🌸కాళీయ మర్ధనం కధ చదివితే గ్రహ దోషాలు తొలిగిపోతాయి అని పెద్దలు చెబుతారు
పూర్వం ద్వాపర యుగంలో మధుర నగరిలో శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్న సమయంలో కాళీయ అనే నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీళ్లు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సెగ గాలులకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి.
ఆ నదిలో దిగిన పసుపక్షాదులను జనులను ఆ కాళీయ సర్పం తినేస్తూ ఉండేది. అన్నిటికీ జీవనాధారమైన ఆ నదిలోకి దిగాలంటే భయపడి పోతుండేవారు. ఇది చూసిన బాల కృష్ణుని మనసు చాలా ఆర్ద్రమైంది.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు.
కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది.
ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపైకి ఎక్కి నృత్యం చేయ సాగాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి.
కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో అని భయపడుతూ చూస్తున్నారు. ఇంతలో శ్రీకృష్ణుడు ఖాళీయ పడగల పై నుండి నాట్యం చేస్తూ యమునా నది నుండి పైకి వచ్చాడు. అది చూసిన యశోదమ్మ గోప బాలురు కృష్ణునికి ఏమీ కాలేదని ఊపిరి పీల్చుకున్నారు
కాళీయుడు శ్రీకృష్ణుని ప్రార్థించి కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.
అలా అందరూ కాళీయుడి విషవాయువుల నుంచి విముక్తి పొందారు. యమునా నది సైతం పవిత్రమైంది.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🌻🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి