16, జనవరి 2021, శనివారం

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము🌹


బాల భక్తుని  పరికించి పరవశించి 

యంత యలమేలు మంగమ్మ సంతసిల్లి 

వృద్ధ వనితగు రూపాన సిద్ధ మయ్యు 

యెదుట ప్రత్యక్ష మయ్యెను వేడ్కతోడ



మంత్ర జలమును ప్రోక్షించ మమత తోడ 

యలసటను దీరి లేచియు యన్నమయ్య 

కన్ను లెదుటున్న యమ్మను గాంచి మిగుల 

విభ్రమం బొంది యత్యంత విస్తుపోయె 


అంతట మాతృశ్రీ యలమేలు మంగమ్మ 

            యన్నమయ్యను జీరి యమిత దయతొ 

తనువును స్పృశియించి తనివార నిమిరియు 

            బడలిక పోగొట్టి భయము దీర్చి 

శ్రీ వెంకటేశ్వరు దివ్య ప్రసాదమున్ 

             ప్రియమార తినిపించి పెంపు గూర్చి 

యాకాశగంగను యందించి యతనికి 

            దీర్చియు దాహంబు తృప్తి గాను,

"గిరులు సర్వంబు దెలియగా హరి మయంబు 

విమల మైనట్టి యీ గిరి నెక్కు తరిన 

పాదరక్షలు ధరియించ పాప మగును "

యనుచు బోధించె నతనికి ననునయముగ 


 అమ్మ యమృతపు పలుకుల నాలకించ 

యంతరంగంబు నందున యన్నమయకు 

విమల జ్ఞానోదయంబయ్యు వింతగాను 

తనువు పులకలు గల్గెను  తన్మయమున 



అమృత తుల్య ప్రసాదంబు నంద జేసి 

చింత బోగొట్టి తనువుకు సేద దీర్చి 

దివ్య సందేశ మిచ్చియు తీరు దెలిపి 

యమ్మ కనుమరుగయ్యెను యంతలోనె 


కనుల ముందర యాతల్లి కదలి పోగ 

యన్నమయ్యకు యత్యంత యలజ డవగ 

యంత నతనికి కన్పించె నంతరమున 

యమ్మ యలమేలు దేవత యభయ మిడుచు 



అమ్మ దయచేసి నట్టి యా కమ్మ నైన 

దివ్య మగు ప్రసాదంబును దినిన వెంట 

యాంధ్ర పదముల కాద్యుడౌ యన్నమయకు 

కవిత యుప్పొంగె నంతట గంగ వోలె




✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ఉత్తరాయణ పుణ్యకాలం

 *ఉత్తరాయణ పుణ్యకాలం*




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️





*"సరతి చరతీతి సూర్యః"*  అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. *"ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత"*  అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. *"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే "చేరడం" లేదా "మారడం"అని అర్థం.* సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. *జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం"సంక్రాంతి"ని* ఇలా నిర్వచించింది. *"తత్ర మేషాదిషు ద్వాదశ*

*రాశి క్రమణేషు* *సంచరితఃసూర్యస్య పూర్వన్మాద్రాశేఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః"* మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది. *"రవి సంక్రమణే ప్రాపే నన్నా యాద్యన్తు మానవఃసప్త జన్మసు రోగీ స్యానిర్దేనశే్చన జాయతే"* అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే , రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా , దరిద్రునిగా ఉండిపోతాడని భావం.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి , దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ , ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.


ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు..  ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు , తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ , ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ , హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ , సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ , సమస్త ఋషులకూ , దేవతలకూ , పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ , ముఖ్యం గా  ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ , ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.


సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను , ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని , వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని , ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

 

ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా , ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం , ఫలాలు , విసనకర్ర, వస్త్రం , కాయగూరలు , దుంపలు , నువ్వులు , చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.


*"సంక్రాంతి వైభవం"*



సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని *"ఉత్తరాయణ పుణ్యకాలం"గా* పరిగణించిన సనాతన సిద్ధాంతంలో..  ప్రకృతి పరిశీలన , దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి , కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన , శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి , సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యమున్నా, పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది. 

*"తిల సంక్రాంతి"గా* కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి , పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని , మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొనే సంప్రదాయం ఉంది. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంట చేతికందే సందర్భమిది. సంపదను , ఆనందాన్ని కుటుంబంతో , సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు , మానవీయమైన సత్సంబంధాల సౌహార్దమూ ఈ పండుగల సత్సంప్రదాయాల్లో మేళవిస్తుంది. 


రంగవల్లుల శోభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా , చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం , దానం , పితృతర్పణం , జపతపాలు , దేవతార్చనలు - సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు , తల్లిదండ్రులు , సాటి మనుషులు , ప్రకృతి పట్ల కృతజ్ఞతను , ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యముంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి , ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది. 

కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా - మంచి వృష్టిని , ఆరోగ్యాన్ని , సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం , నువ్వుల నూనె దీపం , బియ్యం కలిపిన తిలలతో పూజ , తిలలతో కూడిన పదార్థాల నివేదన - శాస్త్రం చెప్పిన విధులు. పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖ మైనది కనుక - ఈ రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా - యమునా - సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం.


ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం. అది కుదరనివారు గృహంలో భగవత్‌ స్మరణతో , స్నానమంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రధానానికి ప్రాధాన్యం ఇస్తారు. దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం , శక్తి... ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు. 

సూర్యుణ్ని నారాయణుడిగా ; శోభను , శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా సంభావించారు. సంక్రాంతినాటి సూర్య శోభయే కాక , పంటల శోభ , సంపదల పుష్టి... అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావన. శాస్త్రీయమైన సత్కర్మలు , సంప్రదాయసిద్ధమైన కళలు , ఉత్సాహాల ఉత్సవాలు , బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు.. వెరసి సంక్రాంతి వైభవాలు !

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము🌹


ప్రథమ ప్రాయమైన బాల్యంబు నుండియు 

యమిత ప్రజ్ఞుడైన యన్నమయ్య 

తల్లి దండ్రి వలన సంగీత పాండిత్య 

కళల నెల్ల నేర్చి  ఘనత గాంచె 


నారాయణ సూరంతట 

పారాయణ జేయుటకును బహువిధ నీతుల్ 

యూరిలొ గురుకుల మందున 

చేరిచె శ్రీ యన్నమయను స్థిర విద్య లకున్ 


అంత గురుకుల మందున యన్నమయ్య 

వేంకటేశ్వరు కృపవల్ల విమల మదితొ 

యనతికాలంబు నందునె యఖిలమైన 

వేదశాస్త్రంబులను నేర్చి విజ్ఞుడయ్యె 


         అన్నమయ్య  తిరుమల దర్శనము 


అన్నమయ్య తనదు యష్టమవయసులో 

కాలినడక తోడ కదలి వెడలి 

చేరె పట్టుదలతొ తిరుపతి పురముకు 

తాళ్లపాకనుండి తన్మయమున 


తిరుపతి గంగమ్మ దివ్యదర్శన మొంది 

              ప్రణతుల నర్పించె భక్తి తోడ 

కాలిద్రోవను బట్టి కనుమలు దాటుచూ 

              చేరగా సాగెను తిరుమలకును 

దుర్గమంబైనట్టి మార్గంబు నందున 

               యాగక నడువగా యలసటొచ్చె 

తడియారె గొంతుక దాహంబు గల్గగా 

               యత్యంత బడలికన్ యాకలయ్యె 

కనులు దిరుగుచుండ కాయంబువణుకగా 

యడుగు ముందుకేయ నలవిగాక 

నడువ శక్తిలేని తడబడు స్థితియందు 

యవనిపైన బడెను యన్నమయ్య



✍️గోపాలుని మధుసూదనరావు 🙏

అన్నమాచార్య చరితము

    🌹అన్నమాచార్య చరితము🌹


అట్లు నారాయనయ్యయు లక్కమాంబ 

తిరుమలేశుని దర్శించి తృప్తితోడ 

దారి యందున్న కపిలతీర్థంబు గాంచి 

యిల్లు జేరిరి యత్యంత యుల్లసమున 


కాల మారీతి తృప్తితో గడచి పోగ 

తిరుమలేశుని దివ్యమౌ వరము వలన 

భవ్య నారాయణయసూరి భాగ్యమునను 

గర్భమును దాల్చె లక్కమ ఘనము గాను 


       అన్నమయ్య జననము 


శుద్ధ శ్రోత్రి నారాయణసూరి శర్మ 

లచ్చికెనయగు యిల్లాలు లక్కమాంబ 

ధరను వెల్గొందు యాదర్శదంపతులకు 

బుట్టె నన్నమాచార్యుడు  పుణ్యమునను 


వరలు సర్వ ధారి వైశాఖ మాసాన 

శుక్ల పూర్ణిమనెడి శుభపు తిథిన 

కడప ప్రాంత మందు ఘనమైన గ్రామమౌ 

తాళ్లపాక యందు సంభవించె 


పది నాల్గొందల యెనిమిది

సదమలమగు మే నెలందు సరి తొమ్మిదినన్ 

పద కవితల పేర్గాంచిన 

సదమలుడగు యన్నమయ్య సంభవ మొందెన్ 


అన్నమయ్య బుట్టి హరికృప తోడను 

దిన దినాభి వృద్ధి చెందు చుండి

యాట పాట లందు హరినామమును బల్క 

తల్లి దండ్రు లెంతొ సంత సిలిరి 


వేదప్రోక్తమైన విధులను సేయంగ  

విహిత వయసు నందు విప్రు లెదుట 

బడసె నన్నమయ్య  బ్రహ్మోపదేశంబు 

కన్నతండ్రి నుండి ఘనముగాను 


అంత ' ఘనవిష్ణు' వనియెడి హరి సముండు 

యన్నమయ్యకు యష్టమ వర్షమందు 

దివ్య మైనట్టి వైష్ణవ దీక్ష నొసగ 

యన్నమాచార్యు డయ్యెను యన్నమయ్య



✍️గోపాలుని మధుసూదనరావు 🙏

బ్రహ్మ జ్ఞానం

 



బ్రహ్మ జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనం                                 [ఉపనిషత్తులు]


 


బ్రహ్మ జ్ఞానం కలగటం అనేది చాలా కష్టమైన పని. అట్లా అంత కష్టపడి సాధించాల్సిన అవసరం ఏముంది అనే సందేహం రావచ్చు. ఎందుకు బ్రహ్మ జ్ఞానం కావాలి, దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఈ మంత్రం తెలుపుతుంది.


 


స పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్

అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్ |

కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః

యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః || (8)


 


 


ఎవడైతే బ్రహ్మ జ్ఞానం పొందుతాడో వాడు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతాడు. ఆ స్థితి ఎలా ఉంటుందో తెలుపుతుంది ఈ మంత్రం. బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన "చ్ఛుక్రమ్"- పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు. జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు. పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు. "అకాయమ్" - ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ విగ్రహం . "అవ్రణమ్" - రోగాలు, వ్యాదులు అంటని శరీరం. "అస్నావీరమ్"- ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక "శుద్ధమపాపవిద్ధమ్" ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది. పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు. వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు. కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో. మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా ? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది. ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ వలె జ్ఞానం అంతటా విస్తరించి ఉంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు. వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది.  వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు. అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, ఆ స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు.



 

అన్నమాచార్య చరితము

 అన్నమాచార్య చరితము 


ధర నారాయణసూరికి 

హరిచింతన నెపుడుసేయు యా లక్కమకున్ 

పురప్రముఖులు  యాత్మీయులు

పరిణయమును జేసిరంత బహు విభవమునన్ 


ఎంతయో యన్యోన్యంబుగ 

సంతసమున జీవయాత్ర సాగుచు నుండన్ 

యెంతటి భాగ్యము లున్నను 

సంతానము లేని లోటు  తారస పడియెన్ 


నారాయణసూరి తిరుమల పయనము 


సంతు లేక వారు సంతాప మొందియు

యిలను దైవతంబు యింటివేల్పు 

తిరుమలేశుడైన శ్రీ వేంకటేశుని 

దర్శనంబుసేయ తరలి రంత 


తిరుమలందు వారు దివ్యపుష్కరణిలో 

పుణ్య మజ్జనంబు పొంది పిదప 

తొలివరాహు జూచి ఫలముల నర్పించి 

దేవమందిరముకు జేరి రంత 


శ్రీవేంకటేశుని దివ్య మందిరమందు 

                నారాయణయ్యయు లక్కమాంబ 

మూలవిరాట్టును ముదమార గాంచియు 

                గోవింద యనుచును గొంతు కలిపి 

ముడుపులు గట్టిన మూటల నర్పించి 

                తీర్థ ప్రసాదముల్ దీసుకొనిరి 

దివ్య ధ్వజస్తంభ మెదుట యా లక్కమ 

                సాష్టాంగ దండంబు సల్పె నపుడు 

యంత  దివ్య కాంతి హరి దయ తోడను 

వెలసి యచట మిగుల వైభవముగ 

గరిమ లక్క మాంబ గర్భంబు నందున 

శ్రీకరంబు గాను చేరె పోయె


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ప్రపంచమంతా పరమాత్మ దేహం

 ప్రపంచమంతా పరమాత్మ దేహం అని తెలిస్తే శోకం ఉండదు (7వ మంత్రం)                     [ఉపనిషత్తులు]


ప్రపంచంలో అన్నీ పరమాత్మ దేహంలో భాగాలే, పరమాత్మ అన్నింటిలో లోన బయట వ్యాపించి ఉన్నాడు కనుక.  కానీ మనిషికి ఎల్లప్పుడూ దుఃఖమే. దాన్ని ఎలా దూరం చేసుకోవాలో ఈ మంత్రం చెబుతుంది.


యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః |

తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః || (7)


లోకంలో నా అనుకున్నవాడు దగ్గరవుతే మోహం, దూరమైతే శోకం కలుగుతున్నాయి. ఇష్టం లేనిది దూరం పోతే సంతోషం, అది దగ్గరికి వస్తే భాధ కలుగుతుంది. "యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః" ఒకటే అందరికీ ఆధారం అని తెలిస్తే, ఇది వరకు మోహము, శోకము కలిగాయి కానీ ఈనాడు అందరి యందు "ఏకత్వమనుపశ్యతః" ఏకత్వ భావన కలిగితే కనిపించే వాటి యందు జాలి కలుగుతుంది తప్ప ద్వేషం కాదు. కాలిలో ముల్లు దిగితే చేయి అలా ఊరికే కూర్చుంటుందా ? వెళ్ళి తీసే ప్రయత్నం చేస్తుంది. అట్లానే ఒకడు శోకిస్తుంటే నీవూ వెళ్ళి వాడి శోకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తావు. ఒకడికి కలిగిన ఆనందానికి నీవూ ఆనందించగలుగుతావు. ప్రత్యేకించి ఒక్కడి యందు కాదు, విశ్వం అందరి యందు కలిగినా ఆ భావం ఏర్పడుతుంది. వాల్మీకికి కౌంచపక్షికి భాణం కుచ్చుకుంటే ఏడుపు వచ్చింది. విశ్వం అంతా అట్లాంటి భావన ఉండాలి.


ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ వాడివి అని గుర్తించినప్పుడు, వాడు నీ వాడైనప్పుడు ఇక నీవు కోల్పోయేది అంటూ ఏమి ఉండనే ఉండదు. ఇక మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది. ఈ భావన లేని నాడు మోహ శోకాలకు తావు ఉంది. పరమాత్మను గుర్తించిన నాడు అవి వాటంతట అవే దూరం అవుతాయి.


జనకుడు మిథిలానగరి రాజ కుమారుడు, యాజ్ఞవల్క్యుడి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురువుగారికి జనకుడంటే ప్రియం. రాకుమారుడని అట్లా జనకులవారిపై ఇష్టం చూపిస్తున్నారని మిగతా శిష్యులు అనుకునేవారు. గురువు గారు వారి కళ్ళు తెరిపిద్దాం అని అనుకున్నారు. వారికున్న యోగిక శక్తిచే అక్కడ కుటీరంలో మంటలు కనిపించేట్టు మాయను చేసారు. అది చూసి శిష్యులంతా లేచి వాళ్ళ వాళ్ళ వస్తువులను కాపాడుకోవడానికి వెళ్ళారు, అసలు వారికి ఉన్న వస్తువులు అంటూ ఏమీ లేవు పెద్దగా. జనకుల వారు అక్కడే కూర్చొని ఉన్నారు. కాసేపటికి మిథిలానగరం తగలబడుతున్నట్టు కనిపించింది. అయినా జనకుల వారు అక్కడే ఉన్నారు, పెద్దగా పట్టించుకోలేదు. అసలు ప్రమాదం ఏమీ జరగలేదు అని శిష్యులంతా వచ్చి కూర్చున్నారు. గురువుగారు జనకుడిని అడిగాడు, మీ నగరం తగలబడుతుంటే  ఏమీ చేయడం లేదేమిటని. నావద్ద అగ్నికి కాలనిది, నీటికి తడవనిది, గాలికి చెదరనిది ఉంటుంటే ఏదో తగలబడుతుంటే నాకెందుకు అని అన్నాడు. బాహ్యమైన వస్తువుల యందు వారికి ఎట్లాంటి మోహం ఉండేదే కాదు. తనలో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే అంతటా ఉన్నాడు అని గుర్తించాడు.  ఈ విషయం గుర్తించడానికి జనకులవారు మనకు ఆదర్శం.

పతంజలి కృత శంభు నటన స్తోత్ర

 *పతంజలి కృత శంభు నటన స్తోత్ర విశిష్టత*


ఒకసారి పతంజలి మహర్షి మహాశివ దర్శనానికి అనుమతి కోరగా, నందీశ్వరుడు అనుమతించక పోవడంతో పాటు పతంజలి మహర్షి సర్పాకారాన్ని చూసి హేళనచేసి నీకు నాకున్నట్లు కాళ్ళు, కొమ్మలు లేవని నవ్వాడట. అందుకు పతంజలి మహర్షి ఆగ్రహించి, ద్వారం వెలుపలి నుండే శంభు నటన స్తోత్రాన్ని చరణ శృంగ రహితంగా ఆశువుగా చెప్పాడట. ఆ స్తోత్రానికి పరవశుడై పరమశివుడు ప్రత్యక్షమైనాడట. 


ఈ స్తోత్రము యొక్క గొప్పదనమేమో చూద్దాము. దేవనాగరి లిపిలో आ, का అన్న అక్షరాలలో ा ఈ సంకేతములను చరణములు(కాళ్ళు) అంటారు. అదేవిధముగా ओ, औ లలో ोौ పైన వంపుతో ఉన్న గీతలను శృంగములు (కొమ్ములు ) అంటారు. నిజముగా ఈ కవనము చిత్ర కవిత్వపు కోవకు చెందినది. ఆకార, ఏకార, ఐకార, ఓకార, ఔకారములతో ఉండే దీర్ఘాక్షరములు లేవు. అనుస్వారము, విసర్గము, సంయుక్తాక్షరములు, మాత్రమే ఇందులో గురువులను కలిగిస్తాయి. ఇకార, ఈకార, ఉకార, ఊకారములు అంగీకృతములు. రండి మనమూ ఈ స్తోత్రాన్ని విని తరిద్దాము.


******************************

*పతంజలి కృత శంభు నటన స్తోత్రం*


సదంచిత ముదంచిత నికుంచిత పదం

ఝలఝలం చలిత మంజు కటకం

పదంజలి దృగంజన మనంజన

మచంచల పదం జనన భంజనకరం


కదంబ రుచిం మంబరవసం పరమ

మంబుద కదంబక విడంబక గళం

చిదంబుధి మణిం బుధ హృదంభుజ 

రవిం పర చిదంబర నటం హృది భజే


హరం త్రిపుర భంజన మనంత కృత

కంకణ మహంత దయ మంత రహితం

విరించి సురవంహతి పురంధర విచింతిత 

పదం తరుణ చంద్ర మకుటం పరం 

పద విఖండిత యమం భసిత 

మండిత తనుం మదన వంచన పరం 

చిరంతన మముం ప్రణవ సంచిత నిధిం 

పర చిదంబర నటం హృది భజే


అనంత మఖిలం జగద భంగ గుణ తుంగ

మమతం ధృత విధుం సుర చరీత్

తరంగ నికురుంబ ధృతి లంపట 

జటం శమనదం పశుహరం భవహరం

శివం దశ దిగంతర విజృంభిత కరం 

కరలసం మృగశశిం పశుపతిం

హరం శశి ధనంజయ పతంగ అయనసం

పర చిదంబర నటం హృది భజే


పరం సురవరం పురహరం పశుపతిం 

జనిత దంతిముఖ షణ్ముఖ మముం

మృదం కనక పింగళ జటం శనక పంకజ రవిం సుమనసిం హిమ రుచిం

అళంగ మనసం జలధి జన్మ గరళం 

కబలయంత మధుకరం గుణనిధిం

సనంద వరదం శమిత మిందు వదనం 

పర చిదంబర నటం హృది భజే


ఇతి స్తవం మముం భుజగ పుంగవ కృతం 

ప్రతి దినం పఠతి యః కృత ముఖా

సదః ప్రభు పద ద్వితియ దర్శన పదం

సులలితం చరణ శృంగ రహితం

సః ప్రభవ సంభవ హరిత్పతి హరి

ప్రముఖ దివ్య నుత శంకర పదం

సగచ్ఛతి పరం నతుజను ర్జలనిధిం

పరమ దుఃఖ జనకం దురితదం


                        - పతంజలి మహర్షి

              గానం - సిక్కిల్ గురుచరణ్

అన్నమాచార్య చరిత్ర

 అన్నమాచార్య చరిత్ర 


అంత టమ్మవారు యద్భుత మహిమతో 

కరుణ తోడ నతని గావ నెంచి 

బాలు నెదుట తాను  ప్రత్యక్ష మయ్యును 

పరమ వత్స లతతొ బలికె నిట్లు 


"సాహసం బేల నీకిట్లు చచ్చుటకును 

కలత చెందకు బాలక కలదు శుభము 

తప్పకను నీదు మూడవతరము నందు 

బాలుడుదయించు శ్రీహరి భావమందు "


అంతట శ్రీ నారాయణ 

సంతోషము పొంది మిగుల స్వాంతము నందున్ 

గెంతుచు వెళ్ళియు గృహముకు 

పంతుళ్ళకు జెప్పి మిగుల పరవశమొందెన్ 


అవని నారాయణయ్యయు యమ్మ కృపన

పెఱిగి పెద్దయ్యు ద్విజులందు పెంపు పొందె 

పరిణయంబాడి పుత్రుని బడసి యతడు 

పేరు నారాయణ నుచును బెట్టు కొనియె 


నారాయణు కృప వల్లను 

నారాయణ సూరి బెఱిగి నాలుగు చదువుల్ 

పారాయణ మొనరించియు 

పారీణత పొందె మిగుల పండితు లందున్ 


తాళ్లపాక గ్రామ సామీప్య మందున 

మాడుపూరు నందు మహితమైన 

విప్రవంశమందు విభవంబుగా బుట్టి 

లచ్చి వోలె బెఱిగె లక్కమాంబ 


లచ్చి కెనయైన మానినౌ లక్కమాంబ 

విష్ణుకోవెల యందున విభవముగను 

మహితమొప్పగ నెలకొన్న మాధవునికి 

యర్చనము సేయు చుండును యనయముగను


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

కుంబాభిషేకం

 కుంబాభిషేకం - ఒక జ్ఞాపకం


పరమాచార్య స్వామివారి జ్ఞాపకశక్తి అమోఘం. ప్రతి చిన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని సరైన సమయంలో వాటిని తెలియజేస్తుంటారు. అటువంటి ఒక సంఘటన మీకోసం.


మహాస్వామి వారు ప్రకృతి ప్రేమికులు. యాత్రా సమయాలలో వారు ఎప్పుడూ పాకలలోనూ, ఛత్రాలలోనూ, చెట్లకింద, బయలు ప్రదేశాలలో ఎక్కువగా నివసించేవారు. ఒకసారి వారు మన ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. రోడ్డుపక్కనే ఒక చిన్న పాకలో ఉన్నారు. ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికై కార్లో వచ్చాడు. అతను మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, “నా పేరు కళ్యాణం పెరియవ. నేను తంజావూరు జిల్లా నుండి వచ్చాను. మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎవ్వరికీ మనఃశాంతి లేదు. నన్ను మహాస్వామి వారే కాపాడగలరని మీ దర్శనానికి వచ్చాను” అని అన్నాడు.


మహాస్వామి వారు అతన్ని కూర్చోమని చెప్పి, అతని గురించి వాకబు చేసి వారి సమస్యలన్నీ విన్నారు. వారి రెండు చేతులను పైకెత్తి అశీర్వదించి ఒక ఫలం ఇచ్చి పంపారు. ఒక రెండు సంవత్సరములు గడిచిపోయాయి. కళ్యాణం జీవితంలో వసంతం వచ్చింది. అతని బాధలన్నీ తొలగి సంతోషం వచ్చింది. అతను మహాస్వామి వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాడు. అప్పుడు కూడా మహాస్వామి వారు యాత్రలోనే ఉన్నారు. అతను మహాస్వామి వారి దర్శనం చేసుకుని తన కష్టాలు తొలగిపోయినందుకు, మహాస్వామి వారికి నమస్కరించి పక్కగా నిలుచున్నాడు.


“పరమాచార్య స్వామి వారి అవ్యాజ కరుణాకటాక్షాల వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. కావున నా మనః సంతోషము కోసం శ్రీమఠానికి ఏమైనా సమర్పించాలని అనుకుంటున్నాను” అని అన్నాడు. పరమాచార్య స్వామి వారు నవ్వి, ”నువ్వు ఇప్పుడేమి సమర్పించనక్కర లేదు” అని అన్నారు. కళ్యాణం అన్యమనస్కంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చిదంబరంలోని థిల్లై నటరాజ స్వామి వారి ఆలయ కుంబాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఒకరోజు ఉదయం నన్ను స్వామి వారు పిలిచారని శ్రీమఠం నుండి కబురు వచ్చింది. శ్రీమఠం శ్రీకార్యం తిరు టి.ఎన్. కృష్ణమూర్తి, నేను వెళ్ళి మహాస్వామి వారి ముందు నిలబడ్డాము. మహాస్వామి వారు మేనాలో కూర్చుని కుంబాభిషేకానికి జరగవలసిన తిరుమురై సంగీతం, తిరుమురై సదస్సు, తిరువాచక పారాయణం, దీక్షితర్ల(చిదంబరం ఆలయ వంశపారంపర్య అర్చకులు) పిల్లల చేత శంభునాథ స్తోత్ర పారాయణ వంటి ఏర్పాట్ల గురించి ఆదేశాలు ఇస్తున్నారు.


అంతలో ఒకరు మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. మహాస్వామి వారు అతన్ని మాతోపాటు కూర్చోమన్నారు. ఆ వచ్చిన అతను కళ్యాణం.


“నువ్వు నన్ను ఫలానా రోజు ఫలానా చోట కలిసావు? గుర్తు ఉన్నాదా?” అని మహాస్వామి వారు అతణ్ణి అడిగారు.


అతను ఆశ్చర్యపోయాడు. అతను రెండవ సారి దర్శనం చేసుకున్న విషయం చెప్పగా అతను కొద్దిగా గుర్తు తెచ్చుకుని, అవునన్నట్టు తల పంకించాడు.


”ఇప్పుడు బావున్నావు కదా? నువ్వు మఠానికి డబ్బు ఇవ్వాలనుకున్నావు కదా ఇప్పుడు ఇవ్వగలవా?” అని అడిగారు.


”ఇప్పుడే సంతోషంగా ఇవ్వగలను పెరియవ” అని అన్నాడు.


”కాని ఆ డబ్బు శ్రీమఠం కోసం కాదు. ఇది చిదంబరం థిల్లై నటరాజ స్వామి వారి ఆలయ కుంబాభిషేక సమయం. అక్కడ జరగవలసిన పనుల గురించి నేను వీళ్లకు చెప్పాను. నువ్వు ఇచ్చిన డబ్బు ఆ పనుల కోసం ఉపయోగిస్తాము. ఆ ధనం నటరాజ స్వామికి చేరనీ!! నీవు వారితో చర్చించి రా” అని అన్నారు.


మేము ముగ్గురమూ బయటకు వచ్చి అన్ని విషయాలు చర్చించి లోపలికి వెళ్ళాము. పరమాచార్య స్వామి వారు కూడా సంతోషించి మమ్మల్ని ఆశీర్వదించి పంపారు.


ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన చిన్న సంఘటనను గుర్తుపెట్టుకుని సరైన సమయంలో గుర్తుతెచ్చుకుని, ఆనాడు అతను కోరిన కోర్కెను నెరవేర్చి నటరాజ స్వామి వారి అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసారు. ఇంతటి అదృష్టాన్ని పొందిన కళ్యాణం జన్మ ధన్యమైనది.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।