12, సెప్టెంబర్ 2026, శనివారం

భాద్రపద మాసం..*

  *నేటినుండి భాద్రపద మాసం..* 

*************************

భాద్రపదం అనగానే మనకు గుర్తొచ్చేది *వినాయకచవితి* పర్వదినం!... అయితే దేవతా పూజలతోపాటు -- పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ‘భాద్రపద మాసం’...

చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవది.. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ‘భాద్రపద మాసం’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం. 

-- భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు, ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినం మనకు ‘వినాయక చవితి’  పర్వదినం.

భాద్రపద మాసం అనేది కేవలం పండుగలు, ఆచారాల పరంగానే కాకుండా ఖగోళ, వాతావరణ మరియు ఆయుర్వేద కోణాల్లో కూడా స్పష్టమైన శాస్త్రీయ ప్రాతిపదిక కలిగిన కాలం. 

ఖగోళ ప్రాతిపదిక :

చంద్రుడు పూర్ణిమ నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాల సమీపంలో పూర్ణబింబంగా కనిపించడం వల్ల ఈ నెలకు "భాద్రపద మాసం" అనే పేరు వచ్చింది.

---కన్యాసంక్రమణం: ఈ మాసంలో సూర్యుడు సింహం నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్17 న ప్రతి ఏడాదీ వచ్చే ఈ కన్యాసంక్రమణం విశ్వకర్మ పరమాత్మ యజ్ఞమహోత్సవం. యజ్ఞం,హోమం,అగ్ని మొదలు పంచభూతాత్మకమైన సమస్తసృష్టికీ మూలం విశ్వకర్మ పరమాత్మయే.. అంచేత కన్యా సంక్రమణం నాడీ పరమాత్మ పూజ చేస్తారు. 

---విషువత్తు (Equinox): 

ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే శరద్ విషువత్తు (రాత్రి, పగలు సమానంగా ఉండే రోజు) దాదాపు ఈ మాసంలోనే ఏర్పడుతుంది.


వినాయక చవితి - ఏకవింశతిపత్ర పూజ: వినాయక చవితి నాడు వాడే 21 రకాల పత్రాలు తులసి, బిల్వం, మాచిపత్రి, దూర్వా మొదలైనవి అన్నీ అత్యంత శక్తివంతమైన ఔషధ గుణాలున్న మొక్కలే.వీటితో పూజలు చేయడంలో ఆయుర్వేద విజ్ఞానందాగి ఉంది. వర్షాకాలంలో వచ్చే క్రిమికీటకాలు, బ్యాక్టీరియా నశించడానికి వీటితో వచ్చిన రసాయనాలు, సువాసనలు తోడ్పడి గాలిని శుద్ధి చేస్తాయి.

మట్టి విగ్రహాల విశిష్టత: సహజసిద్ధమైన బంకమట్టితో చేసిన విగ్రహాలను తిరిగి చెరువులు, నదులలో నిమజ్జనం చేయడం వల్ల ఆ మట్టి నీటిలోని మలినాలను తొలగించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది.

మహాలయ పక్షం (పితృ పక్షం): భాద్రపద బహుళ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు, అన్నదానం చేస్తారు. 

భాద్రపద మాసంలోని ప్రతి పండుగ, వ్రతం మరియు నియమం వెనుక ప్రకృతి మార్పులకు అనుగుణంగా శరీరాన్ని, సమాజాన్ని సమాయత్తం చేసే జీవన విజ్ఞానం స్పష్టంగా కనిపిస్తుంది.

--- జయోస్తు!

సిద్ధి వినాయక అనుగ్రహ ప్రాప్తిరస్తు!!.. 🌸🙏🌸

కామెంట్‌లు లేవు: