గురుశిష్యుల మధ్య న్యాయాలు. 1. విహంగ న్యాయం.
పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది. అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు. 2. భ్రమర కీటక న్యాయం.
భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది. అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలెనే తయారు చేస్తాడు. 3. మీన న్యాయం.
చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది. తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి. ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడం వల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు. 4. తాబేటి తలపు న్యాయము...
తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది. ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది '. ఆ సంకల్ప బలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని 'సంకల్పిస్తారు'. ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.
ఓం శ్రీ గురుభ్యో నమః.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి