*గూగుల్ కుదిర్చి న పెళ్ళి* (*హాస్య కధ*)
=================
రచన :- సురేష్ వంకాయలపాటి
===============
డైరెక్ట్‌గా కథలోకి సుత్తిలేకుండా వస్తే…
గోపాల్‌కి 40 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. మనిషి చాలా అందగాడు. ఎంటెక్ వరకు చదువుకుని హైదరాబాద్‌లో ఒక మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
కానీ అతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది.
ఏ విషయం అయినా ముందుగా గూగుల్‌లో సెర్చ్ చేస్తే గానీ నిర్ణయం తీసుకోడు. గూగుల్ అంటే అతనికి అంత నమ్మకం.
ఏ విషయం అయినా సరే మొబైల్ తీసుకుని గూగుల్‌లో చెక్ చేస్తాడు.
అది చూసి తర్వాతే ఏ నిర్ణయం అయినా తీసుకుంటాడు.
ఒకరకంగా చెప్పాలంటే… అతనికి లోకజ్ఞానం కొంచెం తక్కువే అని చెప్పాలి.
గోపాల్ వాళ్ళ ఊరు పిఠాపురం. అక్కడే అతని తల్లిదండ్రులు ఉంటారు. తల్లి పేరు లక్ష్మి. తండ్రి పేరు శ్రీరాములు. శ్రీరాములు గారు వృత్తి రీత్యా పురోహితుడు. ఊరిలో చాలా మంది పెళ్లిళ్లు చేసి మంచి పేరు సంపాదించారు.
కానీ ఒక విచిత్రం ఏమిటంటే…
ఊరిలో అందరి పెళ్లిళ్లు చేసిన శ్రీరాములు గారు తన కొడుకు పెళ్లి మాత్రం చేయలేకపోతున్నారు.
ఎందుకంటే గోపాల్ పెళ్లి విషయం వస్తే అంత గమ్ముని ఒప్పుకోడు. పైగా ఏ విషయం అయినా ముందుగా గూగుల్‌లో సెర్చ్ చేయడం అతని అలవాటు.
ఒకరోజు పిఠాపురం నుండి లక్ష్మి గారు మరియు శ్రీరాములు గారు హైదరాబాద్‌లో ఉన్న గోపాల్ దగ్గరకు వచ్చారు.
ఇంటికి రాగానే శ్రీరాములు గారు సోఫాలో కూర్చున్నారు. లక్ష్మి గారు గ్లాస్‌లో మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది.
నీళ్లు తాగుతూ శ్రీరాములు గారు కొడుకును చూసి కోపంగా అన్నారు.
“ఏరా గోపాల్… ఈ సంవత్సరం అయినా పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? ఊరిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. అందరూ అడుగుతున్నారు.
‘శ్రీరాములు గారు ఊరి వాళ్లందరి పెళ్లిళ్లు చేస్తారు కానీ తన కొడుకు పెళ్లి మాత్రం చేయలేదట’ అని.”
అని గ్లాస్ టేబుల్ మీద పెడుతూ అన్నారు గోపాల్ తో...
గోపాల్ మాత్రం చాలా ప్రశాంతంగా మొబైల్ తీసుకున్నాడు.
అది చూసి లక్ష్మి గారు అడిగింది.
“ఏరా… నాన్న మాట్లాడుతుంటే ఆ ఫోన్ చూస్తున్నావేమిటి? ఏంటి అర్జెంట్?”
గోపాల్ ఫోన్‌లోంచి తల ఎత్తకుండా అమాయకంగా అన్నాడు.
“అమ్మా… నాన్న చెప్పిన విషయం గురించి గూగుల్ ఏమంటుందో చూస్తున్నాను.”
అని వెంటనే గూగుల్‌లో టైప్ చేశాడు.
“40 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిదా?”
కొద్దిసేపు చదివి అన్నాడు.
“నాన్న… గూగుల్ చెబుతోంది ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా కూడా జీవితం బాగానే ఉంటుంది అంటోంది.”
అది విని శ్రీరాములు గారు తల పట్టుకున్నారు.
“అయ్యో రామా… నేను జీవితంలో వందల పెళ్లిళ్లు చేశాను. కానీ నా కొడుకు పెళ్లి మాత్రం గూగుల్ అనుమతి కోసం ఎదురు చూస్తోంది!”
లక్ష్మి గారు కూడా చెప్పింది.
“అవును రా బాబు… మాకు కోడలు కావాలి. ఇంట్లో కాస్త నవ్వులు వినాలి. మనవళ్లు తో ఆడుకుంటున్నారు మా వయస్సు వాళ్ళంతా.”
అని ప్రేమగా చెప్పి చివరకు గోపాల్‌ను పెళ్లికి ఒప్పించింది.
కొన్ని రోజుల తర్వాత లక్ష్మి గారు ఒక మంచి సంబంధం చూసింది. పైగా ఆడపెళ్లివారు దూరపు బంధువులే.
ఆ అమ్మాయి పేరు సీత. ఆమె హైదరాబాద్‌లో టీచర్‌గా పని చేస్తోంది. మంచి సంస్కారం ఉన్న కుటుంబం.
ఒకరోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.
సీత కాఫీ తీసుకుని హాల్‌లోకి వచ్చింది. అందరూ కూర్చుని మాట్లాడుతున్నారు. గోపాల్ మాత్రం మెల్లగా మొబైల్ తీసుకుని గూగుల్ ఓపెన్ చేశాడు.
అతను టైప్ చేశాడు.
“పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఏమి అడగాలి?”
అది చదివి వెంటనే సీతను అడిగాడు.
“మీకు హాబీస్ ఏమిటి?”
సీత నవ్వుతూ చెప్పింది.
“నాకు పాటలు పాడటం, పుస్తకాలు చదవడం ఇష్టం.”
గోపాల్ వెంటనే మళ్లీ గూగుల్‌లో టైప్ చేశాడు.
“పాటలు పాడే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిదా?”
అది చూసి సీతకు నవ్వు వచ్చింది.
ఆమె మెల్లగా అడిగింది.
“మీరు ప్రతి విషయం గూగుల్‌లో చూసి నిర్ణయం తీసుకుంటారా?”
గోపాల్ గర్వంగా అన్నాడు.
“అవును. గూగుల్‌లో చాలా జ్ఞానం ఉంటుంది.”
సీత చిరునవ్వుతో చెప్పింది.
“అయితే పెళ్లి తర్వాత భార్యతో ఎలా మాట్లాడాలో కూడా గూగుల్‌లోనే చూస్తారా?”
అందరూ నవ్వేశారు.
పెళ్లి చూపులు అయిపోయాక సీత గోపాల్‌తో కొద్దిసేపు మాట్లాడింది.
“మీరు మంచి వ్యక్తిలా కనిపిస్తున్నారు. కానీ జీవితంలో కొన్ని నిర్ణయాలు గూగుల్ కాదు… మనసే తీసుకోవాలి.”
అది విని గోపాల్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.
తర్వాత మొబైల్ తీసుకుని గూగుల్‌లో టైప్ చేశాడు.
“మనసు చెప్పిన మాట వినడం మంచిదా?”
కొద్దిసేపు చదివి నవ్వాడు.
“గూగుల్ చెబుతోంది కొన్నిసార్లు మనసు మాట కూడా వినాలి అని.”
అప్పుడు సీత అడిగింది.
“అయితే ఇప్పుడు మీ మనసు ఏమంటోంది?”
గోపాల్ కొద్దిసేపు ఆలోచించి అన్నాడు.
“నా మనసు చెబుతోంది… మీరు మంచి అమ్మాయి అనిపిస్తున్నారు.”
అది విని శ్రీరాములు గారు ఆనందంగా నవ్వేశారు.
“అయ్యో దేవుడా… చివరికి నా కొడుకు గూగుల్ కాకుండా తన మనసు మాట కూడా విన్నాడు!”
కొన్ని రోజుల తర్వాత రెండు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి నిర్ణయించారు.
ముహూర్తం రోజున పెద్దగా పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు.
పెళ్లి మండపంలో ముహూర్తం దగ్గరపడుతోంది.
అప్పుడే గోపాల్ మళ్లీ మొబైల్ తీసుకున్నాడు.
శ్రీరాములు గారు వెంటనే అడిగారు.
“ఇప్పుడు ఏమి సెర్చ్ చేస్తున్నావురా?”
గోపాల్ నవ్వుతూ అన్నాడు.
“నాన్న… గూగుల్‌లో ఇలా టైప్ చేస్తున్నాను…”
“మంచి భర్తగా ఎలా ఉండాలి?”
అది విని శ్రీరాములు గారు నవ్వుతూ అన్నారు.
“రా గోపాల్… ఇప్పుడు గూగుల్ కాదు… నీ భార్య చెప్పిందే విను. అదే నిజమైన జ్ఞానం!”
అందరూ గట్టిగా నవ్వేశారు.
పెళ్లి అయిపోయి కొన్ని రోజులు గడిచాయి.
ఒకరోజు ఉదయం సీత వంటగదిలో వంట చేస్తోంది. గోపాల్ సోఫాలో కూర్చుని మొబైల్ చూస్తున్నాడు.
సీత అడిగింది.
“మళ్లీ గూగుల్‌లో ఏమి చూస్తున్నారు?”
గోపాల్ అమాయకంగా అన్నాడు.
“భార్య కోపంగా ఉన్నప్పుడు ఎలా శాంతింప చేయాలి అని చూస్తున్నాను.”
సీత నవ్వింది.
“అయితే గూగుల్ ఏమంటోంది?”
గోపాల్ చదువుతూ అన్నాడు.
“క్షమాపణ చెప్పాలి… గిఫ్ట్ ఇవ్వాలి… కాఫీ చేసి ఇవ్వాలి అంటోంది.”
సీత నవ్వుతూ చెప్పింది.
“గూగుల్ చెప్పింది అంతా చేయాల్సిన అవసరం లేదు. ముందు మీరు కాఫీ పెట్టడం నేర్చుకుంటే చాలు.”
గోపాల్ వెంటనే టైప్ చేశాడు.
కాఫీ త్వరగా ఎలా తయ్యారు చేయాలి ”
సీత నవ్వుతూ చెప్పింది.
“గూగుల్ కాదు గోపాల్… నేను నేర్పిస్తాను.”
గోపాల్ మొబైల్ పక్కన పెట్టి అన్నాడు.
“అయితే ఇకనుంచి నా గూగుల్ నువ్వన్న మాట.
అది విని ఇద్దరూ నవ్వేశారు.
అప్పుడే శ్రీరాములు గారు ఫోన్ చేశారు.
“ఏరా గోపాల్… ఎలా ఉంది పెళ్లి జీవితం?”
గోపాల్ నవ్వుతూ అన్నాడు.
“నాన్న… గూగుల్ కన్నా పెళ్లి జీవితం చాలా పెద్ద సబ్జెక్ట్ అని ఇప్పుడు అర్థమైంది!”
అది విని శ్రీరాములు గారు నవ్వుతూ చెప్పారు.
“అది తెలుసుకోవడానికి గూగుల్ అవసరం లేదు రా… పెళ్లి చాలు!”
ఆ మాటలు స్పీకర్ ఫోన్ లో విన్న లక్ష్మి గారు మసి ముసి గా నవ్వు కుంది కొడుకు మాటలు విని.
అలా చివరకు గూగుల్ మీద ఆధారపడే గోపాల్ కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని నవ్వులతో ప్రారంభించాడు.
(వాళ్ళ కాపురం ఎలావుందో తెలుసు కోవాలని మీరు గూగుల్ ల్లో వెతక్కం డే)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి