10, జనవరి 2021, ఆదివారం

త్వమేవాహమ్‌



*త్వమేవాహమ్‌*


కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణంనుంచి, పుడమితల్లి కడుపులోకిచేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే *నేను*


ఈ *నేను* ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు


ఊపిరి ఉన్నంతదాకా *నేను* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది


 జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది


*ఈ *నేను* లోంచే*నాది* అనే భావన పుడుతుంది!


ఈ *నాది* లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ *నేను* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా

ప్రజ్వరిల్లుతుంది

 *అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *నేను*  *నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుందిపంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీసిద్ధపడుతుంది


బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన *నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్ప కూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన *నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచినవిగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*

*మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*

*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*


**నేనే* శాసన కర్తను, *నేనే* ఈభూమండలానికి అధిపతిని, *నేనే* జగజ్జేతను... అని మహోన్నతంగా భావించిన *నేను* లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది.


ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను* కథ అలా సమాప్త మవుతుంది.


అందుకే ఊపిరి ఆగకముందే *నేను* గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత!

ఉపనిషత్తులు

 అన్నీ పరమాత్మ దేహంలో భాగాలే, దేనియందు అసహ్యం చెందకు (6వ మంత్రం)           [ఉపనిషత్తులు]                               


4వ మరియూ 5వ మంత్రాల్లో పరమాత్మ తత్త్వం ఏమిటో తెలిసింది. అయితే మనం చూస్తున్నది ప్రపంచాన్ని. అందులో ఎన్నో రకాల జీవుల్లు. వారియందు మనం ఎట్లాంటి భావన కలిగి ఉండాలి ? వారితో నడుచుకునేప్పుడు పరమాత్మ వరకు అది పర్యవసించగలగాలి. అదేలా సాధ్యం ఈ మంత్రం చెబుతుంది.


యస్తు సర్వాణి భూతాని  ఆత్మన్యేవానుపశ్యతి |

సర్వ భూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే || (6)


విజుగుప్స- అంటే అసహ్యం, లోకంలో కొందరిని చూస్తే కలుగుతోంది అసహ్యం, కొందరిని చూస్తే కలుగుతోంది ప్రేమ,  ఏమి కారణం ? మన కాలికి మురికి అంటితే కాలును పట్టుకోవడానికి ఏం పెద్ద పాదపడటం లేదే, కారణం ఇది నా దేహంలోని భాగమే అనే భావం. కాలిలో ముల్లు దిగితే కంటిలోంచి నీరు వస్తుంది, శరీరంలో ఒక అవయవం శోకిస్తే మిగతా అవయవాలు అన్నీ స్పందిస్తాయి. వాటికి అట్లాంటి జుగుప్స లేదు. ఇదే దృష్టితో ప్రపంచాన్ని చూడు,  ఇక ఎవడిని చూసి జుగుప్స చెందుతావు ? చెందవు. ఎందుకని ?  "యస్తు సర్వాణి భూతాని ఆత్మని" సర్వ భూతాలు అన్నీ పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి. "సర్వ భూతేషు చాత్మానం" పరమాత్మ అంతటా ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. విశ్వశరీరంలో ప్రతి ఒక్కరం ఒక్క అవయవమే, కనుక ఒక అవయవం మరొక అవయవాన్ని ఎప్పుడూ ధూషించదు, ద్వేశించదు, అసహ్యం చెందదు. 


కనుక ఎవడైతే కనిపించే ప్రపంచంలోని విషయాలు పరమాత్మపై ఆధారపడి ఉన్నాయని, అవన్నీంటిలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడని తెలిస్తే వాడికి పరమాత్మ తత్త్వం అర్థం అయినట్లు, ఇక ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉండవు. ఇక అవి లేనప్పుడు వాడికి పాపం అంటనే అంటదు.

విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత

 విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత


రోజుకు కనీసం ఒక్క సారైనా 

విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.

ఉత్తమ ఫలితాలు పొందండి..


మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం

ఓం నమో నారాయణాయ .

ఓం నమో భగవతే వాసుదేవాయ.

ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...


విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన 

అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును, 

పాపములు తొలగును. 


స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం. 

మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి


విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 


అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 


అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?


1. అదృష్టం


2. ఆర్థిక ఇబ్బందులు వుండవు 


3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం 


4. కోరిన కోరికలు నెరవేరుతాయి


5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది


విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.


అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 

108 మార్లు జపించవలెను. 

పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:


1. విద్యాభివృద్ధికి :-

      14వ శ్లోకం.

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||


2. ఉదర రోగ నివృత్తికి:-

       16వ శ్లోకం.

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||


3. ఉత్సాహమునకు:-

       18వ శ్లోకం.

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||


4. మేధాసంపత్తికి:-

       19వ శ్లోకం.

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |

అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||


5. కంటి చూపునకు:-

       24వ శ్లోకం.

అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |

సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||


 6. కోరికలిడేరుటకు:-

         27వ శ్లోకం.

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |

సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||


7. వివాహ ప్రాప్తికి:-

       32వ శ్లోకం.

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |

కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||


8. అభివృద్ధికి:-

       42వ శ్లోకం.

వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |

పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||


9. మరణ భీతి తొలగుటకు:-

        44వ శ్లోకం.

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||


10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-

         46వ శ్లోకం.

విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |

అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||


 11. జ్ఞానాభివ్రుద్ధికి:-

           48వ శ్లోకం.

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |

సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||


12. క్షేమాభివ్రుధ్ధికి:-

           64వ శ్లోకం

అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |

శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||


13. నిరంతర దైవ చింతనకు:-

          65వ శ్లోకం.

శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |

శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||


14. దుఃఖ నివారణకు:-

           67వ శ్లోకం.

ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |

భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||


15. జన్మ రాహిత్యమునకు:-

          75వ శ్లోకం.

సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |

శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||


16. విద్యా ప్రాప్తి కి :-

       80వ శ్లోకం.

అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|

సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||


 17. శత్రువుల జయించుటకు:-

            88వ శ్లోకం.

సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !

న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||


18. భయ నాశనమునకు:-

           89వ శ్లోకం.

సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |

అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||


19. సంతాన ప్రాప్తి కి :-

       90వ శ్లోకం.

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|

అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||


20. మంగళ ప్రాప్తికి:-

         96వ శ్లోకం.

సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |

స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||


21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-

          97 & 98వ శ్లోకం.

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |

శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||


22. దుస్వప్న నాశనమునకు:-

            99వ శ్లోకం.

ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |

వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||


23. పాపక్షయమునకు:-

           106వ శ్లోకం.

ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |

దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||


24.సర్వ రోగ నివారణకు:-

     103వ శ్లోకం.

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః

తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||


25. సుఖ ప్రసవమునకు:-

    107వ శ్లోకం.

శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|

రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||

శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి


విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.

(సేకరణ)pvs శాస్త్రి స్వామి

శ్రీమద్రామాయణావతరణము

 🌹శ్రీమద్రామాయణావతరణము🌹 


మనమన ఘనమగు చరితము

కనిపించుచునుండ గాంచి కడుతోషమునన్

ముని యా వాల్మీకి యపుడు

ఘనమగు రామాయణంబు గావించె భువిన్  36 


శ్రీరాము జననంబు క్షితి పతి ప్రేమయు

         గురు వశిష్ఠుని వద్ద కూర్మి విద్య

గాదేయు జన్నంబు కావంగ బోవుట

        తాటకన్ జంపుట దారి యందు

జన్నమ్ము గాచుట జనకుని జేరుట

        శివ ధనుర్భంగమ్ము సీత పెంళ్లి

కైక వరంబులు కానల కేగుట

        పాదుకా దానమ్ము భరతు నకును

దండ కారణ్య సీమకు తరలు టయును

దనుజ నాసిక చెవులను తరుగు టయును

క్రూర ఖరదూష ణాదుల గూల్చు టయును

వర్ణనము జేసె వాల్మీకి వరుసగాను            37 


దశకంఠు చరితమ్ము తరుణి పై మొహంబు

         మారీచు సాయంబు మాయలేడి

సీతాపహరణమ్ము శ్రీరాము శోకంబు

         కపివర్యు మారుతిన్ కలసికొనుట

సురుచిర స్నేహమ్ము సుగ్రీవుపట్టంబు

          కలికి సీతమ్మకై కపులు జనుట

సామీరి పయనమ్ము సంద్రంబు దాటుట

          లంకిణిన్ జంపుట లంక జేరి

ధరణిపుత్రిక సీతమ్మ దర్శనంబు

లంక గాల్చియు వెనుకకు రయము గొచ్చి

సీత విషయము స్వామికి చెప్పు టయును

వర్ణనముజే సె వాల్మీకి వరుస గాను           38 


శ్రీరాము కోపంబు సేతు నిర్మాణంబు

         యుద్ధ సంసిద్ధత యుద్ధితిగను

రామ రావణ ఘోర రణ విశేషంబులు

         కుంభ కర్ణుడు నేల గూలు టయును

సౌమిత్రి మూర్ఛయు సంజీవి గ్రహణంబు

         యిల మీద గూలుట యింద్రజిత్తు

రఘురాము తేజంబు రావణుమరణంబు

          ధర్మసంస్థాపన ధరణి యందు

సీత నగ్నిపునీతను స్వీకరించి

తిరిగి సాకేత పురముకు చేరు టయును

రామ పట్టాభి షేకమున్ రమ్య ముగను

వర్ణ నము జే సె వాల్మీకి వరుస గాను         39



ఆదికవి వాల్మీకి యజుని యానతితోడ

          రామాయణంబును రమ్యముగను

యారు కాండములుగ  నరయంగ రచియించి

           జగతికి నర్పించె జనులు బొగడ

పంచశతములైన ప్రముఖ సర్గల తోడ

           భాసమానమ్ముగా పరిఢ విల్లి

వెరసి యిర్వైనాల్గు వేల శ్లోకాలతో

           నొప్పారె కావ్యమ్ము  నుర్వి యందు

ఘనుడు వాల్మీకి సంయమి  గరిమ తోడ

భవ్య రామాయణమునందు భాగముగను

తదుప రుత్తరకాండమున్ తనరు నట్లు

రమ్య మొప్పoగ పరిపూర్ణ రచన జేసె.        40



                      🌹శుభమ్ 🌹 


           గోపాలుని మధుసూదనరావు 🙏

9, జనవరి 2021, శనివారం

ప్రవర

 *ప్రవర ఎలా చెప్పాలి...?*


*1) భగవంతుని ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో కుడి చెవిని, ఎడమ చేత్తో ఎడమ చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*

*2) మానవుల ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*

*3) చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు /సజ్జనేభ్యః శుభం భవతు. ఆయా సందర్భానుసారంగా చెప్పవలెను.*


*ఋషి1_________, ఋషి 2_______,ఋషి 3_________త్రయార్షేయ ప్రవరాన్విత, _________గోత్రద్భవస్య, _________సూత్రం _______ శాఖాధ్యాయిః _______(పేరు) శర్మణ్ అహంభో అభివాదయే, అభివాదయామి.*

🦜🦜🦜🅰️🦜🦜🦜

*ఓం🕉️భారతీయ సంస్కృతి*


*కొన్ని బ్రాహ్మణ  గోత్రాలు మరియు వాటి ప్రవరలు..*


*1. భరద్వాజ :*


ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య


*2. వాథూలస :*


భార్గవ, వైతాహవ్య, శావేదస త్రయా ఋషేయ ప్రవరాణ్విత వాథూలస గోత్రస్య


*3. శ్రీవస్త లేక శ్రీవత్స :*


 భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఆర్వ, జామదఘ్నేయ పంచా ఋషేయ ప్రవరాణ్విత శ్రీవత్సస గోత్రస్య


*4. శ్యాలంకాయన :*


 విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవరత త్రయా ఋషేయ ప్రవరాణ్విత శ్యాలంకాయనస గొత్రస్య


*5. షతమర్షన:* 


ఆంగిరస, ఫౌరుకుత్స, త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత షతమర్షనస గోత్రస్య


*6. ఆత్రేయ:* 


ఆత్రేయ, ఆర్చనాస, శ్యావాస్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆత్రేయ గోత్రస్య


*7. కౌషిక:*


 విశ్వామిత్ర, ఆఘమర్షన, కౌసిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌషిక గొత్రస్య


*8. ఖలబొధన/ఖలభవస (రెండు రకాలు)*


1. ఖలబొధన: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలబొధన త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలబొధన గోత్రస్య


2. ఖలభవస:


విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలభవస త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలభవస గొత్రస్య


*9. విశ్వామిత్ర:* 


విశ్వామిత్ర, దేవరత, ఔతల త్రయా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర గోత్రస్య


*10. కౌండిన్య:* 


వాసిష్త, మైత్రావరుణ, ఖౌందిన్యస త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌండిన్యస గోత్రస్య


*11. హరితస:* 


ఆంగిరస, అంబరిష, యువనశ్వ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత హరితస గోత్రస్య


*12. గౌతమస :* 


ఆంగిరస, ఆయస్య, ఆఔశిద్యస, కాక్షివత, వమదెవ, గ్రిహదుగ్ద, గౌతమస – సప్తా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య


*13.ఔద్గల్య (మూడు రకాలు)*


1. ఆంగిరస, భర్మ్యశ్వ, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య


2. తర్క్ష్య, భార్మ్యశ్వ, మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య


3. ఆంగిరస, ఢవ్య, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య


*14. శందిల్య (మూడు రకాలు)*


1. కాశ్యప, అవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


2. కాశ్యప, ఆవత్సార, శాందిల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


3. కాశ్యప, దైవల, ఆసిత త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


*15. నైత్రువకాశ్యప:*


కాశ్యప, ఆవత్సర, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత నైత్రువకాశ్యపస గోత్రస్య


16. కౌత్స: ఆంగిరస, మాంధత్ర, కౌత్స త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌత్సస గోత్రస్య


*17. కన్వ (రెండు రకాలు)*


1. ఆంగిరస, ఆజమీద, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య


2. ఆంగిరస, కౌర, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య


*18. పరాసర:* వాశిష్త, శాక్త్య, పరాసర త్రయా ఋషేయ ప్రవరాణ్విత పరాసరస గోత్రస్య


*19. అగస్త్య:* అగస్త్య, తర్ధచ్యుత, శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాణ్విత అగస్త్యస గోత్రస్య


*20. ఘర్గి (రెండు రకాలు)*


1. ఆంగిరస, బర్హస్పత్య, భారద్వజ, ఉపాధ్యయ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య


2. ఆంగిరస, శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య


*21. బాదరాయణ:*


 ఆంగిరస, ఫార్షదశ్వ, ఋతితర త్రయా ఋషేయ ప్రవరాణ్విత బాదరాయణ గోత్రస్య


*22. కశ్యప (మూడు రకాలు)*


1. కాశ్యప, ఆవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


2. కాశ్యప, ఆవత్సార, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


3. కాశ్యప, ఆవత్సార, నైత్రువ, రేభ, రైభ , శాందిల, శాందిల్య సప్తా ఋషేయ ప్రవరాణ్విత కాశ్య్పస గోత్రస్య


*23. సుంక్రితి లేదా శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)*


1. ఆంగిరస, కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య


2. శధ్య ,కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య


*24. ఆంగీరస :* 


ఆంగీరస, ఫురుకుత్స్య, ఠ్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగీరస గోత్రస్య


*25. గౌతం/గౌతమస :*


 అంగీరస, ఆయస్య, గౌతమస త్రయా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య


*26. అగ్నివైవశ్వత:*


 ఆంగీరస, భార్హస్పత్స్య, భారద్వాజ, శ్రుక్వ, ఆగ్నివైవశ్వత పంచాఋషేయ ప్రవరాణ్విత అగిన్వైవశ్వత గోత్రస్య


*27. శాంఖ్యాయన:*


 విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవవ్రథ శాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాంఖ్యాయన గోత్రస్య


*28. విశ్వామిత్ర:* 


శ్రౌమిత, ఖామకయన, దేవతరస, దేవరత,పంచా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర


*29. కపి:* 


ఆంగీరస, అమాహైయ, ఔరుక్షయ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత కపిస గోత్రస్య.

🦚🦚🦜🅰️🦜🦚🦚

విదుర నీతి*

 *విదుర నీతి*


జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.

ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.

రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.

సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!

జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.

మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.

‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.


సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

దారంతో కట్టిన పూలు

 దారంతో కట్టిన పూలు


చెన్నై నుండి ఒక భక్తుడు చాలా పూలు తెచ్చి శ్రీమఠంలో ఒక పెద్ద రాశిగా పోసాడు. అందులో చాలా రకాలైన పూలు ఉన్నాయి, గుబురుగా కట్టిన మల్లెదండలు, పరిమళం వెదజెల్లే చాలా రకాలైన రంగురంగు పూలతో కళాత్మకంగా తీర్చిదిద్దిన దండలు ఉన్నాయి. కాని, వాటిని శ్రీచంద్రమౌళీశ్వరునకు అలంకరించడానికి పనికిరావు. ఆ పూలదందలన్నీ దారంతో కట్టబడ్డాయి అరటి బెరడు దారంతో కాదు. శ్రీమఠంలో దారంతో కట్టిన మాలలను చంద్రమౌళీశ్వరునకు అలంకరించరు. ఆ భక్తుని నిరాశ మాటలలో చెప్పలనవి కాదు. అతను చాలా ప్రయాసతో ఆ పూలను తెచ్చాడు కాని ఒక చిన్న మల్లె దండ కూడా అలంకారానికి పనికిరాదు.


పరమాచార్యస్వామి వారు పూజ ముగించుకుని బయటకు వచ్చారు. వెళ్తూ బుట్టలలో ఉన్న పూలను చూసారు.


మహాస్వామి వారు పరిచారకులతో ”వీటిని ఎందుకు పూజకు తీసుకుని రాలేదు?’ అని అడిగారు.


”వాటన్నింటిని దారంతో కట్టారు” అని చెప్పారు.


వాటిని తెచ్చిన ఆ భక్తుడు అక్కడ నిలబడి ఉన్నాడు. తన అజ్ఞానానికి స్వామి వారు ఏమంటారో అని కొంచం ఆందోళనగా ఉన్నాడు. కాని మహాస్వామి వారు కరుణా సముద్రులు.


”దారంతో కట్టిన పూలు స్వామి అలంకరణకు పనికిరావు. కాని నాకు పనికివస్తాయి” అని అన్నారు.


అక్కడున్న భక్తులు ఆనందపడ్డారు. పరమాచార్య స్వామి వారు ఒక చెక్క పీఠంపైన కూర్చున్నారు. తెచ్చిన పూలను మాలలను స్వామి వారికి అలంకరించారు. అది చూడడానికి పూలంగి సేవ లాగా కనపడింది. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు.


”సాక్షాత్ తిరుపతి వెంకటాచలపతి” అన్నాడొక భక్తుడు.


”సాక్షాత్ తిరుచెదూర్ మురుగన్” అన్నారు మరొకరు.


”సాక్షాత్ కంచి కామాక్షియే” అన్నారింకొకరు.


ఒక వేదాంతి పారవశ్యంతో అన్నాడు. “ఈ ప్రపంచం జగన్ మిథ్య అని చెప్పేవారందరూ ఒక్క క్షణం అలోచించండి. ఈ క్షణం వాస్తవం సత్యం. బ్రహ్మం సత్యం. దేవుడు ఉన్నాడు అన్నది నిజం (సగుణ బ్రహ్మం పరమ సత్యం). దేవుడు గుణాహితుడై పరిపూర్ణ గుణములచేత ప్రకాశించి ఉన్నాడు. పెరియవ... రూపహితుడైన దేవుడు. దైవం మానవ రూపంలో అన్నది నిజం (సగుణం ... సద్గుణం). గుణముల చేత ప్రకాశించువారే శ్రేష్టమైనవారు. పెరియవ సగుణబ్రహ్మం... బ్రహ్మానందం”


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

ఉత్తమజ్ఞానం

 *📖 మన ఇతిహాసాలు 📓*



*ఉత్తమజ్ఞానం*


పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు.


తిరిగి తిరిగి అలసిపోయిన పులస్త్యుడు ఒకనాడు ఒక గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటుతున్నాడు. పులస్త్యుడు అక్కడే కూర్చుని తదేకంగా చూడసాగాడు. మరు సటి రోజు భారీ వర్షం కురిసి విత్తనాలన్నీ కొట్టుకుపోయాయి.


రైతు మళ్లీ వేరే విత్తనాలు తెచ్చి నాటాడు. ఆ తర్వాత వర్షమే పడలే దు. రైతు దూరంగా బావి నుంచి నీళ్లు తోడి పోశాడు. కానీ బావి కూడా ఎండిపోయింది. రైతు పట్టువిడవకుండా ఇంకా ఎంతో దూరంలో వున్న నది నుంచి నీళ్లు తెచ్చిపోయసాగాడు. క్రమంగా విత్తనాలు మొలకెత్తాయి. పంట దండిగా పండింది. రైతు హాయి గా పంట కోసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. పులస్త్యుడికి అసలు విషయం అర్థమైంది.


ఉత్తమజ్ఞానం ఎక్కడో లేదు, మనచుట్టూ కనిపించే ప్రతి దానిలోనూ వుంటుంది. అదే రైతు తనకు ఇచ్చిన ఉపదేశంగా భావించాడు పులస్త్యుడు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

తెలివైన రైతు

 *✍🏼 నేటి కథ ✍🏼*



*తెలివైన రైతు*



రాజా విజయేంద్రవర్మ తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒక రోజు రాజ్యంలో పర్యటిస్తున్నాడు. పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతును "నువ్వు సంపాదించే దానితో సంతోషంగా ఉన్నావా?" అని అడిగాడు. "సంతోషంగా ఉన్నాను రాజా! నేను రోజుకు ఒక రూపాయి మాత్రమే సంపాదిస్తాను. దానిలో 25 పైసలు తింటాను. మరో 25 పైసలు అప్పుగా ఇస్తాను. మరో 25 పైసలు రుణం చెల్లిస్తాను. మిగిలిన 25 పైసలు పడవేస్తాను" అని చెప్పాడు రైతు.


"అయినా నీవు సంతోషంగా ఉన్నావని ఎలా చెప్పగలవు?" అడిగాడు రాజు. "రాజా! నా మొదటి 25 పైసలు నా కుటుంబ సభ్యులు ఆహారానికి, రెండో 25 పైసలు నేను పిల్లలపై ఖర్చ చేస్తాను కాబట్టి అది నా భవిష్యత్తుకు బీమా వంటిది. మరో 25 పైసలు నా తల్లిదండ్రులపై ఖర్చు చేస్తాను. వారి రుణం తీర్చుకోవడానికంటే సంతోషం ఏముంటుంది. చివరి 25 పైసలు నేను బీదవారికి దానం చేస్తాను.


రైతు చెప్పిన దానిని విని రాజు సంతోషించాడు. అతనికి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చి, "నా మొహం వందసార్లు చూసే వరకు ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పవద్దు" అని రాజు దర్బారుకు చేరుకున్నాడు.


రైతు చెప్పిన చిక్కు ప్రశ్నను రాజు తన దర్బారులో వారి ముందు ఉంచాడు. జవాబు చెప్పిన వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఒక తెలివైన అధికారికి రాజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ రైతును కలిశాడన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే రైతు దగ్గరకెళ్ళి అతనికి బంగారు నాణాల మూట ఇచ్చి తిరిగి నగరానికి చేరుకున్నాడు.


మర్నాడు ఉదయం ఆ రైతు కూడా దర్బారుకు వచ్చాడు. ఆ తెలివైన అధికారి చక్కగా చిక్కు ప్రశ్నలకు జవాబును వివరించాడు. అంతే, కోపంతో ఊగిపోతు రాజు "నీకెంత ధైర్యం! నా మొహం వందసార్లు చూపిన తరువాత గాని జవాబు ఎవరితోనూ చెప్పవద్దని చెప్పానుగా! అని రైతు మీద ఆగ్రహించాడు.


"రాజా! మీ మాటలను నేను జవదాటలేదు. ఈ అధికారి గారు నాకు వంద బంగారు నాణాలు ఉన్న ఒక మూటను ఇచ్చారు. నాణాలపై మీ బొమ్మ ముద్రించి ఉంది. కాబట్టి నేను వందసార్లు మీ మొహం చూసిన తరువాత గాని ఈ జవాబు అధికారికి చెప్పలేదు" అని వివరించాడు రైతు.


రాజు తన అధికారి తెలివికి, రైతు మేధస్సుకు సంతోషించి వారిద్దరినీ సత్కరించాడు. 


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

గురు మర్యాద

 🌹గురు మర్యాద !🌹


        దేవతలలో త్వష్ట అనే వాడు తన తపోశక్తితో మూడతలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవి కోరి ఘోరతస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకుబెళుకులకు లొంగక పోవడంతో ఇంద్రుడు విశ్వరూపుని చంపి ఆ విషయం ఒక సంవత్సరం పాటు రహస్యంగా దాచాడు. తరువాత అందరికీ ఆవిషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు, అతడు బ్రహ్మహత్యా పాతకం చేసాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచి పెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేసాడు.


        ఇది తెలిసిన త్వష్ట కోపించి, ఇంద్రుడిని చంపడానికి వృత్తాసురుడిని సృష్టించాడు. అధిక బల సంపన్నుడైన వృత్తాసురుడి ధాటికి తట్టుకోలేక దేవతలు శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్ళి వృత్తుని చంపే ఉపాయం చెప్పమని అర్ధించారు. 


        “మీరు వెళ్ళి ఇంద్రుడికి వృత్తుడికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంత మయ్యేలా చేస్తాను " అన్నాడు. 


        ఋషులంతా వృత్తాసురుడి వద్దకు వెళ్ళి


         "ఇంద్రుడు అజేయుడు నీవా అధిక బలశాలివి మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు కనుక ఇంద్రుడితో మైత్రి చేసుకో " అని నచ్చచెప్పారు. 


        దానికి వృత్తాసురుడు అందుకు అంగీకరిస్తూ...


        "బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి. నేను తడిసిన దానితో కాని ఎండిన దానితో కాని రాత్రి కాని పగలు కాని సంహరించబడకూడదు. అందుకు ఒప్పుకుంటే ఇంద్రుడితో సంధి చేసుకుంటా" అన్నాడు. 


        ఆ మేరకు ఒప్పందం కుదిరింది.


        కానీ ఇంద్రుడు మాత్రం అతడిని సంహరించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు అసుర సంధ్యలో సముద్రతీరంలో విహరిస్తున్న వృత్తాసురుడిని చూసి అతడిని సంహరించడానికి అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువుని ప్రార్ధించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సాయంతో వృత్తుని సంహరించాడు


        దేవేంద్రుడికి వృత్తాసుర సంహారం చేయడం వలన మరల బ్రహ్మ హత్యాపాతకం అంటుకుంది. ఒక సారి ఆ బ్రహ్మహత్యా పాతకమును ఇతరులకు పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ హత్యా పాతకం మాత్రం పరమ వృద్దుడయిన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో, ఒళ్ళంతా క్షయ వ్యాధి, కుష్ఠు వ్యాధి చేత పుండ్లు పడిపోయి, ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణములతో ఇంద్రుని కౌగలించుకోవడానికని వెంటపడింది. 


        అది బ్రహ్మహత్యాపాతక స్వరూపం. అది బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగు పెడుతూ అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఎటువైపుకు వెళ్ళినా విడిచి పెట్టలేదు. అప్పుడు ఇంక దారిలేక ఇంద్రుడు ఈశాన్య దిక్కుపట్టి పరుగెత్తి మానస సరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. 


        అక్కడికి బ్రహ్మహత్యా పాతకం కూడా తరిమి రాలేక పోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురు చూస్తూ నిలబడింది. ఇంద్రుడు మానస సరోవరంలోకి దూకి అందులో ఉన్న ఒక తామరపువ్వు గుండా తామర నాళం లోనికి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరిపోయాడు. 


        అలా ఇంద్రుడక్కడ వేయి సంవత్సరాలు ఉన్నాడు. ఒడ్డున ఆ బ్రహ్మహత్యా పాతకం బయటకు రాకపోతాడా పట్టుకోనక పోతానా అని నిరీక్షిస్తూనే ఉంది. అలా ఇంద్రుడు నారాయణ కవచమును శ్రీమన్నారాయణుని తపమును ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు. ఈశ్వరారాధనం చేస్తూ కూర్చున్నాడు. 


        ఈ వెయ్యి సంవత్సరాలు గడిచేలోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఇంద్రపదవి ఖాళీగా ఉండటం వల్ల ఆ పదవిలోకి తాత్కాలికముగా అనేక యాగాలు చేసిన నహుషుడు అనే మహారాజును తెచ్చి కూర్చోబెట్టారు. 


        ఇంద్ర పదవిలో కూర్చోగానే ఆయనకో వెర్రి ఆలోచన పుట్టింది. అదేమిటంటే.....


         ‘ఇంద్రపదవి ఒకటీ ఇచ్చి వదిలిపెడితే ఎలా ?! శచీదేవి కూడా నాది కావాలి కదా !’ అనుకుని-


        “ప్రస్తుతం నేనే ఇంద్రుడిని కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నీవు నా భార్యగా ఉండు" అని శచీదేవికి వర్తమానం పంపాడు. 


        అది వినగానే శచీదేవికి చిర్రెత్తుకొచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మవారికి నమస్కరించింది. లలితా సహస్రంలో అమ్మవారికి "పులోమజార్చిత" అని పేరు ఉంది. పులోముడు శచీదేవి తండ్రి. పులోముని కుమార్తె అయిన శచీదేవి చేత నిరంతరం లలితా పరాభట్టారిక అర్చింప బడుతూ ఉంటుంది. భార్య చేసే పూజల వలన భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. 


        అందుకని శచీదేవి పూజల వలన ఇంద్రుడు ఇంద్రపదవిలో ఉన్నాడు. భర్త చేసిన దోషంతో భార్యకు సంబంధం లేదు కాబట్టి బృహస్పతి ఈమెకు దర్శనం ఇచ్చి 


        "అమ్మా! దీనికి ఒకటే పరిష్కారం. నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో అలాగే వీడితోటి ఒక అపచారం చేయించు. కాబట్టి నహుషుడిని సప్తర్షులు మోస్తున్న పల్లకిలో రా ! నీవు నాకు భర్తవు అవుదువు గాని అని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి అయ్యో, ఈ పని చేయ్యొచ్చునా లేదా అని ఉండదు. సప్తర్షులను పిలిచి మోయమని పల్లకి ఎక్కుతాడు” అని చెప్పాడు. 


        బృహస్పతి చెప్పిన విధంగానే నహుషుడుకి కబురు పంపింది. అతడు సప్తర్షులు మోస్తున్న పల్లకి ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో అగస్త్య మహర్షి ఉన్నారు.


        ఆయన మహాశక్తి సంపన్నుడు. కొంచెం పొట్టిగా ఉంటాడు. అందువల్ల ఆయన అడుగులు గబగబా వేయడం లేదు. నహుషుడు లోపలినుంచి చూశాడు. తొందరగా శచీదేవి వద్దకు వెళ్ళాలనే తాపత్రయంతో...


         “సర్ప సర్ప (నడు నడు)” అని ఆయనను హుంకరించి డొక్కలో తోశాడు. అగస్త్యుడికి కోపం వచ్చింది. నహుషుడి వంక చూసి...


        “చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని అడుగులు వేయలేక పోతున్న వాడిని అయిన నన్ను "సర్ప సర్ప" అన్నావు కాబట్టి నీవు సర్పమై కొండచిలువవై భూలోకంలో పడిపో" అని శపించాడు.


        వెంటనే నహుషుడు కొండచిలువయి క్రిందపడ్డాడు. ఇపుడు మళ్లీ ఇంద్రపదవి ఖాళీ అయింది. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ కలిసి మానస సరోవరం దగ్గరకు వెళ్ళారు. వెయ్యి సంవత్సరాలు తపించిన ఇంద్రుడి శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. 


        పూర్తి నివారణ కాలేదు. అప్పుడు ఇంద్రుడిని తీసుకు వచ్చి అశ్వమేధ యాగం చేయించారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాపపరిహారం చేశాడు. ఏది చేసినా భగవానుడే చేయాలి. అందుచేత ఇంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహమునకు పాత్రుడయ్యాడు. 


        బ్రహ్మహత్యా పాతకం నివారణయ్యి మరల వచ్చి ఇంద్రపదవిలో కూర్చుని సంతోషముగా గురువును సేవిస్తూ కాలమును గడిపాడు. 


        ఇంద్రపదవిని అలంకరించిన వాడే గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కష్టములు పడ్డాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ గురువుల పట్ల మర్యాదతో ప్రవర్తించడం, వారు చెప్పిన మాట వినడం అనే మంచి లక్షణమును కలిగి ఉండాలి అనేది దీని ద్వారా తేటతెల్లమవుతోంది.


                                  🌺🌼🌺