21, ఆగస్టు 2024, బుధవారం

దాన విశిష్ఠత !



దాన  విశిష్ఠత !


             ఉ:  దాన కళా కలాప  సముదంచిత  సార వివేక  సంపదన్


                   మానిత  యాచమాన  జనమానస  వృత్సభిపూర్తి బుధ్ధి  యె


                   వ్వానికి  లేదొకింతయును  వాడొకరుండు  భరంబు ధాత్రికిన్,


                  కానలుగారు , వృక్షములుగారు  నగంబులు  గారు  భారముల్; 


శృంగార నైషథము--శ్రీనాథమహాకవి.


భావము:  దానంచేయటం ఒక  కళ.  దాని విశిష్ఠతను  తెలిసికొని  ,మాన నీయులైన  యాచకజన  మనోరథములను  తీర్చెడి

కుతూహలము  యెవనికి లేదో  ఈపుడమికి  వాడొక్కడే  భారము.


                       అడవులుగాని , వృక్షములుగానీ , పర్వతములు  గానీ , భారములుగావు.


      విశేషాంశములు: దానకళా విజ్ఙాన వంతుడే  దానంచేయగలడు. దానం చేయటానికిముందు యాచకుని యోగ్యతనుగుర్తించి,తదుచితమైన దానంచేయాలి.అది  కష్టసాధ్యమైనవిషయమే!. దాత ముందుగా ఆవివేకాన్ని  సంపాదించాలట.

యాచకులను హీనులుగా చూడరాదు.వారుపుడమికిసందేశహారులట!ఏమిటాసందేశం?"ఎన్నడూ యెవరికీ యేమీ పెట్టనివానిబ్రతుకు మాబ్రతుకులాగేఉంటుంది.దానంచేనిన వారిజీవితం మీలాగేహాయిగాఉంటుంది"- అని; అందువలనవారిని  గౌరవనీయులుగా భావించాలి. వారి  మనసెరిగి  దానంచేయాలి. అరకొర దానం చేయరాదు. అలాంటి  ఉత్తముడే దాత అతడు పుడమికి  అలంకారం. తక్కినవారు (లోభులు ) భూమికి బరువని కవియభిప్రాయం.

పర్వతాదులు గూడా భూమికి భారము కాదని  భావము.🙏🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌾🌷🌷🌷🌷🌷🌾🌷🌷🌷🌷🌷🌷

ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు -

 ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు  - 


 *  ఆరోగ్యం , శరీరపుష్టి , రోగము , కృశత్వము , బలము , శరీర బలహీనత , పురుషత్వము , నపుంసకత్వం , జ్ఞానము , అజ్ఞానము , జీవితము , మరణము ఇవన్నియు నిద్రకు అధీనములై ఉన్నవి. అనగా నిద్రపైన ఆధారపడి ఉన్నవని అర్థం.


 *  నిద్రించుటకు రాత్రియే సరైన సమయము . రాత్రి సమయము నందు 6 లేక 9 గంటల కాలం నిద్రించవలెను. కాలాన్ని అతిక్రమించక నిద్రించవలెను. ఒకవేళ రాత్రి సమయము నందు జాగరణ చేయవలసి వచ్చినచో అట్టి జాగరణ ఎంత సమయం చేసినారో అందు సగం సమయం భోజనమునకు పూర్వము నందే ప్రాతఃకాలము నందే నిద్రించవలెను.


 *  రాత్రి సమయము నందు ఎక్కువ కాలం జాగరణ చేసినచో శరీరం నందు రూక్షగుణం ఎక్కువై వాతరోగములు కలుగును.


 *  వృద్దులు , బాలురు , బలహీనులు , ధాతుక్షయం కలవారు , శ్వాస , హిక్కా , అతిసారం , దెబ్బలు తగిలినవారు , శూల , దప్పి , అజీర్ణం , ఉన్మాదం రోగములు కలవారు , అధికంగా మాట్లాడుట , ఆయాసం కలిగించు పనులు , గుర్రము , ఒంటె మొదలగువానిపై స్వారి చేయుట , మార్గగమనము , మద్యములు తాగుట , సంభోగం చేసినవారు , భయం , కోపం , శోకములచే శ్రమ పొందినవారు , ప్రతిదినం మధ్యాహ్నం నిద్రించుట అలవాటుగా గలవారు పగలు నిద్రించవచ్చు. అందువలన దోష , ధాతు సమానత కలుగును.


 *  ఎక్కువైన మేథస్సు , కఫం కలిగినవారు , గట్టిగా ఉండు ఆహారం తీసుకున్నవారు ఎప్పుడూ పగలు నిద్రించకూడదు. ఇటువంటివారు గ్రీష్మకాలం నందు కూడా నిద్రించరాదు . విషపీడితుడు , కంటరోగం కలవాడు రాత్రులయందు కూడా నిద్రించరాదు .


 *  ఆకాలంలో నిద్రించుచున్న ఆరోగ్యమును , ఆయువును నశింపచేయుటయే గాక మోహము , జ్వరం , పీనస , శిరోరగము , వాపు , మూత్రబంధనం వంటిరోగాలు కలుగును.


 *  నిద్రయొక్క వేగమును ఆపుట వలన మోహము , తలబరువు , కండ్లునొప్పులు , సోమరితనం , ఆవలింతలు , శరీరం బరువు పెరగటం వంటివి కలుగును. ఇట్టి స్థితి యందు శరీరమర్ధనం , శరీర అంగములు పిసుకుట , నిద్రించుట చేయవలెను .


 *  రాత్రినిద్ర తక్కువైనచో అట్టికాలములో మరురోజు ఉదయమున భోజనం చేయకుండా నిద్రించవలెను . రాత్రియందు సక్రమముగా నిద్రపట్టనివారు క్షీరము , మద్యము , మాంసరసము , పెరుగు వీనిని తాగవలెను . అభ్యంగనం , స్నానం మొదలగునవి ఆచరించవలెను.


 *  నిద్రించునప్పుడు నిద్రాభంగము కలిగినచో బడలిక , సోమరితనం , తలబరువు , ఆవలింతలు , ఒళ్ళు నొప్పులు , బడలికగా ఉండటం , పనుల యందు ఇష్టం లేకుండా ఉండటం , భ్రమ , అజీర్ణం , వాతరోగములు కలుగును.


 *  కూర్చుండి నిద్రపోయినచో కఫవృద్ధి , ఆరోగ్యభంగం కలుగదు .


         మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కనిపించని బంధాలేవో

 ఒక  వ్యక్తి  తన మూడు గాడిదలను అమ్మేయడానికి అంగడికి తీసుకెళ్తున్నాడు... మార్గమధ్యంలో ఓ నది కనిపించింది... అసలే నడిచీ నడిచీ ఒళ్లంతా చెమట చిటచిట... స్నానం చేస్తే పుణ్యం, శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు...


ఆ గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర రెండే తాళ్లున్నాయి... మరి మూడో గాడిదను కట్టేయడం ఎలా..?


ఓ సన్యాసి అలా నడిచిపోతున్నాడు... తనను పిలిచాడు... స్వామీ, నీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా...? కాసేపు నా గాడిదను కట్టేస్తా, నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా...


నా దగ్గర తాడు లేదు కానీ ఓ ఉపాయం చెబుతాను అన్నాడు ఆ సాధువు...


నీ దగ్గర ఉన్న తాళ్లతో ఆ రెండు గాడిదలను కట్టెయ్... మూడోది చూస్తూనే ఉంటుంది... తరువాత దీని వెనక్కి వెళ్లి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టు నటించు...


సాధువు చెప్పినట్టే చేశాడు... నదీస్నానం పూర్తిచేశాడు... వెనక్కి వచ్చి ఆ రెండు గాడిదల కట్లు విప్పేశాడు... అదిలించాడు, తను ముందు నడుస్తున్నాడు... కాసేపయ్యాక చూస్తే రెండు తనతో వస్తున్నాయి కానీ మూడో గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు... అక్కడే ఉండిపోయింది...


తట్టాడు, కొట్టాడు, తిట్టాడు... ఊహూఁ... ఫలితం లేదు... అటూఇటూ చూస్తుంటే అదే సాధువు కనిపించాడు... స్వామీ, స్వామీ, ఇది మొరాయిస్తోంది, కదలనంటోంది...


అసలు నువ్వు కట్లు విప్పితే కదా, అది కదిలేది... అన్నాడు సాధువు...


అసలు నేను కట్టేస్తే కదా విప్పేదిా... అంటాడు రైతు...


అవునోయీ, అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ గాడిదకు తెలియదు కదా... తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తోంది...


అయ్యో, మరేం చేయాలిప్పుడు..?


కట్లు విప్పితే సరి... కదులుతుంది...


అసలు కట్టేస్తే కదా... విప్పేది...


పిచ్చోడా... కట్టేసినట్టు ఎలా నటించావో, విప్పేసినట్టు కూడా నటించవోయ్...


అతను అలాగే చేశాడు... గాడిద ముందుకు కదిలింది, మిగతా రెండింటితో కలిసింది... రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు...


‘‘మనుషులు కూడా అంతేనోయ్... కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం... కదలం, ఉన్నచోటు వదలం... నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు... అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు... ప్రపంచమంతా నీదే...


అర్థమయ్యీ కానట్టుగా ఉంది... అవును, మరి తత్వం, సత్యం ఎప్పుడూ సంపూర్ణంగా అర్థం కావుగా... అతను కాసేపు బుర్ర గోక్కున్నాడు... సాధువుకు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు... 💐


*🙏 కృష్ణం వందే జగద్గురుమ్🙏🏻

శుభోదయం 🌹🕉️🌹Goodmorning

దేవాలయాలు - పూజలు 17*

 *దేవాలయాలు - పూజలు 17*

సభ్యులకు నమస్కారములు.


*ప్రదక్షిణ (2)*

(పురాణ గాథ)


గణాధిపత్య షరతులతో 

శ్రీమహా గణపతి యుక్తిగా జననీ జనకులైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల ప్రదక్షిణ చేసి ఉన్న చోటనే ఈశ్వర ప్రదక్షిణ ద్వారా భూ ప్రదక్షిణ గావించిన ఫలితం పొందాడు.  


ప్రదక్షిణ లోని కొన్ని విధానాలను పరిశీలిద్దాము.

 1) ఆత్మ ప్రదక్షిణ

 2) పాద ప్రదక్షిణ 

3) దండ ప్రదక్షిణ 

4) అంగ ప్రదక్షిణ 

5) గిరి ప్రదక్షిణ.


ఈ *సదాచారము* దేవాలయాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇంకా కొందరు మహానుభావులు అశ్వత్థ ప్రదక్షిణ, భూ ప్రదక్షిణ, కుల శైల ప్రదక్షిణ ,తులసీ ప్రదక్షిణ మరియు గో ప్రదక్షిణలు గూడా చేస్తూ ఉంటారు. 


తండ్రికి, గురువుకు మరియు తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదానికంటే ఒకటి దశోత్తరమైన 

(పది రెట్లు అధికము) ఫలితాలనిస్తాయి.  

బ్రహ్మ చర్యం పాటించే వారికి, గృహస్థులకు మరియు సన్యసించిన వారికి ప్రదక్షిణలు వేర్వేరుగా ఉంటాయి. 


*ప్రదక్షిణ ఫలితాలు*  మొదటి ప్రదక్షిణ బ్రహ్మ హత్య లాంటి పాపాలను గూడా హరిస్తుంది. రెండవ ప్రదక్షిణ ఆరాధకుడిని అధికారిగా చేస్తుంది అంటే భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలకు అర్హత కల్గిస్తుంది. మూడవ ప్రదక్షిణ నైంద్ర సంపద సమకూరుస్తుంది అనగా జీవిత అంతంలో =  చివరి విముక్తిలో ఆనందం పొందుపరుస్తుంది. *ఇంకొక భావన* మొదటి ప్రదక్షిణలో  *తమో గుణం*, రెండవ ప్రదక్షిణలో *రజో గుణం*, మూడవ సారి *సత్వ గుణం* అనగా మనలో ఉన్న త్రిగుణాలను భగవంతునికి అర్పించి ఒక్కొక్క గుణం నుండి విముక్తి పొంది పరి శుద్ధాత్ములము కావడానికి సహకరిస్తుంది. సాధారణంగా దేవాలయాలలో కనీసము మూడు మార్లు, విష్ణు ఆలయాలలో నాలుగు సార్లు, ఆంజనేయ స్వామి ఆలయంలో అయిదు సార్లు, మొక్కుబడులు ఉంటే కనీసము పదకొండు మార్లు, అవకాశం ఉంటే 108 సార్లు చేయడం ఆనవాయితి. 


*కనీస నియమాలు*

1)సవ్యదిశలో సరి సంఖ్య కంటే బేసి సంఖ్యలో ప్రదక్షిణలు ఉండాలి. విష్ణు ఆలయాలలో మినహాయింపు వర్తిస్తుంది.

2) ప్రదక్షిణలు మెల్లగా (నిదానంగా),  *గజగమనము*  లేదా నిండు చూలాలు ఏవిధంగా నెమ్మదిగా నడువగలదో ఆ ప్రకారంగా.... ఆలయ భగవంతుని నామాన్ని/ శ్లోకాలను ధ్యాన పూర్వకంగా ముకుళిత హస్తాలతో, శరీరం మరియు మనస్సు స్మరణ/భగవంతుని కీర్తిస్తూ/...తమయభీష్ట కోరికలపై దృష్టి ఉంచాలి. 


*ప్రదక్షిణ మంత్రాలు*.

ప్రతి దేవాలయంలో సాధారణ ప్రదక్షిణ మంత్రం. 

*యాని కాని చ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే*

*పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః, త్రాహిమాం కృపయా దేవ శరణా గత వత్సల!*,

*అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర*

శక్తి (అమ్మవార్ల) దేవాలయాలకు వెళ్ళినప్పుడు మంత్రమును దిగువ విధంగా పల్కాలి. *దేవ* కు బదులు *దేవీ*,  *వత్సల* బదులు *వత్సలే*, *మహేశ్వర* బదులు *మహేశ్వరి*. 

*తులసి* ప్రదక్షిణ మంత్రము

*యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా, యదగ్రే  సర్వ వేదాంశ్చ, తులసీత్వాం నమామ్యహం*.

శ్రీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణలప్పుడు  ఆ స్వామి వారి మంత్రం పఠించాలి.  


ధన్యవాదములు.

*(సశేషం)*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦||¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 *𝕝𝕝 శార్దూలము 𝕝𝕝* 


  *ఱాలన్ ఱువ్వఁగ జేతులాడవు, కుమారా రమ్ము రమ్మంచునేఁ*


  *జాలన్ జంపగ, నేత్రము ల్దివియఁగా శక్తుండ నేఁగాను, నా*


  *శీలం బేమనిచెప్పనున్న దిఁకనీచిత్తంబు, నాభాగ్య మో*


  *శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!!!*

            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 17*


*తాత్పర్యము: ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! ఒక కిరాతకుడు పూలులేవని రాళ్ళతో పూజించినట్లు నేను చేయలేను.... భక్తశిరియాళుని వలె కుమారుని చంపి వంటచేసి నీకు నైవేద్యమిడలేను..... భక్తకన్నప్ప మాదిరి నేను నీకు నా నేత్రములను సమర్పించలేను... నా భక్తి ఎంత గొప్పదో చెప్పవలెనన్న అది నీ చిత్తము, నా భాగ్యము... సాక్షాచ్ఛ్రీమన్నారణుని చేత సేవింపబడు పాదములు కలిగినట్టివాడా*!....


✍️💐🌷🌹🙏

ప్రవాస భారతి

 ప్రవాస భారతి


గుప్పెడు కాసులున్, మిగుల గుండెల నిండుగ గంపెడాశలున్,

అప్పులు, ఆస్తులమ్ముకొని, ఆప్తుల పల్కులు, మూటగట్టి, నే

గొప్ప విమానమెక్కితిని కోర్కెలు తీర్చెడి పోరుబాటలో

ఎప్పుడు తప్పుజేయనని, ఇచ్చితి మాట ప్రవాస భారతీ..


చదువులఁ గోరుచున్ మరియుఁ జక్కని భావిని కోరి, దేశమున్

వదలగ నార్తితో, కడకు వాస్తవమిద్దను బాధకోర్చుచున్,

మదినిను నిల్పి నీస్మరణ మానక నిత్యము జేయు వారి, య

వ్వదనములందుఁజిందెఁబలు వన్నెలు నేడు ప్రవాసభారతీ..


నమ్మికలేనివానికిల నాశముఁ దప్పదు నష్టమౌను, ఆ

నమ్మకమున్న చాలునదె నాకము జేర్చును నాయదృష్టమై,

నమ్మితి తల్లినీవెయని నాడును, నేడును నామనస్సులో

నమ్మకమన్న ఆయుధము నాకును దక్కె, ప్రవాసభారతీ..


అమ్మను నమ్ముకొన్న బ్రతు కాటగు, పాటగునన్నివేళలన్,

అమ్మను నమ్ముకొన్న సరి యాదెస యీదెస ఆత్మరక్షయౌ,

అమ్మను నమ్ముకొన్న సుతునాకలి దీర్చెడి యన్నపూర్ణగా,

అమ్మయె వెంట వచ్చెనిదె ఆకృతి నీవు, ప్రవాసభారతీ..


నాటిరి దేశభక్తియను నాణ్యపు విత్తులు పెద్దలెందరో,

బూటక రాజకీయముల పుచ్చగ దేశము పూటపూటకున్,

నోటికి తాళముల్ మిగిలె నూటికి తొంబది మందికక్కటా,

నేటికి మేలుకొల్పితివి నీకిదె జోత ప్రవాస భారతీ..


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్ 


(2022లో ప్రచురించిన "ప్రవాసి" పద్యకావ్యమునందలి పద్యఖండిక, అందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు)

నృసింహ స్తుతి

 నృసింహ స్తుతి 

పంచ చామరం లో 


 ఘనాఘనాయవేధసే నఖాయు ధాయశౌరిణే।                                                  కిరీటహారతేజసే పరాత్ప రాయ విష్ణవే।                                         సుపుండ్రఫాలభాగినే శుభాంగ రాజితాయతే।                      సుచిహ్నపాదుకాయతే యశస్వి నే నమోస్తుతే ।   


 గురు చరణాంబుజా ధ్యాయీ విజయకుమార శర్మా.       

      ✍️ విమలశ్రీ

శంకరా! (శతకము,)

 శంకరా!

      (శతకము,)


. 5

అంబురుహము

భభభభరసలగ.యతి 13.


బొమ్మలు సేతువుకుమ్మరి రీతిని

          మూడు రంగులు వేసెదో

దొమ్మినిగూర్చెదు బొమ్మల మధ్యను

            దుఃఖభాగులచేసెదో

కమ్మిన మాయల కన్నులు చూడని

            కారుచీకటి గుప్పెదో

ద్రిమ్మరి వెచ్చట నుండెదొ నీవని?

            తెల్పుమయ్యరొ?శంకరా!

6.

కరిబృంహితము

భనభనభనర .యతి 13.


పూలశరము లెడంద తగులగ

           మోద పులకిత గాత్రుడై

తూలి గిరిజను పట్టినిలచెను

        తోలు మడుగుల వాడు తా

కోలవిసిరిన వానిగనియెను

            కోపమొలయగ రుద్రుడై

జ్వాలలెగయగ మారుడణిగెను

              భస్మమగుచును శంకరా!

7

చంద్రశేఖర

నజరజర   యతి 13


నిరతము జీవనంపు సంద్రమందునిల్చియున్

గురుతరమైన నీతిబాధలందు గూరియున్

పరమపవిత్రమైన నీదుపాద భక్తితో

శరణము పల్కమోక్షమిత్తువయ్య శంకరా

8.

తరలి

భసనజనర. యతి 11


శ్రీకరుడవు చిన్మయుడవు

             శ్రీగళుడవు శ్రీశివా!

భీకరుడవు నాశకుడవు

             విశ్వదుడవు శ్రీభవా!

శోకభయ విమోచనుడవు

          సుందరుడవు శ్రీహరా!

లోకగతుల లోక విధుల

           లోగొనెదవు శంకరా!


డా.ఉపాధ్యాయుల గౌరీశంకరరావు

        9550231590

భార్యకు భర్తయె దైవము

 భార్యకు భర్తయె దైవము

భర్తకు భార్యసహకార భరితము జూడన్! 

ధారుణి కోరిక దీర్చగ

ధర్మము నిలుపగ పతియెగదా! గతి మనసా!

గిరిజాపతీ

 *గిరిజాపతీ!* అనేమకుటం

పద్య శతకము 

*మత్తకోకిల పద్యపంచకం*

************************

*మాడుగులమురళీధరశర్మ* 

   *సిధ్ధిపేట/కాళేశ్వరం*

*చ.వా:-9951985880*

*************************

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

***********************

*మత్తకోకిల-1*

ఈశ్వరా!పరమేశ్వరా!జగ*

దీశ్వరా!శివ!పాహి!కా!

ళేశ్వరా!భవ!పాపమోచన!* 

హే!మహేశ్వరదేవ!;ము

క్తీశ్వరా!హర!ముక్తినాథ!సు*

తీర్థవాస!పరాత్పరా!

శాశ్వతమ్మగు దర్శనమ్మున*

సాకుమో *గిరిజాపతీ!*


*మత్తకోకిల-2*

గౌతమీ!నదిగా త్రివేణియు*

గాంచువాణి,ప్రణీతయున్!

ప్రీతిమీరగ సంగమమ్మున*

పేర్మిపంచుచు పుణ్యముల్!

ఖ్యాతిగా వెలుగొందుచున్న,సు*

కర్మభూమి త్రిలింగమై!

నాతితో శుభ మంగళమ్మిడు*

నందితా *గిరిజాపతీ!*


*మత్తకోకిల-3*

దర్శనమ్మున ముక్తినిచ్చెడు*

ధర్మదేవత వీవె;సం!

స్పర్శనమ్మున పాపహారిగ*

పానవట్ట ద్విలింగ;ని!

ష్కర్శ నాసికలున్న జంటగ*

సాంబ!మోక్షములిచ్చుసం!

దర్శనాద్భుత తన్మయత్వపు*

దాతవౌ *గిరిజాపతీ!*


*మత్తకోకిల-4*

ధర్మ కర్మ విరాజమానపు*

ధార్మికమ్మగు గౌతమీ!

నిర్మలమ్మగు పుణ్య భూమిగ*

నిత్య పుష్కర శోభలన్!

శర్మ పూజన దానధర్మము*

శాశ్వతమ్ముగ నిల్చుచున్!

శర్మమంద జలాభిషేకపు*

శంకరా! *గిరిజాపతీ!*


*మత్తకోకిల-5*

లక్షబిల్వ సురార్చనమ్మును*

లక్షణమ్మునఁ జేయగా!

నక్షయమ్మగు పుణ్యమిచ్చుచు*

నాదుకొమ్ము ముముక్షులన్!

రక్షణమ్మిడు జీవకోటికి*

రాజమౌళివి నీవుగా!

భిక్షగాండ్లను నాదుకొమ్మిల*

ప్రీతితో *గిరిజాపతీ!*