23, జులై 2025, బుధవారం

ఏది స్వర్గం....?

 ఏది స్వర్గం....?  

ఏది నరకం......? 

    

ఒక శిష్యుడికి

ఏది స్వర్గం? 

ఏది నరకం? 

అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. 

తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు. 


చివరికి ఓ రోజు ‘గురువుగారూ! 

మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. 


దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు.

 

శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు ఇలా ఒకటీ రెండూ కాదు మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి.


శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. 


అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు.


తనకు కనిపించిన రెండు దృశ్యాలనూ తల్చుకుంటూ శిష్యుడు తన కళ్లని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ‘ఇప్పుడు అర్థం అయ్యిందా స్వర్గానికీ, నరకానికీ ఉన్న తేడా ఏమిటో!’ అన్నారు గురువుగారు. శిష్యుడు తలవంచుకున్నాడు.

 

‘నీకు కనిపించిన రెండు దృశ్యాలలోనూ పరిస్థితి ఒక్కటే! కానీ ఒకదానిలో మనిషి తాను సుఖపడటం లేదు, ఎదుటివాడికీ అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఎంతసేపూ తన కడుపే నిండాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి అని తెలుసుకుని, ఒకరికొకరు సాయపడినప్పుడు ఎదుటివాడి ఆకలీ తీరుతుంది, మన కడుపూ నిండుతుంది. స్వర్గం, నరకం ఎక్కడో కాదు మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా!’ అన్నారు గురువుగారు.

చంద్రునికొక నూలుపోగు

 *“చంద్రునికొక నూలుపోగు" అంటే ఏమిటి? చంద్రునికి ఇవ్వవలసినది నూలు పోగేనా?*


ప్రతి మాసమూ వృద్ధి క్షయాలు పొందేవాడు చంద్రుడు. స్త్రీలలో చంద్రుడే ఋతు చక్ర భ్రమణానికి, సంతానోత్పత్తి, ప్రతి మాసమూ జరిగే అండోత్పత్తికి కారకుడు. చంద్రుడు దాంపత్యంలో భార్యా భర్త సంబంధాల అనుకూలతికూ, సౌగాభ్యానికి కూడా కారకుడు. చంద్రునికి ఆధిదేవత గౌరీదేవి. ఆ దేవత మాంగల్య సౌభాగ్యానికీ, అన్యోన్య ద్యాంపత్యానికీ, సంతాన సౌభాగ్యానికి అధిదేవత. 


గ్రహాలను తృప్తిపరచే విధానంలో ఏయే గ్రహాలకు ప్రీతికరమైన ద్రవ్య ధాన్యాదులచేత ఆయా గ్రహాలను తృప్తిపరచే విధానం ఉన్నది. వానిలో చంద్ర గ్రహానికి ప్రీతికరమైనదీ, చంద్రుని కారకత్వంలోనిదీ అయిన ధాన్యం - బియ్యం. ఆ బియ్యపు పిండిలో తయారుచేసిన తీపి వంటకమైన చలిమిడిని - చంద్రుని ఆరాధనలో గాని, గౌరీపూజలో గాని ఆర్పిస్తారు. అది విధానం. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళే సమయంలో కూడా, చంద్రునికీ, గౌరిదేవికి ప్రీతిపాత్రమైన ఈ చలిమిడినే ఆయా దేవతలకు నైవేద్యం చేసి- కుమార్తెకు సౌభాగ్యమూ, కడుపు చలువా కలగాలని - ఆమెకు ఆ చలిమిడిని ఇచ్చి పంపే ఆచారం ఉంది. 


ఆ విధంగానే చంద్రుడు వస్త్ర కారకుడు కనుక - కుమార్తెకు కొత్తబట్ట కట్టబెట్టి వంపుతారు. వస్త్రం అనేది చంద్రుని కారకత్వాలలోనిది. మానవ జీవితానికి అభిషణీయములైన అనేక ముఖ్య ప్రాథమిక అంశాలు చంద్రుని ఆధిపత్యంలొ ఉండడం వల్ల - ఆ చంద్రుని ఆర్చించడం, చంద్రునికి ప్రీతికరాలైన వస్తు విశేషాలను అర్పించడం శుభప్రదమవుతుందనే విశ్వాసానికి అనుగుణంగా ఈ విధంగా ఆచరిస్తారు. 


ఏదైనా ఒక శుభకార్యం కాని, ఆశుభకార్యం కాని జరిగినప్పుడు ఆయా కర్తలకు వారి తల్లి వైపు బంధువులు - నూతన వస్త్రాలను బహూకరించే ఆచారం మనకుంది. దానికి కారణం - మాతృ కారకుడు కూడా చంద్రుడే కావడం గమనార్హం. ఆయా శుభాశుభ కార్యాలను నిర్వర్తించే స్త్రీ పురుషులకు - అశుభాలు తొలగిపోయి శుభం కలగాలని శుభాశంసలతోను, చంద్రభగవానుని ఆశీస్సులు వారికి కలగాలనీ, చంద్ర గ్రహ సంబంధమైన శుభఫలాలను వారు పొందాలనీ- ఇటువంటి సందర్భాలలోని భావన. ఇదే విధంగా వ్యాధిగ్రస్తులై, తిరిగి ఆరోగ్యాన్ని పొందిన వారికి కూడా తల్లి లేదా తల్లికి సంబంధించిన వారు అన్న దమ్ములు మేనమామలు ఇత్యాదులు, ఎవరు జీవించి ఉంటే వారు - నూతన వస్త్రాలను బహూకరిస్తారు. ఈ సందర్భంలో కూడా ఇదే విధమైన శుభ మనకు కారణం - చంద్రుడు ఓషధీ కారకుడు, మనః కారకుడు, మాతృ కారకుడు - కూడా కావడమే. ఇత్యాదిగా ఇంకా ఈ సందర్భంలో అనుప్రాసక్తంగా చెప్పదగిన ఉన్నాయి.


ప్రతిమాసారంభంలోనూ ప్రధమ చంద్ర దర్శనం రోజున- చంద్రరాథనోన్ముఖంగా, ఒక వస్త్ర ఖండాన్ని చంద్ర దేవతా ప్రీత్యర్థంగా అర్పించడమే చంద్రునికొక నూలుపోగు నీయడం. దాని ద్వారా చంద్రగ్రహుయొక్క అనుగ్రహాన్నీ, చంద్రగ్రహ కారకత్వంలో ఉన్న శుభఫలాలనూ పొందగోరడమే 


చండ్రునికొక నూలుపోగు అనేది మరొక అర్థంలో కూడా ఉపయోగిస్తారు. అదేమంటే - కొండంత దేవునికి కొండండ పత్రి ఇచ్చుకోలేము. జగచ్చక్షువు, కర్మసాక్షిణన చంద్రునికి స్వల్పమైన నూలుపోగునివ్వడం అల్పాతి అల్పమైన కానుక. స్వీకరించేవాని అర్హతనుబట్టి కాక - ఇచ్చేవాని శక్తినిబట్టి అధికునికి స్వల్పమైన కానుక ఇచ్చినప్పడు చంద్రునికొక నూలు పోగుగా ఇస్తున్నామని చెప్పడంతా పరిపాటి.

గొప్పవాడు

 *వినయశీలుడే, అందరికన్నా గొప్పవాడు...!!*

వినయాన్ని మించిన ఆభరణం ఏమున్నది...

కార్యసిద్ధి కీర్తి లభించినప్పుడు, కొంతమంది మరింత పరిపక్వతతో అణకువగా ఉంటారు...

అయితే మరికొందరు వారి దృక్కోణాన్ని కోల్పోతారు...


ఒక సాధారణ మానవుడు, తన గొప్పలను సదా చెప్పుకుంటూ ఉంటే మహనీయులు, తమ ప్రతిభలు జయాపజయాలు సుఖదుఃఖాల ద్వారా భగవంతుడే వ్యక్తీకరింప బడుతున్నాడని భావిస్తారు...

సకల అనుభవాల ద్వారా వారు సత్యాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు...

దైవేచ్ఛ మన ఆలోచనల ద్వారా నెరవేరుతుందని తెలుసుకోవటమే ఆ పరమసత్యం..🙏🌺

ఆత్మనివేదన

 *ఆత్మనివేదన...*


పండుగలప్పుడో, పర్వదినాల్లోనో, లేకపోతే తమకు ప్రత్యేకమైన పెళ్లి రోజో, పుట్టిన రోజో... గుడికి వెళ్తుంటారు చాలామంది. ముందుగా అనుకుని ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు వెళ్లడమూ చేస్తుంటారు. 

అలా వెళ్లొచ్చాక తమ సన్నిహితులతో అక్కడి విషయాలను పంచుకుంటూ ఫలానా సందర్భంలో మేం అక్కడికి వెళ్లాం, ఆ దేవుణ్ని దర్శించుకున్నాం, ఆయనకి కిరీటాన్ని సమర్పించాం, అమ్మవారికి బంగారు నగలు చేయించాం లేకపోతే అన్నదాన నివేదన చేశాం, మొక్కు చెల్లించాం... అంటూ చెబుతుంటారు. 

తమ స్వయంకృషితో సంపాదించిన సంపదనుంచి ఇవన్నీ చేస్తున్నట్లుగా భావిస్తారు భక్తులు. 

నిజానికి ఇదంతా భగవంతుడి అనుగ్రహంతో తమకు కలిగిందనీ, ఆయన సృష్టించిన సంపదేననీ తెలుసుకోలేరు.


_🍁అసలు నివేదన అంటే ఏంటి? దేనిని అంటారు?_

సాధారణంగా భక్తులు భగవంతుడికి సమర్పించే వాటిలో పాలు, పండ్లు, చక్కెర మొదలైన ద్రవ్యాలు ఉంటే దాన్ని సామాన్య నివేదన అంటారు. 

పంచ భక్ష్య పరమాన్నాలు నైవేద్యంగా సమర్పిస్తే దాన్ని మహానివేదన అంటారు. 

కానీ ఈ ద్రవ్యాలన్నీ ప్రకృతి ద్వారా భగవంతుడు మనకిచ్చినవే, అవే తిరిగి మనం ఆయనకే సమర్పిస్తున్నాం. 

వాస్తవానికి నివేదన అంటే భక్తితో, ప్రీతితో భగవంతుడికి సమర్పించడం లేదా అర్పించడం. 

భగవంతుడికి ఏం సమర్పించాలి? ఏం అర్పించాలి? అని మళ్లీ ప్రశ్నించుకుంటే... నీ దగ్గర ఉన్నది, నీకు మాత్రమే చెందినది నివేదన చెయ్యాలి.

 మరి మన దగ్గర ఉన్నది అంతా ఆ పరమాత్ముడికి చెందిందే, ఆయన ఇచ్చిందే అయినప్పుడు ఇక నివేదన చెయ్యడానికి మన దగ్గర ఏం మిగిలింది... అన్న ప్రశ్న తలెత్తుతుంది. 

*దానికి సమాధానమే ఆత్మనివేదన.*


🍁నవవిధ భక్తి మార్గాల్లో తొమ్మిదోది, చివరిది, పవిత్రతను కలిగించేది... ఆత్మనివేదనా భక్తి. 

అంటే, భక్తుడు భగవంతుడి దారిలో నడవడం. తనని తాను భగవంతుడికి సమర్పించుకోవడం. 

మిగిలిన ప్రాణం లేని పదార్థాల మాదిరిగా మనిషి శరీరం ఒక జడపదార్థం కాదు కదా. పంచేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని భగవంతుడికి సమర్పించుకోవడం ఎలా సాధ్యం అంటే... 'నాదేమీ లేదు... అంతా నీదే, అన్నింటా నువ్వే, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ని.... నువ్వు ఇచ్చిన ఈ శరీరంతో నువ్వు సూచించిన మార్గంలో నడుస్తూ నీ సేవ చేస్తాను...' అనుకోవాలి. 

శారీరక మానసిక వాంఛలను, ఆకాంక్షలను, బంధాలను తృణప్రాయంగా భావించాలి, ఎటువంటి కర్మఫలాపేక్ష లేకుండా త్రికరణశుద్ధిగా కర్మలను ఆచరించాలి, నిరంతరం పరమాత్ముణ్నే స్మరిస్తూ, సేవిస్తూ, తనని తాను తెలుసుకుంటూ తనలోని ఆత్మను తెలుసుకోవాలి. 


ఆ ఆత్మ ద్వారా పరమాత్మ ఉనికిని గ్రహిస్తూ, ఆయనకు దగ్గరవుతూ, సకల చరాచర సృష్టిలో దైవాన్ని దర్శిస్తూ అందరి హితాన్ని కోరుతూ జీవించడమే భక్తుడు భగవంతుడికి సమర్పించే ఆత్మనివేదన.🙏

శ్రీ జయంతి శక్తి పీఠం (నర్తియాంగ్ దుర్గ ఆలయం)

 🕉 మన గుడి : నెం 1181


⚜ మేఘాలయ : జైంటియా హిల్స్


⚜  శ్రీ జయంతి శక్తి పీఠం (నర్తియాంగ్ దుర్గ ఆలయం)




💠 మేఘాలయలోని జైటియా కొండలలో ఉన్న నార్టియాంగ్, దీనిని ఏకశిలాల తోట అని పిలుస్తారు, ఎందుకంటే ఈ ప్రదేశం అనేక చెల్లాచెదురుగా ఉన్న ఏకశిలాలతో (రాతి స్తంభాలు) కూడి ఉంటుంది.


💠 నార్టియాంగ్ 600 సంవత్సరాల పురాతన దుర్గా ఆలయాన్ని చూపిస్తుంది, ఈ ఆలయం మాతా సతి యొక్క 51 శక్తి పీఠాలలో ఒకటి.


💠 సంస్కృతంలోని 51 అక్షరాలకు అనుసంధానించబడిన 51 శక్తి పీఠాలు ఉన్నాయి. 

ప్రతి ఆలయంలో శక్తి మరియు కాలభైరవునికి మందిరాలు ఉన్నాయి. నార్టియాంగ్ దేవి మందిరంలోని "శక్తి"ని "జయంతి" అని మరియు "భైరవ"ని "క్రమాదీశ్వర్" అని పిలుస్తారు. 



💠 హిందూ పురాణాల ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం హిందూ మతంలోని శక్తి శాఖ భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి.


💠 పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం మరియు సతీ మాత స్వీయ దహనం ప్రకారం, ఇది సతీ దేవి ఎడమ తొడ పడిపోయిన పవిత్ర స్థలం మరియు అప్పటి నుండి ఈ ప్రదేశం పవిత్రమైనది. 


💠 నార్టియాంగ్ దేవి మందిరంలో, శక్తిని జయంతి రూపంలో 

జైనేశ్వరి అనే పేరుతో పూజిస్తారు మరియు ( శివుడిని) భైరవుడిని కామాదీశ్వరుడిగా పూజిస్తారు.



💠 ఇది ధ్యానం కోసం ఉత్తమమైన - ప్రశాంతమైన మరియు నిశ్శబ్ద ప్రదేశంగా పరిగణించబడుతుంది.


💠 ఆలయ పురాణం ప్రకారం ఇది 600 సంవత్సరాలకు పైగా పురాతనమైనది.

జైంతియా రాజు జాసో మాణిక్ (1606–1641) కుమార్తె లక్ష్మీ నారాయణను వివాహం చేసుకున్నాడు. జయంతియా రాయల్టీని హిందూ మతంలోకి స్వీకరించడానికి లక్ష్మీ నారాయణ కారణమని నమ్ముతారు. 


💠 రాజు ధన్ మాణిక్ సుమారు 600 సంవత్సరాల క్రితం నార్టియాంగ్‌ను జయంతియా రాజ్యానికి వేసవి రాజధానిగా చేశాడు. 

ఒక రాత్రి, దేవత అతనికి కలలో కనిపించి, ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి, తన గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించమని కోరింది. దీని తరువాత, నార్టియాంగ్‌లోని జైంతేశ్వరి ఆలయం స్థాపించబడింది. 


💠 ఆలయం యొక్క వ్యూహాత్మక స్థానం మరియు ఫిరంగులు వంటి ఆయుధాల ఉనికి ఈ ఆలయం జయంతియా రాజుల కోటలో భాగంగా ఉండి ఉండాలని సూచిస్తుంది.


💠 ఈ ఆలయంలో ఆచారాలు మైదానాల్లో మాదిరిగా సాంప్రదాయ పద్ధతిలో జరగవు, కానీ ప్రత్యేకమైన రీతిలో జరుగుతాయి. 

హిందూ మరియు పురాతన ఖాసీ సంప్రదాయాల మిశ్రమం. 


💠 స్థానిక అధిపతి లేదా సయీమ్ ఆలయానికి ప్రధాన పోషకుడిగా పరిగణించబడతాడు. 

నేటికీ, దుర్గా పూజ సమయంలో, సయీమ్ దేవత గౌరవార్థం మేకలను బలి ఇస్తారు. 

గతంలో, ఆలయంలో నరబలి అర్పించేవారు, కానీ ఆ ఆచారాన్ని బ్రిటిష్ వారు ఆపేశారు. 


💠 గర్భగుడి నుండి క్రింద ప్రవహించే మైంట్డు నదికి ఒక సొరంగంలో మానవ తల దొర్లేది. నేడు, మేకలు మరియు బాతులను బలి ఇస్తారు. 

కానీ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేకలకు మానవ ముసుగులు ధరించి, తరువాత బలి ఇస్తారు. 


💠 దుర్గా పూజ ఈ ఆలయంలో అతి ముఖ్యమైన పండుగ. దుర్గా పూజ సమయంలో, ఒక అరటి మొక్కను దేవతగా అలంకరించి పూజిస్తారు. నాలుగు రోజుల ఉత్సవాల ముగింపులో, ఆ మొక్కను మైంట్డు నదిలో ఉత్సవంగా ముంచుతారు. 

ఈ సందర్భంగా దేవతకు తుపాకీ వందనం కూడా చేస్తారు.


💠 ప్రస్తుతం, మేఘాలయలోని హిందూ సమాజం యొక్క అధికారిక ప్రతినిధి అయిన సెంట్రల్ పూజ కమిటీ ఈ ఆలయ సంరక్షకురాలిగా ఉంది.


💠 ఈ ఆలయం మేఘాలయలోని జయంతియా హిల్స్‌లో ఉంది, నార్టియాంగ్ దుర్గా మందిర్ రాజధాని నగరం షిల్లాంగ్ బస్ స్టాప్ నుండి 60 కి.మీ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

18-57-గీతా మకరందము

 18-57-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII సమస్త కర్మములను భగవదర్పణముచేసి చిత్తమును సదా ఆ పరమాత్మ యందే నెలకొల్పవలెనని వచించుచున్నారు -


చేతసా సర్వ కర్మాణి 

మయి సన్న్యస్య మత్పరః |  

బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ || 


తా:- సమస్త కర్మములను (కర్మఫలములను) వివేకయుక్తమగు బుద్ధిచేత నాయందు సమర్పించి, నన్నే పరమప్రాప్యముగా నెంచినవాడవై చిత్తైకాగ్రతతో గూడిన తత్త్వవిచారణను (లేక ధ్యానయోగమును) అవలంబించి ఎల్లప్పుడు నాయందే చిత్తమును నిల్పుము.


వ్యాఖ్య:- “చేతసా” - శరీరముతో సమస్తకర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలన్నిటిని, భగవంతునికే అర్పించి వారియందే మనస్సును సంలగ్న పఱచవలెను. “చేతసా” అని చెప్పుటవలన కర్మఫలసన్న్యాసమే ఇట బోధింపబడినది కాని కర్మసన్న్యాసము కాదు. శరీరము నిశ్చలముగానుండి ఏ కర్మచేయకున్నను మనస్సు ప్రపంచములో తిరుగుచున్నచో దానివలన ఇసుమంతైనను ప్రయోజనములేదు. అట్లు కాక, శరీరముతో అనేక కర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలను, కర్మఫలములను ఈశ్వరార్పణముగావించినచో అది మోక్ష హేతువగును. కనుకనే ఇచట "చేతసా” (చిత్తముతో) అని చెప్పబడినది.

    “బుద్దియోగమ్” - ప్రీతితో భక్తిపూర్వకముగ తనను భజించువారికి “బుద్ధియోగము" నొసంగెదనని 10వ అధ్యాయమున భగవానుడు తెలిపియుండిరి. (దదామి బుద్ధియోగం తమ్). అనగా చిత్తైకాగ్రత, తత్త్వవిచారణాశక్తి ఆతనికి భగవత్కృపచే కలుగును. అద్దానిని లెస్సగ నాశ్రయించి నిరంతరము చిత్తమును ఆ పరమాత్మయందే నెలకొల్పుమని యిట చెప్పబడినది. " సతతమ్" అని వచించుటవలన ఏ కాలమందును దైవవిస్మృతి కలుగనీయక నిరంతరము చిత్తము ఆత్మయందే (దైవమందే) యుండులాగున ప్రయత్నించవలసియున్నది. ఏలయనిన, మాయ జీవుని పడగొట్టుటకు కాచుకొనియున్నది. అతడేమాత్ర మొకింత అజాగ్రతగనున్నప్పటికిని అది యాతని నావరించివైచి తమస్సులో (అజ్ఞానములో), విషయసుఖములలో పడవేయుటకు సిద్ధముగ నున్నది. కావున సాధకులు ‘సతతమ్’ అను ఈ పదమును జ్ఞప్తియందుంచుకొని దైవవిస్మృతి ఏ మాత్రము కలుగకుండులాగున చూడవలెను. 

        ‘మత్పరః’ - ప్రపంచమందలి సమస్త దృశ్యపదార్థములు నశ్వరములు. కావున విజ్ఞుడగువాడు శాశ్వతుడగు ఒక్క పరమాత్మనే పరమగమ్యముగ, పరమప్రాప్యముగ నెంచుకొనవలెను.


ప్ర:- పరమాత్మను పొందుటకై జీవుడేమి చేయవలెను?

ఉ:- (1) చిత్తముతో సమస్తకర్మలను భగవంతున కర్పించవలెను. 

     (2) వారినే పరమప్రాప్యముగ నెంచుకొనవలెను. 

     (3) బుద్ధియోగమును (చిత్తైకాగ్రతాపూర్వకవిచారణను) లెస్సగ నవలంబించవలెను. 

     (4) భగవంతునియందే నిరంతరము చిత్తమును సంలగ్న మొనర్పవలెను. 

ప్ర:- భగవానుడు కర్మసన్న్యాసమును బోధించెనా , కర్మఫలసన్న్యాసమునా ?

ఉ:- ‘చేతసా’ (చిత్తముతో సమస్త కర్మలను భగవంతునకర్పించి) అని చెప్పుటవలన శరీరముతో కర్మలను చేయుచున్నను, మనస్సుతో వానివాని ఫలములను ఈశ్వరార్పణము గావించవలెననియే బోధింపబడినదగును. కావున కర్మఫలసన్న్యాసమే ఇట వివక్షితముగాని కర్మసన్న్యాసముగాదు . 

ప్ర:- మనుజుడు దేనిని పరమప్రాప్యముగ నెంచుకొనవలెను? ఎందుచేత?

ఉ:- పరమాత్మను; వారు శాశ్వతులుకనుక. 

ప్ర:- నిరంతరము చిత్తము దేనియందు సంలగ్నమై యుండవలెను?

ఉ:- పరమాత్మయందు.

తిరుమల సర్వస్వం -309*

 *తిరుమల సర్వస్వం -309*

ఆవిర్భావ పరమార్థం-4


భృగుడంతటి తపస్సంపన్నుడు, జ్యోతిష్యశాస్త్రాన్ని ఔపోసన పట్టి భృగు సంహిత అనే మహద్గ్రంథాన్ని లోకానికి అందించిన ద్రష్ట - సంయమనం కోల్పోయి తాను జీవితాంతం ఆరాధించిన శ్రీహరిపై పాదప్రహారం చేయడమేమిటి? 


సదా విష్ణువు వక్షఃస్థలం లోనే వసిస్తూ, సర్వం తెలిసిన శ్రీమహాలక్ష్మి సఖునిపై అలకబూని భూలోకానికి పయనమవ్వడ మేమిటి?


రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని భకవద్గీత ద్వారా విశ్వమానవాళికి బోధించిన, స్థితప్రగ్జ్నుడైన శ్రీహరి - సతీవియోగంతో వ్యాకులచిత్తుడై అమ్మవార్ని అన్వేషించడానికి వైకుంఠాన్ని వీడి సప్తగిరులపై కాలు మోపడమేమిటి? 


ఇవన్ని శ్రీహరి చిత్త సంకల్పాలే కదా! 


ఈ విధంగా - శ్రీహరి పూర్వపు యుగాల్లో ఇచ్చిన అభయాలను, వరాలను, వాగ్దానాలను నెరవేర్చడం కోసం; తపస్సంపన్నులు, పతివ్రతా శిరోమణుల శాపాలను నిష్ఫలం కాకుండా చూడడం కోసం - తిరుమల క్షేత్రాన్ని తన క్రీడాస్థలంగా ఎంచుకుని; తగిన నెపాన్ని తనంత తానుగా సృష్టించుకొని, ఆనందనిలయంలో అర్చామూర్తిగా వెలసి కోర్కెలు తీర్చే కొండలరాయడిగా వాసికెక్కారు.


అర్చారూపమే ఎందుకు?


పైన చెప్పుకున్నట్లు, శ్రీమహావిష్ణువు ఆదిలో అర్చామూర్తిగా అవతరించ లేదు. మొదట్లో మానవరూపధారియైన మాధవుడు, తదనంతరం అర్చామూర్తిగా వెలశాడు. దీనికి మూలకారణం తెలుసుకోవాలంటే వైఖానస ఆగమ సాయం తీసుకోవాలి.


పంచగుణాత్మకం..


వైఖానస ఆగమ శాస్త్రానుసారం పరమాత్ముడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా రూపాలనే పంచగుణాత్మక రూపాలలో తన ఉనికిని చాటుకుంటాడు -


పర రూపమంటే పాలసముద్రంలో, శేశతల్పంపై శ్రీమహాలక్ష్మితో సపర్యలు అందుకుంటూ ఉండే కాలాతీత సచ్చిదానంద రూపం. ఈ రూపాన్ని కాంచాలంటే విష్ణ్వైక్యం చెందిన సిద్ధులకే తప్ప అన్యులకు సాధ్యం కాదు. దేవాధిదేవతలు కూడా దీనికి అతీతులు కారు.


వ్యూహ రూపమంటే సృష్టి, స్థితి, లయ అనే వ్యూహాలను రచించి, అమలు పరిచే నిర్గుణాత్మకమైన వ్యవస్థాగత రూపం. కావున ఈ రూపాన్ని దర్శించుకోవడం, అర్చించు కోవడం అసాధ్యం. 


విభవ రూపమంటే మత్స్య, కూర్మ, వరాహాది దశావతారాలు మరియు శ్రీమద్భాగవతం లో ఉటంకించ బడిన అన్య అవతారాలు. ఆయా అవతార కార్యాలు సుసంపన్నమైన అనంతరం అవతార పరిసమాప్తి జరిగిపోతుంది కనుక, ఆ అవతారాలను ఈనాడు మనం దర్శించు కోలేము. త్రేతాయుగపు వాసులు శ్రీరామచంద్రుణ్ణి, ద్వాపరయుగ వాసులు కృష్ణుణ్ణి రక్తమాంసాలతో నేలపై నడయాడుతూ చూచారు కానీ, మనకా మహద్భాగ్యం లేదు.


అంతర్యామి అంటే సృష్టిలోని సమస్త చరాచర వస్తువులలో నిబిడీకృతమై ఉన్నట్టి ఆత్మ, పరమాత్మ లేదా అంతరాత్మ. ఆత్మావలోకనం చేసుకోగలిగితే భగవత్సాక్షాత్కారం సిద్ధించినట్లే. కానీ అది అంత సులభం కాదు. తనలో నున్న పరమాత్మను దర్శించుకో గలగటం తపస్సంనన్నులకే సాధ్యం.


ఇక మిగిలింది అర్చా రూపం. మన బోటి సాధారణ భక్తులు దర్శించుకో గలిగింది, కొలువ గలిగింది గుణాత్మకమైన అర్చారూపమే! విభవరూపానికే పరిమితమైతే అవతార కార్యం నెరవేరగానే అవతార పరిసమాప్తి చెందాలి. కానీ, కలియుగ వాసుల కడు దైన్యస్థితిని కాంచిన కరుణామయుడు - విభవరూపాన్నుండి అర్చారూపానికి పరివర్తన చెంది; శాశ్వతంగా కొండపై కొలువుండి దీనజనోద్ధరణకై కంకణం కట్టుకున్నాడు. అంతే కాదు, విస్తారమైన వైదిక కర్మలు సులభసాధ్యం కాని కలియుగంలో - సరళమైన పద్ధతుల్లో భక్తులు తనను అర్చించు కోవడానికి వీలుగా; విఖనసమహర్షి ద్వారా వైఖానస ఆగమాన్ని రచింప జేశాడు. ఆ వివరాలను విఖనసమహర్షి అధ్యాయంలో తెలుసుకుందాం. 


దశావతారాలకు, కలియుగావతారానికి ఉన్న మరో ముఖ్య తారతమ్యం ఇదే! దీనికి అవతార పరిసమాప్తి అనే ప్రక్రియ లేనే లేదు. నిత్యసత్యము, నిరామయము, నిర్నిరోధము, నిత్యనూతనము అయిన ఈ అర్చారూపం సృష్టి, స్థితి, లయలకు అతీతంగా భాసిల్లుతుంది. 


పైన క్లుప్తంగా తెలుపబడిన పౌరాణికాంశాలన్నీ ఆయా అధ్యాయాలలో విశదంగా, వివరించ బడ్డాయి. గమనించ గలరు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము*


*446వ రోజు*

*అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించుట*


కృష్ణుడు అర్జునుడిని చూసి " అర్జునా ! ఇది బ్రహ్మశిరోనామాస్త్రం. ఇది అత్యంత భయంకర మైంది. దీనికి సాటి మరియొకటి లేదు. దీనిని మరే అస్త్రం నిరోధించ లేదు. నీవు కూడా నీకు ద్రోణాచార్యుడు ప్రసాదించిన బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించి నిన్ను నీ సోదరులను కాపాడుకో ! " అని తొందర పెట్టాడు. వెంటనే అర్జునుడు రధము దిగి తన గురువు ద్రోణాచార్యుని మనసులో తలచి గాండీవమును తీసుకున్నాడు. బ్రహ్మశిరోనామాస్త్రమును ఎక్కు పెట్టాడు. అర్జునుడు తనలో " ఈ మహాస్త్రమును నేను అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించుటకు మాత్రమే ప్రయోగిస్తున్నాను. ఈ అస్త్రము వలన నాకు కాని, నా సోదరులకు కాని, గురుపుత్రుడు అశ్వత్థామకు కాని హాని కలుగకుండు గాక " అని ప్రార్ధించి అస్త్రప్రయోగం చేసాడు. అర్జునుడు ప్రయోగించిన అస్త్రం అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నిరోధించ ప్రయత్నించింది. రెండు అస్త్రాలు ఒక దానిని ఒకటి ఢీ కొట్టడంతో సముద్రాలు పొంగాయి. ఆకాశం నుండి ఉల్కలు రాలాయి, భూమి కంపించింది, సూర్యుడు కాంతిని కోల్పోయాడు, ఆకాశం నుండి పిడుగులు పడ్డాయి, రాళ్ళ వర్షం పడుతుంది. ఈ ఉత్పాతాలు చూసి జనం భయంతో కంపించి పోతూ అటూ ఇటూ పరుగులెత్త సాగారు. ప్రజల ముఖాలలో ఆశ్చర్యాందోళనలు, భయం భీతి కనిపిస్తున్నాయి.



*నారదుడి రాక*



ఈ ఉత్పాదనలు చూసి నారదుడు పరుగు పరుగున వ్యాసుడి వద్దకు వచ్చాడు. నారదుడు వ్యాసుడితో కలిసి కృష్ణార్జునులు ఉన్న చోటుకు వచ్చి అర్జున అశ్వత్థాల మధ్య నిలిచి " ఓ అకల్మషులారా ! ఇంతకు ముందు ఎంతో మంది వీరులు, భుజబలసంపన్నులు, శూరులు ఈ పుడమి మీద జన్మించారు గతించారు. వారెవ్వరూ బ్రహ్మశిరోనామాస్త్రమును జనావాసాల మీద ప్రయోగించ లేదు. మీరెందుకు ఈ సాహసానికి ఒడి గట్టారు. " అని ఆడిగాడు వ్యాసుడు. అర్జునుడు వ్యాసుడు నారదులకు నమస్కరించి " ఓ మహాత్ములారా ! అశ్వత్థామ పాండవవంశ నిర్మూలనకై సంకల్పించి బ్రహ్మశిరోనామాస్త్రము ప్రయోగించాడు. శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు ఆ అస్త్రమును నిరోధించుటకు మాత్రమే నేను అదే అస్త్రమును ప్రయోగించాను కాని జనావాసాల మీద ప్రయోగించాలన్న క్రూరమైన తలంపు నాకు లేదు. తమరు ఆజ్ఞాపిస్తే నేను నా అస్త్రమును ఉపసంహరిస్తాను. కాని అలా చేస్తే ఆదుర్మార్గుడు తాను ప్రయోగించిన అస్త్రముతో మమ్ములను అందరినీ దహిస్తాడు మీరు మా క్షేమం కూడా ఆలోచించాలి " అని వినయంగా పలికి అర్జునుడు తాను ప్రయోగించిన బ్రహ్మశిరోనామాస్త్రమును అవలీలగా ఉపసంహరించాడు.


*వ్యాసుడు అశ్వత్థామ అస్త్రమును ఉపసంహరించమని కోరుట*


వ్యాసుడు అశ్వత్థామను చూసి " అశ్వత్థామా నీవు కూడా నీవు ప్రయోగించిన మహాస్త్రమును నిరోధించు " అన్నాడు. అశ్వత్తామ తాను ప్రయోగించిన బ్రహ్మశిరమును ఉపసంహరించాలని ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు. అప్పుడు అశ్వత్థామ వ్యాసుడితో " మహాత్మా ! ఈ భీమసేనుడు సిగ్గు లేకుండా సుయోధనుడిని అక్రమ మార్గమున చంపాడు. అంతటితో ఆగక మునివృత్తి అవలంబించిన నాతో యుద్ధానికి దిగాడు. అందుకని కోపంతో ప్రాణభీతితో వివేకం కోల్పోయి ఈ అస్త్ర ప్రయోగం చేసాను కాని నాకు ఈ అస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు. ఇది పాపం పాండవులను దహించి వేస్తుంది అని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో దాన్ని నేను ప్రయోగించాను " అన్నాడు. అశ్వత్థామ మాటలను సావదానంగా విన్న వ్యాసుడు " అశ్వత్థామా ! నీ తండ్రి ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ప్రీతితో బ్రహ్మశిరమును ఇచ్చాడు. కనుక అర్జునుడు నీకు కీడు తలపెట్టడు. నీవు ప్రయోగించిన అస్త్రమును ఆపడానికే తాను అస్త్ర ప్రయోగం చేసానని చెప్పాడు. మేము కోరినంతనే ఉపసంహరించాడు. ఇంతటి అస్త్ర విద్యా వైభవం కలిగిన అర్జునుడిని వధించడానికి నీ తరం కాదు. ఈ బ్రహ్మశిరోనామాస్త్రమును గురించి చెప్తాను విను " ఇది ప్రయోగించిన దేశంలో పన్నెండేళ్ళు అనావృష్టి సంభవిస్తుంది. కనుక నిన్ను పాండవులను రక్షించడానికి ఈ ఉపాయం చెప్పాను. కనుక తాపస వృత్తిని అవలంబించానని అంటున్నావు కనుక ఈ మహాస్త్రమును ఉపసంహరించి కోపం విడిచి నీ వద్ద ఉన్న శిరోణ్మణిని ఇతడికి ఇవ్వు నిన్ను సంహరించినంతగా సంతోషపడి నిన్ను విడిచిపెడతారు. ఇది అందరికి ఆమోదయోగ్యమైనది. ఆ ప్రకారం చెయ్యి " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *అధర్మం ధర్మకామో హి కరోతి హ్యవిచక్షణః ।*

       *ధర్మం వాధర్మసంకాశం శోచన్సివ కరోతి సః II*


       *ధర్మం కరోమీతి కరోత్యధర్మమ్।*

       *అధర్మకామశ్చ కరోతి ధర్మమ్ II*

       *ఉభే బాలః కర్మణీ న ప్రజానన్।*

       *స జాయతే మ్రియతే చాపి దేహీ II*


తా𝕝𝕝 *విచక్షణ లేనివాడు ధర్మాన్ని కోరుతూ కూడా అధర్మాన్ని పాటిస్తాడు. ఒక్కొక్కప్పుడు దుఃఖంలో అధర్మతుల్యమైన ధర్మాన్ని పాటిస్తాడు. ధర్మాన్నే పాటిస్తున్నా ననుకొంటూ అధర్మాన్ని ఆచరిస్తాడు. అధర్మంమీది ప్రేమతో ధర్మాన్ని పాటిస్తాడు. ఈ రీతిగా అజ్ఞానంతో రెండురకాలుగా కర్మలను ఆచరిస్తూ మనుష్యుడు మరలమరలా పుడుతుంటాడు, చస్తుంటాడు.*


 ✍️🌹🌸💐🙏

జితేంద్రియుడు

 *ఇంద్రియ నిగ్రహం...*



*ఇంద్రియాలు అశ్వాలవంటివి... వీటిని నిగ్రహించని జీవుడు గమ్యంచేరడు.*


*ఇంద్రియాల వశమైన జీవుడు జ్ఞానాన్ని కోల్పోతాడు.*

            *భగవద్గీత (2.67)*🙏🙏🙏



💫 సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది• అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమైఉన్నవి పదకొండు ఇంద్రియాలు• అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు• ఆ పదకొండులో...


*1. అయిదు జ్ఞానేంద్రియాలు,*

*2. అయిదు కర్మేంద్రియాలు,* *మనసు* ఉన్నాయి.


1. శ్రోత్రం (చెవి),

2. త్వక్‌ (చర్మం),

3. చక్షుషీ (కన్నులు),

4. జిహ్వా (నాలుక),

5. నాసికా (ముక్కు) 

అనేవి *జ్ఞానేంద్రియాలైతే,*


1. పాయు (మలద్వారం),

2. ఉపస్థ (మూత్రద్వారం),

3. హస్త (చేతులు),

4. పాద (కాళ్లు),

5. వాక్‌ (మాట) 

అనేవి *కర్మేంద్రియాలు•*


ఈ పదింటికి చివర *మనసు•*


ఇదీ ఇంద్రియసమూహం.


💫 ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి. ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య.


💫 ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని,

కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.


1. మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు - చెడు మాటలనే వింటాయి.


2. చర్మం - పనికిరాని స్పర్శను కోరుతుంది.


3. కళ్లు - అశ్లీలాన్ని చూస్తాయి.


4. నాలుక- అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.


5. ముక్కు - దుర్గంధాలనే స్వీకరిస్తుంది.


6. మల, మూత్రద్వారాలు - పనిచేయకుండా పోతాయి.


7. కాళ్లూ చేతులూ - హింసను ఆచరిస్తాయి.


8. మాట - అదుపు తప్పుతుంది.


ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,


9. మనసు - అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.


💫 అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే. మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.


💫 అందుకే వాల్మీకి - *‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’* అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.


💫 *చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే 'జితేంద్రియుడు'* అని శాస్త్రాల ప్రబోధం.


💫 ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే. అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు. ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు.


💫 కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం.

లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి.

ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు.


1. కళ్లు - బాగా కనబడతాయి.

2. చెవులు - బాగా వినబడతాయి.

3. నాలుక- రుచిని గుర్తిస్తుంది.

4. ముక్కు - వాసనలను పసిగడుతుంది.

5. చర్మానికి - స్పర్శ తెలుస్తుంది.


💫 *ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి. పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది.*


💫 ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం. అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది. మెదడును చక్కగా ఉంచుకోవడానికి ‘ఆయుర్వేదం’ ఇలా మార్గోపదేశం చేస్తోంది -


1.’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది.

జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’.


💫 *ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.*


అందువల్ల,  


*"జితేంద్రియుడు"* (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో,


 *"ఇంద్రియజితుడు"* (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో....


*... తేల్చుకోవలసింది మనిషే!*