5, ఆగస్టు 2026, బుధవారం

పురంజనోపాఖ్యానం

 *బుధవారం 5 ఆగస్టు 2026*


*శ్రీమద్భాగవతం - 12/42*


*పురంజనోపాఖ్యానం & ప్రచేతసుల తపస్సు*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత అధ్యయనం లో భాగంగా 

నిన్నటి రోజున పృథు చక్రవర్తి అవతార విశేషాలు తెలుసుకున్నాం. ఈరోజు చతుర్థ స్కంధం – అధ్యాయాలు 24 నుండి 31ఆధారంగా శ్రీమద్భాగవతంలోనే అత్యంత విలక్షణమైన ఆధ్యాత్మిక రూపక కథ — పురంజనోపాఖ్యానం మరియు ప్రచేతసుల వృత్తాంతం తెలుసుకుందాం.


1. *ప్రచేతసులు & పరమశివుని 'రుద్ర గీత '*

పృథు చక్రవర్తి తపస్సుకు వెళ్ళిన తర్వాత విజితాశ్వుడు రాజు అయ్యాడు ఆయన గొప్పగా పాలన చేశాడు,ఆ తర్వాత ఆయన కుమారుడు హవిర్దానుడు పాలన చేశాడు ఈ హవీర్ధానునికి బర్హిషధుడు అని కుమారుడు ఈయన కర్మ కాండలు యోగ విద్యలలో గొప్ప నిపుణుడు అందువల్ల అతను ప్రజాపతి పదవి పొందాడు.


బర్హిషదుడు వరుసగా దేవయజ్ఞమును ఆచరించుచు కుశాగ్రములు(దర్భల కొనలు) తూర్పుదిక్కునకు ఉండునట్లు పరచెను. ఆ దర్భలతో ఆ ప్రదేశము పూర్తిగా నిండిపోయెను. అందువలన అతడు 'ప్రాచీనబర్హి' అను పేరుతో ప్రసిద్ధిగాంచెను.


ప్రాచీనబర్హి సముద్రుని కుమార్తెయైన శతద్రుతిని బ్రహ్మదేవుని ఆదేశముపై వివాహమాడెను ఆమె వలన ప్రాచీన బర్హికి పదిమంది కుమారులు జన్మించారు. వారిని 'ప్రచేతసులు' అంటారు. తండ్రి ఆజ్ఞ మేరకు సృష్టి విస్తరణ కోసం తపస్సు చేయడానికి వారు పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళారు.


వారు తపస్సు కు వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ప్రశాంతమైన ఒక మహా సరస్సు నుండి పరమశివుడు నారాయణ ధ్యానంలో బయటకు వచ్చాడు. ప్రచేతసులకు ప్రత్యక్షమై పరమశివుడు ఇలా అన్నాడు


 "ఎవరైతే శ్రీమహావిష్ణువును ఆశ్రయిస్తారో వారే నాకు అత్యంత ప్రియమైనవారు. భగవద్దర్శనం కోసం నేను మీకు ఒక దివ్యమైన స్తోత్రాన్ని ఉపదేశిస్తున్నాను. దీనిని 'రుద్ర గీత' అంటారు."


పరమశివుడు ప్రచేతసులకు రుద్రగీతను ఉపదేశించగా, వారు నీటిలో మునిగి దాన్ని జపిస్తూ పదివేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు.


2. నారద మహర్షి ఉపదేశం – ప్రాచీనబర్హికి వైరాగ్యం

అక్కడ ప్రచేతసులు తపస్సు చేస్తుంటే, ఇక్కడ వారి తండ్రి ప్రాచీనబర్హి నిరంతరం జంతువులను బలి ఇస్తూ వేలాది కర్మకాండ యజ్ఞాలు చేస్తూ మోహంలో పడిపోయాడు. ఆయనను ఉద్ధరించడానికి నారద మహర్షి వచ్చి: "రాజా! నీ యజ్ఞాలలో బలి అయిన జంతువులు పరలోకంలో నీ కోసం ఇనుప కొమ్ములతో వేచి ఉన్నాయి. కేవలం కర్మకాండల వల్ల చిత్తశుద్ధి రాదు. నీకు ఒక కథ చెబుతాను విను" అని పురంజనుడి కథను ప్రారంభించాడు.


**పురంజన కథ**


పూర్వం **పురంజనుడు** అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయనకి **అవిజ్ఞాతుడు** అనే ఒక అజ్ఞాత మిత్రుడు ఉండేవాడు. ఆయన చేష్టలు ఎవరికీ తెలియదు, కానీ ఆయన ఎప్పుడూ పురంజనుడి క్షేమాన్ని కోరుకుంటూ, వెంటే ఉంటూ రక్షిస్తూ ఉండేవాడు.


ఆ పురంజనుడు తాను నివసించుటకు అనువగు ఒక స్థలముకొరకు భూతలమునందు అంతటను వెదకెను. కాని సరియగు ప్రదేశము కనబడకపోవుటవలన అతడు ఎంతయు నిస్పృహకు లోనయ్యెను. అతడు అనేకవిధములగు భోగానుభవములకొరకై ఉవ్విళ్ళూరు


కాని, భోగానుభవములను పొందుటకై అతడు భూమండలమున నగరములను అన్నింటిని గాలించెను. ఐనను, వాటిలో ఏ ఒక్కటియు ఆయనకు నచ్చకుండెను. 


తన అన్వేషణలో భాగముగా అతడు హిమవత్పర్వతమునకు దక్షిణమునగల సానువులకు చేరెను. అచట ఆయనకు తొమ్మిది ద్వారములుగల ఒక నగరము కనబడెను. అది అన్నివిధములగు మంచి లక్షణములతో ఉన్నట్లు తోచెను.ఆ నగరం రత్నాలు వజ్రాల తో నిర్మించబడిన గోడలతో అద్భుతంగా విలసిల్లుతూ ఉంది. అక్కడి మృగాలు క్రూర స్వభావం విడిచి ఎలాంటి విరోధం లేకుండా అన్యోన్యంగా నివసిస్తూ ఉన్నాయి.


పురంజనుడు ఆ అందాలు ఆస్వాదిస్తూ అందులో తిరుగుతూ ఉండగా

ఆ నగరంలో పురంజనుడికి అనుకోకుండా వచ్చిన అత్యంత సౌందర్యవతియైన ఒక సుందరి (స్త్రీ) కనిపించింది. ఆమె చుట్టూ 11 మంది నమ్మకమైన కాపలాదారులు ఉన్నారు. ఆ సుందరిని చూసి మోహించిన పురంజనుడు ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ఆమె అంద చందాలకు దాసుడు అయి పూర్తిగా మొహం లో పడిపోయాడు.ఆ స్త్రీ కూడా పురందరునీ స్వీకరించింది ఇద్దరూ ఆ తొమ్మిది ద్వారాల నగరంలోనే నివాసం ఏర్పరచుకున్నాడు.


అలా కాలం గడిచి పోతూ ఉంది పురంజనుడు ఆ స్త్రీకి పూర్తిగా దాసుడైపోయాడు. ఆమె సంతోషిస్తే ఈయన సంతోషించేవాడు, ఆమె ఏడిస్తే ఈయన ఏడ్చేవాడు. ఆమె మోహంలో పడి తన నిజమైన ఆప్తమిత్రుడైన అవిజ్ఞాతుడిని పూర్తిగా మరచిపోయాడు. 


ఒకనాడు పురంజనునికి వేట మీద ఆసక్తి పుట్టింది వెంటనే ఐదు గుర్రాలు ఉన్న రథాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఒక్కరోజు కూడా మహారాణి నీ విడచి అతను వెళ్ళింది లేదు.కానీ ఆరోజు వేట యందు మక్కువ చేత వెళ్ళాడు. తీవ్రమైన తామసిక,అసురీ ప్రవ్రుత్తి చేత విచ్చల విడిగా దయలేని వాడి లా కనపడ్డ ప్రతి జంతువుని వేటాడాడు.అలా వేటాడి వేటాడి అలసిపోయి తిరిగి రాజ్యానికి వచ్చాడు. ఆకలి దప్పులు బాగా ఇబ్బంది పెట్టాయి వెంటనే స్నానాదులు చేసి ఆహారం భుజించాడు. అప్పుడు రాణి గారు గుర్తుకు వచ్చారు నాకు చెప్పకుండా వెళ్తావా అని అలక పూనారు, ఎంతో బతికాడు కున్నారు రాజుగారు ఇక విడిచి వెళ్ళను మాట తీసుకుని హాయిగా గడుపుతూ ఉన్నారు. ఇది రాత్రి ఇది పగలు అనే తేడా లేకుండా అలా గడిపేశారు భోగాలలో..


కాలక్రమేణా వారికి 1100 మంది పిల్లలు, మనుమలు పుట్టారు. వారి రక్షణ, లాలన, సంపాదన కోసమే పురంజనుడు తన జీవితాన్నంతా వ్యర్థం చేసుకున్నాడు.


భోగాలు, బాధ్యతలలో పడి అతను తన ఆత్మను ఉద్ధరించే కర్మలు అన్ని విడిచి పెట్టడు. వయస్సు మళ్లింది స్త్రీల యందు ఆసక్తి కలవారికి నచ్చని ముసలి తనం రానే వచ్చింది.అప్పుడు


ఒకరోజు ఆ నగరంపై **చండవేగుడు** అనే గంధర్వ రాజు 360 మంది నల్లని, 360 మంది తెల్లని సైనికులతో దాడి చేశాడు. వారితో పాటు **కాలకన్య** (ముసలితనం), ఆమె సోదరుడైన **భయుడు** (భయం), **ప్రజ్వారుడు** (జ్వరం/రోగం) ఆ నగరంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. అప్పుడు ఐదు పడగల పాంచాల సర్పం వారికి అడ్డుపడి వందేళ్లు తీవ్రముగా పోరాడింది. క్రమంగా దాని శక్తి కూడా క్షీణించి పోయింది.


అంతవరకు ఆ పాంచాలదేశంలోని తన దూతలు తీసుకువచ్చిన పన్నులతో భోగాలు అనుభవిస్తూ రాబోవు ప్రమాదాలు పసిగట్టలేదు 


అదే సమయంలో కాలుని కుమార్తె జర అనే కాలకన్య భర్త కోసం వెదుకుతూ ఉంది.ఈ జర కూడా పురంజన పురాన్ని ఆక్రమించింది. జర చేత ఆక్రమింప బడిన పురంజనుడు పూర్తిగా దైన్యుడు అయి

వారితో యుద్ధం చేయలేకపోయాడు. నగర ద్వారాలన్నీ ఒక్కొక్కటిగా పాడైపోయాయి. చివరికి **ప్రజ్వారుడు** ఆ నగరానికి నిప్పు పెట్టాడు. నగరం తగలేబడిపోతుంటే, శరీరం క్షీణిస్తుంటే... పురంజనుడు చివరి క్షణంలో కూడా భగవంతుణ్ణి తలచుకోలేదు. "అయ్యో! నేను చనిపోతే నా భార్య ఏమైపోతుందో, నా పిల్లలు ఎలా బతుకుతారో" అని తన భార్య ధ్యాసలోనే ప్రాణాలు వదిలాడు. అదే సమయంలో తాను జీవితం మొత్తం కేటాయించి ఎవరిని ఉద్దరించాలి అనుకున్నాడో వారు మాత్రం అతనికి తోడు రాలేదు.


ఇతను ఆమె ఆలోచనలతోనే చనిపోవడం వల్ల, తదుపరి జన్మలో ఆయన **వైదర్భి** అనే రాజకుమారిగా (స్త్రీగా) జన్మించాడు. వైదర్భికి వివాహమైంది. కొంతకాలానికి ఆమె భర్త కూడా మరణించాడు. ఆమె తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి, భర్త శవం దగ్గర ఏడుస్తూ ప్రాణత్యాగానికి సిద్ధపడింది.


అప్పుడు ఆ అడవికి ఒక **అజ్ఞాత బ్రాహ్మణుడు** వచ్చాడు. ఆయన మరెవరో కాదు... పురంజనుడి పాత మిత్రుడైన **అవిజ్ఞాతుడు**. ఆయన వచ్చి ఇలా అన్నాడు: *"అమ్మా! నీవు ఎవరు? నీ భర్త ఎవరు? గత జన్మలో నీవు పురంజనుడివి. నేను నీ ఆత్మమిత్రుడిని. నీవు ఈ శరీరం కావు, పంజరంలో చిలకలా ఈ శరీరంలో బంధించబడ్డావు. నన్ను గుర్తుపట్టు!"*


ఆ ఉపదేశంతో వైదర్భికి జ్ఞానోదయం అయి, తన నిజరూపాన్ని తెలుసుకుని ముక్తిని పొందింది.


-*ఆధ్యాత్మిక అంతరార్థం (పరమార్థం)*


ఈ కథ కేవలం ఒక రాజు కథ కాదు, ప్రతి ఒక్క మానవుడి జీవిత సత్యం. ఇందులో ఉన్న పాత్రలు, స్థలాల వెనుక ఉన్న ఆంతర్యం ఇది:


* **పురంజనుడు = జీవుడు (మనలోని ఆత్మ / జీవాత్మ):** సంసారంలో కొట్టుమిట్టాడే ప్రతి మానవుడికి ఇది సంకేతం.

* **అవిజ్ఞాతుడు = పరమాత్మ (భగవంతుడు):** మనలోని అంతరాత్మ. మనం ఆయనను గుర్తించలేము (అవిజ్ఞాత), కానీ ఆయన ఎప్పుడూ మన వెంటే ఉంటాడు.

* ** తొమ్మిది ద్వారాల నగరం = మానవ శరీరం:** మన శరీరానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి (రెండు కళ్లు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు, నోరు, రెండు విసర్జన అవయవాలు).


* **సుందరి (స్త్రీ) = బుద్ధి:** జీవుడు తన బుద్ధి చెప్పినట్లు వింటూ మోహంలో పడతాడు.


* **11 మంది కాపలాదారులు = ఇంద్రియాలు & మనస్సు:** 5 జ్ఞానేంద్రియాలు + 5 కర్మేంద్రియాలు + 1 మనస్సు.


* **పిల్లలు & మనుమలు = కోరికలు & కర్మలు:** ఇంద్రియ సుఖాల వల్ల పుట్టే అపరిమితమైన కోరికలు, పాపపుణ్యాలు.


* **చండవేగుడు & 360/360 సైనికులు = కాలం (సమయం):** 360 పగళ్లు, 360 రాత్రులు ఉన్న ఒక సంవత్సరం. కాలం మన ఆయుష్షును కరిగిస్తోంది.


* **కాలకన్య, భయుడు, ప్రజ్వారుడు = వృద్ధాప్యం, భయం, రోగాలు:** ముసలితనం వచ్చి శరీరం అనే నగరాన్ని క్షీణింపజేస్తుంది.


* **నగరానికి నిప్పు పెట్టడం = మరణ సమయం:** రోగాలు, తీవ్రమైన బాధతో శరీరం నశించడం.


* **స్త్రీగా పుట్టడం = పునర్జన్మ:** *"యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్"* (భగవద్గీత) — చనిపోయేటప్పుడు దేని గురించి ఆలోచిస్తే మరుసటి జన్మలో అదే రూపాన్ని ఎత్తుతారు. మోహంలో ఉంటే మళ్లీ జన్మలు తప్పవు.


* **అజ్ఞాత బ్రాహ్మణుడి ఉపదేశం = గురుకృప / జ్ఞానోదయం:** బ్రాహ్మణుని రూపంలో వచ్చిన భగవంతుడే "నీవు ఈ శరీరం కావు, ఆత్మవు" అని జ్ఞానోదయం కలిగించి ముక్తిని ప్రసాదిస్తాడు.


సారాంశం: జీవుడు బుద్ధికి, ఇంద్రియాలకు లొంగిపోయి తనను తాను దేహంగా భావించి నరక-స్వర్గాల మధ్య తిరుగుతుంటాడు. కానీ అంతర్యామియైన పరమాత్మను గుర్తించిన నాడు మోక్షాన్ని పొందుతాడు.


అని నారదుడు చేసిన ఆత్మ బోధతో ప్రాచీనబర్హి కర్మకాండలను విడిచిపెట్టి, కపిలాశ్రమానికి వెళ్లి భగవద్భక్తిలో ముక్తి పొందాడు.


5. ప్రచేతసుల భగవద్దర్శనం

నీటి అడుగున ప్రచేతసులు చేసిన రుద్రగీతా జపానికి ప్రసన్నుడై శ్రీమహావిష్ణువు దివ్యరూపంతో ప్రత్యక్షమయ్యాడు.


 * శ్రీహరి అనుగ్రహం: "ప్రచేతసులారా! పరమశివుడు ఉపదేశించిన స్తోత్రంతో నన్ను పూజించినందుకు ఆనందించాను. మీరు కండూ మహర్షి కుమార్తె అయిన 'మార్ష'ను వివాహం చేసుకుని సృష్టిని విస్తరించండి. మీ వంశంలో గొప్ప భాగవతోత్తముడు జన్మిస్తాడు" అని వరమిచ్చాడు.


 * దక్షుని పునర్జన్మ: ప్రచేతసులకు, మార్షకు 'దక్ష ప్రజాపతి' జన్మించాడు. (గతంలో దక్షయజ్ఞంలో మరణించిన దక్షుడు, పరమశివుని అనుగ్రహంతో ఈ జన్మలో ప్రచేతసుల కుమారుడిగా జన్మించి సృష్టి కార్యంలో నిమగ్నమయ్యాడు).


ప్రచేతసులు తమ రాజ్యపాలన ముగిశాక నారద మహర్షిని దర్శించుకుని, ఆయన వద్ద భాగవత ధర్మాలు విని, యోగమార్గంలో పరమపదాన్ని పొందారు.


📝 నేటి ముఖ్య విషయాలు:

 * రూపక కథ విశిష్టత: సంసార బంధంలో చిక్కుకున్న జీవుడి మానసిక స్థితిని ప్రతిబింబించే అత్యుత్తమ తత్త్వ శాస్త్రం పురంజనోపాఖ్యానం.


 * రుద్రగీతా మహత్యం: పరమశివుడు స్వయంగా ఉపదేశించిన రుద్రగీత శ్రీహరి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత శక్తివంతమైన సాధనం.


 * కర్మకాండల పరిమితి: కేవలం యజ్ఞాలు, బలుల వల్ల శాశ్వత శాంతి లభించదు; అంతర్ముఖ భగవద్భక్తి మాత్రమే జీవునికి ముక్తిని ఇస్తుంది.


(రేపటి రోజు 13 లో: పంచమ స్కంధ ప్రవేశం – ప్రియవ్రతుని చరిత్ర, ఋషభదేవుని అవతారం & ఆయన తన వందమంది కుమారులకు చేసిన పరమహంస ధర్మ ఉపదేశం (ముక్తి మార్గం) తెలుసుకుందాం!)


.....సశేషం🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

కామెంట్‌లు లేవు: