శ్రీ శోభకృత్ (ఉగాది) కి స్వాగతము
శార్దూలము:
శ్రీమత్సుందర శోభనాలసిత సుశ్రీదీప్తులన్ పర్వుచున్
క్షేమమ్ముల్ పెనువెల్లువై విరియగా క్షితిన్ ప్రవర్తిల్లవే
యో మా శోభకృదబ్దమా! ప్రబల యుద్ధోన్మాదమున్ బాపవే!
ఈ మర్త్యాళికి మేలు సేయ భువి కీ విచ్ఛాగతిన్ రాగదే!
మత్తకోకిల॥
సాదరమ్మగు స్వాగతమ్మిదె సాధువత్సరి నీ కిటన్శ్రీ
మోదమిచ్చెది ఈ యుగాదికి స్ఫూర్తి నీవెగ మాకిలన్
చేదు మమ్మిల కోకి గానపుశ్రీల నీవిదు సంపదల్
భేదభావన లేని నీకిదె ప్రేమపూరిత స్వాగతమ్
మత్తకోకిల॥
నీలిదేహపు కోకిలమ్మలు నీకు స్వాగత మీయగా
క్రాలు హర్షము లుల్లమెల్లెడ శ్రావ్యగీతుల నింపగా
కాలమందున వేలయూహలు కార్యరూపము దాల్చగా
శ్రీలు జిందిల తేజ మీనుచు చేర రాగదె శోభకృత్
సీసం:
శుభకృత్తు శుభమీయ స్ఫూర్తి చాలగ లేమి కుహుయంచు కూసె నో కోయిలమ్మ. యుద్ధవిధానము లుద్ధరించున? యని కుహుయంచు కూసె నో కోయిలమ్మ వర్షమిచ్చినపంట వడగండ్లు కొంపోవ కుహుయంచు కూసె నో కోయిలమ్మ
త్రాగునీటి కఱవు ప్రారబ్ద మని యెంచి కుహుయంచు కూసె నో కోయిలమ్మ
శోభకృద్వర్ష మేతెంచ శుభము గల్గు శోభలెంతయు భువిపైన సోకులీను
ననెడి యాస్థ మదిని గల్గ నాశతోడ
కోకిలల్ స్వాగతించుచు కూసి బిలచె
శార్దూలము॥
సంభూషించుము నీవు భూతముల శశ్వచ్ఛోభలన్ శోభకృత్!
సంభావింతురు నిన్ను సమ్ముదమునన్ సర్వంసహావర్తు లీ
శుంభద్గౌరవ మంది రాగదె వెసన్ శోభాకృతీవర్షమా!
కుంభిన్ కంతవసంత దీప్తులవిగో కోర్కెన్ నినున్ బిల్చెడిన్
శ్రీ శోభకృత్ ప్రతిపత్-బుధవారం.
ఉగాది శుభాకాంక్షలతో........
మీ శ్రీశర్మద చరవాణి: 8333844664
శ్రీ శర్మదా జ్యోతిషాలయమ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి