11, జూన్ 2026, గురువారం

ఒక ఆలోచన

 *ఒక కప్పు టీ... ఒక ఆలోచన"

-కథానిక


శ్రీశైలం క్షేత్రంలో బస్‌స్టాండ్‌కు దగ్గరగా వెంకట్రావు ఒక చిన్న జిరాక్స్ షాపు నడిపేవాడు. జిరాక్స్‌లు, ప్రింట్లు, ఆన్‌లైన్ టికెట్లు—అన్నీ అతని షాపులో చేసేవారు. పనిలో ఎంత బిజీగా ఉన్నా, తన దగ్గరకు వచ్చిన వారితో రెండు మాటలు మాట్లాడటం అతని అలవాటు.


ఒకరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చిన ఆనందరావు, దర్శన టికెట్ ప్రింట్ తీసుకోవడానికి వెంకట్రావు షాపుకు వచ్చాడు.


"అన్నా, ఈ టికెట్ ప్రింట్ కావాలి," అని ఫోన్ చూపించాడు.

వెంకట్రావు ఫైల్ ఓపెన్ చేసి చూస్తుండగా, అప్పటికే కొందరు కస్టమర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

"కాస్త ఆలస్యం అవుతుంది సార్... మీరు కూర్చోండి," అన్నాడు.

"పర్వాలేదు," అని చిరునవ్వుతో పక్క కుర్చీలో కూర్చున్నాడు ఆనందరావు.

ఆ చిరునవ్వులో ఏదో ప్రశాంతత ఉంది. ఆలస్యం అవుతున్నా అసహనం లేదు. గడియారం వైపు పదేపదే చూడటం లేదు. 

అది వెంకట్రావును ఆకర్షించింది.


"టీ తాగుతారా?" అని అడిగాడు.

అయ్యో ఎందుకులెండి అనాలనుకున్నా "తాగుతాను," అన్నాడు ఆనందరావు.

వెంటనే పక్కనే ఉన్న టీ దుకాణం నుంచి రెండు టీలు తెప్పించాడు వెంకట్రావు.

టీ తాగుతుండగా ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి.


"మా అబ్బాయి, కోడలు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు," అన్నాడు వెంకట్రావు.

"చాలా మంచిది," అన్నాడు ఆనందరావు.

"మంచిదే గానీ... ఒక చిన్న సమస్య ఉంది. వాళ్లు బాగా సంపాదిస్తున్నారు. కానీ పొదుపు చేయడం లేదు. అందుకే నెలకు నలభై వేల రూపాయలు నాకు పంపమని చెప్పాను. ఆ డబ్బుతో వాళ్ల పేరుమీద ఇల్లు కొనాలని అనుకున్నాను."

"అయితే పంపించారా?"

వెంకట్రావు నవ్వాడు.

"అదే కథ. మొదట అడిగితే వాళ్లిద్దరికీ కోపం వచ్చింది. నేను వాళ్ల డబ్బు మీద కన్నేశానని అనుకున్నారు."

"మరి?"

"అప్పుడు ఒక చిన్న అబద్ధం చెప్పాను. నీ చదువు కోసం అప్పులు చేశాను, అవి ఇంకా తీర్చాల్సి ఉందని చెప్పాను. వెంటనే ఒప్పుకున్నారు."

ఆనందరావు ఆశ్చర్యంగా చూశాడు.

"అంటే నిజంగా అప్పులు లేవా?"

"లేవు. కానీ వాళ్ల భవిష్యత్తు కోసం చేసిన అబద్ధం అది. వాళ్లకు తెలియకుండా వాళ్లకోసం దాచుతున్నాను."


కొద్దిసేపు ఆనందరావు మౌనంగా ఉన్నాడు.

తర్వాత చిరునవ్వు నవ్వాడు.

"మీరు నాకు ఒక గొప్ప ఐడియా ఇచ్చారు."

"ఏమిటది?" అడిగాడు వెంకట్రావు.

"నాకూ ఇద్దరు కొడుకులు. వాళ్లు కూడా బాగా సంపాదిస్తున్నారు. నేను డబ్బు ఇవ్వమని అంటే అవసరం ఏమిటని అడుగుతారు. ఇప్పటివరకు నేను అడగలేదు. కానీ వృద్ధాప్యంలో కొంత భద్రత ఉండాలని అనిపిస్తోంది."


వెంకట్రావు ఆసక్తిగా విన్నాడు.

"ఇప్పుడే మీరు చెప్పిన వ్యూహం వాడతాను. నేను కూడా మీ చదువు కోసం అప్పు చేశానని మా పిల్లలకు చెబుతాను," అని నవ్వుతూ అన్నాడు ఆనందరావు.

వెంకట్రావు కూడా నవ్వాడు.

ఒక మాట కూడా అన్నాడు

"అయ్యో! నేను చెప్పింది కాపీ కొట్టేస్తున్నారే!"

"మీ షాపు జిరాక్స్ షాపు కదా! ఇక్కడ కాపీలు తీయడం సహజమే," అన్నాడు ఆనందరావు.

ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.


అంతలో టికెట్ ప్రింట్ పూర్తయింది.

టికెట్ తీసుకుంటూ ఆనందరావు,

 "మీరు నాకు ప్రింట్ మాత్రమే ఇవ్వలేదు. ఒక ఆలోచన కూడా ఇచ్చారు. ధన్యవాదాలు," అన్నాడు.

వెంకట్రావు చిరునవ్వుతో, 

"స్వామి దర్శనం బాగా చేసుకుని వెళ్లండి సార్," అన్నాడు.

ఆనందరావు బయలుదేరాడు.

షాపు బయటకు వెళ్లిపోతున్న అతన్ని చూస్తూ వెంకట్రావు మళ్ళీ పనిలో పడిపోయినా తన మాటలు ఇంకో వ్యక్తిలో తెచ్చిన మార్పు గురించి ఇలా అనుకున్నాడు

"కొన్నిసార్లు మనం అనుకోకుండా చెప్పిన మాట, ఎదుటివారి జీవితంలో ఒక కొత్త ఆలోచనకు విత్తనమవుతుంది. ఒక కప్పు టీ తో మొదలైన పరిచయం, ఒక జీవిత పాఠంగా మిగిలిపోవచ్చు"


సి.యస్.రాంబాబు

కామెంట్‌లు లేవు: