా తాను సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు.  అంతేకాక తాను సంతోషంగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాడు కూడా. ఒక ప్రయత్నం తరువాత ఒక ప్రయత్నం సాగిస్తూనే వుండాడు.  కానీ జీవితం విచిత్రమైనది ఒకటి సాధిస్తే మనస్సు దాని తర్వాత ఇంకొకటి కోరుతుంది.  అదే అవసరాలు, కోరికలు.  ఈ ఆధునిక యుగంలో ఎన్ని వున్నా కూడా మనిషి ఇంకా ఇంకా ఇంకొకటి కావాలని కోరుకుంటున్నారు. గతంలో నీకు లేనిది ఇప్పుడు వచ్చింది కదా మరి దానితో నీవు సుఖంగా ఉండొచ్చు కదా అంటే లేదు నీకు వెంటనే ఇంకొకటి కావాలని కోరిక కలుగుతుంది. నీకు ఫాను కావలి గాలి ఆడడం లేదు అన్నావనుకో ఫ్యాను పొందితే చల్లని గాలి కావలి ఏరుకులర్ కావలి అంటావు.  అది వచ్చిన తర్వాత ఎయిర్ కండిషనర్ కావాలి అంటావు.  అంటే మనిషి ఒకటి పొందిన తరువాత దానితో తృప్తిగా లేకుండా అంతకన్నా మెరుగైనది ఇంకొకటి కావాలనే వాంచ కలుగుతున్నది. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ఏదీ కూడా నిన్ను సంతోష పెట్టటం లేదు ఇంకొకటి ఉంటే సంతోషంగా వుంటాను అనుకుంటావు కానీ అది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వటంలేదు. మరి నీవు ఎప్పుడు సంతోషంగా వున్నావు అంటే భవిష్యత్తులో ఉండొచ్చేమో అని అంటావు. "తృప్తస్య భవిష్యామి" నిజానికి బౌతికంగా వున్నది ఏదైనా కొంతకాలం మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తుంది.  అది ఒక నిమిషమో, రోజో లేక కొన్ని రోజులో ఇంకా అయితే కొన్ని సంవత్సరాల్లో.  కానీ యదార్ధం ఏమిటంటే ఏది కూడా నీకు జీవితాంతం సంతోషాన్ని ఇవ్వదు. 

ఈ సృష్టిలో ఒక నియమం వున్నది అదేమిటంటే ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది.  ఆ మార్పు అభివృద్ధి వైపు కావచ్చు లేక వినాశనం వైపు కావచ్చు. ముందుగా అభివృద్ధి వైపు అయితే అవ్వ వచ్చు కానీ కాలాంతరంలో వినాశనం వైపుకు మళ్లుతుంది. అదే విధంగా మనిషి జీవితంలో కూడా ఒక వయస్సులో సంతోషాన్ని ఇచ్చేది కాలాంతరంలో వయస్సు పెరిగినప్పుడు అదే వస్తువు సంతోషాన్ని ఇవ్వలేదు. అదే అంటే అదే కాదు అలాంటిదే ఇంకొక క్రొత్తవస్తువు కూడా.  ఉదాహరణకు నీవు చిన్నగా వున్నప్పుడు మూడు చక్రాల చిన్న సైకిలు నీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.  నీవు కొంత పెరిగి రెండు చక్రాల సైకిలు తొక్కటం అలవాటు అయినప్పుడు నీకు మూడు చక్రాల సైకిలు అస్సలు నచ్చదు.  మరి రెండు సంవత్సరాల క్రింతం వరకు అది నీకు ఇష్టమైన వస్తువు కదా మరి ఇప్పుడు ఎందుకు కాదు అంటే. ఇప్పుడు నీవు దానికన్నా సౌకర్యంగా వున్న వస్తువు నిన్ను ఆకర్షించింది.  అంతే కాదు నీవు ఇంకా కొంత పెరిగిన తరువాత మోటారు సైకిలు ఫై నీ మనస్సు ఆకర్షితం అవుతుంది.  అది లభిస్తే సైకిలు నీకు నచ్చదు.  అంటే ఎప్పుడు నీవు ఉన్నదానికన్నా మెరుదైనదే ఆనందాన్ని ఇస్తున్నది. దీనిని బట్టికూడా మనకు బాధపడేది ఏమిటంటే మన కోరికలు మారుతున్నాయి.  అంటే ఉన్నదానికన్నా మెరుగైనది మనస్సు సదా కోరుకుంటున్నది.  మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.

ఈ ప్రపంచాన్ని చుస్తే మనకు తెలిసేది ఏమిటంటే ఇక్కడ ప్రతిదీ మారుతున్నది.  మారేది ఏది నీకు శాశ్విత సుఖాన్ని ఇవ్వటంలేదు. ఇంకొక సత్యం కూడా నీకు అవగతం అవుతుంది నీకు సుఖాన్ని ఇచ్చింది కాలాంతరంలో దుఃఖదాయకంగా మారుతున్నది.  మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.

సృష్టిలో సదా మారకుండా ఉండేది ఏదైనా ఉంటే అది నీకు ఎల్లప్పుడూ సుఖాన్ని ఇవ్వవచ్చు.  మరి సృష్టి నియమమే మార్పు కదా మరటువంటప్పుడు మారకుండా ఉండేది ఏది.

ఆ శోధన ఫలితమే మనకు మన మహర్షులు ప్రబోధించిన ఉపనిషత్ జ్ఞ్యనం. అఖండ జ్ఞ్యాన సంపన్నులైన మహర్షులు వారి వారి అనుభవాలతో తెలుసుకున్న సత్యాలే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మనకు ఇచ్చిన జ్ఞ్యానమే బ్రహ్మ జ్ఞ్యానం ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం.  సాధకుడు నిత్య సాధనతో తెలుసుకోవలసిన సత్యమే బ్రహ్మ జ్ఞ్యానం. కాబట్టి ప్రతి సాధకుడు తనకు తానుగా తెలుసుకోవలసింది బ్రహ్మ జ్ఞ్యానం మాత్రమే. కాబట్టి సాధక ఇప్పుడే మేల్కొని నిత్యసాధన పరుడవు కమ్ము సదా సంతోషపరుడవు కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ

 

బాదరాయణ సంబంధాత్

 బాదరాయణ సంబంధం:: కథ చెబుతా...

 

మనకి "వేలు విడిచిన సంబంధాలు ", "బీరకాయ పీచు సంబంధాలు" లాగానే "బాదరాయణ సంబంధం" ఒకటి ఉంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బాదరాయణ సంబంధం మీద కొన్ని కథలున్నాయి. అందులో ఒకటి ఇదిగో....

 

కోనసీమలో కేశనకుర్రు అనే గ్రామం ఒకటుంది. ఆ గ్రామం లో అమాయక బ్రాహ్మణ కుటుంబం ఒకటి. భార్య, భర్త- ఇద్దరే కుటుంబ సభ్యులు. మరీ సంపన్నులు కాక పోయినా కాస్త సంపన్నులే! దేనికీ లోటు లేదు. అతిథి మర్యాదలు సాదరంగా చేస్తారని ఆ పరిసర ప్రాంతాల వారందరికీ తెలుసు. యజమాని పేరు కామయ్య. 


 

ఓరోజు కామయ్య గారి ఇంటి ముందు ఓ గుర్రబ్బండీ ఆగింది. నిగనిగలాడుతూ జరీ పంచె, కండువాతో ఉన్న ఓ పెద్ద మనిషి దిగేడు. బండి తోలే మనిషి పెట్టె తెచ్చి హాల్లో పెట్టేడు. వెనుకనే హుందాగా నడచి వచ్చాడీ పెద్ద మనిషి. బండి తోలే మనిషి తిరిగి వచ్చి గుర్రానికి గడ్డి వేసి బండి లోనే కూర్చున్నాడు. కామయ్య ఏదో పని మీద పై ఊరుకెళ్ళేడు. పెరట్లో పని చేసుకుంటున్న భార్య సీతమ్మ ఈ పెద్దమనిషి ని చూసి హడావుడిగా హాల్లోకొచ్చింది కొంగుతో చేతులు తుడుచుకుంటూ. 


"అబ్బాయి ఇంట్లో లేడేమిటమ్మా?" అన్నాడు పెద్ద మనిషి సావకాశంగా కాళ్ళు జాపుకుని కండువా తీసి కుర్చీ మీద పెట్టి. 

"పై ఊరు పని మీద వెళ్ళారు. వచ్చేస్తారు." అని వినయంగా చెప్పి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళింది. 


ఆమె వివాహమై కొద్ది కాలం మాత్రమే అయింది. పెళ్ళి లో చూడని భర్త తరుఫు బంధువనుకుంది ఆమె. 


కాళ్ళు కడుక్కుని, ఆమె పెట్టిన పలహారం సుష్టుగా తాను సేవించడమే కాకుండా బండివాడికి కూడా పెట్టించాడు పెద్ద మనిషి. 


ఇంతలో కామయ్య తిరిగి వచ్చాడు." ఇదిగో, ఆయన వచ్చారు. " ఆమె లేచి నిలబడింది అంతవరకు పిచ్చాపాటి కబుర్లు చెప్తున్న సీతమ్మ .

"రావోయ్, అల్లుడూ. ఉదయమే ఎక్కడికో వెళ్లి పోయావ్!" అంటూ చనువుగా పలుకరించాడు. 


 

"అర్జెంటుగా పని పడింది. పక్కూరు వెళ్ళేను. కాఫీ, పలహారం సేవించారా?" అని అభిమానంగా అడిగేడు కామయ్య. 


"అన్నీ చక్కగా పెట్టింది అమ్మాయి. అమ్మాయి ఎవరనుకున్నావు? సాక్షాత్తూ అన్నపూర్ణ!" అన్నాడు సీతమ్మ ని మెచ్చుకోలుగా చూస్తూ. 


"నేను మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళవలసి ఉంది. మీరు కాస్త విశ్రమించండి. భోజనం వేళకు వచ్చేస్తాను. కలసి భోంచేద్దాం. ఏమీ అనుకోకండి. " అని నొచ్చు కుంటూ లేచాడు కామయ్య. 


"భలే వాడివే! నిరభ్యంతరంగా వెళ్ళి రా. " నీతో కలసి భోంచేసాక నేను కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను." అన్నాడు పెద్ద మనిషి పత్రిక తిరగేస్తూ. 


అతని బాధ్యత  భార్య కప్పజెప్పి వడివడిగా బయటకెళ్ళిపోయాడు కామయ్య. అతడు దినపత్రిక తిరగేస్తూ కూర్చోగా సీతమ్మ వంట పనిలో పడింది. 


ఆమె వంట పూర్తి అయ్యేసరికీ బయటకెళ్ళిన కామయ్య తిరిగి వచ్చేసాడు. 

ఇద్దరికీ వెండి కంచాలలో వడ్డన చేసింది సీతమ్మ. సుష్టుగా భోజనం చేశాడు పెద్ద మనిషి. అరుగు మీద బండీవాడు కూడా భోంచేశాడు. 


పెద్ద మనిషి గదిలో బయలుదేరడానికి సిద్ధమౌతూండగా, "మీ బంధువు మంచి భోజన ప్రియుడే సుమీ. " పెరట్లో మెల్లగా అన్నాడు భార్య తో కామయ్య. 

"మా బంధువు అంటారేమిటి? ఆయన మీ తరుఫు వారు కాదూ?" అంది సీతమ్మ విస్తుపోతూ. 

 

"అబ్బే, మావైపు వారు కాదు. " అన్నాడు కామయ్య. 


దంపతులు ఇద్దరూ హాల్లోకి వచ్చే సరికి పెద్ద మనిషి పెట్టె బండి లోనికి చేర్చడమూ, అతను బయలుదేరడానికి సిద్దంగా ఉండడమూ గమనించారు. 


"వస్తానోయ్. కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను. వస్తాను తల్లీ. మంచి భోజనం పెట్టేవు. " అని బండి వైపు నడిచాడు పెద్ద మనిషి. 


అతడి వెనుకనే నడచి వెళ్ళి, "అయ్యా, తమరు ఎవరో పోల్చుకోలేకపోయాను.  మన సంబంధం....." నసుగుతూ సందేహం వెలిబుచ్చాడు కామయ్య. 


గట్టిగా ఓ నవ్వు నవ్వి, "మనది బాదరాయణ సంబంధమోయ్. " అన్నాడు పెద్ద మనిషి. ఇతడు తెల్ల ముఖం పెట్టడం చూసి, "అర్థం కాలేదూ? బదరి అంటే రేగు. నీ ఇంటి ముందు రేగు చెట్టు ఉంది కదా. నా బండి చక్రాలు రేగు చెట్టు తో చేసినవే! అదే మన సంబంధం!" అని బండి ఎక్కేసాడు పెద్ద మనిషి. అంతే కాదు, కొసమెరుపు గా...


"శ్లో: అస్మాకం బదరీ చక్రం 

       యుష్మాకం బదరీ తరుః

       బాదరాయణ సంబంధాత్ 

       యూయం యూయం వయం వయం. " 

 

అని ఓ శ్లోకం కూడా వదిలేడు. బండి కదిలింది. బండి మలుపు తిరిగే వరకూ నిర్ఘాంతపోయి నిలిచి చూస్తూ ఉండిపోయారా అమాయక దంపతులు!

 

                    🤣🙏

ధర్మాకృతి

 ధర్మాకృతి : గిణి


సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఉద్యోగధర్మాన శ్రీస్వామినాథన్ బాల్యము విల్లుపురము, తిండివనం చిదంబరం, ఫిరంగిపేట, వికరవాండి మొదలైన గ్రామాల్లో గడిచింది. ముందు జీవితమంతా గ్రామగ్రామంగా విజయం చేయబోతున్నారనేందుకు సూచనేమో ఈ త్రిప్పట.

పెద్దకుమారుడు కలిగిన తొమ్మిదేళ్ళ తరువాత ఇక పుత్రులు కలగరేమో బెంగపడుతున్న సమయంలో పుట్టిన వారవడంతో శ్రీస్వామినాథన్ అంటే తల్లిదండ్రులకు ఎంతో ముద్దు, గారాబం. డానికి తోడు చురుకుదనం, మంచి నడవడి, చక్కదనం, మంచి మాటకారితనం, ఇవన్నీ కలసి వారిపై మరింత ఆదరాన్ని కలుగజేశాయి. ఇన్ని వన్నెలున్న తమ కుమారుని పంచవన్నెల రామచిలుకకు కన్నడ పర్యాయపదమైన ‘గిణి’ అనే పేరుతో పిలుచుకోసాగారు. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఏకాదశులు

 *ఏకాదశులు వాటి విశిష్టతలు*


ఏకాదశి అనగానే హిందువులకు గుర్తుకు వచ్చేవి తొలఏకాదశి ముక్కోటి ఏకాదశి. కొంతమంది ఏకాదశికి ఉపవాసం ఉంటారు. ప్రతి నెలలోనూ రెండు సార్లు ఏకాదశులు వస్తాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే.  ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి. 1. శుక్లపక్షము 2. కృష్ణ పక్షము … పక్షానికొక ఏకాదశి చొప్పున్న .. ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులుంటాయి.


ప్రతి నెల పౌర్ణమికి,అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆషాడ శుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశిగా పరిగణిస్తారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి శుద్ధ ఏకాదశులు 12 వస్తాయి. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు 12 వస్తాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ…. హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు. అవే


1. ఆషాడ శుద్ధ ఏకాదశి ( తొలి ఏకాదశి / శయనేకాదశి )

2. కార్తీక శుద్ధ ఏకాదశి

3. పుష్య శుద్ధ ఏకాదశి ( వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి )

4. మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి ) వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.


చైత్రమాసం నుంచి వచ్చే ఏకాదశుల పేర్లు – వాటి ఫలాలు ఓసారి చూద్దాం

చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) – ‘కామదా’ – కోర్కెలు తీరుస్తుంది.

చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) – ‘వరూధిని’ – సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.

వైశాఖ శుద్ధ ఏకాదశి – ‘మోహిని’ – దరిద్రుడు ధనవంతుడు అవుతాడు.

వైశాఖ బహుళ ఏకాదశి – ‘అపరా’ – రాజ్యప్రాప్తి.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి – ‘నిర్జల” – ఆహార సమృద్ధి.

జ్యేష్ఠ బహుళ ఏకాదశి – ‘యోగిని’ – పాపములను హరిస్తుంది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి – ‘దేవశయనీ’ – సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి).

ఆషాఢ బహుళ ఏకాదశి – ‘కామికా’ కోరిన కోర్కెలు ఫలిస్తాయి.

శ్రావణ శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – సత్సంతాన ప్రాప్తి.

శ్రావణ బహుళ ఏకాదశి – ‘ఆజా’ – రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ.

భాద్రపద శుద్ధ ఏకాదశి – ‘పరివర్తన’ (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి).

భాద్రపద బహుళ ఏకాదశి – ‘ఇందిరా’ – సంపదలు, రాజ్యము ప్రాప్తించును.

ఆశ్వయుజము శుక్ల ఏకాదశి – ‘పాపంకుశ’ – పుణ్యప్రదం.

ఆశ్వయుజము బహుళ ఏకాదశి – ‘రమా’ – స్వర్గప్రాప్తి.

కార్తీక శుద్ధ ఏకాదశి – ‘ప్రబోధిని’ – (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి.

కార్తీక బహుళ ఏకాదశి – ‘ఉత్పత్తి’ – దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు).

మార్గశిర శుద్ధ ఏకాదశి – ‘మోక్షదా’ – మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

మార్గశిర బహుళ ఏకాదశి – ‘విమలా’ -(సఫలా) – అజ్ఞాన నివృత్తి.

పుష్య శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

పుష్య బహుళ ఏకాదశి – ‘కళ్యాణీ’ (షట్ తిలా) ఈతిబాధా నివారణం.

మాఘ శుద్ధ ఏకాదశి – ‘కామదా’ (జయా) – శాపవిముక్తి.

మాఘ బహుళ ఏకాదశి – ‘విజయా’ – సకలకార్య విజయం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘ఆమలకీ’ – ఆరోగ్యప్రదం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘సౌమ్య’ – పాపవిముక్తి

(కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని బేధాలున్నాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించట్లేదు)


24 ఏకాదశులలోనూ – సౌరమానంలో ప్రసస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని “వైకుంఠ ఏకాదశి”గా కీర్తిస్తున్నాం. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.  సౌరమానం ధనుర్మాసం కాగా, అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి, శ్రీమన్నారాయణునకు సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరు ఐనా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా….. కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది.


వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇచ్చుట జరిగింది. దేవతల బాధా నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది.


🚩 * 🚩