*ఘోల్లు మన్న సెల్లు (హాస్య కథ)*
📱📱📱📱📱📱📱📱📱📱
***ఓరీ మీ దుంపలు తెగా , మీరెక్కడ తయారయ్యారు రా....***
అని గొంతు వినిపిస్తే ఒక్కసారిగా ఉలిక్కిపడి అటూ ఇటూ చూశాను !!! మొబైల్ లో ఏదో హాస్య కార్యక్రమం చూస్తూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్న నాకు ఉన్నట్టుండి
""నిన్నే దరిద్రుడా !! అని వినిపించింది"",
అంతే నాకు సర్రున నా కోపం నషాళానికి అంటుతుండగా *ఎవర్రా అంత ధైర్యంగా నన్ను తిట్టేది అరుస్తూ ఒక్క ఉదుటున లేచి అటూ ఇటూ చూశాను కానీ చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవటంతో*
నా చరవాణే నన్ను తిడుతున్నది అని అర్థం అవ్వటానికి చాలా సమయం పట్టింది , అలా అర్థం అయ్యసరికి నాకు మూర్చ వచ్చినంత పని అయ్యింది.....
ఆ హఠాత్పరిణామానికి *నేను వింటూ వింటున్నది చూస్తున్నది నిజమేనా?? అనుకుంటూ, నన్ను నేను ఓ సారి చేతి మీద గిచ్చుకుంటూ , కెవ్వని అరచుకుంటూ , షాక్ కొట్టిన కాకిలా అలా బిగుసుకుపోయి నా సెల్లునే చూస్తున్నాను* అదేదో హారర్ సినిమా చూస్తున్నట్లు , అలా గుడ్లప్పగించి నా సెల్లునే చూస్తుంటే , మళ్ళీ నా సెల్లే తిట్ల డండకం ప్రారంభించింది....
నా పేరు రవి , నేను బ్యాంకులో ఆఫీసర్ గా పని చేస్తున్నాను , మహా అయితే రోజు మొత్తం మీద మూడు నాలుగు గంటలు పని ఉంటుందేమో తర్వాత మిగతా టైం అంతా ఖాళీగా ఉండటం వల్ల నా సెల్లులోనే నాకు ఎక్కువ కాలక్షేపం అవుతూ ఉంటుంది, ఎంతలా అంటే """ఆ కాలక్షేపానికి మూల్యం నా జీవితం అన్న విషయం కూడా మరచిపోయేంత, నేను పెళ్లి చేసుకున్నాను నాకు పిల్లలు ఉన్నారు అన్న సంగతి కూడా పక్కన పెట్టి దానితోటిదే లోకం ఐపోయింది.
ఎలాగంటే , అదేదో నెలల పిల్లని అపురూపంగా చూసుకున్నట్లుగా చూసుకునేవాడిని....
""నా వాడకానికి , సెల్లుని బోలెడు డబ్బులు పోసి కొన్న దానికి పైసా వసూలు చేస్తున్నట్టుగా అనిపించేది నాకు""".
""""కానీ , కానీ సెల్లు మాట్లాడడం ఏమిటో నాకు అర్థం కాలేదు"""???
నేను ఏమైనా భ్రమలో ఉన్నానా అనుకోని చుట్టుపక్కలంతా గమనించాను, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు , సెల్లు మాట్లాడుతోంది అన్న విషయం నాకు నా సెల్ కి తప్ప ఎవరికీ వినిపించట్లేదు కనిపించట్లేదు ఒకవేళ ఎవరైనా చూస్తే నాకు మతిభ్రమించింది అనుకుంటారేమో అని ఒక పక్క భయం.....
నేను అలా అటూ ఇటూ చూస్తుండగానే నా సెల్లు మళ్ళీ నన్ను తిట్టడం మొదలెట్టింది , ఎండాకాలంలో ఏసీ కోసం ఏటీఎంలోకి వెళ్లే అంట్లకుంకలా ఇక్కడ తిడుతుంటే అటూ ఇటూ దిక్కులు చూస్తావేరా పింజారి వెధవా !!! నేను తిడుతున్నది నిన్నే అంటూ మొదలెట్టింది......
నువ్వు వాడే వాడకానికి నేను ఎంత నలిగిపోతున్నానో నీకు అర్థమవుతుందా అసలు ?? అంటూ ఓ రెండు సెకన్లు దీర్ఘంగా ఆకాశంలోకి చూసి నిట్టూర్చింది...... నేను కూడా దానితో పాటు ఒకసారి అలా పైకి చూశాను.... కానీ అక్కడ ఏం లేదు....
దీర్ఘంగా వైబ్రేటిస్తూ మొదలెట్టింది చెప్పడం """"ఏదో నువ్వు పడుకున్నప్పుడు నాలుగైదు గంటలు తప్పితే నా ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంది, నువ్వు లేస్తున్నావు అంటేనే నాకు గుండెదడ మొదలౌతున్నది , అప్పుడప్పుడు ఒక్క పర్సెంట్ ఛార్జింగ్ కోసం ఎంత గిల గిల లాడుతానో switch off అయ్యే నాకు మాత్రమే తెలుసు......ఆ అనుభవం ఎలా ఉంటుందంటే ఆకాశం నుంచి పారచూట్ లేకుండా కిందకి విసిరేస్తున్నట్లుగా ఉంటుంది......
"""పొద్దున్నే లేస్తూనే ఆ పాచి మొహంతో మొదలెడతావు నీ దినచర్య , లేస్తూనే సంతలో తప్పిపోయిన పిల్లాడు తల్లిని వెతికి వెతికి తల్లిని చూడగానే కరుచుకుపోయినట్లు నన్ను వెదికి పట్టుకుంటావ్, అక్కడ నుంచి మొదలవుతుంది నా అవస్థ......""""
ఎక్కడికి వెళ్తే అక్కడకి నన్నూ తీసుకెళ్తావ్ , స్నానానికి !! బ్రష్ చేస్తూ !! టిఫిన్ తింటూ !! దరిద్రాతి దరిద్రం , థూ నా బతుకు చెడా, టాయిలెట్లోకి కూడా తీసుకెళ్తావ్ నన్ను ?? ఈ దరిద్రాలన్నీ చూస్తూ ఇంకా బతికున్నాను నేను అంటూ బావురుమంది....
*అది కాదూ అంటూ మొహం అదోరకంగా పెట్టి, ఏదో సద్ది చెప్పపోయాను కాస్త, అంతే మళ్ళీ అంతెత్తు వైబ్రేట్ అవుతూ , వినటానికి విల్లింగ్ గా ఉంటే భారతంలో కృష్ణుడికి అర్జునుడికి ఇంత చెప్పాడంట అంటూ సాగదీసింది*
తెల్లవారు ఝామున ఐదింటికి లేస్తావు , రాత్రి ఒకటింటి వరకూ నన్ను వాడుతూనే ఉంటావు , ఏ ?? మాకంటూ ప్రైవేట్ లైఫ్ ఉండదా ?? , మీకు సర్వీస్ చేయలేక చస్తున్నాను, ఈమధ్య హెల్త్ కూడా పాడైపోతుంది, చస్తే బాగుండు అనిపిస్తోంది , ఎవడికి చెప్పు కొనేది నా బాధ అంటూ , నా సెల్లు దానిని ఎలా వాడతానో నాకే చెప్తుంటే తలకాయ దించుకొని *హి హి హి* అంటూ నవ్వటం మొదలెట్టాను......
నా నవ్వు చూసి నా సెల్ కి ఇంకా ఒళ్ళు మండిపోయింది , జంధ్యాల సినిమా లెవెల్ లో బండ బూతులు తిడుతుంటే చీకేసిన తాటికాయ మొహం వేసుకుని నవ్వుతావేరా అంటూ, కోటా శ్రీనివాసరావుని బ్రహ్మానందం తిట్టినట్టు ఎడాపెడ వాయించేస్తుంది నన్ను....
ఇంతలో మా ఆవిడ నన్ను ఏవండీ ?? ఏవండీ ?? అని గట్టిగా తడుతూ లేపింది, అంతే ఒక్కసారిగా మెలకువ వచ్చి ఉలిక్కిపడి లేచాను , లేస్తూనే అటూ ఇటూ వెర్రి చూపులు చూస్తున్న నన్ను మా ఆవిడ అడిగింది , ఏమైందండీ ??ఎందుకలా నిద్రలో అరుస్తున్నారు , ఏమైనా పీడకల వచ్చిందా అంటూ...... అప్పుడు అర్థమయింది నాకు సెల్లు నాతో మాట్లాడడం , నన్ను తిట్టడం అంతా కల అని....
పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ నా సెల్లునే తదేకంగా చూస్తూ ఆలోచిస్తున్నాను, అవడానికి కలైనా నిజంగా ఈ రోజుల్లోని సెల్లుల బాధ నిజంగా ఇదేనేమో , అంతేనేమో అనిపించింది నాకు. అప్పటినుంచి నేను సెల్లు వాడటం చాలా మటుకు తగ్గించేసి , కుటుంబంతో ఎక్కువసేపు గడపడం మొదలు పెట్టాను , ఆ సెల్లుని చూస్తున్నప్పుడల్లా , అసలు ఏ సెల్లును చూస్తున్నా కూడా నాకు ఆ కల మాత్రం నా జీవితంలో మర్చిపోలేని స్థితికి వచ్చేసాను , నన్ను జీవితాంతం వెంటాడే కల బహుశా ఇదేనేమో.......
ధన్యవాదాలు 🙏
నేను రాసిన ఈ ఘోల్లు మన్న సెల్లు అను హాస్య కథ నా అందరినీ అలరించిందని అనుకుంటున్నాను..
*అరుణా సువర్చల*
కలం పేరు:: చంద్రిక ✍️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి