15, జనవరి 2026, గురువారం

ప్రశాంతత వ్యాపిస్తుంది.*

 ఒక సాయంత్రం, భర్త తలుపు దగ్గర నుండి అలా ఎప్పటిలాగే  పిలిచాడు:

“ పండూ , నేను కొంచెం సేపు  ఫ్రెండ్స్‌తో బయటికి  వెళ్ళొస్తా .”


బట్టలు మడుస్తూ ఉన్న భార్య అతని వైపు ఒక్కసారి చూసి,

“సరే. ఎంజాయ్ చేయండి,” అనింది.


అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది.

సాధారణంగా ఆమె అతనికి — త్వరగా రావాలని, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, ఎక్కువసేపు బయట ఉండొద్దని — ఏదో ఒకటి చెప్పేది.

కానీ ఆ రోజు రాత్రి అదేమీ లేదు. ఉపన్యాసం లేదు, నిట్టూర్పు లేదు, ఎందుకు అన్న ప్రశ్న లేదు. కేవలం ఒక శాంతమైన “సరే.”తో  ఒప్పుకొంది.


కొన్ని గంటల తర్వాత, వారి టీనేజ్ కొడుకు చేతిలో ఒక పేపర్ పట్టుకుని కిచెన్‌లోకి వచ్చాడు. ముఖం స్పష్టంగా పసుపురంగులోకి మారింది.

“అమ్మ,” అని నెమ్మదిగా అన్నాడు, “నా మాక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి… చాలా తక్కువ  వచ్చాయి.”


అతను నిలబడి, అమ్మ తిడుతారని ముందే ఊహించుకున్నాడు.

అతనికి తెలుసు — అమ్మ చదువుపై ఎంత శ్రద్ధ పెడుతుందో.

సాధారణంగా వచ్చే ఉపన్యాసం, టైమ్ వృథా చేశావు, నీ టాలెంట్ సరిగా వాడుకోవడం లేదు…అంటుందని  ఎదురుచూశాడు.


కానీ ఆమె తల ఊపి,“సరే,” అనింది.

అతను ఆశ్చర్యపోయాడు.

“కేవలం… సరే?”


“అవును,” అంది ఆమె మృదువుగా. “నువ్వు కష్టపడితే.  వచ్చే సారి బాగా వస్తాయి. లేకపోతే సెమిస్టర్ రిపీట్ చేయాలి. అది నీ నిర్ణయం. ఏది ఎంచుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను.”


అతను  కన్ఫ్యూషన్తో  వెళ్లిపోయాడు. అమ్మ ఇంత శాంతంగా ఎప్పుడు మారిపోయింది  ? అని ఆశ్చర్యపడ్డాడు.


మరో రోజు మధ్యాహ్నం, వారి కూతురు భయంతో ఇంట్లోకి వచ్చింది. హాలులో కాసేపు ఆగి, లివింగ్ రూమ్‌లోకి అడుగు పెట్టింది.

“అమ్మ,” అంది తడబడి, “నేను… కారు ఢీకొట్టేశాను. పెద్దది కాదు కానీ డెంట్ వచ్చింది.”


అమ్మ కోపపడలేదు, అరవలేదు, కనుబొమ్మలు ఎత్తలేదు కూడా. కేవలం,

“సరే. రేపు రిపేర్ షాప్‌కి తీసుకెళ్లి సరిచేయించు,” అంది.


అమ్మకు కోపం రాకపోవడంతో కూతురు షాక్ అయ్యింది.

“మీకు… కోపం లేదా?” తల్లి చిరునవ్వు నవ్వింది.

“లేదు. కోపపడితే కారు మళ్లీ బాగవుదు కదా. ఇక నుంచి జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి అంతే.”


ఇప్పటికే ఇంట్లో అందరూ ఆందోళన పడడం మొదలుపెట్టారు.  ఇలా ఉండే మహిళ కాదు ఆమె. ఆందోళన, ఒత్తిడి, ఉపన్యాసాలు — ఇవన్నీ సాధారణం.

కానీ ఇప్పుడు? శాంతి, సమతుల్యత, ప్రశాంతత.


వాళ్లు తమలోనే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఏం జరిగింది? ఆరోగ్యం బాగోలేదా? ఏదైనా బాధ ఉందా?


ఆ సాయంత్రం, వాళ్లు ముగ్గురూ ఆమెను కిచెన్ టేబుల్ వద్ద కూర్చోబెట్టారు.


భర్త అడిగాడు,

“ పండూ … నువ్వు చాలా తేడాగా  ప్రవర్తిస్తున్నావు. ఏమైంది? బాగున్నావా?”


ఆమె తన కుటుంబాన్ని — ఎన్నేళ్లుగా తెలియకుండానే తన సహనాన్ని పరీక్షించిన ఈ మనుషులను — స్నేహంగా చూసి చిరునవ్వు నవ్వింది.


“ఏమీ కాలేదు. ప్రతిదీ బాగానే ఉంది. నేను కేవలం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను.”


వాళ్లు ఆగి ఆమె మాట కోసం ఎదురుచూశారు.


“ప్రతి మనిషి తన జీవితం గురించి పూర్తిగా తానే బాధ్యత వహించాలి అని తెలుసుకొనేందుకు  నాకు చాలా కాలం పట్టింది,” అని ఆమె చెప్పింది.


భర్త కాస్త అయోమయంగా,

“అంటే?” అని అడిగాడు.


ఆమె చేతులను టేబుల్‌పై ఉంచి చెప్పింది:

“ఇంతకాలం నేను అన్నింటికీ భయపడేదాన్ని. నువ్వు రావడం ఆలస్యమైతే భయం. పిల్లలకు మార్కులు తక్కువైతే  నిందించేదాన్ని. ఏదైనా పాడైతే కోపపడేదాన్ని. ఎవరు బాధలో ఉన్నా, నేను సరి చెయ్యాలని చూసేదాన్ని. అందరి సమస్యలను నా భుజాలపై మోశాను.

కానీ ఇంతకాలం తరువాత తెలుసుకున్నాను — *నా ఆందోళన వాళ్ల సమస్యలను పరిష్కరించదు. అది నా మనసుకే  నష్టం.”*


ఆమె కూతురు నిశ్శబ్దంగా వింటోంది.


ఆమె మరింత మృదువుగా కొనసాగించింది.:

“నా టెన్షన్ ఎవరికీ లాభం లేదు ?. నా ఒత్తిడి మీ జీవితాలను సరి  చేయదు — కేవలం నన్నే అలసటకు గురి చేస్తుంది. నేను మీరు చేయాల్సిందేమిటో చెప్పగలను, *ప్రేమించగలను, తోడుగా నిలబడగలను. కానీ మీ జీవితాలను నేను జీవించలేను. నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఫలితాలను మీరు ఎదుర్కోవాలి — మంచైనా, చెడైనా.”*


కాసేపు ఆగి, మళ్ళీ నవ్వింది.

“అందుకే, *నా నియంత్రణలో లేని విషయాలను వదిలేశాను.”*


కొడుకు అడిగాడు:

“అంటే… మాకు ఏమయినా మీకు పట్టదా?”


ఆమె తల ఊపి,

“ ఎందుకు పట్టదు, చాలా పట్టింది.  ప్రేమించడం.  నియంత్రించడం — ఇవి ఒక్కటి కాదు.

నేను శాంతిని కోల్పోకుండా ప్రేమించగలను .

మీ సమస్యలను నా భారం కాకుండా  మీకు తోడుగా ఉండగలను.”


గది నిశ్శబ్దమైంది.

వాళ్లందరిని ఒక్కొక్కరిని చూసి ఆమె చెప్పింది:

“నా పని మిమ్మల్ని  ప్రేమించడం, దారి చూపించడం, మీకు అవసరం ఉన్నప్పుడు ఉన్నాను అని చూపించడం .

కానీ *మీ పని — మీ జీవితాన్ని మీరు జీవించాలి . మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి.. ఫలితాలను మీరు ఎదుర్కోవాలి*. అని తెలుసుకొన్నా”


ఆమె కుర్చీలో అలా వెనక్కి వాలి, కళ్లలో మృదువైన కాంతితో అంది:

“ఏదైనా తప్పు జరిగితే, ‘ఇది నా పని కాదు’ అని నేను  గుర్తు చేసుకుంటాను. నేను ప్రశాంతముగా  ఉంటాను. మీరు నేర్చుకుంటారని నమ్ముతాను. ఎందుకంటే జీవితం అంటే — పాఠాల వరుస.”


కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు.

కానీ ఇంట్లో ఏదో మారిపోయింది.


భర్త ఆమె చెయ్యిని పట్టుకుని,

“నువ్వు మాకు  కూడా  చాలా నేర్పావు  అనిపిస్తోంది,” అన్నాడు.


ఆమె నవ్వింది.

“కానీ నేను దీన్ని నేర్చుకోవడానికి చాలాకాలం పట్టింది.”


ఆ రాత్రి అందరూ ఆమె మాటలు బాగా గుర్తుతెచ్చుకొన్నారు .


కొడుకు పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టాడు — అమ్మ అరవకపోయినా, అది తన బాధ్యత అని గ్రహించి.

కూతురు కారు రిపేర్ షాప్‌కి అపాయింట్‌మెంట్ పెట్టి, ఇన్సూరెన్స్ ప్రాసెస్ నేర్చుకుంది.

భర్త ఇకపై బయటకు వెళ్తూ తప్పకుండా ఫోన్ చేసేవాడు — ఆమె అడిగినందుకు  కాదు , కానీ అతనికి చేయాలని అనిపించినందుకు.


మెల్లగా… ఆ ఇల్లు నెమ్మదిగా ప్రశాంతముగా కనిపించడం మొదలైంది.


ఎవరూ భయంతో  లేరు .

ఎవరూ కోపానికి ఎదురుచూడలేదు.

*ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తామే ఎదుర్కోవడం మొదలుపెట్టారు —* భయంతో కాదు, *బాధ్యతతో . .*


ఎందుకంటే ఒకరు శాంతిని ఎంచుకున్నప్పుడు.  ఆ శాంతి  ఇల్లంతా అల్లుకుంటుంది..


*ఒకరు నియంత్రించడం ఆపినప్పుడు…*

మిగతావాళ్లు *తమను తాము నియంత్రించుకోవడం నేర్చుకుంటారు.*


*అలా ఒక ఇంట్లో ప్రశాంతత వ్యాపిస్తుంది.*

ONLINE HOMEOPATHY CONSULATATION

 

సంక్రాంతిపండుగ శుభాకాంక్షలు* 🪷

 🌸   *మిత్రులు, కవిపుంగవులు అందరికీ*   🌸

  🪷  *సంక్రాంతిపండుగ శుభాకాంక్షలు*  🪷


సీ॥

ముంగిళ్ళ దిద్దిన రంగవల్లులలోన 

గొబ్బిదేవతలెల్ల కూడియుండ 

సన్నాయి మేళముల్ సరిగంగిరెద్దులు 

హరిదాసు కీర్తన లందగించ 

చెఱకుదండమ్ములు చేబంతిక్రీడలు 

మంగళతోరణమాల లలర

పొంగారు పొంగళ్ళు పోతుపేరంటాలు 

క్రొత్తయల్లుళ్ళదౌ కోలహలము 

గీ॥ నింగినంటు గాలిపటల భంగిమలును 

బావమరదళ్ళ సరదాల భాషణములు 

నింత యంతయు గాదయ నెంతొ కలదు 

మకరసంక్రాంతి సందడి మరులు గొలుపు 


సీ॥

క్రొత్తబెల్లముతోడ క్రొత్తబియ్యముజేర 

సంక్రాంతి యయ్యెనో చందమలర 

ధనువు వీడిన రవి తా మకరము జేర 

సంక్రాంతి ప్రబలెనో సౌరులలర 

రైతుకష్టములెల్ల ప్రభవించ ధాన్యమై 

సంక్రాంతి ప్రసరించె శాలలలర 

బొమ్మలకొలువుల ముగుదపేరంటాళ్ళ 

సంక్రాంతి యరుదెంచె సరసతలర 

గీ॥ రంగులలముకొన్న వృషభరాజులెల్ల 

పూజలందగ సంక్రాంతి మోహరించ 

దివ్యసంక్రాంతిపర్వమ్ము తేజరిల్ల 

శుభదకామన లందరి కభయ మగుత! 

*~శ్రీశర్మద* 

*8333844664*

పంచాంగం 15.01.2026 Thursday,

 ఈ రోజు పంచాంగం 15.01.2026 Thursday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష ద్వాదశి తిథి బృహస్పతి వాసర జ్యేష్ఠ నక్షత్రం వృద్ధి యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 




అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు


  


శ్రాద్ధ తిథి: ద్వాదశి


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం

  🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 06*


*పరయా కాంచీపురయా పర్వతపర్యాయపీనకుచభరయా।*

*పరతంత్రా వయమనయా పంకజసబ్రహ్మచారిలోచనయా॥*


*భావము :*


*పర్వతములను పోలి, సర్వజగత్తుకు పోషణకారకములైన మాతృస్థానములతో, పద్మములవంటి కన్నులతో కాంచీపురములో వెలసిన మాతకు నేను దాసానుదాసుడను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన ।

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 41 ।।


ప్రతిపదార్థ:


వ్యవసాయ-ఆత్మికా — దృఢమైన; బుద్ధిః — బుద్ధి; ఏకా — ఒకటి; ఇహ — ఈ పథములో; కురు-నందన — కురు వంశీయుడా; బహు-శాఖాః — అనేక-శాఖలుగా; హి — నిజముగా; అనంతాః — అంతులేని; చ — మరియు; బుద్ధయః — బుద్ధి; అవ్యవసాయినామ్ — దృఢ సంకల్పం లేని.


  తాత్పర్యము :


 ఓ కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా/స్థిరంగా ఉంటుంది, మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ, దృఢసంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది.


 వివరణ:


మమకారాసక్తి అనేది మనస్సు యొక్క లక్షణం. ఇదెలా వ్యక్తమవుతుందంటే, మనస్సు పదేపదే మమకార వస్తు/విషయం వైపు పరుగులు తీస్తుంది, అవి వ్యక్తులు, ఇంద్రియ విషయములు, ప్రతిష్ఠ, శారీరక సుఖాలు, పరిస్థితులు మొదలగునవి కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలంపులు పదేపదే మనస్సుకు వస్తుంటే అది, దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడిఉంది అన్నదానికి సూచన కావచ్చు. కానీ, అనుబంధం/మమకారాసక్తి ఏర్పరుచుకునేది మనస్సు అయినప్పుడు ఈ యొక్క అనుబంధం/మమకార విషయాలలో శ్రీ కృష్ణుడు బుద్ధిని ఎందుకు తీస్కోస్తున్నాడు? అనుబంధం/మమకారాలను తొలగించటంలో బుద్ధికి ఏమైనా పాత్ర ఉందా?


మన శరీరంలో సూక్ష్మమైన 'అంతఃకరణ' ఉంటుంది, వ్యావహారికంగా దానిని హృదయం అంటారు. ఇది మనస్సు, బుద్ధి, మరియు అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ యంత్రంలో ‘బుద్ధి’ అనేది 'మనస్సు' కంటే ఉన్నతమైనది. బుద్ధి నిర్ణయాలు చేస్తే, మనస్సు కోరికలను సృష్టించి, బుద్ధి నిశ్చయించిన ఆ విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది. ఉదాహరణకి, ఒకవేళ బుద్ధి గనక సంతోషానికి డబ్బే మూలం అని నిర్ణయిస్తే, మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఒకవేళ, పేరు ప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యం అని బుద్ధి నిశ్చయిస్తే, అప్పుడు మనస్సు పేరుప్రతిష్ఠల కోసం వాంఛిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, బుద్ధి యందు ఉన్న జ్ఞానం ప్రకారంగా, మనస్సు కోరికలను పెంపొందించుకుంటుంది.


రోజంతా మనం మనష్యులం మనస్సుని బుద్ధి ద్వారా నియంత్రిస్తూనే ఉంటాము. ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా కాళ్ళు చాపుకుని మనస్సుకి నచ్చినట్టుగా కూర్చుంటాము. కానీ, కార్యాలయంలో (ఆఫీసు) లో కూర్చున్నప్పుడు అధికారికంగా కూర్చుంటాము. ఆఫీసు క్రమబద్ధత మన మనస్సుకి నచ్చి కాదు, దాని ఇష్టానికి వదిలేస్తే ఇంట్లో ఉండే అనధికార వాతావరణమే కావాలంటుంది. కానీ, ఆఫీసులో అధికారిక ప్రవర్తన అవసరము అని బుద్ధి నిర్ణయిస్తుంది. కాబట్టి, బుద్ధి అనేది మనస్సుని నియంత్రించటం వలన, మనస్సు యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా, కార్యాలయ మర్యాద కోసం, మనము రోజంతా నిబద్ధతతో ఆఫీసులో కూర్చుంటాము. ఇదే విధంగా, దాని ఇష్టానికి వదిలేస్తే, మనస్సు ఆఫీసు పని చేయటానికి ఇష్టపడదు, ఇంట్లో కూర్చుని టెలివిజన్ చూసేందుకే మొగ్గు చూపుతుంది. కానీ, జీవనోపాధి కోసం ఆఫీసులో పని చేయటం అవసరం అని 'బుద్ధి' నిర్ణయిస్తుంది. కాబట్టి, మళ్లీ మనస్సు యొక్క సహజ స్వభావాన్ని, బుద్ధి నియంత్రిస్తుంది, మరియు జనులు రోజుకి ఎనిమిది గంటలు లేదా ఆ పైగా పని చేస్తారు.


ఈ పై ఉదాహరణలు, మానవులగా మన బుద్ధికి మనస్సుని నియంత్రించే సామర్థ్యం ఉంది, అని నిరూపిస్తున్నాయి. ఈ విధంగా, మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని, సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి. బుద్ధి యోగము అంటే, అన్నీ పనులు భగవంతుని ప్రీతి కోసమే అని బుద్ధిలో దృఢ నిశ్చయం చేసుకోవటం ద్వారా కర్మ ఫలాల పట్ల ఆసక్తిరహితంగా ఉండగలిగే కళ. అలాంటి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, లక్ష్యంపై ఏకాగ్రదృష్టితో, విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా ఈ పథంలో దూసుకెళ్తాడు. సాధనలోని పై స్థాయిలలో ఈ సంకల్పం ఎంత బలంగా అవుతుందంటే, ఇక ఏదీ కూడా సాధకుడిని ఆ పథం నుండి తప్పించలేదు. సాధకుడు/సాధకురాలు ఇలా అనుకుంటారు, ‘ఎన్ని కోట్ల అవాంతరాలు నా దారిలో వచ్చినా, ప్రపంచమంతా నన్ను ఖండించినా, నా ప్రాణాలే వదిలివేయాల్సి వచ్చినా, నా సాధనని మాత్రము విడిచిపెట్టను.’ అని. కానీ, ఎవరి బుద్ధి పలు-విధాలుగా ఉంటుందో వారి మనస్సు ఎన్నో దిశలలో పరిగెడుతుంటుంది. వారు ఈశ్వర పథంలో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క ఏకాగ్రతని పెంపొందించుకోలేరు.

14, జనవరి 2026, బుధవారం

మూడు రోజులు జరుపుకునే, పెద్ద పండుగలో

 *🙏శుభోదయం🙏శుభ బుధవారం🙏*

*మూడు రోజులు జరుపుకునే, పెద్ద పండుగలో తొలిరోజున, లౌకికంగా ఉండే వ్యర్థ పదార్థాలను, మంటల్లో వేస్తాం.*


*అంటే చెడుని త్యజించి, విజయాన్ని ఇచ్చే మంచిని, స్వాగతించడానికి సిద్దంగా ఉన్నామనే, సంకేతముగా దీన్ని భావిస్తాం. సంక్రమణం అంటే, మారడానికి సిద్దపడటమే!.*


*భోగ భాగ్యాలను, అదృష్టాలను ప్రసాదించే ఈ భోగి పర్వదినాన....* 


*మీ కుటుంబం సుఖ,సంతోషాలతో, ధర్మ బద్దమైన సిరిసంపదలతో, సుసంపన్నంగా విరజిల్లాలని, సమాజ హిత కార్యక్రమాలలో మరింతగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ..* 

🌹*అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు!..* 🌹

లక్ష్మి కిస్మత్ కుమార్ దంపతులు.

షట్టిల ఏకాదశి

 షట్టిల ఏకాదశి అనేది హిందూ క్యాలెండర్‌లో మాఘ మాసం కృష్ణ పక్షంలో 11వ తిథి (ఏకాదశి)న జరుపుకునే పండుగ. ఇది భగవాన్ విష్ణువుకు అంకితం చేయబడినది. ఈ ఏకాదశి పాపాలను నాశనం చేసి, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు

షట్టిల అంటే 'షట్' (ఆరు) మరియు 'తిల' (తిలలు లేదా ఎల్లు గింజలు) అని అర్థం. ఈ రోజు ఎల్లు గింజలను ఆరు విధాలుగా ఉపయోగించడం ద్వారా పుణ్యం సంపాదిస్తారు. అవి:


తిల-స్నానం: స్నానం చేసేటప్పుడు నీటిలో ఎల్లు గింజలు కలిపి స్నానం చేయడం.

తిల-ఉబ్టన్: శరీరానికి ఎల్లు పేస్ట్ రాయడం.

తిల-హవన్: పవిత్ర అగ్నికి ఎల్లు గింజలు అర్పించడం.

తిల-తర్పణం: పితృదేవతలకు ఎల్లు గింజలు కలిపిన నీటిని అర్పించడం.

తిల-భోజనం: ఎల్లు గింజలతో చేసిన ఆహారం తినడం.

తిల-దానం: ఎల్లు గింజలను దానం చేయడం

ఈరోజు (జనవరి 13, 2026) సాయంత్రం 3:16 నుండి ఏకాదశి తిథి ప్రారంభమైంది, కానీ ఉదయ తిథి నియమం ప్రకారం, షట్టిల ఏకాదశి వ్రతం రేపు (జనవరి 14, 2026) జరుపుకోవాలి. ఈరోజు సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభించవచ్చు, కానీ ప్రధాన ఆచారాలు రేపు

షట్టిల ఏకాదశి రోజు ఏం చేయాలి:


బ్రహ్మ ముహూర్తంలో లేచి, ఎల్లు గింజలు కలిపిన నీటితో స్నానం చేయాలి.

విష్ణువుకు పూజ చేయాలి: ఎల్లు నూనెతో దీపం వెలిగించి, పూలు, తులసి, ఫలాలు సమర్పించాలి.

ఎల్లు మరియు బెల్లం (తిల-గుడ్)తో భోగం సమర్పించాలి.

విష్ణు సహస్రనామం లేదా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' మంత్రం జపించాలి.

ఉపవాసం: ధాన్యాలు, పప్పులు తినకూడదు. ఫలాలు, పాలు, 

నట్స్ తినవచ్చు.

ఎల్లు గింజలు, బట్టలు, ఆహారం దానం చేయాలి.

వ్రత కథ వినాలి లేదా చదవాలి.

షట్టిల ఏకాదశి వ్రత కథ:

చాలా కాలం క్రితం జరిగిన ఘటన. దాదాపుగా ద్వాపర యుగంలో ఈ సంఘటన జరిగినట్లుగా చెబుతారు. ఒక ఊరిలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ఆమె తన సంపదను దానధర్మాలకు వెచ్చించింది. అడిగినవారికి కోరినంత ధనం, ఆభరణాలు ఇలా విలువైన వస్తువులను ఎన్నింటినో దానం చేసిన ఆమెకు ఎందుకో అన్నదానం చేయడం ఇష్టం ఉండేది కాదు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అని చెబుతారు కదా. ఈ విషయమై అందరూ ఆమెకు ఎంతో నచ్చ చెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది. ఆమె ఆహారం మినహా ప్రజలు కోరుకునే ఏదైనా దానం చేసేది.

ఇదిలా ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు ఆ శ్రీమంతురాలికి అన్నదానం గొప్పతనాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. కృష్ణుడు బిచ్చగాడి రూపాన్ని ధరించి, శ్రీమంతురాలి వద్దకు వెళ్లి ఆహారం అర్ధించాడు. కానీ ఆ స్త్రీ బిచ్చగాడికి భిక్షలో ఆహారం ఇవ్వడానికి నిరాకరించి అతనిని తరిమికొట్టింది. పట్టువదలని ఆ భిక్షకుడు తిరిగి వచ్చి మళ్లీ ఆహారం కోసం అడుగగా, ఆమె అతని భిక్షా పాత్రలో మట్టిని వేసి అవమానించింది. ఆశ్చర్యకరంగా ఆ భిక్షకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

భిక్షకుని వెళ్లగొట్టి శ్రీమంతురాలు తిరిగి ఇంట్లోకి వెళ్లేసరికి ఆమె ఇంట్లో వండిన ఆహారమంతా మట్టిగా మారడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అంతేకాదు ఆమె తినడం కోసం ఏది కొన్నా అది మట్టిగా మారిపోతుండేది. అంత సంపద ఉన్నప్పటికీ, ఆమె తినడానికి కొన్నవి కొన్నట్లు మట్టిగా మారిపోతుండడం వల్ల ఆమెకు ఆహారం కరువైంది. ఇంట్లో సకల సంపదలు ఉన్నా ఆమె తినడానికి మాత్రం ఏమి ఉండేది కాదు. ఆ విధంగా ఆకలితో శ్రీమంతురాలి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం ప్రారంభించింది.

ఆకలితో ప్రాణం పోయే స్థితిలో ఆమె తన ఇష్ట దైవమైన శ్రీకృష్ణుని రక్షించమని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు కలలో కనిపించి, భిక్షకుని పాత్రలో మట్టి వేసి అవమానించినందున, ఆమెకు ఈ గతి పట్టిందని పేదలకు అన్నదానం చేయమని అలాగే షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆమెకు ఉపదేశించాడు.

శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆ శ్రీమంతురాలు ఆనాటి నుంచి పేదలకు, అన్నార్తులకు అన్నదానం చేయడం వల్ల ఆమె కోల్పోయినదంతా తిరిగి వచ్చింది. అలాగే ఆమె భక్తిశ్రద్ధలతో షట్తిల ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించి ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి మరణాంతరం మోక్షాన్ని పొందింది

సంక్రాంతి శుభాకాంక్షలు

 మన బ్లాగు వీక్షించే వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంక్రాంతి వారి జీవితంలో  నూతన ఉత్సాహాన్ని కలగజేయాలని ఈ సంవత్సరం ఆహారం సమృద్ధిగా పండాలని ఆహార ధాన్యాలు కావలసినంత దొరకాలని కోరుకుంటున్నాము మీ ఆదరణ ఈ బ్లాగు పురోగతికి సోపానాలు దేశ విదేశాలలో ఉన్న వీక్షకులందరికీ శుభాకాంక్షలు

పంచాంగం