🕉️ శ్రీ కాళహస్తీశ్వర శతకం - 32
ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)
కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె
న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్
సుఖశ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
తాత్పర్యం :
శ్రీ కాళహస్తీశ్వరా !
ఆత్మకు ఆశ్రయ స్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది.
అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచే ఏర్పడిన ’ఓం’ కారము.
దీనిని ఉపాసనాసంప్రదాయము నందు "తారకము" అని అందురు.
మరియొక నామము "నాదము". దీనినుండి మరియు దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది.
ఈ విశ్వమునకు "బిందువు" అనియు వ్యవహరింతురు.
నాదము కాని బిందువు కాని చక్కని శోభతో ప్రకాశించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు.
అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు శబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు.
ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది.
ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు.
అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము.
దానిని తెలుపు సావయవ శబ్దముల మూలతత్త్వము "కళలు” అనబడు వర్ణములు.
ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు - శక్తి అను అంశములుగ చూడవలయును.
ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము.
కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము.
ఓం నమః శివాయ
*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి