12, సెప్టెంబర్ 2020, శనివారం

ధార్మికగీత - 17


                                       
         *శ్లో:- కాకః కృష్ణ: పికః కృష్ణ: ౹*
                 *కో భేదః పిక కాకయో: ౹*
                 *వసంత కాలే ప్రాప్తే తు ౹*
                 *కాకః కాకః పికః పికః ౹౹* 
                                       

కాకము లోకమందు బహు
            కాలపు వర్ణము గల్గి యుండెడిన్
కోకిలగూడ లోకమున
            కూడియు నుండును నల్లవర్ణమున్
కాక పికంబులందునను
            గాంచగ బేధము గల్గునే మనన్
శ్రీకరమైన యామనియు
            చేరిన వేళ స్వరంబు జూడగన్   
కాకము కాకమే మరియు
            గాంచగ కోకిల కోకిలే యగున్


        గోపాలుని మధుసూదన రావు

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ధైర్యం - ఉపాయం



అజేయుడు అడవిని దాటుతూ విశ్రాంతి కోసమని ఒక చెట్టుకింద కూర్చున్నాడు. ఇంతలొ దభీమని చప్పుడైంది. చూస్తే ఎదురుగా కోరలతొ భీకరాకారంలో ఓ రాక్షసుడు ఉన్నాడు.

అజేయుడు ఒక్క క్షణం భయపడ్డాడు. అయినా మెల్లగా ధైర్యం తెచ్చుకున్నాడు. "చాలా ఆకలిగా ఉందిరా! నిన్ను తినేస్తా" అన్నాడు రాక్షసుడు.

"ఎలాగూ నన్ను తినేస్తావు. కాబట్టి ముందు నా కోరికొకటి తీర్చు" అన్నాడు అజేయుడు. ఏంటది! అన్నాడు రాక్షసుడు. .

"మా అవ్వ రాక్షసులకి ఎలా కావాలంటే అలా మారే విద్య తెలుసంటుంది. నేనేమో! అదంతా అబద్ధమంటాను. నువ్వు రాక్షసుడివే కదా నిజంగా నీకావిద్య తెలిస్తే నా అరచేతిలో దోమగా మారు వాలు. తర్వాత హాయిగా నీకు ఆహారమైపోతాను" అన్నాడు అజేయుడు.

పకపకా నవ్వుతూ ఓరోరి! ఇంత చిన్న కోరికా కోరేది. నాకన్ని విద్యలూ తెలుసు. కావాలంటే చూడు దోమగా మారి నీ అరచేతిలో వాలతా" అని ఏదో తలుచుకుని దోమగా మారాడు రాక్షసుడు.

అంతే! వెంటనే అజేయుడు రెండో అరచేతితో గట్టిగా కొట్టి దోమను నలిపేశాడు. దాంతో దోమ రూపంలోని రాక్షసుడు గట్టిగా ఏడుస్తూ చనిపోయాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భయంకరమైన రాక్షసుడు మన కష్టాలు, బాధలు..
తెలివితో, ధైర్యం తో దోమను నలిపినట్టు చేస్తే అంతా మంచే జరుగుతుంది...

దేనికైనా ఓర్పు, సహనం, ఆలోచన ఉండాలి.. అవి ఉంటే అంతా విజయమే.

సర్వే జనా సుఖినోభవంతు..

ధర్మో రక్షతి రక్షితః

స్వక్షేత్ర షడ్గ్రహ యోగం

స్వక్షేత్ర షడ్గ్రహ యోగం- సకల శుభప్రదం
అందరికీ నమస్కారం ప్రస్తుతం అద్భుతమైన స్వక్షేత్ర గ్రహస్థితి ఆకాశంలో ఏర్పడి ఉంది.
ఈ కాలాన్ని అందరూ దైవ పరంగా సద్వినియోగం చేసుకోగలరు.
2020సెప్టెంబర్ 3 తారీఖు నుండి స్వక్షేత్ర పంచ గ్రహకూటమి మొదలైంది. 2020 సెప్టెంబర్ 17 వరకు ఈ పంచ గ్రహ కూటమి ఉంటుంది.
13, 14, 15 తారీకులలో స్వక్షేత్ర షడ్ గ్రహయోగం కూడా ఉండటం వల్ల ఇంకా విశేషమైన రోజులు ఇవి.
సూర్యభగవానుడు సింహరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
చంద్రుడు కర్కాటకరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
బుధుడు కన్య రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
గురువు ధనస్సు రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
శని మకర రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
వీరందరూ వారి వారి సొంత గృహాలలో ఉండటం చాలా అరుదుగా సంభవించే సన్నివేశం. ఈ అరుదైన షడ్గ్రహ యోగం శుభాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజులలో విశేషమైన గ్రహబలం మానవులకు లభిస్తుంది.

భాద్రపదం శూన్యమాసం అవటంవల్ల కేవలం దైవారాధనకే ప్రాధాన్యత.
ముఖ్యంగా ఆరోగ్యం కోసమై 13, 14, 15 తారీకులలో చేసే దైవారాధనలు బాగాఫలిస్తాయి. విశేషించి వృశ్చిక లగ్నంలో చేసే దీపారాధన, పూజలు, జపాలు, అభిషేకాలు, విష్ణు, శివ లలితా సహస్రనామ పారాయణలు విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయి.
ఒకటవ యోగం: 13వ తేదీ ఆదివారం భాద్రపద బహుళ ఏకాదశి పునర్వసు నక్షత్రం, వరీయాన్ యోగం, బవకరణం. వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం ఉదయం 11:36 నుండి 11:51 వరకు. ఈ సమయంలో దైవారాధన ప్రారంభించాలి.
రెండవ యోగం: 14వ తేదీ సోమవారం భాద్రపద బహుళ ద్వాదశి పుష్యమి నక్షత్రం, పరిఘయోగం కౌలవకరణం. వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం
ఉదయం 11:32 నుండి 11:47 వరకు. ఈ సమయంలో దైవారాధన ప్రారంభించాలి.
మూడవ యోగం: 15వ తేదీ మంగళవారం భాద్రపద బహుళ త్రయోదశి ఆశ్లేష నక్షత్రం, సిద్ధయోగం, గరజికరణం. వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం
ఉదయం 11:28 నుండి 11:43 వరకు. ఈ సమయంలో దైవారాధన ప్రారంభించాలి. ఈ సమయంలో చేసే దీపారాధన, ధ్యానము, జపం అధిక శక్తినిస్తాయి.
ఇట్లు సిద్ధాంతి పంచాంగ కర్త
డాక్టర్ శంకరమంచి రామకృష్ణశాస్త్రి పిహెచ్ డి

హాస్యగుళికలు

నటూరే అంటే ఏంటి ?-
ఒక స్టూడెంటు ఇంగ్లీషు ప్రొఫెసర్ని 'నటూరే' కి మీనింగు ఏంటి అని అడిగాడు.
ప్రొఫెసర్ అ వర్డ్ ఎపుడూ విని ఉండకపోవడం వల్ల కంగారు పడి అర్ధం రేపు చెపుతానన్నాడు.ఇంటికి పోయి ఇంగ్లీషు ప్రొఫెసర్ ఎన్నో డిక్షనరీలు
రాత్రంతా వెతికినా 'నటూరే' అనే పదమే ఎక్కడా కనపడలేదు.
మర్నాడు క్లాసుకి వస్తూనే ఆ స్టూడెంటు మీనింగు చెప్పమని అడగ్గానే
గాభరాపడి రేపు చెప్తానని తప్పించుకున్నాడు.
రోజూ స్టూడెంటు అడగడం ప్రొఫెసర్ తప్పించుకోడం జరిగిపోతుండేది.
ఆ స్టూడెంటు కనపడితే చాలు ప్రొఫెసర్ కిభయంతొ కాళ్ళూ చేతులు వణికేవి.
ఆఖరికి ప్రొఫెసర్ స్టూడెంటుని అడిగాడు.
"నటూరే కి స్పెలింగ్ ఏంటో చెప్పు?"
స్టూడెంటు చెప్పాడు 'NATURE' అని.
ప్రొఫెసర్ పిచ్చికోపంతో తిట్టసాగాడు.
వెధవన్నర వెధవ! నేచర్ ని నటూరే అంటూ నా ప్రాణం తీసావు కదా!
నిన్ను కాలేజి నుంచి వెంటనే బర్తరఫ్ చేస్తున్నాను.
అలా అనగానే ప్రొఫెసర్ కాళ్ళ మీద పడి స్టూడెంటు ఏడవసాగాడు.
సార్ ! కనికరించండి. అంత పని చేయొద్దు !
నా 'ఫుటూరే' నాశనం చేయకండి సార్ !!
ప్రొఫెసర్ స్పృహ తప్పి పడిపోయాడు!!!
('ఫుటూరే' = FUTURE)

*రామాయణ విజ్ఞానం*




1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
=తన మెడలోని ముత్యాలహారం.

*శ్రీ రామ జయం!*
🏹 *🙏

శ్రీఅధోక్షజాష్టకం


1) నమో భగవతే అధోక్షజాయ
   అతుల్యతుల్యనారహితాంగాయ
   దశదిశాంతవిస్తారత్రివిక్రమాయ 
   తృణావర్తసంహరమహాబలాయ ||

2) నమో భగవతే అధోక్షజాయ
   అపవర్గప్రదాయకకరుణార్ణవాయ
   క్షీణరహితస్థితపరమపురుషాయ
   బంధవిమోచనస్థితిప్రదాయకాయ ||




3) నమో భగవతే అధోక్షజాయ
   నీరసరహితస్థితిప్రదాయకాయ
   భీతావహమానసరహితస్థితిప్రదాయ
   పరాభవరహితస్థితిప్రదాయకాయ ||

4) నమో భగవతే అధోక్షజాయ
   అమృతతుల్యస్థితిప్రదాయకాయ
   దానవకాలనేమిసంహరణాయ
   సంసారమోహనాశకాయ ||






5) నమో భగవతే అధోక్షజాయ
   సకలయజ్ఞఫలప్రదాయకాయ
   త్రిగుణాతీతత్రయీమయాయ
   సంఖ్యతత్త్వజ్ఞానప్రబోధకాయ ||

6) నమో భగవతే అధోక్షజాయ
   ఈశానమనోల్లాసకారకాయ 
   రవీంద్వగ్నిప్రభాభాసురాయ
   సమయానుకూలప్రవర్తకాయ ||






7) నమో భగవతే అధోక్షజాయ
   సురరాజబృందార్చితాయ
   కల్పనారహితమానసాయ
   ధ్యానానందస్థితిప్రదాయకాయ ||

8) నమో భగవతే అధోక్షజాయ
   పాండవరాయబారకార్యనిర్వాహకాయ
   సమయోచితమార్గనిర్దేశకాయ
   అరిషడ్వర్గహంతజ్ఞానకుఠారాయ ||

      సర్వం శ్రీ అధోక్షజదివ్యచరణారవిందార్పణమస్తు

మహాలయ పక్షాలు

*శ్రీ బాలాంబికానాధ పీఠం మరియు సేవా సమితి*

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి ?

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

2-9-2020 నుంచి 17.9.2020 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

*పితృదేవతలకు.... ఆకలా...?*

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*

*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...

పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.

*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

*ఆచార్య సద్భోదన*

ఆధ్యాత్మికతను అలవరుచుకోవడంలో ముందుగా సహనం, వినమ్రత, అణకువవంటి వాటిని అభ్యసించాలి. ఈ గుణాలను అభ్యసించాలని మన మహర్షులు పదే పదే అందుకే ప్రబోధించేవారు. నిజమైన శిష్యుడు నిశ్శబ్ధంగా వింటాడు. ఒకవేళ గురువు తనలోని లోపాలను తెలియజేస్తే వాటిని ప్రతిఘటించే ప్రయత్నం చేయడు. శిష్యుడిగా మసలుకోవడం కూడా పవిత్రమైనది. దానికై సిద్ధం కాని వారికి దానిని అందుకునే అర్హత ఉండదు.
సర్వేజనా స్సుఖినోభవంతు.

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

పరమాత్మే శరణాగతి.

పరమాత్ముడు సృష్టిని వ్యక్తపరిచే ఆలోచనతో మానవుని సాధనముగా ఎన్నుకొని వాని యందు అనేక దేవతల అధిష్ఠానముగా షోడశకళా మూర్తిగా తయారుచేసి చైతన్యముగా తానె అంశను అమర్చి"విరాట్పురుషునిగా" వ్యక్త్యమయినాడు.

దేవతల అధిష్ఠానముగా ఉన్న కళామూర్తి "జడ ప్రకృతి" ,
పరమాత్మ అంశ అధిష్ఠానముగా ఉన్న పురుషుడు "చైతన్య ప్రకృతి " .   
ఈ సృష్ఠిని అంతను "అవ్యక్త బ్రహ్మ" విరాట్పురుషుని సాక్షిగా బ్రహ్మ ,విష్ణు శివాత్మకంగా పర్యవేక్షిస్తున్నాడు.

ఈ భూతజాలమంతా విరాట్పురుషుని సంతతే. ఆ పరమ-ఆత్మ ఒక్కడే ఆక్షరుడు. అవ్యయుడు, అప్రమేయుడు.

క్షరముచెందే ఏ పదార్థమైనా భగవంతుని విశేషాంశ అవచ్చుగాని , భగవంతుడు కాలేడు.

దేవతల అధిష్ఠానముగా ఉన్న కళామూర్తి "జడ ప్రకృతి" మరణము సంభవించగానే ఆ ఆ అధిష్ఠానదేవతలలో విలీనమవుతుంది.

చైతన్య ప్రకృతి ఈ మానవుని జనన మరణముల దశ దాటినప్పుడు కాని
లేక సృష్ట్యాoతమునకాని పరమ పురుషుడిలో ఐక్యము చెందుతుంది.

అందువలన ఏ ప్రకృతులైనా పరమాత్ముని అధీనములే. ఆ పరమాత్మే శరణాగతి.

 "ఓం" అని అవ్యక్త బ్రహ్మని ఆశ్రయించినా , నారాయణా లేక చతుర్ముఖ బ్రహ్మ లేక మహేశ్వరా అని "వ్యక్త బ్రహ్మని" ఆశ్రయించినా పరమాత్మునిఆశ్రయించినట్లే.                 
                                                                                ఓం నమో నారాయణాయ !

వేమన పద్యం

గుణయుతునకు మేలు గోరంత జేసిన,
గొండయౌను  వాని గుణము చేత,
కొండ కొలది మేలు గుణహీనుడెఱుగునా,
విశ్వదాభిరామ వినుర వేమ *

భావము =

సాధారణంగా మన సమాజంలో చాలా మంది ఏవేవో ఇబ్బందులు పడుతూ, వాటిని ఎదుర్కోవటానికి ఏదో సహాయం అడుగుతూనే వుంటారు. అలాంటి సందర్భాలలో సహాయం చేయగలిగే స్థోమత వున్నప్పుడు వెనక ముందు ఆలోచన లేకుండా సాటి మనిషిని, వీలైనంత  వరకు ఆదుకోవటమే మనిషికి పరమోత్క్రుష్టము. సహాయం పొందినవాడు గుణవంతుడైతే మనం చేసిన చిన్న సహాయాన్ని కుడా తన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటాడు.అదో పెద్ద సహాయంగా భావిస్తాడు, అందరికి ఆయన వల్ల నేను సహాయం పొందాను అని చెప్పుకొంటాడు.  అందుకే పెద్దలు చెపుతారు "నీవు ఎవరి ద్వారా నైనా సహాయం పొందితే నీ  జీవితాంతం మరిచిపోవద్దు అని, అదే నీవు ఎవరికైనా సహాయం చేస్తే, దాన్ని మరచిపొమ్మని. ఎంత గొప్ప మాట ఇది. మరి కొందరు గుణహీనులు,  ఓ పెద్ద సహాయాన్ని మనవల్ల పొందినా దానిని, అ ఏముందిలే అని తీసి పారేస్తారు, అది బుద్ధిహీనులు, గుణహీనులు చేసే పని .ఏది ఏమైనా మానవ సేవే మాధవ సేవగా భావించి ముందుకు పోతే ప్రతి ఫలం అ భగవంతుడు ఇస్తాడు, ఇది  ఈనాటి వేమన పద్య భావన.

మీ రాజా బాబు