27, మార్చి 2026, శుక్రవారం

ఆటవెలదులలో అయోధ్యపురి దేవా

 *ఆటవెలదులలో అయోధ్యపురి దేవా!*


 తండ్రి నాజ్ఞ మేర తనయుడివై నీవు 

 కారడవిన నీవు కాలు మోపి 

 దుష్ట శిక్షణంబు శిష్ట రక్షణ జేసె 

 *జామి వారి మాట జగతి కెరుక!*

 

నవమి నాడు బుట్టి నారి చేతను బట్టి 

 నాడు వనము కేగె నారి తోడ 

 నారి కొరకు రామ నాభి యందున గొట్టె 

 *జామి వారి మాట జగతి కెరుక!*


 రామనామ మంత రాజిల్లు ధరలోన

 రామ సీత జంట రమ్యమంట!

 రామబాణమొకటె రక్షించు లోకంబు 

 *జామి వారి మాట జగతి కెరుక!*


 రామ రామ యంటు రామదాసు బలికె 

 రామకీర్తనిపుడు రమ్యమైంది! 

 రామదాసు భక్తి రాజిల్లు భువిలోన

 *జామి వారి మాట జగతి కెరుక!*


 శ్రీ రమ జప మంత్ర శ్రీ ఘన రుచి యంత

 శ్రీ ఘన రుచి పంచు శ్రీలు నిచ్చు  

 శ్రీలు పొంగు సీమ శ్రీరామరాజ్యంబు 

 *జామి వారి మాట జగతి కెరుక!*


 ఒంటిమిట్ట యందు నొంటరి వైనావా?

 వదలబోము నిన్ను వసుధ దేవ!

 రాష్ట్రమంత నిన్ను శ్రేష్టంబు జేతుము 

 *జామి వారి మాట జగతి కెరుక!*


 హనుమ భక్తి కంటె ననురాగమెక్కడ?

 రామ భజన కంటె రాగమేది?

 వరములిచ్చు రామ వందనం గైకొను 

 *జామి వారి మాట జగత కెరుక!*


 తండ్రి మాట కన్న తలమానికంబేది?

 తల్లి సేవ కన్న తనివి యేది?

 రామ పదము కన్న రాజిత పదమేది? 

 *జామి మాట కన్న నేమి గొప్ప?* 

 *శ్రీరామనవమి శుభాకాంక్షలతో..*


    *జామి సత్యనారాయణ* 

 *కవి నటుడు ఉపాధ్యాయుడు*

కామెంట్‌లు లేవు: