15, జులై 2025, మంగళవారం

అయిదు ప్రశ్నలకు

 ఈ అయిదు ప్రశ్నలకు 

సరైన జవాబులు వెతికి పట్టుకోగలవాడే జ్ఞానవంతుడు. 


ఆ జవాబులకు తగినట్టుగా 

జీవించటమే బుద్ధిమంతుడి లక్షణం. 


1 నేనెవరు, 

2 నా లక్ష్యం ఏమిటి, 

3. ఈ లక్ష్యం చేరేది ఎలా, 

4 మార్గం ఏమిటి, 

5 వీటికి విరోధి ఎవరు? 


ఈ ప్రశ్నపంచకాన్ని అర్థపంచకం అంటారు. 


మొదటి ప్రశ్న సమాధానంపై మిగతా నాలుగు ప్రశ్నల జవాబులు ఆధారపడి ఉంటాయి.


నేను జీవుడిని, నాకు ఆధారం దేవుడు. నేను అస్వతంత్రుడిని, భగవంతుడు సర్వస్వతంత్రుడు అన్న ఎరుక కలగటమే తొలి ప్రశ్నకు జవాబు. 


మనం ఏమిటన్నది మొదట తెలుసుకోవటం 

స్వరూప జ్ఞానం. జీవుడినైన నేను దేవుడికి దూరమయ్యాను, తిరిగి చేరువ కావటం నా లక్ష్యం అన్నది రెండో ప్రశ్నకు జవాబు. ఇది ఫలస్వరూప జ్ఞానం.


ఈ లక్ష్యం భగవంతుడి అనుగ్రహంవల్లే నెరవేరాలి. మార్గదర్శనం చేయించగల సమర్థుడు... ఆయనను నమ్మి మనస్ఫూర్తిగా ఆదుకొమ్మని ఆకాంక్షిస్తే, ఏదో ఒక దారి కనిపించకపోదు. 


అది కర్మ కావచ్చు, 

భక్తి కావచ్చు, 

జ్ఞానం కావచ్చు. అర్హతకు తగిన మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఇది పరస్వరూప జ్ఞానం.


మార్గం అంటే ఉపాయం. 


ఏ మార్గంలో ఎలా వెళ్లాలో ముందుగా ఆలోచించి, అడుగు వేయడం చాలా అవసరం. చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి కలిగి, చేపట్టిన పనులు చేస్తే భగవంతుడు మెచ్చుతాడు. కృష్ణార్పణంగా చేసే కర్మలే నిష్కామ కర్మలు.


 ‘కర్మ నీ వంతు, ఫలితం నా పూచీ’ అని కృష్ణుడు చెప్పనే చెప్పాడు. నదులన్నీ సముద్రంలో చేరే చందాన ఆ కర్మలు మోక్ష ద్వారానికి దారి తీస్తాయి, దగ్గరికి చేరుస్తాయి. 


ఈ దారిలో ఎదురుపడే విరోధులు ఎవరు? 


అహంకార 

మమకారాలు, 

రాగద్వేషాలు, 

స్వపర భేదాలు. వీరందరూ ఇంటి దొంగలు. 


మనలోని అజ్ఞానపు చీకటి గది వీరి నివాసం. 


యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు సాధనా రూప దీపాలు. వీటి వల్ల మనసుకు పట్టిన మకిలి దూరం అవుతుంది. మనసు నిలకడ ధారణ. తైల ధారలా సాగే మనోయానమే ధ్యానం. ధ్యానం పరాకాష్ఠ చెందడమే సమాధి. విరోధిని అధిగమించిన సమాధి అయిదో ప్రశ్నకు సమాధానం. అదే స్వస్వరూప జ్ఞానం. 


అంటే స్వతహాగా మనం అజ్ఞానులమని తెలుసుకోవటం. అజ్ఞానం తొలగితే అంతా జ్ఞానమయమే. 


శరణాగతికే మరో పేరు ఉపాయ స్వరూప జ్ఞానం.


భారత, 

భాగవత, 

రామాయణాలు జ్ఞాన భాండారాలు. నిత్యపారాయణ గ్రంథాలు కూడా. మనమేమిటో, మన స్వరూప, స్వభావాలు ఎలాంటివో, ఏ విధంగా మనం మన జీవితాలను మలచుకోవాలో, సర్వగమ్యమైన జీవిత పరమార్థం ఎలా సాధించాలో... వీటికి తగిన సమాధానాలు వాటిలో ఉన్నాయి. 


భారతం అంటే స్థూల శరీరం. 

భాగవతం సూక్ష్మశరీరం. 

రామాయణం కారణ శరీరం. 


భారతం చదివి మానవుడిగా, 

భాగవతం చదివి దేవుడిగా, 

రామాయణం చదివి ఆదర్శ మానవుడిగా మెలగటం నేర్చుకోవాలి. 


నేర్చినది జీవితానికి అనువదించాలి లేక ఆచరించాలి. అందుకే వ్యాస వాల్మీకులు వేదసారాన్ని సులభ సుందరంగా అక్షరానువాదం చేసి మనకు నిత్య సంసేవనంగా అందజేశారు. ఇహం లేనిది పరం దక్కదు. కర్మ చేయక జ్ఞానం దొరకదు. కర్మ జ్ఞానాలు భక్తిలో ఊరితేగాని పరిపూర్ణం కావు. 



ప్రతి మనిషిలో మూడు భాగాలున్నాయి. 


ఒకటి పశు భాగం. 

రెండోది ప్రాణ భాగం. 

మూడోది ఆత్మ భాగం. 


శరీరం, ప్రాణం, ఆత్మ... ఈ మూడూ మనుగడకు, అస్తిత్వానికి ఆధారభూతాలు.


 ‘నేను జీవుడిని... నాకు ఆధారం ఆ దేవుడు’ అన్న మొదటి సమాధానమే భవ్య దివ్య జీవన సంవిధానానికి మూలాధారం.

మంగళవారం🍁* *🌹15 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

  *🌹15 జూలై 2025🌹*       

    *దృగ్గణిత పంచాంగం*  

             

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి  : పంచమి* రా 10.38 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : శతభిషం* ఉ 06.26 వరకు ఉపరి *పూర్వాభాద్ర*

*యోగం : సౌభాగ్య* మ 02.12 వరకు ఉపరి *శోభన*

*కరణం   : కౌలువ* ప 11.21 *తైతుల* రా 10.38 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 06.00 - 08.00 సా 04.30 - 06.30*

అమృత కాలం  : *రా 09.59 - 11.33*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.39*

*వర్జ్యం      : మ 12.39 - 02.13*

*దుర్ముహూర్తం  : ఉ 08.19 - 09.11 రా 11.08 - 11.52*

*రాహు కాలం   : మ 03.29 - 05.06*

గుళికకాళం       : *మ 12.13 - 01.51*

యమగండం     : *ఉ 08.58 - 10.36*

సూర్యరాశి : *మిధునం*  

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 05.50*

సూర్యాస్తమయం :*సా 06.54*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.43 - 08.19*

సంగవ కాలం         :      *08.19 - 10.55*

మధ్యాహ్న కాలం    :     10.55 - 01.32

అపరాహ్న కాలం    : *మ 01.32 - 04.08*

*ఆబ్ధికం తిధి: ఆషాఢ బహుళ పంచమి*

సాయంకాలం        :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.56*

రాత్రి కాలం           :*రా 08.56 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.15 - 04.59*

------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


  *🚩శ్రీ ఆంజనేయ స్తోత్రం🚩*


*గతి నిర్జిత వాతాయ* 

*లక్ష్మణ ప్రాణదాయచ*

*వనౌకసాం వరిష్ఠాయ* 

*వశినే వననాసినే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం -‌ పంచమి - శతభిషం & పూర్వాభాద్ర-‌‌ భౌమ వాసరే* (15.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వ్యంగ్యాస్త్రాలు

 గొప్పవారి వ్యంగ్యాస్త్రాలు,చమత్కారాలూ కూడా గొప్పగానేవుంటాయి.🙂

ఒకసారి కవిసమ్మేళనం జరుగుతోంది.కవులందరూ విచ్చేసారు.మహాకవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ గారూ కూడా సభకు విచ్చేసారు. ఆయన్ని చూసి కవులందరూ వారిని సగౌరవంగా స్వాగతించారు.

శ్రీ జాషువా మాత్రం ఏదో పుస్తక పథనంలో ఉండిపోయారు.

ఆదిచూసిన విశ్వనాధ వారు జాషువా ను ఉద్దేశించి,

"పక్షి నారాకను గమనించలేదు" అన్నారు.

అది విని కవులందరూ ఇంతటి మహాకవి జాషువాని పక్షి తో పొలుస్తారా అని ముక్కున వేలు వేసుకున్నారు.😕

కానీ జాషువా మాత్రం చిరునవ్వుతో లేచి విశ్వనాధారికి నమస్కరించి ,"మీలాంటి కిరాతకుల దృష్టి ఎప్పుడూ పక్షులమీదే కదా" అన్నారు

.

విశ్వనాధుని ఈ జాషువా అంత మాట అంటాడా అని కవులందరూ నిశ్చేస్టు లయ్యారు. 🤔😕

కానీ జాషువా అన్న మాటకి విశ్వనాధులు పగల పడి నవ్వేశారు. 😄

దీని అంతరార్ధం ఏమిటంటే.. జాషువాని పక్షి తో ఎందుకు పోల్చేరంటే జాషువాకి ఆ సభలో "కవి కోకిల"(పక్షి కదా) అనే బిరుదు ఇస్తున్నారు. అందుకే జాషువాకి కోపం రాలేదట.🙂

ఇక జాషువా విశ్వనాధుని కిరాతకుడు అన్నారు.

కిరాతకుడు అంటే విశ్వనాదులవారు "శ్రీ రామాయణ కల్పవృక్షం" అని రామాయణం రాస్తున్నారు అందుకు జాషువా ఆయన్ని (కిరాతకుడు)వాల్మీకి తో పోల్చాడు.🙂

ఇంకో విషయం. జాషువా విశ్వనాధుల వారి అనుంగు శిష్యుడు !!🙂

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


పితా௨హమస్య జగతో మాతా ధాతా పితామహః 

వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ (17)


గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ 

ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ (18)


ఈ జగత్తుకు తండ్రి, తల్లి, కర్మఫలదాత, తెలుసుకోదగ్గవస్తువు నేనే. ఓంకారం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే. ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాసస్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వతబీజం నేనే.

న్యాయ మార్గాన్ని అనుసరించేవాడికి

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *యాన్తి న్యాయప్రవృత్తస్య*

             *తిర్యఞ్చోఽపి సహాయతామ్l*

             *అపన్థానం తు గచ్ఛన్తం*

             *సోదరోఽపి విముఞ్చతిll*


          *... _శ్రీమద్రామాయణమ్_ …*


తా𝕝𝕝 *"న్యాయ మార్గాన్ని అనుసరించేవాడికి సమస్త ప్రాణులు సహాయం చేస్తాయి... తప్పుడు మార్గంలో వెళ్ళేవాడిని సోదరుడు కూడా విడిచిపెడతాడు"....*


 ✍️🌹💐🌸🙏

18-47-గీతా మకరందము

 18-47-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అII స్వధర్మాచరణము చాల ఉత్తమమైనదని వచించుచున్నారు -


శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | 

స్వభావనియతం కర్మ 

కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || 


తా:- తనయొక్క ధర్మము (తన అవివేకముచే) గుణములేనిదిగ కనబడినను (లేక, అసంపూర్ణముగ అనుష్ఠింపబడినను) చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మముకంటె (లేక, ఇతర ధర్మములకంటె) శ్రేష్ఠమైనదే యగును. స్వభావముచే ఏర్పడిన (తన ధర్మమునకు తగిన) కర్మమును చేయుచున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు.


వ్యాఖ్య:- స్వకీయకర్మ, లేక తన ధర్మము ఆచరించుట ఒకింత కఠినమైనను, తేలికగా ఆచరింపబడినట్టి ఇతరుల కర్మను గ్రహించుటకంటె అది ఎంతయో మేలని చెప్పబడినది. కావున నిజధర్మమును ఒకింత కష్టమైనను వదలరాదు. స్వకీయకర్మను పైశ్లోకమందు తెలుపబడిన చందమున ఈశ్వరార్పణబుద్ధితో చేసినచో మనుజుడు పాపమును బొందకుండును.

(లేక, ఇచట స్వధర్మమనగా ఆత్మకు సంబంధించిన ధర్మమనియు చెప్పవచ్చును. ఆత్మచింతనాదులు, ఆత్మధ్యానాదులు ఒకింత ప్రయాసముగా తోచినను, పరధర్మములైన దృశ్యవస్తుధర్మములను, లేక, దృశ్యవస్తుచింతనమును గ్రహించుటకంటె ఎంతయో మేలైనవి. ఆత్మచింతనాదులు (స్వధర్మము) ప్రారంభమున ఒకింత కష్టముగ తోచినను తుదకు అనంత సౌఖ్యమును ప్రసాదించును. దృశ్యవస్తువులు (పరధర్మము) ప్రారంభమున సుఖవంతములుగ తోచినను తుదకు పరమదుఃఖమునే కలుగజేయును. కావున పరధర్మముకంటె స్వధర్మమే మేలని చెప్పబడినది).


ప్ర:- జీవునకు ఏ కర్మము, ఏ ధర్మము శ్రేష్ఠమైనది?

ఉ:- ఒకింతకష్టముగా తోచినను స్వకీయకర్మమే శ్రేష్ఠమైనది.

ప్ర:- దేనిచే మనుజుడు పాపమును బొందకుండును?

ఉ:- స్వభావముచే ఏర్పడిన కర్మమును, స్వధర్మమును (ఈశ్వరార్పణబుద్ధితో) చక్కగ నాచరించినపుడు పాపమును బొందకుండును.

తిరుమల సర్వస్వం -301*

 *తిరుమల సర్వస్వం -301*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-16


ఆలయాన్ని కంఠహారం లా చుట్టి ఉన్న శేషాచల పర్వతసానువుల్లో- సుమారు లక్ష మంది యానాదులుగా పిలువబడే ఆటవిక తెగ వారు సంచారం జీవనం సాగించేవారు. వారు పోడు వ్యవసాయం, పశుపోషణ చేస్తూ లక్క, ఎర్రచందనం, తుమ్మబంక, కందమూలఫలాలు, వనమూలికలు, కుంకుడు కాయలు, తేనె, ఏనుగు దంతాలు, పులిగోర్లు, జింకచర్మాలు, కొమ్ములు వంటి ఆటవిక ఉత్పత్తులను భక్తులకు, మైదాన ప్రాంతవాసులకు నగదు మరియు వస్తుమార్పిడి రూపంలో అమ్మడం ద్వారా జీవనం సాగించేవారు. వారు కూడా శ్రీనివాసుణ్ణి తమ ఇలవేల్పుగా, పెరట్లోని పెన్నిధిగా భావించి, తరచూ దర్శించు కునేవారు. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో సమూహాలుగా ఆలయానికి వచ్చి - తమదైన శైలిలో నృత్యగానాలతో అర్చనాదికాలు గావించి, అటవీ ఉత్పత్తులను కానుకలుగా సమర్పించుకునే వారు. కాలక్రమేణా రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందడం, కొండవాలుల్లో జనావాసాలు ఏర్పడడం, ఆలయ నిర్మాణాలు అనూహ్యస్థాయిలో విస్తరించడం, అటవీ ఉత్పత్తులకు గిరాకీ సన్నగిల్లడం, ప్రత్యామ్నాయ జీవనోపాధి సులభంగా లభించడం మొదలగు కారణాలు వల్ల ఆ సంచార జాతులవారు సుదూర ప్రాంతాలకు తరలి పోయారు. ప్రస్తుతం శేషాచల శ్రేణులపై గిరిజనుల ఉనికి నామమాత్రం గానే ఉంది.


గగనాన్ని చుంబించే పర్వత పంక్తులన్నీ కఠిన శిలలతో, అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులతో, జలజలా పారే సెలయేళ్ళతో, శరవేగంగా దుమికే జలపాతాలతో, అంతు చిక్కని అగాధాలతో, గుంపులు గుంపులుగా తిరుగుతూ ఘీంకరించే గజరాజులతో, అంధకార బంధురంగా ఉండే గుహలతో నిండి ఉండేవి. మానవమాత్రులకు దుర్భేద్యంగా ఉండే ఆ గుహల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, సివంగులు వంటి క్రూరమృగాలు నివసించేవి. కొన్నింటిలో కొండజాతి ప్రజలు తమ పెంపుడు జంతువులతో సహజీవనం చేసేవారు. అలాంటి ఒకానొక గుహ నుండి శ్రీశైలం, అహోబిలం క్షేత్రాలకు బిలమార్గం ఉండేదని ప్రతీతి. కానీ ఎవరూ ఆ మార్గం ద్వారా ప్రయాణించే సాహసానికి పూనుకోలేదు.  


ఆ రోజుల్లో నాగపాతాళ నాయకుడనే ఔత్సాహికుడు బ్రాహ్మణబృందం తోనూ, రక్షకదళం తోనూ వచ్చి శేషాచల పర్వతాల నడుమ నున్న లోయల్లోనూ, దట్టంగా అలుముకున్న కీకారణ్యాల లోనూ యుగాల పర్యంతం అలరారుతున్న తీర్థాలను అన్వేషించే సాహసానికి ఒడిగట్టగా - వారిని దేవభటులు అడ్డగించారని, దాంతో వారందరూ విగతజీవులై పోయారని ఒక కథనం జనబాహుళ్యంలో విస్తృతంగా ప్రచారంలో ఉండేది. ఈ వృత్తాంతం - దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అత్యుత్సాహంతో కొండకోనల్లోకి వెళ్ళే దుస్సాహసం చేసి, ప్రాణాంతకమైన ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా నివారించడంలో సహాయపడేది.


దాదాపు అర్ధశతాబ్దం పాటు క్రైస్తవ పాలకుల అధీనంలో ఉన్న తిరుమలక్షేత్ర పాలనాపగ్గాలు - శ్రీవారి పరమభక్తుడైన హాథీరామ్ బావాజీ వారసులైన మహంతులకు దఖలు పడ్డాయి. 


మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం

--------------------------------------

ఈ విషయాన్ని చెప్పుకునే ముందు, ఆలయ అజమాయిషీ - ఈష్ట్ ఇండియా కంపెనీ వారి నుండి మహంతుల చేతిలోకి ఎందుకు, ఎలా వచ్చిందో పరిశీలిద్దాం...


పరాయి చెరనుండి ఆలయానికి విముక్తి

------------------------------

హిందూ దేవాలయాల, ధార్మిక సంస్థల - మరీ ముఖ్యంగా, కుల వర్గ ప్రాంతీయ బేధాల కతీతంగా హిందువులందరూ ఆరాధించే తిరుమల ఆలయ - వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి జోక్యం మితిమీరడంతో; హిందూ సాంప్రదాయ వాదుల్లో తీవ్రమైన అసంతృప్తి ప్రబలింది. క్రమంగా - వారి సహనం హద్దులు దాటి, బ్రిటీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వేగంగా విస్తరించడంతో; ముందుచూపు కలిగిన, వివేకవంతులైన కొందరు బ్రిటిష్ అధికారులు కళ్ళు తెరిచారు. లండన్ లోనూ, కలకత్తా లోనూ ఉన్న ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులకు అనేక రహస్య నివేదికలు పంపారు. ఈ వ్యవహారాన్ని తెగే వరకు లాగవద్దని, తిరుమల ఆలయ వ్యవహారాలలో అలవి మాలిన జోక్యం పనికిరాదని సందేశాలు ఇచ్చారు. ఇండియా లోని గవర్నర్ జనరల్ కు - దాదాపుగా అన్ని హిందూ మరియు మహమ్మదీయ ధార్మిక సంస్థలకు సంబంధించి ఇలాంటి నివేదికలే అందాయి. వాటన్నింటిని సమీక్షించిన ఆంగ్లేయ పాలకవర్గం - భారతదేశంలోని అన్ని మతపరమైన సంస్థలలో క్రమంగా జోక్యం తగ్గించుకోవాలని తీర్మానించింది. తదనుగుణంగా, అప్పుడు తిరుమల దేవాలయం యొక్క వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకు - ఆలయ నిర్వహణ విధుల నుండి తప్పుకొని; ఆ బాధ్యతను తగిన వ్యక్తులకు గానీ, వ్యవస్థకు గానీ అప్పగించ వలసిందిగా తాఖీదు అందింది.  


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము*


*438 వ రోజు*


*అశ్వత్థామకు భూతం ఎదురు వచ్చుట*


రథికత్రయం పాండవశిబిరాల వైపు వేగంగా కదినారు. అశ్వత్థామ అతి వేగంగా తన రథమును నడుపసాగాడు. కృతవర్మ, కృపాచార్యులు కొంచం వెనుక పడ్డారు. అప్పుడు ఒక భూతం అశ్వత్థామ ఎదుట నిలిచింది. అశ్వత్థామ ఆ భూతానికి బెదరక దాని మీద అస్త్రప్రయోగం చేసాడు. వాటిని అన్నింటిని ఆ భూతం నోరు తెరచి మింగింది. అశ్వత్థామ వద్ద ఉన్న అస్త్రములు అన్నీ అయిపోయాయి. అశ్వత్థామకు ఏమీ చేయాలో తోచక కత్తి తీసుకుని ఆ భూతమును ఎదుర్కొన్నాడు. ఆ కత్తి ఆభూతమును తాకగానే మాడిపోయింది. అశ్వత్థామ తన వద్ద ఉన్న తోమరములు, చక్రాయుధములను ఆ భూతము మీదకు విసిరాడు. అవన్నీ ఆభూతమునకు తాకగానే తునాతునకలు అయ్యాయి. అశ్వత్థామ తన గదను ఆ భూతము మీదకు విసిరాడు. ఆ భూతం ఆ గదను మింగింది. వెనకకు తిరిగి చూసాడు కృతవర్మ, కృపాచార్యుడు కను చూపు మేరలో లేరు. కృపాచార్యుడి మాట వినక ముందుకు దూకినందుకు తనకు తగిన శాస్తి జరిగింది అని చింతించాడు. గోవులను, బ్రాహ్మణులను, బాలురను, వృద్ధులను, అంధులను, మిత్రులను, సఖులను, తోబుట్టువులను, జడులను, ఏమరుపాటున ఉన్న వారిని, నిద్రిస్తున్న వారిని, ఆడువారిని అస్త్రశస్త్రములతో కొట్టడం మహా పాపం. అది ధర్మవిహితం కాదని పెద్దలు చెప్తారు. అట్టి ధర్మమార్గం విడిచి అసుర మార్గం అవలంబించిన వారికి కార్యసిద్ధి కలుగదు. బ్రాహ్మణుడిగా పుట్టి ఇట్టి అపనిందలకు గురి కాగల కార్యమూ నేను చేయవచ్చునా ! అందుకేనేమో నాకు ఈ భూతం దాపురించింది. నాకిక ఎవరు దిక్కు " అని చింతించాడు.


*అశ్వత్థామ ఈశ్వరుడిని ధ్యానించు*


చివరకు అశ్వత్థామ ఈ సమయంలో నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు. అని అచంచలమైన మనసుతో అశ్వత్థామ పరమేశ్వరుడిని ధ్యానించాడు. ఈశ్వరా ! నేను ఈ గండం గడచి గట్టెక్కిన నిన్ను నానా భూతోపహారములతో కొత్తవిధంగా అర్చిస్తాను. నీకు ప్రీతి కలిగిస్తాను " అని అనేక స్తోత్రములతో శివుని ప్రార్థించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు ఒక బంగారు వేదిక కనపడింది దాని మీద అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్ని నుండి అనేక ఆకృతులతో ప్రథమగణాలు బయటకు వచ్చాయి. వాటికి అశ్వత్థామ భయపడ లేదు. అతడి మనసు ఈశ్వరుడి మీద లగ్నమై ఉంది. ఎంతకీ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. తన విల్లంబులతో ఆ అగ్ని గుండంలో దూకబోయాడు అశ్వత్థామ కాని తనను దహించుటకు సరిపోయిన అగ్ని ప్రజ్వరిల్ల లేదు. అశ్వత్థామ తన విల్లు, అమ్ములు, అస్త్రములు, శస్త్రములు, బాణములు, అనేక విధములైన ఆయుధములు వేసి అగ్నిని చక్కగా ప్రజ్వలింప చేసాడు. అశ్వత్థామ పరమేశ్వరా ! నాకు ఏమిచేయాలో తోచడం లేదు. నా శత్రువులను చంపే బలం, శక్తి ప్రసాదించు లేని ఎడల నేను ఆత్మబలిదానం చేసుకుంటాను అని హర హర మహాదేవ " అంటూ మంటలలో దూకబోయాడు. అప్పుడు అశ్వత్థామకు ఈశ్వరుడు ప్రత్యక్షమై " అశ్వత్థామా ! ఆగు నీ భక్తికి అకుంఠిత దీక్షకు ఆనందించాను నీవు కోరినవరం ఇచ్చాను. కాని ఒక్క మాట నేనూ విష్ణాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడూ ఒక్కటే . కృష్ణుడు నన్ను పూజిస్తాడు, కృష్ణుడంటే నాకు ఇష్టం, ఆ కృష్ణుడి మీద గౌరవంతో నేను నిన్ను పాండవ శిబిరముల వైపు పోకుండా ఆపాను. నీ మనసులో మాట తెలుసుకోవాలని నేను ఇన్ని ఆటంకాలు కల్పించాను. ఇంతెందుకు ఆ పాంచాలురకు పోగాలము దాపురించింది. ఈ రోజు వారు నీ చేతిలో చస్తారు, ఇదిగో ఈ ఖడ్గంతో వారిని సంహరించు " అని ఈశ్వరుడు ఒక మహనీయమైన ఖడ్గం అశ్వత్థామకు ఇచ్చి తాను కూడా అశ్వత్థామకు తెలియకుండా అతడిలో ప్రవేశించాడు. అశ్వత్థామలో నూతనోత్సాహం, ధైర్యం, తెగింపు ఉద్భవించాయి. తన రథం దగ్గరకు వెళ్ళగానే తాను అగ్నిలో వేసి దహించిన ఆయుధములు, అస్త్రములు, శస్త్రములు యదాతధంగా రధములో ఉన్నాయి. అశ్వత్థామ రథం మీదకు ఎక్కాడు. ఇంతలో కృపాచార్యుడు, కృతవర్మ వచ్చి చేరారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

చరితం రఘునాథస్య

 చరితం రఘునాథస్య 

శతకోటి ప్రవిస్తరమ్ 

ఏకైకమక్షరం పుంసాం 

మహాపాతకనాశనమ్

అర్థం:

రాముని చరిత్ర వంద కోట్ల శ్లోకాలతో విస్తరించింది, దాని ప్రతి అక్షరం కూడా మానవుల గొప్ప పాపాలను నాశనం చేస్తుంది.

(శతకోటి శ్లోకాల బృహద్గ్రంధాన్ని 24000 శ్లోకాలతో, శ్రీ వాల్మీకి మహర్షి సంక్షిప్తం చేసారని పండితులు చెపుతుంటారు)


శ్రీ వాల్మీకి రామాయణంలోని ప్రతి అక్షరం పాపనాశనం చేయగల శక్తి గలవి. అంటే ప్రతి అక్షరం కూడా ఉపాసనా యోగ్యమైన బీజాక్షరాలే.


'శ్రీ వాల్మీకి రామాయణం', నిత్యం పారాయణ చేయడం, సాధారణంగా చాలామందికి సాధ్యం కాకపోవచ్చు.


అందుకే రోజుకొకటి చొప్పున (అందునా ముఖ్యమైనవి, మన జీవితంలో ఉపయోగపడే నీతి బోధ ఉన్నవాటిని) ప్రతి ఉదయం పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 'ఒక్క శ్లోకం చదివినా', ఆరోజు రామాయణ పారాయణ చేసిన ఫలితం కలుగుతుందని పెద్దలు చెబుతారు.

కావున ఈ నా పోస్ట్ ల లోని శ్లోకాలు ప్రతిరోజూ తప్పకుండా చదివి శ్రీ సీతారాముల దివ్య అనుగ్రహం పొందగలరు.

ఇంతవరకు సుమారు వందకు పైగా శ్లోకాలు *'నేటి సుభాషితం'* పేరుతో పోస్ట్ చేయడం జరిగింది. 

ప్రస్తుతం సుందరకాండలో ఉన్నాము.


జై శ్రీ రామ్