*మంగళవారం 4 ఆగస్టు 2026*
*శ్రీమద్భాగవతం - 11/42*
*పృథు చక్రవర్తి చరిత్ర*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
మన భాగవత అధ్యయనం లో భాగంగా
నిన్నటి రోజున ధ్రువుని బాల్యం, చిన్నమ్మ సురుచి పరుషోక్తులు, నారద మంత్రోపదేశం, సుమధుర తపస్సు మరియు అచలమైన ధ్రువ పదాన్ని పొందడం గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈరోజు **చతుర్థ స్కంధం – అధ్యాయాలు 13 నుండి 23**ఆధారంగా శ్రీమహావిష్ణువు అవతారమైన **పృథు చక్రవర్తి అవతారం గురించి, భూదేవిని గోవుగా మలచి సమస్త రసాలను, సంపదలను పిండడం మరియు పృథురాజ యజ్ఞాల విశేషాలు**శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహించిన మేరకు తెలుసుకుందాం.
1. వేనరాజు అధర్మ పాలన & మునుల శాపం (4వ స్కంధం – 13, 14 అధ్యాయాలు)
ధ్రువుని వంశంలో 'అంగుడు' అనే ధర్మాత్ముడైన రాజుకు **'వేనుడు'** అనే పుత్రుడు జన్మించాడు. వేనుడికి తల్లి వైపు నుండి అధర్మ గుణాలు అబ్బాయి(తల్లి గారి తండ్రి అధర్మాంశ అయిన మృత్యువు). తండ్రి అయిన అంగుడు ఎంత ప్రయత్నం చేసినా అతడు దారిలోకి రాకపోవడంతో, వేనుడి ప్రవర్తనకు విరక్తి చెంది ఎవరికీ చెప్పకుండా అడవులకు వెళ్లిపోయాడు.
ప్రజాపాలన కోసం మహర్షులు వేనుడికి పట్టాభిషేకం చేశారు. కానీ అధికార మదంతో వేనుడు తీవ్రమైన అహంకారిగా మారాడు:
* రాజ్యంలో యజ్ఞయాగాదులు, దానధర్మాలు, హరిపూజలు పూర్తిగా నిషేధించాడు.
* "నేనే పరమేశ్వరుడిని, నాకే పూజలు చేయాలి" అని చాటింపు వేయించాడు.
మహర్షులు ఎంత హితవు చెప్పినా వేనుడు వినకపోగా, వారిని అతి ఘోరంగా,తీవ్రముగా అవమానించాడు. దాంతో మునులు ధర్మ రక్షణ, ప్రజల క్షేమం కోసం తమ తపోబలంతో **"హుంకారం"** చేసి వేనుడిని సంహరించారు.
2. *పృథు చక్రవర్తి ఆవిర్భావం*
కానీ రాజు లేకపోవడంతో రాజ్యంలో అరాచకం, చోరభయం ఎక్కువయ్యాయి. దాంతో మహర్షులు మళ్ళీ ఎంతో దిగులు చెందారు.
అంగరాజు గారి వంశం ఎంతో పవిత్రమైనది, వారంతా సాక్షాత్ శ్రీహరి అనుగ్రహం పొందిన మహానుభావులు అది అంతం కాకుడదు,ఏదో ఉపాయం చేత తిరిగి పునరుద్ధరించాలి అని నిర్ణయం తీసుకుని. మృతుడైన వేనుడి ఒక తోడను బాగా మధించారు .
1. అప్పుడు వేనుడి ఒక తొడ నుండి నల్లటి రూపంతో, కురచ శరీరంతో అధర్మ స్వరూపుడైన **'నిషాదుడు'** జన్మించాడు. జన్మిస్తూనే నేను ఏమి చేయాలి అని మునులను అడిగాడు, ఋషులు నిశీధ అంటే కూర్చో అన్నారు.ఆ కారణంగా అతడు నిషాదుడు అని పిలవబడ్డాడు. అతను పుట్టుకతోనే వేణుని క్రూరత్వానికి వారసుడు అయ్యాడు,వారు గ్రామ పట్టణాల్లో నివసింపక అడవులకు వెళ్లి నిషాద (బోయ) వంశానికి మూలపురుషుడయ్యాడు. అతని వంశం వారినే నైషధులు అంటారు.
2. అనంతరం వేనుడి చేతులను మథించగా, అందులో ఒక భుజం నిండు నుండి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దివ్యాంశతో, శంఖ చక్ర రేఖలు కలిగిన చేతులతో **'పృథు చక్రవర్తి'** ఆవిర్భవించాడు! ఆయనతో పాటు మరో చేతి నుండి ఆయన ధర్మపత్నిగా 'అర్చి' అనే దేవి కూడా ఉద్భవించింది.
దేవతలు, మహర్షులు ఆనందించి ఇతను మున్ముందు గొప్ప మహారాజు అవుతాడు, అతని యశస్సు జగద్వ్యాప్తం అవుతుంది.మహా ప్రభువులలోనే అగ్రగణ్యుడు అవుతాడు అన్నారు.ఆ సమయంలో దేవ దుందుభులు మోగాయి. పృథువు అని పేరు పెట్టారు. ఆ మహారాజుకు చేతిలో శంఖ చక్రం చిహ్నాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఋషులు పృథువుకు పట్టాభిషేకం చేసి, అనేక దివ్య ఆయుధాలను, రథాన్ని బహుకరించారు.
3. భూదేవిని గోవుగా మలచి ధాన్యాలు పిండడం (17, 18 అధ్యాయాలు)
వేనుడి పాలనలో యజ్ఞాలు ఆగిపోవడం వల్ల భూదేవి సమస్త ఓషధులను, ధాన్యాలను తన కుక్షిలో (కడుపులో) దాచుకుంది. దీనివల్ల రాజ్యంలో తీవ్రమైన క్షామం (కరువు) వచ్చి ప్రజలు ఆకలితో అలమటించసాగారు.
* **పృథువు ఆగ్రహం:** ప్రజల ఆకలి కేకలు విన్న పృథు చక్రవర్తి ధనుర్బాణాలు ధరించి, భూదేవిపైకి దండయాత్రకు సిద్ధమయ్యాడు.
* **భూదేవి శరణాగతి:** భూదేవి భయపడి **గోవు (ఆవు)** రూపాన్ని ధరించి పారిపోగా, పృథువు ఆమెను వెంటాడాడు. చివరకు భూదేవి పృథువును శరణువేడి ఇలా అంది:
"రాజా! వేనుడి వంటి అధర్మాత్ములు ధాన్యాన్ని దుర్వినియోగం చేస్తారని నేను ఓషధులను కడుపులో దాచుకున్నాను.
అనుభవజ్ఞులైన పెద్దలు బాగుగా ఆలోచించి, తెలిపిన శాస్త్రీయ *విధానముల యెడ ఆదరము చూపక అజ్ఞానియగు మానవుడు తాను స్వయముగా కల్పించుకొనిన ఉపాయములను ఆశ్రయించినచో, అవి శాశ్వతముగా సత్ఫలితములను ఇయ్యజాలవు. వాటికై మరలమరల కృషి చేసినను ఫలితము ఉండదు.
నరేంద్రా! సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు సకలజనుల శ్రేయోభివృద్ధికై ధాన్యాది వనస్పతులను సృజించెను. కాని వాటిని అందరికిని అందుబాటులో ఉండనీయక స్వార్థపరులైన దుష్టులు అనుభవించుచున్నారు. ఇది నేను స్వయముగా గమనించితిని.
ప్రజలకు ఉపయోగపడవలసిన పైరుపంటలను దుర్మార్గులు దొంగలవలె దోచుకొనుచున్నారు. అందువలన సమస్త ప్రజల క్షేమముకొరకై వాటిని (ఆ ఓషధులను) నాలో దాచుకొంటిని (పాలకులు ఆహారధాన్యాదులను ప్రజలందరికిని అందించుటకై సరియగు వ్యవస్థను నడపనిచో స్వార్థపరులు దొంగలై వాటిని దోచుకొందురు .
చాలా కాలము గడచిపోవుటతో ఆ ధాన్యాదులు నాలో జీర్ణమైపోయినవి.
నన్ను సంహరిస్తే ప్రజలకు ఆధారం ఉండదు. నన్ను చంపక, ఒక దూడను నిలిపి, సమస్త లోకాలకు ఏది కావాలో దానిని నా నుండి పిండుకో!"
* **భూమిని సమం చేయడం & పిండడం:**
పృథు చక్రవర్తి **స్వాయంభువ మనువును దూడగా చేసి**, తన చేతులనే పాత్ర గామార్చి భూమి అనే గోవు నుండి సమస్త ధాన్యాలను, ఓషధులను పితికాడు.
* **మహర్షులు:** బృహస్పతిని దూడగా చేసి వేదాలను, తపస్సును పితికారు.
* **దేవతలు:** ఇంద్రుడిని దూడగా చేసి అమృతాన్ని, వీర్యాన్ని పితికారు.
* **దైత్యులు/రాక్షసులు:** ప్రహ్లాదుడిని దూడగా చేసి మద్యాన్ని, రక్తాన్ని పితికారు.
* **నాగులు:** తక్షకుడిని దూడగా చేసి విషాన్ని పితికారు.
*గంధర్వులు**విశ్వావసుడు అనే గంధర్వునీ దూడగా చేసుకొని పద్మరూప పాత్ర యందు సంగీతం,వాఙ్మయం, సౌందర్యం అనే వాటిని పిండారు.(ఇంకా చాలా చెప్పబడ్డాయి విస్తార భీతి చేత ముఖ్యమైన వి అందించాను.)
అనంతరం పృథు చక్రవర్తి తన ధనుస్సు కొనతో పర్వతాలను పిండి చేసి, భూమిని సమతలం చేసి మానవ నివాసాలకు, వ్యవసాయానికి అనువుగా మార్చాడు. పృథు మహారాజుకి ముందు ప్రజలు తోచిన స్థలం లో నివసించేవారు కానీ, భూమిని చదును చేసి పట్టణ, నగర వ్యవస్థలు ఏర్పాటు చేశాడు.భూదేవిని తన పుత్రికగా స్వీకరించాడు. అందుకే భూమికి **'పృథ్వి'** అనే పేరు వచ్చింది!
4. వంద అశ్వమేధ యజ్ఞాలు & ఇంద్రుని గర్వభంగం (19, 20 అధ్యాయాలు)
పృథు చక్రవర్తి బ్రహ్మావర్తంలో వంద (100) అశ్వమేధ యజ్ఞాలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటికే 100 యజ్ఞాలు చేసిన ఇంద్రుడు, పృథువు తన పదవిని ఆక్రమిస్తాడేమోనని ఈర్ష్య పడ్డాడు.99 యజ్ఞాలు దిగ్విజయంగా పూర్తి చేసాడు కానీ వందవ యజ్ఞంలో.
* **అశ్వాపహరణం:** ఇంద్రుడు సన్యాసి వేషంలో వచ్చి యజ్ఞ అశ్వాన్ని (గుర్రాన్ని) దొంగిలించి పారిపోయాడు. పృథువు కుమారుడైన 'జితాశ్వుడు' ఇంద్రుడిని వెంటాడి గుర్రాన్ని తిరిగి తెచ్చాడు. ఇంద్రుడు మళ్లీ మళ్లీ గుర్రాన్ని అపహరించాడు.
* **పృథువు శాంతి:** పృథువు కోపంతో ఇంద్రుడిని యజ్ఞాగ్నిలో ఆహుతి చేయడానికి సిద్ధపడగా, బ్రహ్మదేవుడు వచ్చి: "పృథురాజా! నీకు ఇంద్రపదవితో పనిలేదు. 99 యజ్ఞాలతోనే నిలిపివేయి" అని నచ్చచెప్పి.పితృదేవతలు, దేవతలు, ఋషులు మానవులు మొదలగువారు పెక్కుమంది నీ ఆహ్వానమును అందుకొని యజ్ఞమునకు విచ్చేసిరి. వారిని అందరిని చక్కగా పూజించి, దానములతో, బహుమతులతో సత్కరించు అన్నారు అలాగే చేశాడు.నీకు శుభమగుగాక!” అని ఆశీర్వదిచారు.
* **శ్రీహరి ప్రత్యక్షం:** పృథువు యజ్ఞాన్ని నిలిపివేయగానే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఇంద్రుడితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహా విష్ణువు సనక సనందన ఋషులు నీకు ఆత్మజ్ఞాన బోధ చేస్తారు అని చెప్తాడు.(ఇక్కడ రాజ ధర్మాలు అనేకం చెప్తాడు శ్రీమహా విష్ణువు)
ఇంద్రుడు పృథువు పాదాలపై పడి క్షమాపణ కోరాడు. పృథువు ఇంద్రుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు.
5. సనత్కుమారుల బోధ & పృథువు నిర్యాణం (21, 22, 23 అధ్యాయాలు)
యజ్ఞవాటికకు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు వేంచేయగా పృథువు వారిని పూజించాడు.వారు
పూర్వకర్మల వాసనలు అన్నియును కలిసి జీవునకు అహంకారరూపమగు గ్రంథిగా ఏర్పడును. సత్పురుషులు వాసుదేవుని చరణకమలముల వ్రేళ్ళనుండి ప్రసరించెడు కాంతులను స్మరించి, అనన్యభక్తిని చేయుదురు. దాని ప్రభావమువలన ఆ అహంకారరూపమగు గ్రంథిని సునాయాసముగా విప్పుకొని కృతకృత్యులు అగుచున్నారు.
కాని, యోగాభ్యాసపరులు ఇంద్రియములను నిరోధించి అంతఃకరణవృత్తులను నిలిపివేసిన సమాధిస్థితిలో కూడా అంత తేలికగా వారు అహంకారముడిని విప్పలేకపోయెదరు. అట్టి వాసుదేవుని నీవు శరణుగోరి చక్కగా సేవింపుము.
భగవంతుని ఆశ్రయింపనివారు ‘మనస్సు పంచేంద్రియములు' అనెడి ఆరు మొసళ్లతో నిండిన సంసార సాగరమును దాటుట యోగాభ్యాసాదులద్వారా గూడ కష్టసాధ్యము. కనుక, నీవు సులభముగా ఆరాధింపదగిన భగవంతుడైన శ్రీహరియొక్క పాదపద్మములనెడి నౌకను ఆశ్రయించి దుస్తరమైన భవసాగరమును దాటుము”. అని సనత్కుమారులు పృథువుకు పరమ ఆత్మజ్ఞానాన్ని, భగవద్భక్తి మహత్యాన్ని ఉపదేశించారు.
ఆ తదుపరి పరిపూర్ణమైన ధర్మపాలన చేసి పృథు చక్రవర్తి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి, తన ప్రజలకు దివ్యమైన సుదీర్ఘమైన సందేశం ఇచ్చి భార్య అర్చితో కలిసి అడవులకు వెళ్లి తీవ్రమైన తపస్సు చేశాడు. యోగమార్గంలో దేహాన్ని విడిచి పరమపదాన్ని పొందాడు. పృథువు వెంటే అర్చీదేవి కూడా సహగమనం చేసి దివ్యలోకాలను చేరుకుంది.
ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠుడైన పృథుమహారాజు వైకుంఠమును పొందెను. మహారాణియైన అర్చియు అంతటి పుణ్యాత్మురాలే. ఆమె అమరభామినుల స్తుతులను అందుకొనుచు తన పతిదేవుడు చేరిన పరమపదమును పొందెను.
విదుర! పృథుమహారాజు పరమభాగవతోత్తముడు, అలౌకిక ప్రభావశాలి. ఉదారచరితుడు. అట్టి మహాత్ముని చరితమును నీ అభ్యర్థనపై నేను వివరించితిని. ఈ వృత్తాంతము పరమపవిత్రమైనది. ఏకాగ్రచిత్తులై నిష్కామభావముతో దీనిని పఠించినవారు, వినిపించినవారు, వినువారుకూడ పృథుమహారాజు చేరిన పరమపదమును పొందుదురు.
ఈ పునీతచరితమును సాదరముగా ముమ్మారు వినిన స్త్రీలుగాని, పురుషులుగాని ధన్యతను పొందుదురు. సంతానము లేనివారు ఉత్తమ సంతానముతో వర్ధిల్లుదురు. నిర్ధనులు గొప్ప సంపన్నులగుదురు.ప్రసిద్ధులు కానివారు యశోవైభవములతో తేజరిల్లుదురు. పామరులు పండితులగుదురు. ఈ వృత్తాంతము మానవాళికి అభ్యుదయములను చేకూర్చును. అశుభములను పారద్రోలును.
ఈ దివ్యగాథ ధనధాన్యములను ఇచ్చును. కీర్తిప్రతిష్ఠలను పెంపొందించును. ఆయురారోగ్యములను వృద్ధిపరచును. కలియుగ దోషములను నిర్మూలించును.అని పృథు మహారాజు గారి వృత్తాంతం పూర్తి చేశాడు మైత్రేయ మహర్షి.
📝 నేటి ముఖ్య విషయాలు:
1. **పృథువు – పర్యావరణ పరిరక్షణ:** భూమిని సమతలం చేయడం, వ్యవసాయం, నివాస ప్రాంతాల ఏర్పాటుకు మూలపురుషుడు పృథు చక్రవర్తి.
2. **అహంకార రహిత శక్తి:** 100వ యజ్ఞం పూర్తి కాకపోయినా, భగవంతుని ఆజ్ఞకు లొంగి ఇంద్రుడిని క్షమించడమే పృథువు మహోన్నత వైష్ణవ గుణం.
3. **ప్రజాపాలన ముఖ్యం:** రాజు లేదా పాలకుడు ప్రణాళికాబద్ధంగా సంపదను సృష్టించి ప్రజల ఆకలిని తీర్చడమే ఉత్తమ పాలన అని పృథు చరిత్ర ప్రబోధిస్తుంది.
రేపటిరోజు చతుర్థ స్కంధ ముగింపు – ప్రచేతసుల వృత్తాంతం & జీవుడు, దేహం, మాయల అంతరార్థం కలిగిన అత్యద్భుత రూపక కథ "పురంజనోపాఖ్యానం" యథాతథంగా తెలుసుకుందాం!
...🌹🙏🌹
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి