2, ఫిబ్రవరి 2021, మంగళవారం

గుండె జబ్బులు

 గుండె జబ్బులు  -  ఆహార నియమాలు - ఔషధాలు 


 గుండెజబ్బు రావడానికి గల కారణాలు -


 *  అతిగా ఆవేశపడటం.

 

 *  ఎక్కువుగా ఉన్న వేడి పదార్దాలు తినడం.

 

 *  పులుసు , వగరు ఉన్న రుచులు ఎక్కువ ఉన్న పదార్దాలు తినడం.


 *  విచ్చలవిడిగా కామకలాపాలు సాగించడం .


 *  అతిసారం 


 *  జీర్ణకోశం లో  వ్రణాలు .

 

 *  విషపదార్దాల సేవనం .

 

 *  మానసిక ఆందోళన .


 *  రక్తపోటు .


 *  కొవ్వు పేరుకొని పోవడం.


 *  అధికంగా గోంగూర వాడటం.


   మొదలైన వాటివల్ల గుండె జబ్బులు వస్తాయి.


   గుండె రోగులు పాటించవలసిన నియమాలు -


 *  ఎప్పుడు పాత బియ్యమే ఆహారంగా ఉపయోగించాలి. దంపుడు బియ్యమే శ్రేష్టం .


 *  మేక మాంసం , అడివి పక్షుల మాంసం , అడివి మృగాల మాంసం తో తయారైన మాంస రసాలు త్రాగవచ్చు. 


 *  అల్లం, ఉప్పు, కొద్ది కారం , కొద్దిగా యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క, ఇవన్ని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మాంసం ముక్కలకు రాసి ఎండబెట్టాలి. ఎండిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆవునేయ్యిలో వేయించుకొని తినవచ్చు.


 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.


 *  కందికట్టు, పెసరు కట్టు, ఉలవ కట్టు వాడవచ్చు.


 *  బీర, కాకర, క్యాబేజీ , టమాటో , లేత ముల్లంగి పొట్లకాయ , లేత అరటికాయ , పొన్నగంటి కూర , పెరుగుతోట కూర , మెంతి కూర , సొరకాయ , దోసకాయ తినాలి .


 *  మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు , బత్తాయి రసం ( కలకండ రసం కలిపింది.) నారింజ రసం , ద్రాక్ష రసం వాడవచ్చు.


 *  ఆవుపాలు, ఆవునెయ్యి , ఆవుమజ్జిగ , పాతబెల్లం , తేనె , ద్రాక్షారిష్ట, అర్జునారిష్ట , వెల్లుల్లి , అల్లం వాడవచ్చు. 


   గుండె రోగులు మానుకోవలసినవి   - 


 *  కొత్తబియ్యం అన్నం తినకూడదు .


 *  పెరుగు వాడరాదు . మజ్జిగ వాడవలెను.


 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.


 *  ఎప్పుడు దాహం , వాంతి రాకుండా చూసుకోవాలి .


 *  మలమూత్రాలు ఎక్కువసేపు ఆపకుండా వచ్చినవెంటనే విసర్జించాలి.


 *  దగ్గు, తేన్పులు , అపానవాయువు వీటిని ఆపకూడదు .


 *  పుల్లలతో పండ్లు తోముకోకుడదు.


 *  పొగత్రాగటం పూర్తిగా మానుకోవాలి.


 *  మద్యం, గేదపాలు అసలు పనికిరావు.


 *  తాంబూలం వేసుకొకుడదు .


 *  ఆవకాయ తినడం అత్యంత ప్రమాదకరం .


       పైన చెప్పిన ఆకుకూరలు తప్ప మిగిలనవి బాగా తగ్గించడం శ్రేయష్కరం .


గుండె నొప్పి మరియు గుండెబలమునకు సిద్ధఔషధ యోగాలు  - 


 *  తమలపాకు జీర్ణాశయమునకు మరియు హృదయమునకు బలాన్ని కలిగించును. 


 *  మునగచెక్క రసము నందు కొంచం ఇంగువ చేర్చి ఇచ్చిన గుండెనొప్పి తగ్గును. 


 *  గులాబీల నుండి తయారుచేసిన పన్నీరు గుండెదడ , గుండెపోటు , ఆయాసములను తగ్గించును . 


 *  అంజూర పండ్ల రసమును రోజుకు ఒకసారి తీసుకున్నచో గుండెకి , ఊపిరితిత్తులకు బలాన్ని కలుగచేయును . 


 *  ద్రాక్షపండ్ల రసము గుండెకు , మూత్రపిండాలకు బలాన్ని కలుగచేయును . 


 *  ఒక ఔన్స్ సొంపు కషాయంలో రెండు చెంచాల పంచదార కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకున్న ఛాతినొప్పి , ఉపిరి తీసుకునేప్పుడు నొప్పి , గుండెనొప్పి తగ్గును. 


 *  ఖర్జుర పండు గుండె , ఊపిరితిత్తులు , మూత్రపిండములు , లివర్ మొదలగు శరీరావయములకు మిక్కిలి ఉత్తేజాన్ని కలిగించి బలమును , పుష్టిని ఇచ్చును . 


 * ప్రతినిత్యం ఉదయాన్నే ఒక అంజూరపండు తినుచున్న గుండెదడ , ఆయాసం తగ్గును. 


  

 

       మరిన్ని సులభయోగాలు నా గ్రంథాల యందు ఇవ్వడం జరిగినది.

 

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అభిషేక జలం

 గుడిలో అభిషేక జలం పోవు మార్గాన్ని ఏమంటారు ?


ప్రాచీన దేవాలయాన్ని ముఖమండపం, రంగమండపం, అంతరాళం, గర్భగుడి అనే భాగాలుగా విభజించవచ్చు.

భక్తులు మొదట ప్రవేశించేది ముఖమండపంలోనికే. ముఖమండపం అందమైన శిల్పస్థంభాలతో అలరారుతూవుంటుంది. ఇక్కడే ద్వారపాలకులు అటు ఇటు కొలువైవుంటారు.

రంగమంటపం కూడా శిల్పస్థంబాలతో శోభిల్లుతూవుంటుంది.

రంగమంటపంలోనే నృత్యగాన సంగీతభజనలుంటాయి.

రంగమంటప వాకిలి పైన లక్ష్మీదేవికి ఏనుగులు పూలమాలలతో  అర్చిస్తూవుంటాయి.


అంతరాళం గర్భగుడికి అనుకొనేవుంటుంది. ఎత్తైన అరుగులుంటాయి. 

ఈ అరుగులు కూడా శిలాశిల్ప స్థంబాలతో వుంటాయి.

గర్భగుడి ద్వారానికి అటుఇటుగా ద్వారపాలకులుంటారు.

గర్భగుడిలో పానవట్టం లేదా అధిష్టానం పై శిలామూర్తైన మూలవిరాట్టు విగ్రహం వుంటుంది.


విమానమంటే గర్భగుడిపై గల గోపురం. గర్భగుడిలోని మూలవిరాట్టు ఎత్తును బట్టి విమానం రూపురేఖలు ఎత్తు నిర్ణయిస్తారు.


విమానగోపురాలలో దాదాపు 20 రకాలున్నాయి.అవి


(1) మేరువు 

(2) మందరం 

(3) కైలాసం

(4) విమానం 

(5) నందనం 


(6) సముద్గం

(7) పద్మం

(8) గారుడం

(9) నందిని

(10) కుంజరం


(11) వర్ధనం

(12) గృహరాజం

(13) వృషభం

(14) హంస

(15) ఘటము


(16) సర్వతోభద్రం

(17) సింహం

(18) మహేంద్ర

(19) రాజహంస

(20) స్వస్తికం


దేవుడి అభిషేకజలం పోవుమార్గాన్ని *సోమసూత్రం* అంటారు.


దేవుడిని ప్రతిష్టించే అధిష్టానానం నాలుగు లేదా లేదా ఎనిమిది లేదా పదహారు ముఖములు కలిగివుండాలి.లేదా గుండ్రంగా వుండాలి.

ప్రధానదేవుడి అధిష్టానం, ఉత్సవ విగ్రహాలకు అధిష్టానం వేరువేరుగా వుంటాయి.


ఈ దేవతాపీఠాలు లేదా మూలవిగ్రహాపీఠాలు (1) పద్మపీఠం, (2)శేషపీఠం, (3) కుముదపీఠం (4) సోమపీఠం (5) ద్వాదశాశ్రమం అని 5 రకాలు.


ఘంటానాదం వలె  గంభీరంగా మ్రోగేది పురుషశిల.

సంగీతంలోని లయతాళములవలే  మ్రోగునది స్త్రీ శిల.

స్వరంపీలగా, హీనంగావుండునది నపుంసకశిల.


పురుషశిలతో మూర్తిని, స్త్రీ శిలతో పీఠాన్ని, నపుంసకశిలతో పాదపీఠం చేయడం ఉత్తమo...

1, ఫిబ్రవరి 2021, సోమవారం

ఐదు 'జ' కారాలనూ

 *జామాతా,  జఠరం,  జాయా, జాతవేదా,  జలాశయ:*


*పూరితేనైవ పూర్యన్తే జకారా: పంచ దుర్లభా:* *(దుర్భరా)*


లోకములో తృప్తి అనేది వేటికి  వుండదు? 

అని ఆలోచించి ఒక కవి యిలా అన్నాడు:


ఈ లోకం లో ఐదు

 'జ'   కారాలున్నాయి.

వాటికి ఎంత చేసినా తృప్తి అనేది వుండదు. అవి ఏమిటంటే :


(1) 'జామాతా' అంటే అల్లుడు. 

ఎంత యిచ్చినా చాలు అనని వాడు.


(2) 'జఠరం'  అంటే కడుపు. 

దీనికీ అంతే ఎంత తిన్నా మరునాటికి మామూలే. 


(3) 'జాయా'  అంటే భార్య. 

ఈవిడ కూడా అంతే.

ఎంత మంచిగా ఉన్నా ఎప్పుడూ కోపమే.


(4) 'జాతవేదా'   అంటే అగ్ని. 

ఎన్ని వస్తువులు వేసినా కాలిపోతూ వుంటాయి. 


(5) 'జలాశయ'  అంటే సముద్రము. 

ఎంతనీరు వచ్చి పడినా తృప్తి లేదు.


ఈ ఐదు 'జ'   కారాలనూ తృప్తి పరచటం కష్టం.


శాశ్వత మైన జఠరాలు.

అసంతృప్తి తప్ప, 

తృప్తి అనేదే ఉండదు. 

                                                                

*సర్వే జనా సుఖినోభవంతు*

🌹👏🏾🌷

తర్పణాలు

 🌻🍄🌻🍄🌻🍄🌻

🍄🌻🍄🌻🍄🌻🍄




*🌻 అందరం తప్పకుండా తెలుసుకోవలసిన తర్పణాలు వాటి సమగ్ర వివరణ 🌻*



""తృప్తినిచ్చే అర్పణం తర్పణం ""అంటారు.



1. తర్పణం అంటే ఏమిటి ?


పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.


2. తర్పణము ఎన్నిరకాలు ?


తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.


ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.

1-గరుడ తర్పణం : -

ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.


2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : -

నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.


3-పర్హెణి తర్పణం : -

యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.


4-సాధారణ తర్పణం : -

అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు.


మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.


3. తర్పణాలు ఎందుకు వదులుతాము ?

తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకోనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.


4. ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ?

1. తేనె ద్వార తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.


2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .


3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.


4. ఆవు నేతితో తర్పణము చేస్తే, సుఖము


5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, సర్వ సిద్ధి


6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే …….. శత్రు నాశనము


5. తర్పణం ఎలా వదలాలి ?


కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను.


(అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?


మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


 భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


*పితృదేవతలకు.... ఆకలా...?*


అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*


*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*


అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.


మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...


పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..


*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*


అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.


*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*


సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.


క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.


భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.


చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.


ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.


*ఓం గం గణపతయే నమః*🌻

మనసునుంచి పుట్టిన సరోవరం🌼

 🍄🌼🍄🌼🍄🌼🍄

🌼🍄🌼🍄🌼🍄🌼




*🌼మనసునుంచి పుట్టిన సరోవరం🌼*




మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం వల్ల పార్వతి (దుర్గాదేవి)కి ఈ పేరు వచ్చింది. మహిషాసురుడు గొప్ప బలవంతుడు. అతనికి ఉన్న వర మహిమ అతనిని మరింత బలవంతుడిని చేసింది. ఆ బల గర్వంతో మూడు లోకాలను జయించి విజయగర్వంతో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించసాగాడు. దేవతలను, రుషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో, బాధతో మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వారి వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద వారికి కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు (వెలుగు.. ఒక శక్తి) పుట్టింది. దానికి ఒక రూపం ఏర్పడింది. ఆ తరువాత మూడు కోట్ల దేవతల కోపం, ఆవేశం ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా, అదే ఆదిశక్తిగా, అమ్మగా అవతరించింది. దేవతలందరూ తమ తమ శక్తిని, ఆయుధాలను అమ్మకు ఇచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, మహా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, విశ్వకర్మ ఒక పదునైన గొడ్డలి (పరశువు)ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తికి ఆయుధాలుగా ఇచ్చారు. హిమవంతుడు సింహాన్ని తల్లికి వాహనంగా సమర్పించాడు. పరాశక్తి ఆ సింహాన్ని వాహనంగా చేసుకుని పైన చెప్పిన ఆయుధాలను తీసుకుని వరుణుడు ఇచ్చిన శంఖాన్ని పూరించింది. ఆ శంఖ నాదశక్తికి తట్టుకోలేక రాక్షసులు తలకిందులయ్యారు. మహిషాసురుడు అణిమాది అష్టసిద్ధుల సహాయంతో సింహరూపంలో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు. మత్తగజంలా మారి అమ్మను ముట్టడించబోయాడు. చివరకు తన సహజరూపమైన దున్నపోతు (మహిషం) రూపంలో, తన వాడి కొమ్ములతో అమ్మ మీద దండెత్తాడు. తన త్రిశూలంతో అమ్మవారు ఆ మహిషాసురుడి గుండెలను చీల్చిపారేసింది. మహిషాసురుడు ఆరుగురు రాక్షసులకు ప్రతిరూపమైనవాడు. చండ, ముండ, శుంభ, నిశుంభ, దుర్గమాసుర, మహిషాసుర.. ఈ ఆరు రూపాలు రజో, తమో గుణాలకు ప్రతీకలు. సత్వ గుణానికి అధి దేవత అయిన జగన్మాత ఈ ఆరుగురు రాక్షసులనూ సహరించింది. అలా సంహరించిన రోజే దసరా అయ్యింది.


*మానస సరోవరం*


ఇది పవిత్ర తటాకం. ఇది హిమాలయ పర్వత శిఖరాల మధ్య టిబెట్టులో ఉంది. హిందువులకు ఇది అత్యంత తీర్థాస్థలి. ఇక్కడ సాక్షాత్తూ శివుడు కొలువు ఉంటాడని, ఆయన కైలాస పర్వతశ్రేణిలోనే ఈ పవిత్ర కొలను ఉందని నమ్మిక. ఇక్కడ ముక్కోటి దేవతలు నివసిస్తారని అంటారు. ఈ సరోవరానికి ఉత్తర దిక్కున కైలాస పర్వతం ఉంటుంది. ఈ సరస్సు సముద్ర మట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇందులో స్వచ్ఛమైన జలం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ఆలోచనల (మనసు) నుంచి ఈ సరస్సు ఆవిర్భవించిందని, అందుకే దీనిని మానస సరోవరం అంటారని చెబుతారు. జ్ఞానానికి, అందానికి ప్రతిరూపమైన హంసలు ఇక్కడ స్వేచ్ఛా విహంగాలై విహరిస్తాయి. భారతీయతకు మూలమైన వేదాలకు అధిదేవత అయిన వేద దేవత ఇక్కడే విహరిస్తుందని అంటారు. కైలాస మానస సరోవర యాత్ర అనేది ప్రతి హిందువు కలగనే ఆధ్యాత్మిక యాత్ర. బ్రహ్మపుత్ర, గంగ, సట్లజ్‍ నదులు మానస సరోవరం నుంచే పుట్టాయని కూడా అంటారు. శాస్త్రీయంగా కూడా ఇది శక్తి ప్రాంతం. ఇక్కడ అడుగు పెట్టగానే అద్భుతమైన శక్తి సొంతమైన భావన కలుగుతుంది.🌼

నవగ్రహ దోషముల

 🙏🍄🙏🍄🙏🍄🙏

🍄🙏🍄🙏🍄🙏🍄




*🙏నవగ్రహ దోషముల స్నానౌషధములు నవగ్రహ దోషములు-స్నానౌషధములు🙏*



*నవగ్రహ దోషములు*


స్నానౌషధములు సిద్ధౌషధ సేవలవలన రోగములు, మంత్ర జపమువలన సకల భయము తీరునట్లుగా ఔషధ స్నాన విధానము వలన గ్రహదోషములు నశించును.



*సూర్య గ్రహ దోషము తొలగుటకు:*


మణిశిల,ఏలుకలు, దేవదారు,కుంకుమ పువ్వు,వట్టివేళ్ళు,యష్టిమధుకము,ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు -ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను.



*చంద్ర గ్రహ దోషము తొలగుటకు:*


 గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి, శంఖములు,మంచిగంధములు,స్పటికము-ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.



*కుజ గ్రహ దోషము:*


మారేడు పట్టూ, ఎర్రచందనము, ఎర్రపువ్వులు,ఇంగిలీకము,మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు -ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.



*బుధ గ్రహ దోషము:*


ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారము -ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలయును.



*గురు గ్రహదోషమునకు:*


మాలతీపువ్వులు,తెల్ల ఆవాలు,యష్టి మధుకం, తేనే -వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.



*శుక్ర గ్రహదోషము:*


 యాలుకలు,మణిశిల, శౌవర్లవణము,కుంకుమ పువ్వు-ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆనీటితో స్నానము చేయవలయును.



*శని గ్రహ దోషము:*


నల్ల నువ్వులు, సుర్మరాయి,సాంబ్రాణి, సోపు, -వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.



*రాహు గ్రహ దోషము:*


సాంబ్రాణి,నువ్వు చెట్టు ఆకులు,కస్తూరి,ఏనుగు దంతము (ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) -ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.



*కేతు గ్రహ దోషము:*


సాంబ్రాణి,నువ్వుచెట్టు ఆకులు,ఏనుగు దంతం, మేజ మూత్రం , మారేడు పట్ట-ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.🙏

గురుచండాల యోగం🥀*

 🍄🥀🍄🥀🍄🥀🍄

🥀🍄🥀🍄🥀🍄🥀




*🥀గురుచండాల యోగం🥀*



గురుగ్రహానికి రాహువు చేరువై చండాల యోగాన్ని ఇస్తాడు. దీనినే గురు చండాల యోగం అంటారు. 

కలియుగంలో ధర్మం ఒక పాదంపైన, అధర్మం 3 పాదాలపైనా నడుస్తున్నదని పురాణాలు చెప్తాయి. ఈ మూడు పాదాల అధర్మ నడకకు పెద్దపీట వేసే గ్రహమే రాహువు. చంద్రునికి ఉత్తర ధృవ బిందువుగా రాహువుంటే, దక్షిణ ధృవ బిందువుగా కేతు వుంటాడు. నవగ్రహాలలో రాహు కేతువులు మినహా మిగిలిన ఏడూ గ్రహాలూ గడియారంలో ముళ్ళువలె సవ్య దిశలో సంచారంలో ఉంటాయి. కాని రాహు కేతువులు అపసవ్య సంచారంలో ఉంటాయి. రాహువు ఉన్న రాశికి, ఏడవరాశిలో కేతువు ఉంటాడు.


ప్రపంచ రాజకీయ రంగాన్ని పరోక్షంగా శాసించే వాడే రాహువు. దీనికి తోడు నూతన అంశాలపై దృష్టి ఉంచి విశేష విజ్ఞానానికి బాటలను వేసేవాడు కూడా రాహువే. ప్రపంచంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతున్నదంటే, కేవలం రాహు అనుగ్రహమని చెప్పటంలో అతిశయోక్తి లేదు. లోక కల్యాణానికి పునాదులు వేసే విజ్ఞాన శాస్త్రానికి సారధిగా రాహువు ఉండటం నాణేనికి ఒకవైపు అంశం. అదేవిధంగా నాణేనికి రెండవ వైపున విజ్ఞాన శాస్త్రంలోనుంచే విశ్వ వినాశనానికి ప్రేరణ కారకత్వాన్ని ఇచ్చేవాడు కూడా ఛాయా గ్రహమైన రాహువే.


మానసిక, శారీరక, ఆర్ధిక, కుటుంబ, నేత్ర, దంత, సోదర, సోదరీ, వృత్తి, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ, సంతాన, దాంపత్య, పితృ, ఆయు స్థాన అంశాలన్నిటి లోను అనుకూలంగా, ప్రతికూలంగా ఫలితాలను తనికిష్టమైన రీతిలో ఇచ్చే ఏకైక గ్రహమే రాహువు. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు, ఆకాశ మార్గంలో విమాన ప్రమాదాలు, దానితో పాటు రిమోట్ తో పేల్చే ప్రమాదాలు, ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు పడిపోయే ఘోర ప్రమాదాలు, నూతన వైరస్ క్రిముల ఉత్పత్తితో పాటు అనేకానేక అంశాలన్నీ రాహు ప్రాబల్యం వలెనే జరుగుతుంటాయి. ఇతర గ్రహాలు రాజయోగం ఇచ్చినా, ఇవ్వకపోయినా రాహువు తన ఇష్టానుసారంగా ఫలితాలను తారుమారు చేయగలడు. అందలం ఎక్కించగలడు. భూస్థాపితం చేయగలడు.

గ్రహస్థితి బలహీనమైనప్పుడు మానవుడు ఎంత ప్రతిభాశాలి అయిననూ విధి వంచితుడు కాక తప్పదు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచుగా కనపడుతుంటాయి. వ్యక్తికి అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జేజేలు పలికిననూ రాహు, కేతువుల అనుగ్రహం లేని కారణంగానే నామినేషన్ల తదుపరి చేసే స్క్రూట్నీతో పేరు గల్లంతవుతుంది. స్వల్ప అవయోగాలవ లెనే విశేష రాజయోగాలు ఉన్ననూ దెబ్బతినేవారు అనేకమంది ఉన్నారు. ముక్కు మొహం తెలియని వారు ఒక్కోసారి అనుకోకుండా ఎన్నికలలో గెలవటము, ఉన్నత పదవులు అలంకరించటము జరుగుతుంది. ఇలాంటి యోగాలని అనుకోకుండా అందించేవాడే రాహువు.


ముఖ్యంగా రాజకీయ రంగము, విజ్ఞాన శాస్త్ర రంగములపై అనుకూల స్థితి ఏ స్థాయిలో ఉంటుందో, దానికంటే రెట్టింపుగా ప్రతికూల పంజాలు ఇవ్వటంలో రాహువుకి సాటి ఎవ్వరూ రారు. ఇంకా ఈ రెండు రంగాలను గురించి కొంత లోతుగా చర్చించుకుందాం.


సప్త గ్రహాలూ అనుకూలించక పోయినప్పటికీ రాహు, కేతువుల యోగాల వలన అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. రాహు, కేతువులు ఇచ్చే యోగాలు శాశ్వతం కావు. అశాశ్వతాలే. కనుక ఈ అశాశ్వత రాజ యోగాలను పట్టుకొని, మన వ్యక్తిత్వాన్ని సరియైన స్థితిలో నియంత్రించుకుంటూ ఉంటుంటే రాహు, కేతువులిచ్చే అశాశ్వత యోగాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేకుంటే మహారాజ సమానుడై భోగ భాగ్యాలతో జీవితం గడుపుతూ చివరకు ఆకాశ వీధులలో మరణం జరిగి అన్నీ అవయవాలు లేకుండా అంత్య క్రియలు జరగటం కూడా ఈ ఛాయా గ్రహాల ప్రభావమేనని గుర్తించాలి. 

రాజకీయ అధికారానికి రాహువు కారకుడు. అంతేకాక అనువంశిక రాజకీయ వారసత్వానికి కూడా రాహువే కారకుడు. పొడవైన, అందమైన శిరోజాలు కావాలంటే రాహు ప్రీతి అవసరం. బంధన కారకత్వం కూడా రాహువు వలెనే జరుగును. బాంబు ప్రేలుడు, ఇతర విస్ఫోటనాలచే మరణానికి రాహువు కారకుడవుతాడు. కఠిన కారాగార యోగము, దీర్ఘకాల కారాగార వాసము, న్యాయ స్థానాలచే సమస్యలు, ఉగ్రవాదుల, తీవ్రవాదుల వలన వాటిల్లే సమస్యలు రాహువు యొక్క దుర్యోగములే.


పదవులు, అత్యున్నత రాజకీయ జీవితం, రాజ్యాధికారము మొదలగు యోగములు పొందాలంటే జాతకునికి రాహు స్థితి ప్రధానంగా అనుకూలమై ఉండాలి. ఇట్టి రాహు అనుగ్రహానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఎంతో తోడ్పడుతుంది. రాహుకాల దీపములు నిమ్మ డొప్పలలో పెట్టవలెను. గురు రాహు లకు జప దాన హోమ శాంతులు చేయించుకొనవలెను.🥀

మత్స్య యంత్రము

 🌷🍄🌷🍄🌷🍄🌷

🍄🌷🍄🌷🍄🌷🍄




*🌷మత్స్య యంత్రము🌷*



మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి 'మత్స్యావతారము'. విష్ణు ద‌శావ‌తార‌ముల‌లో మొట్టమొద‌టి అవ‌తార‌మే మ‌త్స్యావ‌తార‌ము వేద స‌ముద్ధర‌ణ‌కై అవ‌త‌రించిన శ్రీ మ‌హావిష్ణువు రూప‌ము. ఈ యంత్రము, ఇత‌ర యంత్రముల కంటే చాలా విశిష్టమైన‌ది. స‌మ‌స్త వాస్తు దోష నివార‌ణ యంత్ర రాజ‌ము ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము – వాని ప్రస్థార‌ము నందు గ‌ల స‌ప్తావ‌ర‌ణ‌ల‌లోను అతి ముఖ్యము శ‌క్తివంత‌మైన బీజాక్షర‌ముల‌తో రూపొందించ‌బ‌డి, స‌ర్వ సాంప్రదాయాను కూల‌ముగా నిర్మించ‌బ‌డింది.


పూజా విధి ఈ మ‌త్స్య యంత్రమును శాస్త్రానుసార‌ముగా దైవ‌జ్ఞుల‌చే త‌యారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ క‌ళాన్యాస‌, ప్రాణ‌ప్రతిష్టాదుల‌ను జ‌రిపించి, శుభ స‌మ‌య‌మున యంత్ర పూజ‌, జ‌పాదుల‌ను ప్రారంభించ‌వ‌లెను. ఈ యంత్రమును శ‌క్తివంత‌ముగా చేయుట‌కై విధి విధాన‌మును మిగిలిన యంత్రముల క‌న్న కొంచెం ఎక్కువ‌గానే నిర్ధేశింప‌బ‌డిన‌ది. 


మత్స్య యంత్రమును 

                శ్లో ||   స్వర్ణేన రజతే  నాపి  పంచాంగుళ  ప్రమాణకమ్ |

                         యంత్రపత్రం  విరచ్యాధ  సప్తకోణం  లిఖేత్పురమ్ |

                         వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |

                         మధ్యేతు మత్స్య  మాలిఖ్య  గృహస్థాపన శోభనమ్ |

                         అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |

                         శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ ||

                          

మత్స్య యంత్రంను ఐదు శేర్ల ధాన్యములో ఒక దినం, పంచామృతములందు ఒక దినం మంచి నీటిలో ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును చేసి శంఖు స్థాపన చేసిన గృహ స్థలములలో ఈ యంత్రమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ యంత్రంను స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు, కూప వేధలు, స్తంభ వేధలు, వీధి శూలలు ఆయుర్ధాయము నశించిన గృహ దోషములు, శంఖు స్థాపన చేయక కట్టిన దోషమును మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.🌷

శ్రీకృష్ణుడికి ఎంత మంది పిల్లలో తెలుసా?🦚*

 🦚🌸🦚🌸🦚🌸🦚

🌸🦚🌸🦚🌸🦚🌸



*📖  ఇతిహాసాలు 📓*



*🦚శ్రీకృష్ణుడికి ఎంత మంది పిల్లలో తెలుసా?🦚*



శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ. కానీ, గోవిందుడి కొడుకులు ఎవరు? ఎంతమంది ఉన్నారన్న అనుమానం కలుగుతుంది. మథురని చేరి కంసుని చంపిన దేవదేవుడు తరువాత దేవకీ, వసుదేవుల చెంత వుంటూ వారిని అనుగ్రహించాడు. ఈ సందర్భంలో ఆయన అనేక వివాహాలు చేసుకున్నాడు. ప్రధానంగా ఎనిమిది మంది భార్యలు ఆయనకు అష్ట మహిషులుగా ప్రసిద్ధి పొందారు! శ్రీకృష్ణ పత్నులైన ఆ ఎనిమిది మంది... లక్ష్మీదేవీ అవతారమైన రుక్మిణీ మాత, సత్రాజిత్తు తనయ అయిన సత్యభామ, శ్రీరాముని బంటైన జాంబవంతుని పుత్రిక జాంబవతి, అలాగే, వివిధ రాజ్యాల రాకుమార్తెలైన నాగ్నజితీ, భద్ర, మిత్రవింద, కాళింది, లక్షణ. ఈ ఎనిమిది మందితోనూ శ్రీకృష్ణ పరమాత్మకి పదేసి మంది కొడుకులున్నారని చెబుతోంది భాగవత పురాణం! అంటే, మొత్తం ఎనభై మంది తనయులున్నమాట!


గోపాలబాలుడి కులంలో పుట్టిన ఆయన వంశోద్ధారకుల్లో అందరూ ప్రాముఖ్యత వహించలేదు. అయితే, రుక్మిణీ దేవీ కుమారుడైన ప్రద్యుమ్నుడు మహా సుందరుడు, వీరుడు. ఆయన సాక్షాత్తూ రతీదేవీ భర్త అయిన మన్మథుడు. శివుడికి తపోభంగం చేసిన కారణాన ఆయన రూపం నశించి పోగా.. రుక్మిణీ దేవీ గర్భంలో జన్మించి తిరిగి రూపం పొందాడు ప్రద్యుమ్నుడుగా! రుక్మిణీదేవీకి ప్రద్యుమ్నుడు కాక మరో తొమ్మిదిమంది పుత్రులున్నారు. అలాగే, సత్యభామకి భాను, సుభాను, స్వర్భాను అంటూ పది ముంది భాను పేరుగల పుత్రులున్నారు. ఇక మరో ప్రధానమైన కృష్ణుడి పత్ని అయిన జాంబవతి కుమారుడు సాంబుడు. ఈయన కురుక్షేత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాటం చేసి చివరకు ప్రాణాలతో నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మరణించని అతి కొద్దిమందిలో జాంబవతి, శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు కూడా ఒకరు! ఈయన కాక మరో తొమ్మిది మంది సంతానం జాంబవతికి వున్నారు.


రుక్మిణీ, సత్యభామ, జాంబవతి లాగే ఇతర శ్రీకృష్ణ పట్టపు రాణులకు కూడా అనేక మందిపుత్రులున్నారు.  అయితే, వాళ్లలో అందరూ కలియుగ ప్రారంభసమయంలో మురళీ మోహనుని అవతార సమాప్తి తరువాత అంతమై పోయారు. శ్రీకృష్ణ, బలరాముల వంశంలో అంతః కలహాలు పెల్లుబికి ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు! అలా కృష్ణుని సంతానం ఏదీ మిగలలేదు. రుక్మిణీ, శ్రీకృష్ణ పరమాత్మల తనయుడైన ప్రద్యుమ్నుడికి మాత్రం అనిరుద్ధుడనే కొడుకు కలిగాడు. ఆయన మాత్రం కృష్ణ వంశాన్ని కొనసాగించాడు!🦚

సప్తపది

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                      *సప్తపది!*

                     ➖➖➖✍️


మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగులకు ఉన్న సంబంధమేంటి ?


సాధారణంగా హిందు వివాహ సాంప్రదాయంలో వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థముందంటారు మన పెద్దలు.

ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటిగా చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పురోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.


వివాహ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వధువరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్నే సప్తపది అంటారు. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. 

పురోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.


"సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం!"


ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు. మరి ఏడు అడుగుల వెనుక దాగున్న పరమార్థాలేంటో తెలుసుకుందాం...


మొదటి అడుగు:

*"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!"


రెండవ అడుగు..

*"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక


మూడవ అడుగు:

*త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.


నాలుగవ అడుగు:

*"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.


ఐదవ అడుగు:

*"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.


ఆరవ అడుగు:

*"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు"* 

ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.


ఏడవ అడుగు:

*"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక. 

మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀