29, మే 2021, శనివారం

ఒక్కరుపు అరిచాను

 వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన! 


‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ. 


ఎప్పుడు తెచ్చారు? ఎన్ని తెచ్చారు? ఒక్కొక్కరికీ ఎన్నేసొస్తాయి? వాటాలేసుకునేటప్పుడు ముందుగానే మంచివన్నీ చూసి తీసేసుకోవాలి. అసలే అయిదుగురం. పందార కలిశలనుకుంటా! భలే తియ్యటి వాసన గదంతా! గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడిలా మెరిసిపోతున్నాయి.


అప్పుడప్పుడు ఇంకా పండనివి తెచ్చేవారు. మునగపాక నుంచి వచ్చి రోజూ పాలుపోసే పైడమ్మని అడిగి ఎండుగడ్డి తెప్పించేవారు. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు. మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం. 


వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.


అసలా మావిడిపళ్ల ఆకలి చాలా దారుణమైన ఆకలి. వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత! 


‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే!


వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది. నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు. 


కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు. అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి. అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి. 


‘బాబోయ్, పులుపు రొడ్డు!’ అనేది అమ్మ. 


ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా! అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది. 


శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతఁవప్పుడు ఇరవయ్యొక్క రకాల పిండివంటలు వండినా విస్తట్లో ఓమూలగా క్షేత్రపాలకుడి పాత్రలో ఆవకాయ వుండాల్సిందే! 


ఇక భాద్రపదంలో వినాయక చవితికి ఉండ్రాళ్లలోకి కొబ్బరిపచ్చడీ, అల్లప్పచ్చడీ చేసినా సాయంత్రం మాత్రం పునఃపూజ తరవాత ఆవకాయ అద్దుకుంటూ ఉండ్రాళ్లు తినకపోతే వ్రతఫలం దక్కదుట! 


ఇక అసలు విషయానికొద్దాం. 


వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది. ఆ టైములో అర్జెంట్ ఆపరేషనన్నా వెళ్లబుద్ధి కాదు!


అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి. ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు. నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.


అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు. ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి...‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!


అసలు వాణ్ణని ఏంలాభం? వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది. కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి!


వేసవి సెలవులప్పుడు తాడేపల్లిగూడెం వెళ్లేవాళ్లంకదా? అక్కడ ముగ్గురు మావయ్యలు, వాళ్లకి నలుగురేసి, అయిదుగురేసి పిల్లలు కదా!


తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!


వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 


అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే జోగిరాజు మావయ్యనడిగి ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి. అంతేగానీ పళ్లు తినొద్దంటే ఎలా?


కానీ పిర్రలమీద వస్తే మాత్రం చచ్చేచావే! నిక్కరేసుకోలేక పోయేవాళ్లం. అది పగిలేదాకా తువ్వాలు కట్టుకు తిరగాల్సొచ్చేది. ఆడపిల్లలు వెక్కిరిస్తారన్న బాధొకటి కురుపు కన్నా ఎక్కువ సలుపుతూ వుండేది.


దాసు మావయ్య హాస్పిటల్‌కి తీసుకెళ్లి పెన్సిలిన్ ఇంజక్షన్ చేయిస్తాననేవాడు. ఆ భయంతో తినడం తగ్గించేవాళ్లం. లేకపోతే మనల్ని ఎవరాపగలరు?


మన చిన్నతనాల్లో మావిడిపళ్లు డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా? ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.


ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు. మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి. 


పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు. అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు మాజా తాగడం బెటరు. లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??


బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.


అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...


‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’ 


అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా! అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.


మావిడిపండంటే తీపే కాదు! తీపి జ్ఞాపకం కూడా!

మెదడు కి మేత

 మెదడు కి చిన్న మేత



❓❓❓❓❓❓❓

***********************

👇 కింది ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి.  ప్రతి పదం "" ఉ "" తో మొదలవ్వాలి .

***********************

1.salt ఉప్పు

2.free 

3.steel

4.swing ఊయల

5. potato 

6. Idea

7. relief

8. Run

9.  Both

10. Fasting 

11. Help 

12. Speech

13. teacher

14. Ring

15. Lump

16. Squirrel 

17. Anxiety 

18. Temperature 

19. Horse gram

20. Joint

21. Satellite 

22. Neglect 

23. Tsunami 

24. Escape 

25. Example

26. North 

27. Opinion 

28. Job

29. Rise

30. Production 

31. Water

32. Wash

33. park

34. Letter

35. Thunder 

36. Asthma 

37. Episode 

38. Movement 

39. Send off

40. Stomach

Fపిశాచత్వ విముక్తి*

 _*వైశాఖ పురాణం - 19 వ అధ్యాయము*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*పిశాచత్వ విముక్తి*



☘☘☘☘☘☘☘☘☘



నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవుడిట్లనెను , రాజా ! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.


వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు.


వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు.


ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.


పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు , తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.


వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో , తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును , వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.


విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా ! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి ?  కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము , ధ్యానము , మననము , ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము , విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని , విష్ణుకథగాని , సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము , మననము , స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.


ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన ఇష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు , చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ ఇంటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము , చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.


ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు , నిరాశ్రయుడు యెండిన పెదవులు , నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను , జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.


ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని శిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వారి పాదములపై బడి దుఃఖించెను.



సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను.  ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు - సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.


శ్రుతకీర్త మహారాజా ! కావున శ్రీహరి కథల ప్రసంగము , శ్రవణము , ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు ఇహము , పరము , నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.


*ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |*

*తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||*

*ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |*

*కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||*

*ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |*

*బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||*


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.

కాళీ గ్లాసు

 కాళీ గ్లాసు 


మనం రోజు చూస్తున్న ఒక సాధారణ విషయం. ఈ రోజుల్లో చాల పలచటి ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేస్తున్నారు. వాటిని ఏదయినా విందులో వాడేటప్పుడు టేబులు మీద పెట్టి నీళ్లు పోస్తుంటే కాళీ గ్లాసులు గాలికి అటు ఇటు కదులుతూ కొంచం పెద్ద గాలి వస్తే టేబులు మీదినించి కింద అక్కడక్కడ పడుతూ వాటిలో నీళ్లు పోసే వారికి విసుకు కలిగిస్తాయి. అందుకే నీళ్లు పోసేవారు ఇంకొకడిని ఆ గ్లాసులు పట్టుకోమని చెప్పి వాటిలో నీళ్లు నింపటం నిత్యం మనం చూస్తూవున్న విషయం . 


అదే కొంత బరువు కలిగిన రాగి గ్లాసో లేక ఇత్తడి, కంచు లేక స్టీలు గ్లాసు అనుకోండి వాటిని టేబులు మీద పెట్టినవి పెట్టినచోట ఉండి వాటిలో నీరు నింపటం చాల సులువుగా అవుతుంది. 


ఇక విషయానికి వస్తే ప్రతి మనిషి ఒక కాళీ గ్లాసు లాంటి వారే దానిలొ నీరు నింపటం అంటే గురువుగారు చేసే జ్ఞాన బోధ. నింపటం అన్న మాట. ఎప్పుడైతే కాళీ గ్లాసు స్థిరంగా ఉండి  ఉంటే దానిలో నీరు నింపటం ఎలా అయితే సులువు అవుతుందో అదే విధంగా సాధకుని మనస్సు స్థిరంగా ఎటువంటి వత్తిడులకు లోనుకాకుంటే ఆ సాధకునికి గురువుగారు చేసే జ్ఞాన బోధ చక్కగా వంట పట్టి జ్ఞానిగా మారుతాడు. అదే ప్లాస్టిక్కు గ్లాసులాంటి చంచల మనస్సు కలవారికి జ్ఞానబోధ చేయుట బహు కష్టం. కాబట్టి ప్రతి వారు ఒక రాగి గ్లాసులాగా స్థిరంగా ఉంటే వారికి గురువులు చేసే తత్వ బోధ సులువుగా అర్ధమౌతుంది. కాబట్టి మనమందరం స్థిర మనస్కులుగా ఉంటే మనలో జ్ఞానం సులువుగా వికసిస్తుంది. 


ఓం తత్సత్.  


ఓం శాంతి శాంతి శాంతిః 


మీ భార్గవ శర్మ.

జప / ధ్యానాలు

 జప / ధ్యానాలు ఎందుకు గొప్పవి..




మానవునకు రోగం కలిగించేది ' పాపం ' . 

మానవునకు భోగం కలిగించేది ' పుణ్యం ' . 

మానవుని భవిష్యత్తు నిర్ణయించేది ' కర్మ ' .


మానవునకు లాభం కలిగించేది ' సేవ ' .

మానవునకు సంపాదన  నిలిపేది ' పొదుపు '

 మానవుని విలువ పెంచేది ' దానం ' . 


మానవునకు నష్టం కలిగించేది ' హింస ' . 

మానవునకు అశాంతి కలిగించేది ' ఆశ ' .

 మానవునకు శాంతి కలిగించేది ' తృప్తి ' .

 

మానవునకు దుఃఖం కలిగించేది ' కామం ' . మానవుని పతనం చేసేది ' అహంకారం ' . 

మానవునకు అందరిని దగ్గర చేసేది ' ప్రేమ ' 


మానవునకు అందరినీ దూరం చేసేది ' అసూయ ' .

మానవుని స్థితిని సూచించేది ' గుణం ' . 

మానవుని దైవంగా మార్చేది 

' దయ


మానవుని ఆత్మస్థితి తెలిపేది ' వాక్కు ' . 

మానవునకు విజయం చేకూర్చేది ' ధర్మం ' . 

మానవుని గొప్పవాడిగా చేసేది ' జ్ఞానం ' . 


మానవునకు ' ముక్తి'ని ఇచ్చేది  సత్యం ' .

 మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది ' జపం / ధ్యానం ' .


*అందుకే జపం / ధ్యానం అన్నింటికంటే గొప్పవి.*

సమర్థుడికి

 🪔 *卐ॐ _సుభాషితమ్_ ॐ卐* 💎


శ్లో|| నాతః శ్రీమత్తరం కిఞ్చిత్ అన్యత్పథ్యతమం మతమ్ |ప్రభవిష్ణోర్యథా తాత క్షమా సర్వత్ర సర్వదా ||


తా|| "సమర్థుడికి అన్నిచోట్ల అన్నివేళలా సహనం కంటే శుభకరమైనది మరొకటి లేదు.

అది అన్నిటికంటే చాలా శ్రేయస్కరం".


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

అవ్యాజ కరుణామూర్తి ( పాతకథ)

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

)

              🌷🌷🌷

అవ్యాజ కరుణామూర్తి ( పాతకథ) 


" రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా

రంజనీ రమణీరస్యా రణత్కింకిణి మేఖలా"


అనునిత్యపఠనంగా అలరారే లలిత.. రాగబద్ధంగా సాగిపోతోంది గణపతి పెదవులపైన.  


తమకలవాటయిన తమదైన పరదేవతానామం తమ జీవనాడుల అమృతం పోస్తుంటే, ఆ అమృతపాన పునీతులైన ఆ పుష్పగుల్మాలన్నీ, అమ్మకు అంకితంగా తమ సుమహృదయాలను పరమానందంగా అర్పిస్తున్నాయి ఆ కెంజాయ సంజెవేళ! 


             రాజరాజేశ్వరి దేవతార్చనకు ముందురోజే సాయంత్రం మల్లెలూ, గులాబీలూ, సంపెంగెలూ, మరువం, ధవనం కోసి ఉంచుకుంటాడు. మందారాలూ, నందివర్ధనాలూ , పారిజాతాలూ మర్నాడు ఉదయమే తామూ తయారు! అంటాయి. ఆ పూబాలలను పలకరిస్తూ, సున్నితంగా వాటిని కొమ్మనుండి వేరుచేస్తాడు. 


అమ్మపొదుగు నుండి బొజ్జనిండా పాలుతాగిన తువ్వాయి లేలేత గడ్డిలో గెంతులేస్తోంది. చీకటిఛాయలు పరుచుకుంటున్న వేళ... దూరంగా పొదల్లో ఏదో అలజడి. పాము కాదు కదా! అటు పరుగెడుతున్న ఆవుదూడను సంభాళించడానికి వడివడిగా అడుగులేసాడు గణపతి. 


సన్నని ఆర్తనాదం. పొదల మాటున ఇద్దరు యువతులు. పెద్దింటి అమ్మాయిలేమో! దూరంగా పెద్ద కారు! ఏడుస్తున్న అమ్మాయి చేతిలో ఏదో మూట. " నావల్ల కాదు వదినా! నేను పాపాయిని తీసుకుని ఎక్కడికయినా పారిపోతా! నేను విడువలేక పోతున్నా".... హృదయవిదారకంగా ఏడుస్తోంది. పద్దెనిమిది వుంటాయో ఏమో! 


" లాభం లేదు లతా! తప్పుచేసినపుడు ఆలోచించలేదా ఇవన్నీ. ఎంత అజాగ్రత్త! ఐదునెలలకు కళ్లు తెరిచావ్! వాడేమో మీనాన్నకు భయపడి పారిపోయాడు. హాస్టల్ నుంచి నిన్ను తెచ్చి ఈవూళ్లో రహస్యంగా వుంచి, డెలివరీ పూర్తిచేసేటప్పటికి నాతల ప్రాణం తోకకొచ్చింది. మంత్రసాని ఏ పొరపాటు చేసినా నీ ప్రాణం మీదికొచ్చేది. మీ అన్నయ్యకు తెలిస్తే నా తల తెగుతుంది. ఇది మనవల్ల అయ్యేది కాదమ్మా. నాతల్లి కదూ! ఇక్కడ పెట్టేద్దాం బిడ్డను. ఆయుష్షుంటే బతుకుతుంది. ఎవరో ఆదరిస్తారు. నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. నాకియ్యమ్మా బిడ్డను. "..... పాతికేళ్లుంటాయేమో వదినగారికి. ఆడపడుచుకు ధీటుగా పచ్చనిఛాయలో మెరిసిపోతోంది. ఆ ఇద్దరి వంటిమీద రవ్వల ధగధగలు వారి చెక్కిళ్లపై జాలువారుతున్న కన్నీటిని మరింత మెరిపిస్తున్నాయి. 


బిడ్డను అక్కడే ఓ మొగలిపొద మొదలులో పెట్టి , ఆడబిడ్డను లాక్కుపోయింది ఆమె. 


" అయ్యో! ఎంత అఘాయిత్యం!" ఆపడానికి పరుగుపెట్టి రోడ్డు మీదకొచ్చాడు గణపతి. 


కారెక్కబోతున్న ఆ నిర్భాగ్యమాతృమూర్తి , ఒక్కసారి తిరిగి, కన్నీళ్లతో నమస్కరించి వెళ్లిపోయింది. ఎంత అభ్యర్ధనో! ఎంత వేడుకోలో! ఆ పెద్దకళ్లల్లో! 


తెల్లారితే విజయదశమి. చేతిలో పొత్తిళ్లలో పాపాయి. కళ్లుమూసుకుని చిన్మయముద్రలో బాలాలీలావినోదినిలా! 


" రాజరాజేశ్వరీ దేవి"...... " నను పాలించగ నడచీ వచ్చితివా తల్లీ! పాదాల తలలనే పారిజాతములుంచి, మోదాన భాష్పాల ముద్దుపూసరులిచ్చి.... ఓ దేవి! నీమ్రోల ఒదిగి ఉన్నానమ్మా"! ..... ఏదో పరవశత్వం! ఏదో ఉన్మాదం! వివశత్వం బిడ్డను చూస్తుంటే! బాలాత్రిపురసుందరిని కళ్లారా చూస్తున్నట్టు! 


తన కుటీరానికి తెచ్చాడు. భార్యను పిలిచాడు. ప్రశ్నించే తెలివిలేని ఆ అమాయకురాలు అపురూపంగా బిడ్డను గుండెకు పొదువుకుంది. కుటీరానికి ఆనుకుని చిన్న మందిరంలో తాను ప్రాణప్రదంగా ప్రతిష్టించుకున్న శ్రీచక్రసహిత రాజరాజేశ్వరీదేవి పంచలోహవిగ్రహం పాదాల చెంత బిడ్డను పెట్టాడు. కళ్లువిప్పిన బిడ్డ కనులారా నవ్వింది. పెద్దపెట్టున ఏడ్చింది. " భావాభావ వివర్ధిని"


            బిడ్డనెలా పెంచాలన్న భయం లేదు ముప్ఫైయేళ్ల గణపతికి. పుష్కలంగా పాలిచ్చే గోవుంది. అమ్మవారు వుండనే ఉంది. పుష్కరకాలం క్రితం తనకు " వినిపించిన తల్లి" ఈరోజు కనిపించింది! " అమ్మా! నీ దయ! "


గణపతి సత్సాంప్రదాయ, సంపన్న కుటుంబంలో ఆరవకొడుకు. తాతతండ్రులు మంచిపేరున్న ప్లీడర్లు. చదువులో చురుకుగా ఉండే గణపతి చిన్నప్పటినుండి తాతగారితో పాటూ దేవతార్చనలో కూర్చుండేవాడు. పద్దెనిమిదో యేట ఉపనయనం జరిగింది. గాయత్రీ మహామంత్రోపదేశం తీసుకోగానే అతనికి బ్రహ్మానందం కలిగింది. 

ఆరోజు అర్ధరాత్రి ఇంట్లో చిరుగజ్జెల చప్పుడు. ఎంత మరలిద్దామన్నా మనసుకు గాలం వేస్తున్న మంజీరకింకిణీ నాదం! ఒంటిపై కొస్తున్న మైమరుపు! మొగలి, మల్లెలు , చందన సుగంధం. పిలుస్తున్న దివ్యకాంతిని అనుసరించి వెళ్లిన గణపతి , దేవుడిగది పక్కగదిలో చిన్న సందువాపెట్టి దగ్గర నియంత్రించబడ్డాడు. పెట్టె తెరవగానే గుప్పున సాంబ్రాణిధూపం. జీర్ణమైపోతున్న పట్టువస్త్రంలో చుట్టబడి శ్రీచక్ర మేరువు, అష్టభుజాంకిత, అఖిలాధారిణి రాజరాశేశ్వరీ దేవి దివ్యవిగ్రహం. 


గాయత్రితో ఆవహించిన మైమరుపు ఇప్పుడు అతని ఆత్మను ఆలింగనం చేసుకుని, అలౌకికమైన స్థితికి తీసుకుపోయింది. 


తమ పూర్వీకులు కొన్నితరాల క్రితం పూజించిన రాజేశ్వరీపీఠం అతన్ని వరించింది. 


కొన్నినెలలు అదే అలౌకికస్థితిలో, పరదేవతా ధ్యానంలో ఉన్మత్తుడయిపోయిన గణపతిని ఐహికస్థితికి తీసుకురావడం అసాధ్యమని గ్రహించిన అతని తాతగారు , కంచి గురుస్వాములచే శ్రీచక్రార్చన చేయించి, అమ్మవారిని ఆహ్వానించి, సద్గురువులచే మంత్రోపదేశం చేయించారు. అనంతరం కొద్దిగా బుద్ధిమాంద్యమున్న అతని మేనత్తకూతురుతో వివాహం జరిపించి, అతనికోరిక మీద ఆ చిన్న ఉపవనం, అమ్మవారి అర్చనకు ఏర్పాటు చేసారు. 


సన్యసించకపోయినా, అవధూతలా విరక్తితో, నిర్గుణ నిశ్చల మార్గంలో తపోధనంతో వెలిగిపోయే గణపతి జీవితంలోకి పెనుమార్పులా ఈ "బాల రాజరాజేశ్వరి" ! 


                స్వయాన వైష్ణవి, వైభవోపేత ఆతల్లి. ఆ పూరికుటీరానికి అష్టైశ్వర్యాలూ వచ్చి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. 


ఒకరోజు నామినేషన్ కు వెళుతూ ఆ కుటీరం దగ్గర దాహానికాగి, అమ్మవారికి దండం పెట్టుకున్న ఒక పెద్దమనిషిని ఏకంగా కీలకమంత్రిపదవి వరించడం , ఆ చిన్నమందిరం రూపురేఖల్నే మార్చేసింది. 

స్వయాన పీఠాధిపతులు, గణపతి సచ్చిదానంద స్వాములు, యతీంద్రుల అధ్వర్యంలో రాజరాజేశ్వరీదేవి విగ్రహస్థాపన జరిగింది. 


ఆగమశాస్త్రానుసారం భూకర్షణ చేసి, అద్భుతమైన శిల్పకళతో, అందమైన పాలరాతి ఆలయం నిర్మింపచేసుకుంది తల్లి. 


ఆలయంతో పాటూ దినదినప్రవర్ధమానమైన రాజరాజేశ్వరికి అందరూ తల్లులే. అందరికీ అపురూపమే! పదిమంది పిల్లలున్న తల్లి కూడా మాతృభావన ఉప్పొంగి, ఆలింగనం చేసుకునే అద్వితీయ ఆకర్షణ ఆపిల్లది. 


ఆ శ్వేతపద్మాసని విద్యాధరి శారదాంబ పిల్లకు విద్యలు అలవోకగా కట్టిపెట్టింది. 


తనప్రమేయం లేకుండానే అఖండమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీరాజరాజేశ్వరీదేవి సంస్థానం పురోగమించడం గణపతి నిశ్చలభక్తికి ఏ ఆటంకం కలుగచేయలేదు. సాక్షీభూతుడిగా తన తపోనిష్ట సాగించుకుంటూ ఆయన తన కుటీరంలో తన శ్రీవిద్యోపాసనలో మహాయోగిలా తేజోవిరాజిల్లుతూ! 


అది ఇరవై ఒకటో విజయదశమి రాజరాజేశ్వరికి. ముగ్గురమ్మలూ పోటీపడి చేసిన ఆ పిల్ల పెళ్లి ప్రస్థావనా   , ప్రయత్నమూ గణపతిని కణ్వుణ్ణే చేసింది. 


ఆమె అకులా సమయాంతస్థ అయినా మానుషరూపిగా ఆమెకు తనకులంలో కాకుండా కులేతర వివాహం చెయ్యలేడు. పైగాఆమె చెయ్యికోరి వచ్చిన వారికి సంస్థానం మీద దురాశ అదనం! "అమ్మా! నీ దయ!" దీర్ఘంగా నిశ్వసించి విశ్రమించాడాయన నవమిరాత్రి. 


      పోటెత్తిన జనసంద్రసమక్షంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవికి శాంతికవచం ధరింపచేసి, పూర్ణాహుతి, అఖండ అన్నదానానంతరం.... రాత్రి పదింటికి అమ్మవారికి భార్యాపుత్రీ సమేతంగా మణిహారతులిచ్చి, మొట్టమొదటిసారిగా ఒకేఒక్క కోర్కె కోరాడు అమ్మను! 


                కార్తీకపౌర్ణమి! ప్రత్యూష శీతలపవనాలు హిమగిరితనయ చల్లనిచూపుల్లా ఉన్నాయి. పచ్చనిగరికెలమీద తుహిణకణాలపై లేత అరుణకిరణాలు వక్రీభవనం చెంది, లక్షల ఇంద్రధనుసులు ఆ వనమంతా! అతిసుకుమారంగా పారిజాతాలు ఏరుకుని మొగలిపొదవేపు కెళ్లాడు గణపతి. కేతకీ పుష్పం శివుడికి నిషిద్ధమైనా , ఆయన గణపతి కదా! అమ్మకు ఇష్టంగా ఒకరేకు పెడతాడు రాజరాజేశ్వరి వచ్చినప్పటినుండి. 


      సంస్థానాన్ని విస్తరించి, సంరక్షించే గణపతి అన్నలపిల్లలూ, ధర్మకర్తలూ ఆయన ప్రపంచాన్ని ఏమాత్రం స్పర్శించకుండా ఆయనకేది ప్రియమో ఆ తోటంతా అలాగే ఉంచారు. 


              మొగలిపొద దగ్గర ఇద్దరు స్త్రీలు! ప్రౌఢలు! ఆయన అక్కడకు చేరగానే " స్వామీ!" అని మంద్రంగా పిలిచింది ఆమె. 


ఆయనది సూక్ష్మబుద్ధి ! ఇట్టే కనిపెట్టాడు! 


" ఏమ్మా! జగన్మాతను నాకు వదిలి నువ్వు వెళ్లిపోయావా తల్లీ?" 


కన్నీరుమున్నీరే అయింది ఆ దొరలపిల్ల! 


" మీ జగన్మాత చెయ్యి పట్టుకోడానికే వచ్చాము స్వామీ!".... కొంత ఠీవి. మరింత వినయం! ఆమె వదిన! 


స్వామీ! నాపేరు శ్రీలలిత, ఈమె మా వదిన మణిదీప. ఆ కారు దగ్గరున్నాడే శైలేష్. మా అన్నకొడుకు. హైదరాబాద్ లో డాక్టర్ ! తన అంశను మోసిన గర్భంలో మరొకరికి స్థానం ఇవ్వలేదు ఆ తల్లి. వదిన పెద్దకొడుకు శైలేష్ ను నేనే పెంచుకున్నా! 


నా పాప మీదగ్గర సవ్యంగా పెరుగుతోందని తెలుసు. ఏమిచ్చి మీరు పెంచగలరు అని కూడా ఆలోచించలేదు. మీ ఋుణం ఎప్పటికీ తీరనిది. వైవాహికజీవితం అల్లకల్లోలమవుతుందని నా గతాన్ని పాతిపెట్టేసాను. కానీ అనుక్షణం నా పాపం వెంటాడుతూనే ఉంది. పాపను మీరు చూడకపోతే! ఆ వూహే భయంకరం! 


నా పాపభారంతో ఈ పవిత్రసన్నిధిలోకి అడుగుపెట్టే సాహసం చెయ్యలేకపోయా! జీవనసహచరుడు అకాలమృత్యువు పాలయ్యారు. రెండేళ్లయ్యింది నా జీవితం నాచేతిలో కొచ్చి.  అందుకే ఈరోజు ధైర్యంచేసి మీకుమార్తెను నా దత్తపుత్రుడికి చేసుకోమని అర్ధించడానికి వచ్చా స్వామి. 


పిల్లాడు శాఖాహారి. దైవభక్తితో సవ్యంగా పెరిగినవాడు" ...... మాటలూ-దుఖం కలగలుపుగా మాట్లాడుతుంటే,  ఆమె కెంపుల కర్ణాభరణాలమెరుపులు ఆమె చెక్కిళ్ల దుఖపు ఎరుపులో ప్రతిఫలిస్తున్నాయి! 


" అరుణాం కరుణాతరంగితాక్షీం"..... అమ్మనామం ఆయన నోటంట అప్రయత్నంగా జాలువారింది. 


"రండమ్మ! మందిరంలోకి వెళ్దాం. అమ్మ సమక్షంలో పిల్లతో, ఆమె తల్లితో ఓ మాట చెప్పాలి కదా! 


" మరోమాట స్వామి! ఏతండ్రికి భయపడి నాబిడ్డను వదిలేసి వెళ్లిపోయానో, ఆయన్నే స్వయంగా అమ్మ తన కాళ్లదగ్గరకు తెప్పించుకుంది. అవునండి ! మినిస్టర్ మృత్యుంజయరావు గారు మా నాన్నగారు. ఆయనకు పాప విషయం ఏమీ తెలియదు. అంతా ఆ దేవి దయ"


ఆ తరువాత వచ్చిన మాఘమాసంలోనే రాజరాజేశ్వరీదేవి కల్యాణం తను మెచ్చిన శైలేష్ తో ఆదిత్యనారాయణుడు ప్రత్యక్షసాక్షిగా , ముక్కోటిదేవతల ఆశీస్సులతో శ్రీరాజరాజేశ్వరీ సుందరేశుల సమక్షంలో అంగరంగ వైభవంగా అయింది. 


పిల్లకు అప్పగింతలు పెట్టి పంపించేసారు అత్తవారింటికి. 

ఏడుస్తున్న భార్యతో

" పిచ్చిదానా! తల్లి విశ్వమాత! జగద్ధాత్రి! పుట్టిల్లేంటి? మెట్టినిల్లేంటి? ఆమే బంధాలనిస్తుంది. బంధమోచనీ ఆమే!"అంటూ ఓదార్చారు గణపతి స్వామి! 


ఆరోజు రాత్రి అమ్మవారికి ఒంటరిగా హారతిచ్చి, " కల్యాణీ జగతీకందా కరుణారససాగరా! పిల్లకల్యాణంతో నీవిచ్చిన బంధం ముగిసింది తల్లీ! రాజమ్మను చేర్చాలిసిన చోటికే చేర్చావు. నీలీలలు వర్ణించతరమా..!"అని కన్నీళ్లు పెట్టుకుని.... పిల్ల నీ సన్నిధిలోకి వచ్చింది కనుక నువ్వు చూసుకున్నావు, కానీ ఇలా ఎంతమంది పిల్లలు పురిటిగుడ్లుగా రాలిపోతున్నారో! ఎన్ని పసిబతుకులు ఛిద్రమైపోతున్నాయో! రక్షాకరీ! కాపాడుతల్లీ! నువ్వు కలికల్మషనాశినివి! దౌర్భాగ్యతూల వాతూలా! జరాధ్వాంత రవిప్రభవు! కటాక్షకింకరివి. రక్షించు తల్లీ పసిపిల్లలను! రక్షించు! మాతృరక్షణనుండి దూరం చెయ్యకమ్మా!" 


ఆ అవ్యాజకరుణామూర్తి , అన్నీ తానయిన కర్మసాక్షి అమ్మ ముఖారవిందంలో అదే మందహాసం. ఆ చూపుల్లో అదే కరుణ! " 


ఓలేటి శశికళ 

8-10-2019

సత్యం బ్రూయాత్

 జై శ్రీరామ్


సత్యం బ్రూయాత్

ప్రియం బ్రూయాత్

న బ్రూయాత్

సత్యమ్ అప్రియమ్

ప్రియం చ 

న అనృతం బ్రూయాత్

ఏషః ధర్మః సనాతనః


నాస్తి సత్యసమం బ్రహ్మ

నాస్తి సత్యసమః విష్ణుః

నాస్తి సత్యసమః శివః

నాస్తి సత్యసమం జగత్


సత్యమ్ అదః 

సత్యం ఇదం

సత్యాత్  సత్యమ్ ఉదచ్యతే

సత్యస్య సత్యమ్ ఆదాయ

సత్యమ్ ఏవ అవశిష్యతే


సత్యం బ్రహ్మా సత్యం విష్ణుః

సత్యదేవో మహేశ్వరః

సత్యం సాక్షాత్ పరం బ్రహ్మ

తస్మై శ్రీ సత్యాయ నమః


సత్యజ్యోతి నమస్తుభ్యం

సత్యదే సత్యరూపిణి

సత్యార్థం ప్రార్థయిష్యామి

సత్యం దదాతు  మే సదా


సత్యజ్ఞానం వాచయతు

సత్యమూర్తిం దర్శయతు

సత్యమార్గం ప్రేషయతు

సత్యే అస్మాన్ ప్రవేషయతు


యత్ యత్ సత్యం

తత్ తత్ వదేమ

యత్ యత్ అసత్యం

తత్ తత్ త్యజేమ


యే సత్యమార్గమ్ ఆశ్రయంతి

తే భవంతి యశస్వినః

యే అసత్యమార్గమ్ ఆశ్రయంతి

తే భవంతి అపయశస్వినః


సత్యం ధైర్యేణ వదేమ

సత్యం ధైర్యేణ ప్రసరేమ

సత్యం ధైర్యేణ ప్రచరేమ

తదర్థం సదా సంకల్పయేమ


నాస్తి సత్యసమం బ్రహ్మ

నాస్తి సత్యసమః విష్ణుః

నాస్తి సత్యసమః శివః

నాస్తి సత్యసమం జగత్


సత్యస్య ప్రియః నారాయణః

అతః సత్యనారాయణం భజే

వ్రతేషు ఉత్తమోత్తమం వ్రతం

సత్యనారాయణవ్రతమిహఖలు


సత్యమార్గం దర్శయేమ

సత్యమార్గమ్ ఉత్సాహయేమ 

సత్యమార్గం ప్రవిశేమ

జీవనం పవిత్రం కుర్యామ


సత్యమేవ జయతే

సత్యమేవ ఆశ్రియతే

సత్యమేవ ధార్యతే

సత్యమేవ శిష్యతే


సంభాషణ సంస్కృతమ్

(మాసపత్రికా)


జై శ్రీరామ్

అహల్యాబాయి_హోల్కర్_జయంతి

 #అహల్యాబాయి_హోల్కర్_జయంతి


"ఒక సాధారణ భారతీయ మహిళ అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు అసమానమైన ప్రజ్ఞ కనబరుస్తూ వీరనారిగా రూపాంతరం చెందుతుంది అనడానికి అహల్యాబాయి హోల్కర్ జీవితం ఒక ఉదాహరణ. 


మహారాష్ట్రలోని చౌండి గ్రామంలో జన్మించిన అహల్యాబాయి హోల్కర్ మరాఠా సర్దార్ అయిన ఖండేరావు ని వివాహం చేసుకున్నారు. 19 సంవత్సరాల తర్వాత ఒక యుద్ధంలో ఆమె భర్త మరణిస్తారు, భర్త మరణానంతరం అహల్యాబాయి మామ గారు యుద్ధ విద్యలు, రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై ఆమెకు తర్ఫీదు ఇస్తారు. తర్వాత కొంత కాలానికి ఆమె మామ కూడా మరణిస్తారు, ఆ తర్వాత సంవత్సరం తన ఏకైక కుమారుడు కూడా మృతి చెందడంతో అహల్యాబాయి హోల్కర్ అనూహ్యంగా ఇండోర్ పరిపాలనా బాధ్యతలు స్వీకరించారు. 


ఆమె రాణి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆవిడ ఒక మహిళా సైన్యాన్ని తయారు చేయడంతోపాటు, యుద్ధంలో తన సేనలను ముందుండి నడిపేవారు. తన రాజ్య పరిధిలో లేని అనేక పుణ్యక్షేత్రాలలో ధర్మశాలలు నిర్మించారు. అంతేకాకుండా మహమ్మదీయుల దాడులలో ధ్వంసం కాబడ్డ ఎన్నో దేవాలయాలను ఆవిడ పునః ప్రతిష్ట చేశారు. ముఖ్యంగా సోమనాథ్ లోని ప్రముఖ సోమనాథేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం కాశీ క్షేత్రంలోని విశ్వనాథుని ఆలయం కూడా ఆవిడ నిర్మించినదే, ఇలా మన దేశంలో ఎన్నో తీర్థ క్షేత్రాల సందర్శించినప్పుడు ఆ మహనీయురాలు స్మరణకు రావడం అతి సహజం. భారతీయ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది. ఇండోర్లోని విమానాశ్రయానికి కూడా ""దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా"" నామకరణం చేశారు. ఇలాంటి మహనీయురాలు వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర చరణాలకు శతకోటి ప్రణామాలు తల్లి 🙏🙏🙏🙏

పూరి జగన్నాథ్ ఆలయంలోని వంట గది

 పూరి జగన్నాథ్ ఆలయంలోని  వంట గది ప్రతీరోజూ అక్షరాలా లక్ష మందికి  కడుపు నింపుతుంది...ఇది ప్రపంచం లోని అతిపెద్ద బహిరంగ పాకశాల...ఇక్కడ జరిగే విశేషమైన పనులు చూడటానికి మన రెండు కళ్లు చాలవు...


ఇక్కడ ప్రతీరోజూ 15000 మట్టి కుండల్లో వంటలు వండుతారు...ఒకరోజు వాడిన కుండలను ఇంకొరోజు మళ్లీ ఉపయోగించరు...ఏరోజు కారోజు కొత్త కుండలను వాడుతారు.... 


పదార్థాలు ఒక ప్రత్యేక పద్ధతిలో వండుతారు...7కుండలను ఒకదానిపై ఒకటి ఒక వరుసలో పేర్చి తాడుతో కట్టి వాటిని పొయ్యి పై ఉంచి వండుతారు...


ప్రతీరోజూ 56 రకాల పదార్థాలు వండి జగన్నాథ స్వామికి నైవేద్యంగా అర్పిస్తారు... నైవేద్యంగా పెట్టిన ఈ అన్నీ రకాల పదార్థాలను స్వామి వారి మహా ప్రసాదంగా స్వీకరించి రోజూ మధ్యాహ్నం 2-3గంటల ప్రాంతంలో ఆలయం లోని ఆనంద బజార్ అనే ప్రాంగణంలో సందర్శకులకు,భక్తులకు వితరణ చేస్తారు...


ఒక్కరోజు కూడా కొంచం అయినా ఈ మహా ప్రసాదం ఎప్పుడూ వృథా కాదు...


కుల,మతాల కతీతంగా ప్రతీరోజూ లక్ష మందికి కడుపు నింపే ఒక్క మసీదు లేదా చర్చ్ అయినా ఉందా ప్రపంచంలో ఎక్కడైనా ...అందులోనూ ఎవరినీ మతోన్మాదులుగా మార్చకుండా...మతం మార్చకుండా...మన ఆలయాల విశిష్టత ఎంత చెప్పినా చాలదు...దేవుడిని కూడా తమ స్వార్థం కోసం మార్చుకునే గొఱ్ఱెలకు ఏం అర్థం అవుతుంది...సేవ,భక్తి, ఆధ్యాత్మికత లోని గొప్పదనం...


జై జగన్నాథ్...🙏🙏