30, ఆగస్టు 2021, సోమవారం

ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి

 కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి 




అవునండి కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు 


యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య 




కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు ధరి చేరకుండా ఉండడంతో కృష్ణుడు కర్ణుడిని వెళ్ళి ఒక కోరిక అడిగాడు 




కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని అడిగాడు 


కర్ణుడు కృష్ణుడు అడగగానే దానం చేసేసాడు 




అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు 




అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు 


ఒకవేళ అలా ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు 




ఆ మాట వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి 


ఇంతమంచి వాడి వేంటయ్యా కర్ణా నువ్వు అని గట్టిగ కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు 




మనం మంచి మనసున్న వారిమైతే చాలండి 


దేవుడి మోక్షం కోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదండీ 


జీవితం ముక్తి పొందడం కోసం దైవదర్శనాలు అంటూ తిరగక్కరలేదండి 




మంచి మనసుంటే చాలండి ఆ భగవంతుడే దిగి వచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు 




కర్ణుడంత కరుణామయులం కాకపోయినా ఏదో ఆయన చిటికిన వేలంత మంచిగా బతికేద్దాం అండి 


🙏🙏🙏🙏

భూచక్రగడ్డ విశేషాలు

 భూచక్రగడ్డ విశేషాలు -


       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు. నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 


          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 


             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.


           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.


        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.


    


     నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *30.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2246(౨౨౪౬)*


*10.1-1358-*


*క. శ్రమజలకణసిక్తంబై*

*కమలదళేక్షణుని వదనకమలము మెఱసెన్*

*హిమజలకణసిక్తంబై*

*కమనీయం బగుచు నున్న కమలము భంగిన్.* 🌺



*_భావము: చెమట బిందువులతో తడిసిన మనోజ్ఞమైన శ్రీకృష్ణుని ముఖకమలము మంచుబిందువులతో తడిసి మనోహరంగానున్న పద్మమువలె రమణీయముగానున్నది._* 🙏🏻



*_Meaning: Soaked in drops of sweat, lotus like lovely face of Sri Krishna is sparkling like the lotus flower drenched in dew drops_* 🙏🏻



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *30.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*3.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*శుచిః సమ్ముఖమాసీనః ప్రాణసంయమనాదిభిః|*


*పిండం విశోధ్య| సన్న్యాసకృతరక్షోఽర్చయేద్ధరిమ్॥12294॥*


సాధకుడు స్నానాదులచేత శరీరమును, సంతోషాదులచేత అంతఃకరణమును, పరిశుద్ధమొనర్ఛుకొని, భగవంతుని విగ్రహము ముందు ఆసీనుడు కావలెను. ప్రాణాయామాదులచేత నాడీశోధన గావించుకొనవలయును. నిర్దిష్టముగా మంత్రపూర్వకముగా అంగన్యాసకరన్యాస విధులను అనుష్ఠించి పరమేశ్వరుని ఆరాధింపవలయును.


*3.50 (ఏబదియవ శ్లోకము)*


*అర్చాదౌ హృదయే చాపి యథా లబ్ధోపచారకైః|*


*ద్రవ్యక్షిత్యాత్మలింగాని నిష్పాద్య ప్రోక్ష్య చాఽఽసనమ్॥12296॥*


*3.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*పాద్యాదీనుపకల్ప్యాథ సన్నిధాప్య సమాహితః|*


*హృదాదిభిః కృతన్యాసో మూలమంత్రేణ చార్చయేత్॥12296॥*


సాధకుడు స్వయముగా స్నానాది కృత్యములద్వారా తాను పరిశుద్ధుడై, తాను పూజింప దలచిన భగవద్విగ్రహమును సిద్ధముగా నుంచుకొనవలెను. శుద్ధిచేసిన పూజాస్థలమునందు అర్చామూర్తిని నిలుపవలెను. హృదయము నందు భగవంతుని ధ్యానించుకొని, ఆ విగ్రహమునందు పరమేశ్వరుని భావింపవలెను. సమయానుకూలముగా లభించిన పూజాద్రవ్యములను సమకూర్చుకొనవలెను. అర్చామూర్తిని జలములతో శుద్ధిచేయవలెను. ఆసనము మీదను, తనపైనను నిర్మలోదకములచే ప్రోక్షణ చేసికొనవలెను. పిదప అర్ఘ్యపాద్యాదులను, ధూపదీపములను, నైవేద్యములను అర్చామూర్తికి ఎదురుగా నుంచవలయును. అంగన్యాసములను, కరన్యాసములను, హృదయాది న్యాసములను ఆచరింపవలెను. పిదప మూలమంత్రముతో ఇష్టదైవమును (అర్చామూర్తిని) ఆరాధింపవలెను.


*3.52 (ఏబది రెండవ శ్లోకము)*


*సాంగోపాంగాం సపార్షదాం తాం తాం మూర్తిం స్వమంత్రతః|*


*పాద్యార్ఘ్యాచమనీయాద్యైః స్నానవాసోవిభూషణైః॥12297॥*


*3.53 (ఏబది మూడవ శ్లోకము)*


*గంధమాల్యాక్షతస్రగ్భిర్ధూపదీపోపహారకైః|*


*సాంగం సంపూజ్య విధివత్స్తవైః స్తుత్వా నమేద్ధరిమ్॥12298॥*


అనంతరము సాధకుడు ఆయుధాది ఉపాంగసహితునిగా, పార్షదసమేతునిగా తన ఇష్టదైవమును అర్చామూర్తిలో మూలమంత్ర పూర్వకముగా ఆవాహన చేయవలెను. పిమ్మట పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, మధుపర్కము, స్నానము, వస్త్రము, ఆభూషణములు, గంధపుష్పములు, అక్షతలు, తిలకము, మాలలు, ధూపదీపనైవేద్యములు మొదలగువాటితో ఆ దైవమును విధ్యుక్తముగా పూజింపవలెను. స్తోత్రములద్వారా స్తుతించుచు, శ్రీమన్నారాయణునకు సపరివారముగా ప్రణమిల్లవలెను.


*3.54 (ఏబది నాలుగవ శ్లోకము)*


*ఆత్మానం తన్మయం ధ్యాయన్ మూర్తిం సంపూజయేద్ధరేః|*


*శేషామాధాయ శిరసి స్వధామ్న్యుద్వాస్య సత్కృతమ్॥12299॥*


పిదప ఆరాధ్యమూర్తిని తన ఆత్మలో అంతర్యామిగా ధ్యానింపవలెను. భగవన్నివేదితమైన ప్రసాదమును భక్తిపూర్వకముగా స్వీకరింపవలెను. భగవత్పాదములయందు సమర్పింపబడిన పుష్పాదులను శిరమున దాల్చవలయును. పిమ్మట ఉద్వాసనపూర్వకముగా స్వామిని యథాస్థానమున నిలిపి, పూజావిధిని ముగింపవలెను.


*3.55 (ఏబది ఐదవ శ్లోకము)*


*ఏవమగ్న్యర్కతోయాదావతిథౌ హృదయే చ యః|*


*యజతీశ్వరమాత్మానమచిరాన్ముచ్యతే హి సః॥12300॥*


ఇట్లు సాధకుడు హృదయ పూర్వకముగా అగ్నియందును, సూర్యునియందును, జలములయందును, అతిథులయందును, శ్రీహరిని భావించి పూజింపవలయును. అట్లొనర్చినచో అచిరకాలములోనే అతనికి ముక్తి లభించును.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే తృతీయోఽధ్యాయః (3)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *భగవదవతారముల వర్ణన* అను

మూడవ అధ్యాయము (3)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

జన్మ చరితార్థ మయ్యే లా!..

 జన్మ చరితార్థ మయ్యే లా!..


పరమాత్మను కీర్తించే రోజు

ఆ పరాంధాముని పూజించే రోజు

పాండవ పక్షపాతి యై ధర్మాన్ని

కాపాడాడ ని

ఆపద్బాంధవు డై గోవులను,ఆ బాల

గోపాలా న్నీ గోవర్ధన గిరి నెత్తి

రక్షిం చాడ నీ

కాళీయుని మద మడచి కాలిందిని

కల్మష రహితం గావించాడనీ

జరాసంధ వ థకై నలుని కి యుక్తిని

ప్రసాదించాడని

బృందావన విహారి యై మురళీ గాన

లోలుడై గొపికల్నే కాదు ఆబాల గోపాలా న్నీ తన మురళీ గానంలో

ముంచెత్తా డ నీ

వెన్న దొంగ యై కడకు మన్ను తిన్న

నెపంతో తల్లి యశోదకు తన నోట

పడునాల్గు భువన భాండమ్ముల

చూపాడ నీ

ధర్మార్థ సాధనకై గీటాబోధ నూ ఈ

జగతికి చేశాడనీ

లీలా మానుష వేషధారి యై

మాధవుడు గా, మధుసూ ధనుడు గా, బాల కృష్ణుడు గా,జనార్ధనుడు గా,మేఘ శ్యా ముడు గా,గోవిందుడు గా, కన్నయ్య గా,మురళీ మోహ నుడుగా,

ఇలా ఎన్నో,ఎన్నెన్నో నామాలతో

ఆర్తితో పిలిస్తే అంతటా ఏపేరు నైనా

ఏ రూపు నైనా దర్శన మిస్తాననీ

జీవిత పరమార్థాన్ని బోధించిన

ఆ పరం ధాముడు

మన శ్రీ కృష్ణ భగవానుని

ఆ పరం ధా మునీ

ముక్తియుక్తిభుక్తిశక్తి భక్తి ప్రదాత యనీ

ఆయన జన్మదినం కృష్ణాష్టమి

సందర్భంగా మనమంతా

మనసారా గోవింద కృష్ణ జై!

గోపాల కృష్ణ జై!!....

గోపాల బాల బాల బాలరాధ కృష్ణ జై,!!!!......అంటూ తనివి తీరా

గొంతెత్తి కీర్తి ద్ధా ము

జన్మ చరితార్థ మయ్యే లా!..


దోస పాటి.సత్యనారాయణ మూర్తి.

రాజమహేంద్రవరం

9866631877

సన్మైత్రీ భావుకత ప్రకృతి

 " సన్మైత్రీ భావుకత ప్రకృతి ఒసగే మహోన్నత సన్మార్గ జీవన పథం " విశాల విశ్వమందు సకల జీవరాశి ప్రశాంత మనుగడ, సుస్నేహ జీవన పథాన సాకారం ! అనాదిగా ప్రకృతి బోధించే జీవిత సత్యం, విశ్వ జీవరాశి సన్మైత్రీ భావనాత్మక సమైక్య గమనం ! సకల జీవజాలపు నిత్య చైతన్య స్ఫూర్తి, ప్రకృతి ఒసగెడి మహోన్నత ఓషధీ పరిమళం ! విశ్వ మానవాళి బాధ్యత, ప్రకృతి పరిరక్షణం, తద్వారా సకల జీవ సంరక్షణం ! సృష్టి కర్త బ్రహ్మ ఒసగిన ప్రత్యేక సుజ్ఞాన వికాస చైతన్య స్ఫూర్తి, మానవాళి మదిన జీవకారుణ్య స్థాపనం ! ఈ విశాల విశ్వంలో చరాచర జీవజాల నిత్య జీవన గమనంలో, మానవాళి పాత్ర మహోన్నతం ! విద్వేషాలు లేని, అనుమానావమానాలు కానరాని రీతిలో విశ్వ మానవాళి నడవాలన్న సమయోచిత ప్రకృతి నిత్య చైతన్య సంకేతం ! దృశ్యమాన జగతి నందు ప్రశాంత జీవనానికి ప్రత్యక్ష మార్గగామి, ప్రకృతియే అనెడి సృష్టి కర్త సద్భావనం ! తల్లి ఒడిన ఓనమాలు దిద్దిన తదుపరి సకల జీవుల నిత్య పయనం, ప్రకృతి ఒడిలోనే అనెడి సత్య చైతన్య వీక్షణం ! ప్రకృతి పరిరక్షణం సకల జీవుల ముఖ్య కర్తవ్యం, అందునా విశ్వ మానవాళికి అయ్యది నిత్య దార్శనిక దృక్పథం ! ప్రకృతి ప్రతి క్షణం, ఈ విశ్వ జీవ ప్రశాంత జీవన పథాన మహోన్నత ప్రత్యక్ష దర్పణం ! విశ్వ మానవాళి నిత్య సమున్నత కర్తవ్యం, ఈ పవిత్ర పృధ్విపై జీవకారుణ్యతా భావ వికాస సుహృద్భావ స్థాపనం ! ఒండొరుల నిత్య సత్య చైతన్య సన్మైత్రీ భావనాత్మకతా చింతనే విశ్వ సమాజ సువికాస సమైక్య తోరణం ! ఆత్మీయానురాగాల సమ్మేళనం, విశ్వ మానవాళి సుస్నేహ భావ స్ఫూర్తిదాయక చైతన్య దృక్పథం ! ఈ సద్భావనే సకల జీవరాశి దీర్ఘకాలిక ప్రశాంత అఖండ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధికి చక్కని జీవన సోపానం ! రచన : గుళ్లపల్లి ఆంజనేయులు

వీలునామా

 వీలునామా


*


"మనింట్లో మనం ఉంటూ అద్దె కట్టడమేంటండి? మాఁవయ్య గారికి ఛాదస్తం పెరుగుతున్నట్లుంది" అంటోంది సునంద.


"మనిల్లు కాదు, ఇది నాన్న గారు లోను తీసుకుని కట్టుకున్న ఇల్లు" సమాధాన పరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు సుశాంత్.


"ఆయనదైతే మాత్రం .... ఆయన తరువాత మీకే కదా వచ్చేది?"


" 'ఆయన తరువాత' అన్నమాట మరొకసారి అనొద్దు సునంద" గొంతు పెంచుతూ అన్నాడు సుశాంత్ 


"ముందే అనుకోకపోతే మా బాబాయి వాళ్ళ పిల్లల్లాగే కొట్టుకు చావాలి" అంటూ సోదాహరణంగా సుశాంత్ మనసు మార్చేందుకు ప్రయత్నం చేస్తోంది సునంద.


"మీ బాబాయికి ఉన్నది ఐదొందల గజాల స్థలం .... అందులో ఇల్లు. నలుగురు సంతానం. పైగా ఆ స్థలం వాళ్ళ నాన్న గారి నుంచి వారసత్వంగా వచ్చింది కాబట్టి కొడుకులందరూ కలసి ఆయన్ని ఏడిపించారు. ఇప్పుడు చూడు ఏమయిందో? ఆ ఐదొందల గజాల కోసం అందరూ కోర్టుకు పోయారు. పోనీ మధ్యవర్తిత్వం చేద్దామంటే ఆ పెద్దాడికి అసలు మన పొడే గిట్టదు ...."


"అందుకే చెప్పేది .... ఇల్లు ముందుగా మన పేరు మీద రాయించేసుకుంటే .... " అంటూండగానే సుశాంత్ అనేసాడు ....


"ఆ తరువాత నా బుధ్ధి మారి ఆయన్ని వేరే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు ఈ వయసులో?" అన్నాడు .... సునంద మనసులో విషయం తన మాటగా చెబుతూ ...,


"అదీగాక ఈ ఇంట్లో చెట్లు, మొక్కలు ఆయన ప్రాణం. రోజూ చూస్తున్నావ్ కదా, ఎంత శ్రధ్ధగా వాటిని చూసుకుంటారో?" అంటూ తండ్రిని సమర్ధిస్తూ మాట్లాడాడు సుశాంత్ 


"ఎంత సేపటికీ మీకు మీ నాన్న గారి ఆలోచనే కానీ నా మనసులో ఆలోచన మాత్రం పట్టదు ...." మూతి వరిచింది సునంద.


ఆమె మనసులోని మాట అతడికి తెలుసు. అందుకే తండ్రికి అద్దె కట్టి మేడ మీద ఉండటానికే నిశ్చయించుకున్నాడు. తమ ఇంటికి తామే అద్దె కట్టడం మాత్రం ఆమెకు సుతరామూ ఇష్టం లేక పోయింది.


"అద్దె డబ్బులు ఏం చేసుకుంటారట? రోజూ వండి పెడుతున్నా కదా?" అంటూ మళ్ళీ మొదలు పెట్టింది సునంద.


"చాల్లే .... నీ వంట సంగతే చెప్పు. వారంలో రెండు, మూడు రోజులు బైట నుండి తెప్పిస్తావు. ఆ తిండి ఆయనకు సయించదు. మొదటినుండి అమ్మ చేతి వంట అలవాటైన మనిషి. ఆ బైట తిండి తింటే ఈ వయసులో మంచిది కాదు కూడా" అంటూ సమాధానం చెప్పాడు. 


ఈ మాటతో సునందకు ఎక్కడలేని రోషం వచ్చింది. 


"అంటే మీ ఉద్దేశ్యంలో నాకు వంట రాదనా?" 


"వంట రాదనలేదు. బైటనుండి తెప్పించే ఆహారం ఆయనకు పెట్టొద్దు అని అంటున్నాను" అన్నాడు సుశాంత్ 


"దానికీ, మన అద్దెకు ఏంటి సంబంధం?" అంటూ మళ్ళీ మొదటికే వచ్చింది సునంద.


"ఆయనకు అద్దె కడితే వంట మనిషిని పెట్టుకుని ఆయనకు కావలసినట్లు చేయించుకుంటాడు. నాకెలాగూ నీ చేతి ముద్ద తప్పదనుకో" అన్నాడు సుశాంత్ 


"మరైతే ఆయనకు అద్దె కడితే ఆయన కోసం వంట చెయ్యనని చెప్పేయండి .... ఐనా కొడుకు దగ్గర అద్దె వసూలు చేసే తండ్రిని ఈయన్నే చూస్తున్నా" అంటూ సాగతీసింది సునంద.


మరేమీ మాట్లాడలేదు సుశాంత్. తండ్రికి ఎలా చెప్పాలో ప్లాన్ వేసుకున్నాడు.


*


"ఏరా ఇలా వచ్చావ్? అద్దె విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావ్? అనడిగారు సుశాంత్ తండ్రి సుబ్రమణ్యం గారు.


"అదే నాన్నా .... ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. సునంద విషయం తెలిసిందే కదా, మన ఇంటికి మనం అద్దె కట్టడం ఏంటంటోంది. ఒక వేళ అద్దె కట్టేట్టయితే మీ వంట సంగతి మిమ్మల్నే చూసుకోమని అంటోంది ...."


"నెత్తిన పాలు పోసిందిరా నీ భార్య .... ఇవాళనుండి అద్దె ఇరవై వేలు. ఎడ్వాన్సుగా రెండు నెలల అద్దె ఇచ్చేసి వెళ్ళు. గోడలకు మేకులు కొడితే మేకుకి రెండొందలు ఎక్స్ట్రా కట్టాలి. చిన్న చిన్న రిపేర్లొస్తే నువ్వే చేయించుకోవాలి" అన్నారు సుబ్రమణ్యం గారు.


అన్నిటికీ ఒప్పుకున్న సుశాంత్ అప్పటికప్పుడు నలభై వేలు ఆయనకు తన మొబైల్ నుండి బదిలీ చేసాడు.


మేడ మీదకు రాగానే చెప్పాడు సుశాంత్ నాన్న గారికి వంట చెయ్యనవసరం లేదని.


"అద్దె ఇచ్చారా?" అనడిగింది సునంద.


"ఇచ్చాను"


"ఎంత?" 


"నెలకి ఇరవై వేలు" అని చెప్పాడు సుశాంత్ 


"ఇరవయ్యా? ఇరవై వేలు పెడితే ఇంతకంటే మంచి కొంపే దొరికేది. ఐనా ఈ వయసులో ఆయన అంత డబ్బు ఏం చేసుకుంటాడండి, మరీ కాపీనం కాకపోతే?" అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది సునంద.


"వంట వాడికి జీతం ఇవ్వాలి కదా? అదీ కాక ఆయన పెన్షను సరిపోవడం లేదట. నన్ను డబ్బు అడగడానికి మొహమాట పడుతున్నారు. అందుకే అద్దె కట్టమన్నారు. ఐనా మనం ఆయనతో కలసి ఉండటం లేదు. మేడ మీద విడిగా ఉంటున్నాం. అది మరచిపోకు" అని సున్నితంగా హెచ్చరించాడు సుశాంత్ 


*


నాలుగు రోజులు గడిచాయి. ఉదయం నిద్ర లేచిన సునందకు ఇంటి ఆవరణ అంతా సందడిగా అనిపించింది. 


'ఏఁవిటో హడావాడి?' అనుకుంటూ బాల్కనీలోకి వచ్చి చూసింది.


చాలామంది వృధ్ధులు .... అందరూ పెద్దవాళ్ళే .... ఆవరణలో సందడిగా మొక్కల మధ్య చెట్ల కింద తిరుగుతున్నారు.


బాల్కనీలోనుండి లోపలకొచ్చిన సునంద భర్తను లేపి విషయం చెప్పింది.


సుశాంత్ కూడా వచ్చి చూసాడు. అతడికీ అర్ధం కాలేదు. మొహం కడుక్కుని కిందకు వచ్చాడు. 


నాన్న గారి దగ్గరకు చేరి "ఏంటి నాన్న విషయం, అంతా సందడిగా ఉంది?" అని.


"వీళ్ళందరూ బిడ్డలనుండి దూరంగా ఉంచబడిన తల్లిదండ్రులురా .... వీళ్ళు నాకు తోడుగా ఉంటారని తెచ్చుకున్నాను" అన్న నాన్న గారి మాటలు మొదట అర్ధం కాకపోయినా ఆయన సంగతి తెలుసు కాబట్టి పక్కకు తీసుకువెళ్ళి అడిగాడు.


"ఔన్రా సుశీ .... నాకు ఈ వయసులో నువ్వు, కోడలు తప్ప ఎవరూ లేరు. ఆ అమ్మాయికి నేనంటే ఎందుకో నచ్చదు. తన కారణాలు తనకు ఉండి ఉండవచ్చు. ఆ కారణాల వల్ల నీవు అమ్మాయి పోట్లాడుకోవడం, ఈ వయసులో నాకు ఇవన్నీ అవసరమా? అందుకే 'వీలునామా' రాసాను" అన్నారు సుబ్రమణ్యం గారు.


"వీలునామానా?" ఆశ్చర్యంగా అడిగాడు సుశాంత్.


"ఔన్రా .... నేను బతికున్నంత కాలం ఈ ఇంట్లో ఉన్నందుకు నువ్వు అద్దె కట్టాలి. నా అనంతరం కింద భాగం ఈ వృధ్ధులు ఉండటానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. అలాగే ఇరవై వేలు అద్దె కూడా కట్టాలి. ఏ రోజైనా వీళ్ళను ఖాళీ చేయించే ప్రయత్నం చేసావంటే ఆస్థి మొత్తం వయో వృధ్ధుల ఆశ్రమానికి వెళ్ళిపోతుంది" అంటూ 'వీలునామా'లోని ముఖ్యమైన అంశాలు వివరించారు సుబ్రమణ్యం గారు.


తిరిగి వెళ్తున్న సుశాంత్ ని పిలిచి మరొక మాట కూడా చెప్పారు .... "ఈ 'వీలునామా' నేను ఎప్పుడైనా మార్చుకునేందుకు హక్కు నాకు ఉంది" అంటూ.


*


పది నిముషాలలో అందరికీ 'కాఫీ' తీసుకొచ్చింది సునంద.


"మాఁవయ్య గారు .... ఈ వయసులో మీకెందుకండి ఈ బరువు బాధ్యతలు? నేను, ఆయన చూసుకుంటాం కదా? మీరు వాళ్ళ సంగతి మరచిపొండి" అంటూ చేతికి 'కాఫీ' కప్పు అందించింది సునంద.


ఏనాడూ చేతికి 'కాఫీ' కప్పు ఇవ్వని కోడలు అలా చేతికి ఇచ్చేసరికి నవ్వుకున్నారు సుబ్రమణ్యం గారు.


'వీలునామా మార్చుకునే హక్కు ఉంది' అనే మాట వినేసరికి కోడలికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది. ఆ మార్పు ఎటైనా మార్చవచ్చు అన్న సంగతి తెలిస్తే కనీసం ఈ 'కాఫీ' నీళ్ళు కూడా ఇవ్వదు' అనుకున్నారు సుబ్రమణ్యం గారు .... #రాయని_వీలునామా గురించి ఆలోచిస్తూ.


పైనుండి సుశాంత్ నవ్వుతూ చూస్తున్నాడు .... నాన్న గారి 'ఏ కీలుకి ఆ కీలు విరిచే వకీలత్వా'న్ని తలచుకుంటూ ....


*************************** (శుభం)


రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు

కరుగుతున్న_తెలుగుభాష

 అ ఆ ఇ ఈ

కరుగుతున్న_తెలుగుభాష


దక్షిణాది నాలుగు ప్రధాన భాషల్లో తెలుగు చివర పుట్టినది. తమిళ, మలయాళ, కన్నడ భాషలు మనకంటే ముందు పుట్టినవి. లిపి పరిణామ క్రమం కూడా ఇదే వరుసలో ఉంటుంది. ఇంతకంటే తెలుగు భాషోత్పత్తి, వికాసం, చరిత్ర విషయాలు ఇక్కడ అనవసరం. అయితే మిగతా మూడు భాషలకంటే ముందు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మాత్రం తెలుగుకే.


తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- కచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం మిగిలి ఉంటే గొప్ప. ఇంకో అయిదు వందల సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక తెలుగు శ్రీనాథుడి పద్యాల్లా ఎవరయినా విడమరచి చెబితే తప్ప అర్థం కాకపోవచ్చు.


కనీసం ఇంకో పది వేల సంవత్సరాలయినా బతికి, బట్ట కట్టి, బలుసాకయినా తిని, నిలబడగల కండపుష్టి, ఎముకల బలం తెలుగుకు ఉన్న మాట నిజమే అయినా-ఇప్పటి పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవు. తెలుగు లిపి నెమ్మదిగా విలువ లేనిది అవుతుంది. తరువాత మాట కూడా విలువ లేనిదే అవుతుంది. కచ్చితంగా ఇదంతా ఎప్పటికి జరుగుతుంది? అని తేల్చడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. మహా అయితే ఇంగ్లీషు రాని తెలుగువారు మాత్రమే తెలుగు మాట్లాడుతుంటారు. భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరని భరోసా అయితే ఏమీ లేదు. ఇంతకంటే లోతుగా భాష కనుమరుగయ్యే ప్రమాదం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు.


మన పొరుగున కర్ణాటక సముద్రతీరం మంగళూరు-ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు. తుళు ప్రత్యేక భాషే అయినా, కోటి మందికి పైగా తరతరాలుగా మాట్లాడుతున్నా లిపి లేదు. కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి. నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు తుళుకు ప్రత్యేక లిపి ఉండేది. అనేక కారణాల వల్ల లిపిని వాడక అంతరించిపోయింది. కృష్ణదేవరాయల మాతృభాష తుళు. తుళు తన సొంత లిపిని మరచిపోయి, కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు- మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు.


ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా, అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి. మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన, బాగా దగ్గరయిన వర్ణమాల ఉంది. అంత నిర్దుష్టమయిన, నిర్దిష్టమయిన లిపి తెలుగుకు ఉంది.


ముత్యాల్లాంటి, రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తున్నాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అనిపిస్తున్నాయి. తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తోంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇప్పుడు ఇంగ్లీషులో రాయడం ఫ్యాషన్. మర్యాద. ట్రెండ్.


క్షుద్రులెరుగని నిర్ణిద్ర గానమిది…పాటకు fools who don’t know the song singing without sleep లాంటి అనువాదం చేస్తుంటే తెలుగు భావాన్ని ఇంగ్లీషులోకి తీసుకెళుతున్నారని సంతోషించవచ్చు. కానీ జరుగుతున్నది కేవలం లిప్యంతరీకరణ మాత్రమే. Kshudrulerugani nirnidra ganamidi అని రాస్తున్నారు. ఇలా రాయడంవల్ల లండన్ లో షేక్స్ పియర్లు, అమెరికాలో నోమ్ చాస్కీలు మన తెలుగును సులభంగా చదివి అర్థం చేసుకుంటున్నారేమో తెలియదు. తెలుగు లిపిని మాత్రం ఘోరంగా అవమానిస్తున్నారు. లిపిని రద్దు చేస్తూ దుర్మార్గమయిన పాపం మూటగట్టుకుంటున్నారు. మన నిలువెత్తు సంతకాన్ని మనది కాకుండా చేస్తున్నారు.

పలికే మాటను సంకేతించే అక్షరం పుట్టడానికి కొన్ని యుగాల సమయం పట్టింది. దాన్ని చెరిపేయడానికి పదేళ్ల సమయం సరిపోయింది. ప్రత్యేకించి సినిమా పాటల లిరికల్ రిలీజ్ లన్నీ ఇలా ఇంగ్లీషు లిపిలోనే జరగాలని తెలుగు సినీ పరిశ్రమ రాసుకున్న రాజ్యాంగం.


ఈమధ్య చిరంజీవి ఆచార్య సినిమా లాహే లాహే లాహే పాటను యూ ట్యూబ్ లో ఆరు కోట్ల మంది చూశారు. మణి శర్మ మంచి సంగీతం. రామజోగయ్య శాస్త్రి చక్కటి రచన. పాట అద్భుతంగా, నిండు తెలుగు కండతో ఉంది. ఆధ్యాత్మిక, వేదాంత విషయాలను సాధారణ పరిభాషలో ప్రతీకాత్మకంగా చెప్పిన తీరు బాగుంది. నూటికి నూరు మార్కులు వేయదగ్గ రచన. మంచి కొరియోగ్రఫీ.లవ్ స్టోరీ సినిమా సారంగదరియా సాయి పల్లవి జానపదగీతం అసాధారణంగా ఇరవై అయిదు కోట్ల మంది చూశారు. ఈ రెండు పాటలు తెలుగువే అయినా ఇంగ్లీషు లిపిలోనే ఉంటాయి.ఇవే కాదు. ఏ పాటలయినా ఇంగ్లీషులోనే ఉండాలని నియమమేదో పెట్టుకున్నట్లున్నారు. తెలుగు పాటలకు తెలుగు లిపిలో టెక్స్ట్ పెడితే జరిగే నష్టాలేమిటో, పెట్టడానికి కష్టాలేమిటో ఇంగ్లీషు తండ్రికే తెలియాలి. నిజంగా తెలుగును ఇంగ్లీషులో రాయడం వల్ల వ్యాపార ప్రయోజనాలుంటే ముందు తెలుగు లిపిలో ఇచ్చి, తరువాత ఇంగ్లీషులో ఇవ్వవచ్చు. అప్పుడు అసలు భాషకు తగిన గౌరవం ఇస్తూనే, కొసరు భాష ఉపయోగాన్ని కూడా పిండుకోవచ్చు.


ఇప్పటికీ శ్రీలంకలో ప్రభుత్వ బోర్డుల్లో మొదట వారి అధికార భాష సింహళీ, తరువాత ఎక్కువ మందికి తెలిసిన తమిళం, దాని కింద మూడో లైన్లో ఇంగ్లీషులో రాస్తున్నారు. మనసుంటే మార్గముంటుంది.


కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఒక మాట ఉంది. మూడో కంటికి తెలియకుండా తడి గుడ్డతో గొంతు కోయడం. చుక్క రక్తం చిందకుండా గుండె కోయడం. అలా మనం తెలుగు లిపిని సైలెంట్ గా మర్డర్ చేస్తున్నాం. ఇన్నాళ్లు ఈ లిపి హత్యా నేరంలో తెలుగు సినీ పరిశ్రమ ఒకటే ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ప్రకటనలు కూడా తోడయ్యాయి.


మనకు మనమే చెరిపేసుకుంటున్న చరిత్ర మనది. మనకు మనమే అక్షరాన్ని బూడిద చేసుకుంటున్న పాపం మనది. మనకు మనమే నిరక్షరులుగా మిగిలే దైన్యం మనది. తెలుగు అక్షరం గుక్క పట్టి ఏడుస్తున్నా వినిపించుకోని పుట్టు చెవుడు మనది. తెలుగు అక్షరం గుండెలు బాదుకుంటున్నా చూడలేని పుట్టు వైకల్యం మనది. తెలుగు పట్టని వైక్లబ్యం మనది.


ఎవ్వరూ భయపడకండి. తెలుగును నడి బజారులో పట్ట పగలు అందరు చూస్తుండగా ఖూనీ చేసినా ఎవరూ కేసులు పెట్టరు. పెట్టినా నిలబడవు. నిలబడినా శిక్ష పడదు. పడినా అమలు కాదు.


త్వరగా పిడికిలి బిగించి ఉరికి రండి!

తలా ఒక పిడిబాకు చేతబట్టి ఉబికి రండి!

తెలుగును కసితీరా పొడిచి పొడిచి చంపేద్దాం.

తెలుగును తెలుగు లిపిలో రాస్తే- అమ్మ భాష.

తెలుగును ఇంగ్లీషు లిపిలో రాస్తే- ? ? ? !


దొర'సాని' భాష..

☹️😞😓🙏

*33 కోటి దేవతలు ఎవరు?*

 *33 కోటి దేవతలు ఎవరు?*


  హిందువులను విరోధించువారు మీ 33 కోటి దేవతల పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవతారు.


 అసలు ఈ కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్ వంటివారు తమకు కావలసిన ఒక మత ధర్మమునకు అనుకూలమగునటుల చరిత్ర ను తిద్ది తీర్చి తెలివిమంతులు అనిపించుకొన్నారు.


   హిందువులు అటువంటి చరిత్ర ప

ను చదివి బుద్ధి హీనులు వారనిపించుకొనిరి.


  వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి(33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా?


  హిందూ ధర్మ - సంస్క్రతియందు 33కోటి దేవతల ఉల్లేఖన ఉంది. మిక్కిలి జనులు ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. మరియు 33కోటి పేర్లను చెప్పమని బలవంతం చేస్తారు. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు.


    సంస్క్రతములో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' (type) అని అర్థమూ ఉంది. 

  ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం. అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.  


  యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలు. హిందూ గ్రంధములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది.


   ఇపుడు దేవతల ఈ 33వర్గములనూ, అందులో వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము: 


 12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) : 1 త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణు 7. భగ. 8. వరుణ 9. సవితృ 10. శక్ర 11.అంశ 12. ఆర్యమ.  

  11 రుద్రులు (ఏకాదశ రుద్రులు): 1.మన్యు 2. మను 3. మహినస 4. మహాన్ 5. శివ 6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా 8. భవ 9 కాల 10. వామదేవ 11. ధృతవృత.  


 8 వసువులు(అష్టవసువులు): 1. ధరా 2. పావక 3 అనిల 4. అప 5. ప్రత్యుష 6. ప్రభాస 7. సోమ 8 ధ్రువ. 


మరి ఇద్ధరు: 1. ఇంద్ర 2. ప్రజాపతి. 


 త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరని తెలిసినది కదా! ఈ పేర్లను కంఠపాఠము చేయునది చాలా సులభము. ఎవరైననూ ఇపుడు 33కోటి దేవతల పేర్లను చెప్పమంటే వెనుక ముందు చూడవలసిన అవసరమే లేదు! కదా?. 

            *

 ( True translation from kannada version)

          🙏హరే శ్రీనివాస🙏

  🙏నా హం కర్త 🙏హరి కర్త 🙏

          🙏శ్రీ కృష్ణార్పణం🙏

జయ గోవింద

 జయ గోవింద

సింహామాసం కృష్ణపక్షంలో రోహిణి నక్షత్రం రోజున శ్రీకృష్ణుడి తిరునక్షత్రం(పుట్టిన రోజు) నిర్వహించాలని ఈశ్వర,శ్రీప్రశ్న మొదలగు సంహితా గ్రంథాలు తెలుపుతున్నాయి.

తిరునక్షత్ర తనియ

సింహమాసే౽ సితే పక్షే రోహిణ్యాం అష్టమీతిథౌ |

చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుమ్ || 


నిత్య తనియ

తతో౽ ఖిల జగత్పద్మ బోధాయాచ్యుతభానునా | 

దేవకీ పూర్వసన్ధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా ||

     శ్రీజయంతి గా పిలువబడే కణ్ణన్ తిరునక్షత్ర మహోత్సవం,ఆమరుసటి రోజు శిక్యోత్సవం నిర్వహించాలని విధి విధానాలను శ్రీప్రశ్న,ఈశ్వర సంహితలు పేర్కోన్నాయి.

 మొదటి రోజున శ్రీస్వామి వారికి విశేష తిరుమంజన కార్యక్రమం,వివిధ ప్రసాదాల నివేదన(ముఖ్యంగా కాయం,పాలు,వెన్నె,మీగడతో పాటు ఇతర ప్రసాదాలు)చేసి ఊంజల్ సేవని,నృత్య,గీతాది కార్యక్రమాలు నిర్వహించాలని ,ఆతరువాతి రోజు గర్భాలయంలో మూలమూర్తి ఆరాధన జరిగిన పిమ్మట ఉత్సవమూర్తిని పల్లకిలో వేంచేపు చేసుకోని శిక్యోత్సవం(ఉట్లి కోట్టడం) నిర్వహించడానికి అనుమతికై స్వామి వారిని ప్రార్థించి ఉత్సవమూర్తిని మంటపానికి వేంచేపు చేయాలి.వీథిలోని గోప బాలకులను భగవంతునికి ఎదురుగా నిలబెట్టాలి.పాలు,వెన్నె వంటి వాటిని సిద్ధం చేసుకోని శిక్యాన్ని(ఉట్టిని)నిర్మించాలి.ఆఉట్టిలోని పాలు,పెరుగు ,వెన్నె ఇత్యాదులతో ఉన్న ఆఉట్టిని గోప బాలురు కొట్టేందుకు భగవంతుని అనుమతిని తీసుకోమని చెప్పి వేడుకను ప్రారంభించాలి.నృత్య,గీత,వాధ్య,వేద,దివ్య ప్రబంధ ,స్తోత్రాదులు చదువుతూ తిరువీథిగా ఉట్టి వద్దకు చేరుకుని అక్కడ పసుపు నీళ్ళతో ఈఉత్సవాన్ని నిర్వహించాలి.ఉత్సవం పూర్తి అయ్యాక ఉత్సవమూర్తికి ఉపచారములు సమర్పించి గర్భాలయానికి వేంచేపు చేయాలి.సంతానార్థులు ఈఉత్సవం పూర్తి తర్వాత పారణ చేసిన సంతానం కలుగుతుందని చెప్పబడింది.

భగవదుత్సవములు అనే శ్రీకోశం నుండి గ్రహించబడింది.

   ప్రియ భగవద్బందువులందరికి శ్రీజయంతి శుభాకాంక్షలు

 సర్వ అపరాధాన్ క్షమస్వ

అడియేన్ రామానుజ దాసన్