9, ఆగస్టు 2020, ఆదివారం

*సాక్షి* దినపత్రికలో వ్యాసం

🌹 *యుగకర్త చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి* // "కవనార్థంబుదయించితిన్,  సుకవితా కార్యంబు నా వృత్తి", 
అని చెప్పుకున్నాడు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి.చెప్పినట్లుగానే తెలుగునాట కవితా కల్యాణము చేయించి, జీవితాన్ని తరింపజేసుకున్న  మహాకవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తొలి ఆస్థానకవి.1949లో, సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్రాస్ నుండి తరలి విజయవాడ వచ్చి, ఈ పదవిని అందించింది.అంతటి ఘన చరిత్ర చెళ్లపిళ్లది.యుగపురుషుడే కాదు.యోగపురుషుడు కూడా. తిరుపతి వేంకటకవులుగా జగత్ ప్రసిద్ధులైన ఈ జంటలో అగ్రజుడు చెళ్ళపిళ్ళ. దివాకర్ల తిరుపతిశాస్త్రి కంటే ఒకటిన్నర సంవత్సరం పెద్దవాడు. దివాకర్ల కంటే ముందుగానే అవధాన ప్రదర్శనకు శ్రీకారం చుట్టిన  పద్యయోధుడు చెళ్ళపిళ్ళ.ఈ మహాకవి పుట్టి  నేటికి 150ఏళ్ళు పూర్తయ్యాయి.1870,ఆగస్టు 8వ తేదీ నాడు తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించాడు.తల్లి దండ్రులు చంద్రమ్మ, కామయ్య.అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చి, తన  గళానికి, కలానికి ఎదురులేదని నిరూపించుకున్నాడు. వీరింట్లో పూర్వుల్లో కవిత్వం ఉంది. వీరి ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే గ్రంథాలు రచించాడు. చిన్ననాడు చూసిన తాళపత్ర గ్రంథాలు చెళ్ళపిళ్ళపై అపురూపమైన ముద్ర వేశాయి.వీరి విద్యాభ్యాసం చాలా గ్రామాల్లో సాగింది.కాశీ కూడా వెళ్ళాడు.పాండిత్యంతో పాటు వివిధ సారస్వత అంశాలు గ్రహించి వచ్చాడు. కవితా జీవితంలో అవధానకవిగా నానా రాజ సందర్శనం చేసి అఖండ యశస్సు పొందాడు.  ఎంతమంది దగ్గర విద్యాభ్యాసం చేసినా, చర్ల బ్రహ్మయ్యశాస్త్రినే ప్రధాన గురువుగా భావించాడు.వెంకటశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఇతని అసలు పేరు వెంకటాచలం. జంటకవిత్వానికి, అవధాన విద్యకు, పద్యనాటకాలకు వీరు తెచ్చిన మోజు అంత ఇంతా కాదు. చెళ్ళపిళ్ళ ప్రభావం ఈ తెలుగునేలపై చాలా ఎక్కువ.తదనంతర జీవితంలో లబ్ధ ప్రతిష్ఠులైన ఎందరో కవి,పండితులు చెళ్ళపిళ్ళ శిష్యులే కావడం విశేషం.చెళ్ళపిళ్ళ మా  గురువని చెప్పుకోవడమే ఆ కాలంలో అంత గొప్ప.బందరు(మచిలీపట్నం)లో హైస్కూల్ లో అధ్యాపకుడుగా పనిచేయడం చెళ్ళపిళ్ళకు బాగా కలిసొచ్చిన అంశం.విశ్వనాథ సత్యనారాయణ,వేటూరి ప్రభాకరశాస్త్రి, పింగళికాటూరి, వేలూరి శివరామశాస్త్రి  వంటివారెందరో బందరులో స్కూల్లో ఈయన దగ్గర   చదువుకున్నారు.వీరికి శిష్యగణం, శత్రుగణం, భక్తగణం  ఆన్నీ  ఎక్కువే.ఎవరినైనా సరే ఎదిరించాలి,గెలవాలి,  గుర్తింపు తెచ్చుకోవాలి, అనే  పట్టుదల చెళ్లపిళ్లకు మొదటి నుండీ ఉంది. గురువు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, శిష్యులు వెంకటరామకృష్ణకవులతోనూ విభేదాలు వచ్చాయి. సాటి  కవులు, సంస్థాన పండితులు, దివాన్లతోనూ వివాదాలు వచ్చాయి. సంచలనాత్మమైన యుద్ధం కొప్పరపు సోదరకవులతో జరిగింది.  ఈ వివాదాలు ఆధునిక సాహిత్య చరిత్రలో సుప్రసిద్ధం.చెళ్ళపిళ్ళ గుంటూరుసీమ అనే గ్రంథమే రాయాల్సి వచ్చింది. లక్కవరం జమిందార్ రాజా మంత్రిప్రగడ భుజంగారావు బహుద్దర్ కలుగజేసుకొని,  ఈ  వివాదాలకు  ముగింపు పలికారు.వివాదాలు ఎలా ఉన్నా, అద్భుతమైన పద్యాలు తెలుగునాట సందడి చేశాయి.భాషా పరిపుష్ఠి జరిగింది. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ళ ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగారు.శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి -చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండులో బాహాబాహీకి దిగి, ఇద్దరూ చెప్పులు చూపించుకునే స్థాయికి వీరి వాగ్వాదం వెళ్ళిపోయింది.వీరి  వివాద సాహిత్యం పుంఖానుపుంఖాలుగా వచ్చింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి అనంత ప్రతిభామూర్తి.అద్భుతమైన ధారణ ఈయన సొత్తు.పద్య పఠనం పరమాద్భుతం.సంగీతజ్ఞానం కూడా మెండుగా ఉండేది.కొంతకాలం సాధన కూడా చేశారు.పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి. శ్రీ రాగంలో ఎక్కువగా పాడేవారని చెబుతారు. ఉపన్యాసాలు సురగంగా ప్రవాహాలు. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు,పిట్టకథలు,సామెతలతో   చెళ్ళపిళ్ళ ప్రసంగం చేస్తుంటే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులై పరవసించేవారు."మంచి కవిత్వం అంటే ఏమిటి", అనే అంశంపై  విశాఖపట్నంలో రాజా విక్రమదేవ వర్మ ఇంట్లో,  చెళ్ళపిళ్ళ 5 గంటలపాటు అనర్గళమైన ప్రసంగం చేశారు.ఆద్యంతం నాటకీయ ఫక్కీలో సాగిన ఆ ప్రసంగం అనన్య సామాన్యం. దీనికి ప్రత్యక్ష సాక్షి శ్రీశ్రీ. అద్భుతమైన ప్రసంగాన్ని అందించడంతో పాటు, విక్రమదేవ వర్మ నుండి చెళ్ళపిళ్ళ మూడువేల రూపాయలు కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో మూడువేలంటే, ఈరోజుల్లో లక్షలు.వెంకటశాస్త్రికి ధిషణ, ధిషణాహంకారం,లౌక్యం ఆన్నీ ఎక్కువే. అదే సమయంలో మెత్తని మనస్సు కూడా. తన ఎద ఎల్ల మెత్తన,శిష్యులన్న ఎడదం గల ప్రేముడి చెప్పలేని మెత్తన, అని అందుకే విశ్వనాథ అన్నాడు.చెళ్ళపిళ్ళ జంటకు కొప్పరపు సోదరకవులతో కొంత కాలం వివాదాలు నడిచినా, తదనంతరం, చెళ్ళపిళ్ళ  దగ్గరుండి కొప్పరపుకవుల కుమారులతో  అవధానాలు చేయించాడు. వానలో తడవని వారు, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి కవితాధారలో మునగనివారు తెలుగు జగాన లేరు.అంతటి ఆకర్షణ,చమత్కారభరితమైన శైలి  చెళ్ళపిళ్ళ సొత్తు. తొలిరోజుల్లో, సంస్కృత సమాస చాలనా జ్వలితమైన కవిత్వం వ్రాసినా, తర్వాత కాలంలో తెలుగుకవిత్వం వైపు మళ్లారు. ఎన్నో కావ్యాలు, శతకాలు, అనువాదాలు,  నాటకాలు రాశారు. పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు.ఎందరో కళాకారులకు అన్నంపెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై  కూర్చోపెట్టిన ఘనత వీరిదే. తద్వారా, వాడుకభాషకు వీరు చేసిన సేవ అనుపమానం.గొల్లలకు, గొడ్లకాపరులకూ తెలిసే స్థితిలో నా కవిత్వం ఉంటుందని చెప్పుకున్న చెళ్ళపిళ్ళ, ఆ మాట అక్షరాలా నిలబెట్టుకున్నాడు.ఇదొక భాషాపరమైన విప్లవం.ఇది ఎందరికో చైతన్యాన్ని నింపింది. చెళ్లపిళ్లది ఎంతటి ధారాశుద్ధి బంధురమైన పద్య కవిత్వమో, అంతటి చక్కని వచన రచనం కూడా. చెళ్ళపిళ్ళవారి రచనలు చదవడం ప్రారంభిస్తే, చివరి అక్షరం వరకూ ఆగకుండా చదివిస్తాయి. అంతటి ఆకర్షణా శిల్పం ఆ రచనలో ఉంటుంది. కథలు-గాథలు, దీనికి చక్కని ఉదాహరణ.తిరుపతి కవిజంటలో మీసాలు పెంచింది కూడా ఈయనే.తెలుగు పద్యాన్ని ఏనుగుపై ఊరేగించాడు.పద్యాలను ప్రబంధాల కౌగిళ్ళ నుండి బయటకు తెచ్చి, ప్రజల నాలుకలపై నర్తనం చేయించాడు. ఏనుగునెక్కినాము, ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము, అంటూ పద్యపౌరుషంతో జీవించిన యుగపురుషుడు చెళ్ళపిళ్ళ. తెలుగుపద్య జండాపై నిలిచిన కవిరాజు,యుగకర్త చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (ఈ వ్యాస రచయిత కొప్పరపుకవుల మనుమడు)🙏
***********************
ఈరోజు (8-8-2020) *ఆంధ్రపత్రిక* సంపాదకీయం🌹
 *సత్కవి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి* //
"సత్కవి చెళ్ళపిళ్ళ వేంకన గురువంచు చెప్పుకొనగా-అది గొప్ప తెలుంగునాడునన్" అన్నాడు ఒక కవి. అన్నవాడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఇంతటి విశ్వనాథ కూడా  చెళ్లపిళ్లకు శిష్యుడే.వేటూరి ప్రభాకరశాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, పింగళి, కాటూరి వంటి ఎందరో ఉద్దండులు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శిష్యులు. తిరుపతి వెంకటకవులుగా లబ్ధప్రతిష్ఠులైన జంటకవులలో వయస్సులో పెద్దవాడు చెళ్ళపిళ్ళ.1870, ఆగష్టు 8వ తేదీ నాడు, తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించాడు. నేటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి.1950 వరకూ 80 ఏళ్లపాటు జీవించారు. తుది శ్వాస వరకూ సరస్వతీ ఉపాసనలోనే గడిపారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థానకవిగా నియమించి గౌరవించింది. ఆంధ్ర ప్రభుత్వ తొలి ఆస్థానకవి వీరే.ఈ వేడుక కూడా అసాధారణ విధంగా జరిగింది. మద్రాస్ నుండి ప్రభుత్వగణమంతా విజయవాడ తరలి వచ్చింది. భక్తి ప్రపత్తులతో  చెళ్లపిళ్లకు నియామక పత్రం సమర్పించి, ఘనంగా సత్కరించారు. ఈ సంఘటన 1949 లో జరిగింది. ఇది జరిగిన కొన్నాళ్లకే చెళ్ళపిళ్ళ శివైక్యమయ్యారు. ఇలా జీవిత చరమాంకం వరకూ ఘన గౌరవాలు పొందిన భాగ్య జాతకుడు చెళ్ళపిళ్ళ. అతి సాధారణ కుటుంబంలో పుట్టి, ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రలో అగ్రస్థానం పొందిన ప్రతిభామూర్తి. అవధానం, జంటకవిత్వం, పద్యనాటకాలు అనగానే గుర్తుకు వచ్చేవారు తిరుపతి వెంకటకవులు. దివాకర్ల తిరుపతిశాస్త్రి-చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి కలిసి తిరుపతి వేంకటేశ్వర కవీశ్వరులుగా తెలుగుతల్లి కడుపు పండించారు. దివాకర్ల కంటే ముందుగానే చెళ్ళపిళ్ళ అవధాన ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు.తర్వాత జంటగా కవితా యాత్ర చేశారు.1920లోనే దివాకర్ల అస్తమించారు.తర్వాత 30ఏళ్ళ పాటు చెళ్ళపిళ్ళ ఒక్కరే కవితాయానం సాగించారు.గతంలోనూ 6ఏళ్లపాటు విడివిడిగానే కవితాపర్వం నడిపారు. 1903 నుండి 1916 వరకూ 13ఏళ్ళపాటు చెళ్ళపిళ్ళ బందరు హైస్కూల్ లో ఉపాధ్యాయుడుగా చేశారు. ఆ కాలంలోనే ఎందరో వీరికి విద్యార్ధులయ్యారు.విశ్వనాథ, వేటూరి, వేలూరి, పింగళి కాటూరి ఈ సమయంలోనే శిష్యులయ్యారు. స్కూల్ పాఠాలు అలా ఉంచగా, వీరందరిపై చెళ్ళపిళ్ళ కవితా ప్రభావం ఎక్కువగా పడింది. అప్పటికే ఆయన                 లబ్ధప్రతిష్ఠుడు కాబట్టి, ఆయన శిష్యులని అనిపించుకోడానికి అందరూ ముచ్చటపడేవారు.చెళ్ళపిళ్ళ అక్షర్షణ అటువంటిది.మృదు  భాషణం,రసరంజితమైన కవిత్వం,వినసొంపైన పద్య పఠనం, గంగా ప్రవాహ తుల్యంగా సాగే చమత్కార భరిత ప్రసంగం,ఎదుటివారిని ప్రోత్సహించే స్వభావం మొదలైన సులక్షణాలతో   ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేవారు.వెంకటశాస్త్రి ఆకర్షణలో పడితే,బయటకు రావడం ఎవరికైనా  అసాధ్యం.అంతటి అసాధ్యుడు చెళ్ళపిళ్ళ.అవధానవిద్యను సర్వ కళామయంగా తీర్చిదిద్దినవాడు చెళ్ళపిళ్ళ.వీరి ప్రభావంతో ఎందరో అవధానులు తెలుగునేలపై పుట్టుకు వచ్చారు.ఈ రంగానికి అత్యంత ఆకర్షణ తెచ్చిపెట్టిన మహనీయుడు చెళ్ళపిళ్ళ.ప్రారంభంలో సంస్కృత కవిత్వం సృష్టించినా, తర్వాత తెలుగు కవిత్వం వైపే ఎక్కువగా దృష్టి  సారించారు. కావ్యాలు, శతకాలు, నాటకాలు, అనువాద రచనలు ఎన్నో చేశారు. నానారాజ సందర్శనం, దేవీ భాగవతం,బుద్ధ చరిత్ర, మృచ్ఛకటికం,పాణీగృహీత   మొదలైనవి ఎంతో ప్రసిద్ధం.శ్రవణానందం ఆ కాలంలో చాలా సంచలనం.ముద్రణపై ఆంక్షలు కూడా విధించారు.వీరి అనువాద రచన శ్రీనివాస విలాసం గొప్ప కావ్యంగా కొందరు పెద్దలు చెబుతారు.వీరు చేసిన అవధానాలలోని కొన్ని పద్యాలు తీసుకొని, మెరుగులు దిద్ది శతావధానసారంగా ప్రచురించారు.ఇక పాండవ ఉద్యోగాలు గురించి చెప్పక్కర్లేదు.ఈ పద్యనాటకాలు తెలుగునేలపై చేసిన సందడి అంతా ఇంతా కాదు.చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు అంటూ... పల్లెల్లో గొడ్లకాపరి కూడా గొంతెత్తి పాడే పద్యాలు ఈ నాటకాల లోనివే. ఎందరో పద్యనటులను, పద్యప్రియులను తయారు చేసిన గొప్ప రచన ఇది. తిరుపతి వెంకటకవులను జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళిందివే. మిగిలిన సాహిత్యమంతా సాహిత్యవేత్తలకు మాత్రమే దగ్గరయింది.ఈ పద్యనాటకాలు తిరుపతి వెంకటకవులను అందరికీ దగ్గర చేశాయి.చెళ్ళపిళ్ళ వచన రచనలోనూ సిద్ధహస్తుడు.ఆ రచనా శిల్పం పరమ ఆకర్షణా స్వరూపం.చదవడం మొదలు పెడితే, చివరి వరకూ వెళ్లాల్సిందే.పాఠకులను అంతగా కట్టిపడవేసే వచన రచనా నిపుణత చెళ్ళపిళ్ళ సొత్తు.అటు గద్వాల్ ఇటు చెన్నపట్నం అన్నట్లుగా తెలుగువారు ఎక్కడుంటే అక్కడ వీరి సభలు జరిగాయి.కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు పల్లెలు, పట్టణాలు, రాజాస్థానాలు అన్ని దిక్కులా వీరి కవిత ప్రవహించింది.అవధానాలు, కురుక్షేత్ర పద్యనాటకాలు, శిష్యబృందం వల్ల వీరి చరిత్ర ఘనంగా సాహిత్య చరిత్రలో లిఖించబడింది.చెళ్లపిళ్లకు పట్టుదల జాస్తి.ఎందరితోనో వివాదాలు జరిగాయి.వివాద సాహిత్యం కూడా చాలా ప్రసిద్ధం.వివాద స్వభావంతో పాటు లౌక్యం కూడా చాలా ఎక్కువ.మెత్తని మాట,సుతిమెత్తని కవిత్వం చెళ్ళపిళ్ళ శైలి.రచించిన  ప్రతి పద్యం ఎంతో మెత్తన అంటూ శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ అభివర్ణించారు.శిష్యవాత్సల్యం కూడా చాలా ఎక్కువ.శిష్య వాత్సల్యంబు చెలువుతీరిన మూర్తి అంటారు పింగళి,  కాటూరి.ఆ కాలంలో ఎక్కడ చూసినా కవులు, శతావధానులు, ప్రబంధకర్తలు ఉండేవారు.ఈ వాతావరణం ఏర్పడడంలో ప్రభావం జూపించిన వారిలో చెళ్ళపిళ్ళ ప్రథమ శ్రేణీయులు.వెంకటశాస్త్రి కామేశ్వరీ ఉపాసకులు.ప్రజాసంబంధాలు ( పి-ఆర్ - పబ్లిక్ రిలేషన్స్ ) కూడా చాలా ఎక్కువ.పోలవరం జమిందార్ రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు ప్రోద్బలంతోనే పాండవ ఉద్యోగ విజయాలు రచించారు. విజయవాడ దుర్గాకళామందిరం పేరు చెళ్ళపిళ్ళ పెట్టారు. ఎన్నో బిరుదులు, సత్కారాలు, గౌరవాలు పొందారు. వారు జీవించిన కాలం తెలుగుభాషకు స్వర్ణయుగం. వీరి ప్రధాన గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి. దివాకర్ల-చెళ్ళపిళ్ళను కలిపి తిరుపతి వేంకటేశ్వరకవులుగా బ్రహ్మముడి వేసింది వీరే.దివాకర్లలో పాండిత్యం మెండు. చెళ్లపిళ్లలో రంజకత్వం మెండు. వీరిద్దరి స్వభావాలు పూర్తిగా భిన్నం. చెళ్లపిళ్లకు దూకుడు,లౌక్యం రెండూ ఎక్కువే.పట్టుదలతో పాటు పట్టువిడుపులు కూడా ఎక్కువే.సారస్వత ప్రతిభా దీప్తి, సరస లౌక్య త్రిమూర్తి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి. స్వయంకృషి ద్వారానే ఎక్కువగా పాండిత్యం సంపాయించారు. చదరంగంలోనూ నిపుణుడు. అందుకే, జీవితంలోనూ ఎత్తుపైఎత్తులు తెలిసిన గడసరిగా పేరు తెచ్చుకున్నాడు. ఇటువంటి మహనీయులు ఎప్పుడో కానీ పుట్టరు. తెలుగు భాషాసాహిత్యాలకు వీరు చేసిన సేవ,చూపిన త్రోవ సామాన్యమైంది కాదు. వీరి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. కవనం  జీవనంగా సాగించిన  సత్కవి చెళ్ళపిళ్ళ. వీరిపై కొప్పరపు సోదరకవులు పరమాద్భుతమైన పద్యమాలిక చెప్పారు. అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. చెళ్లపిళ్లలేని ఆధునిక సాహిత్య యుగం ఊహించలేం.తెలుగుభాష ఉన్నంతకాలం ఈ మహనీయుడు చిరంజీవిగా ఉంటారు. ఈ మహాకవితా స్వరూపానికి అక్షరాంజలులు సమర్పిద్దాం. - మాశర్మ🙏

*తద్దినం* !- కధ



(గోతెలుగు నుండి. వారికి కృతజ్ఞలతో)
            🌷🌷🌷🌷
ఆ రోజు సోమయాజులు ఇంట్లో తద్దినం.  డాబా మీద కొంతమంది పైకి చూస్తూ, కొంతమంది చుట్టుపక్కల చూస్తూ... కా... కా... అంటూ అరుస్తున్నారు.

ఎందుకంటే కాకుల కోసం.

పంతులు, సోమయాజి ఇంట్లోంచి ఓ అరటి ఆకులో పిండాలు తెచ్చి పిట్ట గోడ మీద పెట్టి తను కూడా అరవటం మొదలు పెట్టారు.

కాని కాకులు రావటం మాట అటుంచి... అసలు కను చూపు మేరలో కాకి అన్నదే కనిపించలేదు.  చివరకి ఆడాళ్ళూ... మగాళ్ళూ ... కూడా కలిసి అరవటం మొదలు పెట్టారు.

పిల్లలకి ఏమీ అర్ధం కాక వాళ్ళూ కూడా గొంతు కలిపారు.  కానీ వాళ్ళు గొంతులు కలిపింది కాకులకోసం కాదు.  *ఆకలేసి* .

*‘బామ్మా... కాకులు రావడం లేదే... ఆకలేస్తోంది... అన్నాడు సోమయాజి కొడుకు రామ సోమయాజులు.*

*‘కాకి ముట్టుకోకుండా ఎవరూ మెతుకు ముట్టడానికి వీల్లేదు.’ అంది ఖరాఖండిగా బామ్మ.*

అందరూ ముఖాలు చిన్నబుచ్చుకున్నారు.

 *రెండు గంటలు దాటింది.*

*పంతులు గారు కూడా ఆకలితో నక నకలాడుతున్నారు.*

పంతులుగారు 'కాకులు కాదుకదా, కాకి ఈక కూడా కనబడటంలేదు.  ఏం చేద్దాం?' అడిగాడు సోమయాజి.

*‘మీరేం కంగారు పడకండి. ఓ పావు గంటలో కాకి వస్తుంది.’ అన్నాడు పంతులు.*

అందరూ ఆశ్చర్యంగా చూసారు.

రెండు గంటలైనా రాని కాకులు. ఓ పావు గంటలో ఎలా వస్తాయండి? అడిగాడు మరో పెద్ద మనిషి.

*డబ్బులుంటే కొండమీద కోతి దిగి వస్తుంది.  ఈ కాకి ఓ లెక్కా?* , అన్నాడు పంతులు.

*‘డబ్బులు చూపిస్తే కాకులు వస్తాయా? అడిగాడు ఓ పెద్ద మనిషి.*

‘చూపిస్తే కాదు.  ఓ అయిదువందలు ఇస్తే సోమయాజి గారు' అన్నాడు పంతులు.

*‘పావుగంట లోనా’ అడిగాడు సోమయాజి.*

‘అవునండి కాకపొతే ఓ అయిదొందలు అవుతుంది.' అన్నాడు పంతులు తాపీగా.

‘అయిదొందలే' అంది సోమయాజి భార్య సోమిదమ్మ.

*‘అయిదొందలు కాదు అయిదు వేలయినా సరే కాకి ముట్టిన తర్వాతే అందరూ అన్నాలు ముట్టేది’* అంది బామ్మ.

*‘విన్నారుగా’ అన్నాడు పంతులు ఆనందంగా.*

‘అబ్బా నువ్వుండవే అమ్మా. ఆవిడ మాటలేం పట్టించుకోకండి.   ఐదొందలు ఖాయం చేసుకొని అర్జెంట్ గా కాకి చేత కబురు పంపి, కాకి ని రప్పించండి, ఆకలితో అందరూ నక నక లాడుతూ వున్నారు.’  అన్నాడు సోమయాజి.

పంతులు సెల్ ఫోన్ తీసి ఓ నంబర్ డయల్ చేసి. 'హలో! కాకి కామేశం! నేను పిండాల పంతులు కాశీపతి ని, అర్జెంట్ గా ఓ కాకి'  అంటూ ఆగి సోమయాజితో ‘ఒకటా? రెండా?’ అంటూ అడిగాడు.

సోమయాజికి అర్ధం కాలేదు. ‘అంటే’ అన్నాడు.

‘ఒక కాకయితే అయిదొందలు. రెండయితే ఏడు వందల యాభై.  రానూ పోనూ ఖర్చులు ఇవ్వాలట.’ అన్నాడు పంతులు.

‘ఒకటి చాల్లెండి' అన్నాడు సోమయాజి.

‘ఒకటి చాలు. వెంటనే తీసుకురా. పది నిముషాల్లో కాకితో సహా నువ్విక్కడ వుండాలి. ఆ... ఆ... ఇక్కడే.’ అంటూ సెల్ ఫోన్ ఆపి ‘ఇంకో పావుగంటలో కాకి వస్తుంది. ఈ లోగా వడ్డించమని చెప్పండి.’ అన్నాడు పంతులు.

*‘కాకి ముట్టిన తర్వాతే వడ్డన' అంది బామ్మ.*

‘అమ్మా ఇరవయ్ నిముషాల్లో కాకి ముట్టుకుంటుంది.  నాదీ పూచీ(గ్యారంటీ), కాకపోతే కాకి విషయంలో నా కమీషను యాభై రూపాయలు కాదనకూడదు.’  అన్నాడు పంతులు.

అందరూ అరవటం మానేసి రోడ్ మీద చూస్తున్నారు.  కాకి కోసం.

పది నిముషాల్లో ఆటో వచ్చి ఆగింది.

అందులోంచి చేతిలో ముసుగు వేసిన వస్తువుతో దిగాడు కామేశం.

అందరూ కామేశం చేతిలో వున్న దాన్ని చూస్తున్నారు.

*‘అదిగో కాకి కామేశం వచ్చాడు. కాకీ వచ్చింది.' అన్నాడు పంతులు.*

కామేశం లోపలికి వచ్చాడు.

*‘ఏమిటి ఆలస్యం’ అడిగాడు కామేశం పంతులుని.*

‘నాదేం లేదు నీదే ఆలస్యం' అన్నాడు పంతులు.

‘అయితే కానీ’ అంటూ ముసుగు తీసాడు కామేశం.  ఓ పెద్ద పంజరం.  రెండు అరలున్నాయి.  ఓ అర ఖాళీగా వుంది మరో అరలో కాకి వుంది.

అందరూ ఆశ్చర్యపోయారు.

కామేశం పంజరం తలుపు తీసాడు.

‘సోమయాజిగారు, ఆ పిండాల్ని పంజరంలో పెట్టండి.’  అన్నాడు పంతులు.

సోమయాజి అరటాకుతో సహా పిండాల్ని పంజరం మొదటి అరలో పెట్టాడు.

కామేశం పంజరం తలుపు మూసేసి, రెండో అర తలుపుని పైకి లాగాడు.

అందరూ అలాగే చూస్తున్నారు.

కాకి కామేశం వంక చూసింది.

కామేశం తల అడ్డంగా వూపాడు.

*కాకి పిండాలు ముట్టుకోలేదు.*

అందరూ ఆశ్చర్యపోయారు.

బామ్మకూడా చూస్తోంది.

*‘బామ్మా! ఏమయింది?  కాకి ముట్టుకోవడంలేదు.’* అడిగాడు రామ సోమయాజి.

*‘మీ తాతకి కోపం వచ్చిందిరా.’* అంది బామ్మ.

‘తాతయ్యా! త్వరగా తిను. మా అందరికి ఆకలేస్తోంది' అన్నాడు రామ సోమయాజి.

‘ఏంటి పంతులుగారు ఏమయింది కాకి ముట్టుకోవడం లేదు' అడిగాడు సోమయాజి

‘మీ అమ్మ గారన్నట్టు మీ నాన్న గారికి నీ మీద కోపం వచ్చి వుంటుంది.’ అన్నాడు పంతులు.

‘నాన్నా! ఏంటిది! ఏమైంది. నీ కోసం అయిదొందలు ఖర్చు పెట్టి పిలిపించాను.  ఇంకా ఏంటి?  అన్నాడు కాకితో సోమయాజి.  కామేశాన్ని చూసి ‘ఏమయింది కామేశం గారు' అడిగాడు సోమయాజి

*‘మీ నాన్న గారికి తీరని కోరికలేమన్నా వున్నాయేమో’* అన్నాడు కామేశం.

‘అవునండి! మా నాన్న గారికి ఓ కోరిక వుంది.  ఆయనకి సావిత్రిని పెళ్లి చేసుకోవాలని వుండేది.  లవ్ లెటర్ కూడా రాసానని నాకోసారి చెప్పారు. అలా ఆయన కోరిక తీరలేదు’ అన్నాడు సోమయాజి.

*‘ఆ విషయం నాకెప్పుడూ చెప్ప లేదే?'* అన్నారు బామ్మ గారు ఆశ్చర్యంగా.

‘బావుందమ్మా ఆయన లవ్ స్టోరీ మీకెందుకు చెబుతారు. చెబితే మట్టుకు మీరు వూరుకుంటారా... అందుకే అబ్బాయికి చెప్పి వుంటారు. ఏం సోమయాజి గారు’ అన్నాడు పంతులు.

‘నాన్నా... నీ కోరిక తీరేది కాదు.  ఎందుకంటే నువ్వూ పోయావు.  ఆ సావిత్రి కూడా చనిపోయింది.’ అన్నాడు సోమయాజి కాకితో.

‘వాళ్ళిద్దరూ పైన కలుసుకునే వుంటారు... అది కాదు గాని ఇంకోటి ఏదయినా వుందేమో ఆలోచించండి.’  అన్నాడు కామేశం.

‘నాకు తెలిసి ఏమీ లేవు.  నాన్నా నీకేమన్నా కోరికలుంటే నాకు గాని, అమ్మకి గాని కలలోకనిపించి చెప్పు తీరుస్తాం.  ఇప్పటికే ఆలస్యం అయ్యింది.  అందరూ ఆకలి తో కేకలు వేస్తున్నారు. తిను’ అన్నాడు సోమయాజి.

*‘ఆ... ఈ ఎడ్జెస్ట్మెంటు బాగుంది. దోష నివారణార్ధం దక్షిణ ఇవ్వండి’* అన్నాడు కామేశం.

*‘నాన్నా... కామేశం గారికి వెయ్యి రూపాయలు ఇస్తా తిను' అన్నాడు కాకితో సోమయాజి.*

కాకి మళ్ళీ కామేశం వంక చూసింది.

*కామేశం తల అడ్డంగా వూపాడు.*

*కాకి పిండాలు ముట్టుకోలేదు.*

‘దోషానికి సరిపోలేదేమో' అన్నాడు పంతులు’.

నాన్నా పదిహేను వందలు ఇస్తాను.  తిను అన్నాడు సోమయాజి.

*కాకి మళ్ళీ కామేశం వంక చూసింది.*

*కామేశం తల నిలువుగా వూపాడు.*

*ఆకలి మీద వున్న కాకి పిండాల్ని ఆబగా తినేసింది.*

అందరూ ఆనంద పడ్డారు.

*‘బామ్మా... తాతయ్య కోపం పోయిందే ... తినేసాడు'* అన్నాడు రామ సోమయాజి బామ్మతో.

*‘అవున్రా కన్నా’ అంది బామ్మ*

‘కామేశం గారూ మీరు కూడా భోజనమే చేసి వెళ్ళండి' అన్నాడు సోమయాజి

‘అమ్మా ఇక బ్రాహ్మలకి వడ్డించండి' అన్నాడు పంతులు.

*****

బ్రాహ్మల భోజనాలు అయ్యాయి. మిగిలిన వాళ్ళు తింటున్నారు.

సోమయాజి పంతులుగారికి తాంబూలంలో అయిదువేల నూట పదహారులు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టాడు.

‘అయ్యా మీ బోటి వాళ్ళు వుండబట్టి... ఇంకా ధర్మం నిలబడింది.’ అంటూ తీసుకుని దీవించి కాకి కమీషను యాభై ఇవ్వాలి.’ అన్నాడు పంతులు.

సోమయాజి పంతులుకి యాభై రూపాయలు ఇచ్చి,

‘కామేశం గారూ... ఇవిగో ఈ అయిదు వందలు ఈ కాకికి, ఈ పదిహేను వందలు మా నాన్న కోరికకి. ఈ రెండు వందలు మీ రాను పోను ఖర్చులు. ఈ మూడొందలు మీ సంభావన. అంటూ రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు సోమయాజి.

*‘మహా ప్రసాదం* ’ అంటూ తీసుకున్నాడు కామేశం.

కాకిని పంజరం లో సర్దుకుంటున్నాడు కామేశం.

కామేశం ‘అయ్యా ఎవరి తద్దినాని కయినా కాకి కావాలంటే నాకు ఫోన్ చెయ్యండి.  ఇదిగో నా విజటింగు కార్డు’ అంటూ విజిటింగు కార్డు ఇచ్చాడు సోమయాజికి.

సోమయాజి చూసి చదివాడు. ‘కా కా సర్వీసెస్.’ అంటే అడిగాడు.

*‘కా కా అంటే కానుపు నుంచి కాటి వరకు అంటే పురుడు, పుణ్యవచనం, బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాం, వడుగు, పెళ్లి, చావు, మాసికం, తద్దినం వరకు ఎం కావాల్నా సామానులతో సహా సప్లయి చేస్తాం.’* అన్నాడు కామేశం.

‘మీ పని బాగుందండి’ అన్నాడు సోమయాజి పదిహేను వందలూ గుర్తుకువచ్చి.

‘నాదే ముందండి... అంతా ఈ కాకిదే కాకిని నమ్ముకుని బతుకుతున్నా’. అన్నాడు కామేశం.

‘కాకిని నమ్ముకుని కాదు. కాకిని అమ్ముకుని బతుకుతున్నారు. అవునూ... కాకి కామేశం అంటే మీ ఇంటిపేరు కాకివారా? అడిగాడు సోమయాజి.

*‘కాదండి బాబూ... కూటి కోసం కోటి విద్యలని మంత్రాలు రాని నాకు మా అన్నయ్య కో ఐడియా వచ్చి, ఖాళీ గా వున్న నాకు ఇలా ఓ పంజరం, నాలుగు కాకులు ఇచ్చాడు.  దాంతో నాపేరు కాసుల కామేశ్వరరావు కాస్తా... కాకి కామేశంగా మారిపోయింది.*
‘బాగుందండి... బ్రతకడానికో బ్రతుకు తెరువు కావాలిగా. ఇంతకీ మీ అన్నయ్య ఎవరు? అడిగాడు సోమయాజి.

‘ఇంకెవరు... ఇంతవరకు మీ తండ్రి గారి తద్దినం పెట్టించిన ఆ కాసుల కాశీపతే’ అంటూ పంతుల్ని చూపించాడు.

‘అవునండి... వాడికి మంత్రాలు సరిగ్గా అబ్బలేదు. ఇదివరకు హైదరాబాద్ నిండా ఫుల్ గా చెట్లు వుండేవి. ఇప్పడు ఆ చెట్లు అన్నీ నరికి కాకులకి కూడా చోటు లేకుండా కనిపించిన ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టేశారు. దాంతో కాకులు వాలడానికి చెట్లెక్కడున్నాయి. ఎవడయినా పీనాసి వాడిని చూస్తే ఈ వెధవ ఎంగిలి చేత్తో కాని తోలడు... అనే వారు. అంటే కాకులు ఎంగిలి మెతుకులు తిని బతుకుతాయని కదా అర్ధం. మరి ఇప్పుడు వంటింట్లో మనం వాష్ బేసిన్ లో చెయ్యి కడగటం. దాంతో ఆ ఎంగిలి మెతుకులు కాస్తా డ్రైనేజి గోట్టాలలోకి పోయి అవికూడా వాటికి కరువయ్యాయి. దాంతో కాకులన్నీ సిటీ వదిలి పల్లెలకి పారిపోయాయి.

అందుకే తద్దినాలకి కాకులు దొరకటం లేదు. సిటీలో కాకులకి కరువొచ్చింది. కనబడకుండా పోయాయి’. అన్నాడు పంతులు.

అంతా విన్న బామ్మ గారు ‘ఇదిగో పంతులు పంజరం లో కాకిని పెట్టుకుని తద్దినాలు పెట్టించడం కాదు.  ఇలా తద్దినాలు పెట్టించిన ప్రతీ చోట నాలుగు మొక్కలు నాటించు. రేపు నువ్వు పోయాకా... నీ పిండం తినడానికి నాలుగు కాకులయినా వస్తాయి.’ అన్నారు.

అందరూ నవ్వారు.

దాంతో పంతులు కళ్ళముందు కాకులు తిరిగాయి.

(చెట్లు నరికి ఇళ్ళూ... పెద్ద పెద్ద భవనాలు కట్టడంతో కొన్నాళ్ళకి పట్టాణాలన్నీ కాంక్రీట్ జంగిల్ గా మారి సిటీల్లో ఏ పక్షులు కనబడవు. పక్షులని చూడాలంటే ఏ జూ పార్క్ కో... పచ్చదనం... పంట పోలాలు వుండే పల్లెలకో వెళ్ళాలి. అందుకని చెట్లని పెంచుదాం. పక్షులని కాపాడుదాం.)

*********************

ఒక్కసారి ఆలోచించండి


Dr VS Reddy హన్మకొండ గారి
హోమియో వైద్యం వల్ల ఎవరైనా ఇబ్బందిపడి కంప్లైంట్ ఇచ్చుంటే తప్పక చర్య తీసుకొనివుండొచ్చు.
కానీ
అలా ఎటువంటి పిర్యాదు లేకుండా ఏకపక్షంగా
ఒక హోమియో వైద్యుని ఆసుపత్రిని హనుమకొండ, తెలంగాణాలో సీజ్ చేయడం దారుణం.

హోమియోపతి వైద్యవిధానం జబ్బుల పేరుతో కాదు, రోగి లక్షణాలపై జరుగుతుంది.

గతంలో
అల్లోపతి వైద్య విధానంలో చికత్సలేనేలేదు అని చెప్పే ఎయిడ్స్ కి
రామంతాపూర్ లోని ప్రభుత్వ హోమియో కాలేజీలో వైద్యం ఉంది అని, తమ హోమియో వైద్యంతో చాలామంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో మంచి గుణం కనబడిందని టీవీల్లో, పేపర్లలో వార్తలు చూసాం.
మరి అప్పుడెందుకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ స్పందించలేదు ?

అల్లోపతి వైద్యవిధానంలో ఏ వైరస్ జబ్బుకు వైద్యం లేదు.
కేవలం ముందు జాగ్రత్తగా కొన్నింటికి వాక్సిన్ తప్ప.
అది ఆ వైద్యవిధానం పరిమితి.

హోమియోపతిలో అలాంటి పరిమితి వీటికి లేదు.
ఎందుకంటే
ఒక వ్యక్తిలో కనబడే శారీరక, మానసిక అనారోగ్య లక్షణాల మీద ఆధారపడి హోమియో వైద్యం ఉంటుంది కాబట్టి.
కానీ
ఆ అనారోగ్య లక్షణాన్ని ఒక సూక్ష్మక్రిమి కారకంగా  చూసి వైద్యం చేసేదే అల్లోపతి/ఇంగ్లీష్ వైద్యం.

ఉదాహరణకు,
ప్రస్తుత 🅒🅞🅥🅘🅓19 పాండెమిక్ పరిస్థితుల్లో చేతులెత్తేస్తున్న అల్లోపతిని ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలి ?
మా వైద్య విధానంలో కొరోనా కే కాదు,
ఏ వైరస్ జబ్బుకు స్పష్టమైన మందులు లేవు, ఉపశమనం తప్ప,
తీవ్రమైన కండీషన్లోని వారికి మేం వైద్యం చేయలేము,
అని స్పష్టంగా అలోపతి వైద్యులు చెబుతున్నపుడు
హోమియోపతి,
ఆయుర్వేదిక్ వైద్యవిధానాల్లో మేలు జరుగుతున్నపుడు
ఎందుకు
హోమియోపతి, ఆయుర్వేదిక్ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నారు ?

మా దగ్గర కొరోనాకు మందులు లేవు,
వైద్యం లేదు అంటూనే,
లేని మందులతో కొరోనాకు చికిత్స చేస్తూ అదృష్టం కొద్దీ బాగవుతున్న కొరోనా భాదితుల నుండే కాక, చనిపోయిన వారికి కూడా లక్షల్లో బిల్లులు వేస్తూ జనాల్ని బెంబేలేత్తిస్తున్న వారిని వదిలేసి,
కేవలం వందల రూపాయల ఖర్చుతోనే శక్తివంచన లేకుండా వైద్యం చేయడానికి ముందుకొస్తున్న
హోమియోపతి
ఆయుర్వేద వైద్యులపై
రాష్ట్రాల వైద్యఆరోగ్య శాఖల దాడులు, చర్యలు దేనికి సంకేతం ?

హోమియోపతి,
ఆయుర్వేదిక్ వైద్యశాస్త్రాలు కూడా
అల్లోపతి వైద్యశాస్త్రంలా ఐదున్నర సంవత్సరాల వైద్య చదువు కాదా ?
దేశంలో ప్రతీ యూనివర్సిటీలో అర్హత కలిగిన వైద్యశాస్త్రాలు కావా ?

హోమియోపతి,
ఆయుర్వేద వైద్యవిధానాల్లో వైద్యం అల్లోపతితో పోలిస్తే ఖరీదు చాలాచాలా తక్కువ.

గత 5నెలలుగా కొరోనాతో ప్రజల కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణమైన ఏకపక్ష నిర్ణయాలు మంచిది కాదు.

చర్యలు తీసుకోవాల్సింది
ప్రార్ధనలు, మంత్రాలూ, తాయెత్తులతో కొరోనానే కాదు చనిపోయిన మనిషిని సైతం బతికిస్తాం అంటూ జనాల్ని మోసం చేస్తున్నవారి మీద.
వాట్సాపులో వచ్చిన పోస్టు

I SUPPORT Dr V.S REDDY
*******************

జీవ/శాస్త్ర విజ్ఞానం🍁


👉🏼ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తను ఖాళీగా ఉన్నాడా లేడా అని కనుక్కుని ఆ వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. మీ మన కోసం.
  👉🏼తల్లి: నాయనా పూజా పునస్కారాలు ఐనాయా?
కుమారుడు: ఇలా చెప్పారు.
అమ్మా, నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో .. మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు. అలాంటి నేను పూజలు చేయడం ఏం బాగోదు అన్నాడు.
అందుకు అతల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా. కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవే కదా నాన్నా.....అన్నది.
కొడుకు వ్యంగ్యంగా అలాగాఅమ్మా, నాకు తెలీదే అని అన్నాడు.
అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. 
👉🏼నీకు శ్రీమహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....
కొడుకు ఆసక్తిగా అవును తెలుసు,   దానికి ఈ  జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం?  అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ తల్లి...హా సంబంధం ఉంది. ఇంకా నువ్వు,  నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.
మొదటి అవతారం మత్స్య అవతారం.అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. ఇది నిజమా కాదా.
  కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.
తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు.దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా గమనించాలి.అంటే ఉభయచర జీవులు లాగా. తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.
మూడవది వరాహ అవతారం అంటే పంది.ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తు కు తెస్తుంది.
ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి, సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.
ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు. నీకు తెలుసు కదా మానవులు మొదట హోమో erectes మరియు  హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులుగా వికాసం చెందారు. కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.
ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు , గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.
ఇక ఏడో అవతారం రామావతారం. మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు పాటించాడు, ఆయనే సమస్త కుటుంబ  బంధుత్వ విలువలకూ అది పురుషుడు.
ఇక ఎనిమిదవది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు, ప్రజా పాలకుడు, ప్రేమించే స్వభావి. అతడు సమాజ  నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. అదే సమాజములో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలను అన్నీ నేర్పినవాడు.
కొడుకు ఆశ్చర్యం , విస్మయంతో వింటున్నాడు.
ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ
 తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం. ఆయన నృసింహ అవతారం నుండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు.  అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటూ చేసే ఆవిష్కరణలకు మూలం.
ఇక వచ్చేది కల్కి పురుషుడు. అతను నీవు  ఏ మానవునికై వేతుకుతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.
కొడుకు తన తల్లి  మాటలు  అవాక్కాయి  వింటున్నాడు
అప్పుడు ఆ కొడుకు ఆనంద భాష్పాలతో అమ్మా, సనాతన  ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మమని చాలా బాగా తెలిపావమ్మా అన్నాడు.
👉🏼ఆత్మీయులారా !!!
మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు,
ఇత్యాదివన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృక్కోణం మారాలి.  మీరు ఎలా అనుకొంటే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు,  లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్త్రీయతతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. ఇకనైనా మేలుకోండి. ఋషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని మర్మాన్నీ గ్రహించండి మరియు పాటించండి తద్వారా లభించే ఆనందాన్ని అనుభవించండి.
అందుకుగానూ, ముందు మనం మారుదాం తరువాత ఈ యుగమే  మారుతుంది...!!!
*********************

*కరోనా కూల్చలేని బలమైన తులసికోట!*


అనంతసాహితి -ఆయుర్వేదం పంచమవేదం-006
-----------------

చనిపోయే వారికి తులసి తీర్థం ఎందుకుపోస్తారు?
అతిముఖ్యమైన రోగనిరోధకశక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే పవర్ హౌస్ ఎక్కడ ఉంది?
+++++++++++++++++

కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోవడం తప్పు కాదు. ఎందుకంటే వాటి సమాధానాలు మహారహస్యాలు అయినప్పుడు, ఆ సత్యాలు తెలిస్తే తమ మనుగడకే ముప్పు అయినప్పుడు మహారాక్షసులు ఆ అక్షరసత్యాలను భూస్థాపితం చేస్తారు. అలా పాతిపెట్టిన రహస్యాల్లో ఈ రెండు ప్రశ్నలూ ఉదాహరణ మాత్రమే. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే భారతీయులను ఎవరు అజ్ఞానంలో ముంచివేసి తమపబ్బం గడుపుకుంటున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు.

గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు అష్టాదశమహాపురాణాలు అనువదిస్తూ శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణంలోని ప్రకృతిఖండం తెలుగు చేశారు. ఈ ఖండం చాలా ప్రధానమైంది. అనంతసాహితికి కీలకమైన పితృదేవతారహస్య ప్రచారంలో అతిముఖ్యమైన స్తోత్రాలు ఇందులో ఉన్నాయి. అంతేకాక స్వధా మాత జన్మరహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటుగా మహాసాధ్వి తులసీదేవి మాహాత్మ్యం కూడా ఇందులో ఉంది. ఈ భాగాలు అనువదిస్తూ ఆంధ్రవ్యాసులవారు ఎన్నో రహస్యాలు చెప్పారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా విజృంభిస్తున్న నేటి తరుణంలో ఎవరు అదృష్టవంతులు అంటే   తిప్పతీగ నుంచీ తయారు చేసే  గిల్లోయ్ ఘనవతి, అశ్వగంధ కాప్యూల్స్ (లేదా చూర్ణం), నువ్వుల నూనె (లేదా తినే కొబ్బరినూనె), తాంబూలం వేసుకునేవారు, ఆయిల్ పుల్లింగ్ చేసేవారు. వీరంతా అదృష్టవంతులు అయితే వీరిలో మహాదృష్టవంతులు తులసీమాతను సేవించేవారు.  ఎందుకంటే కరోనా కాలంలో చాలా మందికి తెలియని రహస్యం ఒకటుంది.

గత ఏప్రెల్ మొదటి రోజునుంచీ తులసీ ఘనవటి దొరకటం లేదు. ముఖ్యంగా పతంజలి సంస్థ ఉత్పత్తుల్లో తులసీ ఘనవతి నేటికీ ఔట్ ఆఫ్ స్టాకే అవుతోంది. కేవలం పతంజలి మాత్రమే కాక శ్రీశ్రీ, డాబర్, బైద్యనాథ్, జండూ, హిమాలయ వంటి కంపెనీల నుంచీ కూడా తులసి ఉండే మందులు గత మూడు నెలలుగా దొరికిన వారిది పండుగ. దొరకని వారు దురదృష్టంతులు. ఇది కేవలం ఆయుర్వేద ప్రేమికులకు మాత్రమే తెలిసిన సంగతి. ముఖ్యంగా ఉత్తరాదిలో డేగల్లా తులసీ వస్తువులు ఎగరేసుకుపోతున్నారు.

తెలుగు వారికి పరిచయం లేని ఆయుర్వేద తులసి గురించి గురుదేవుల అనుగ్రహభాషణాల నుంచీ తెలుసుకుందాం.

ఆయుర్వేదం వైద్య విధానంలో అతి ప్రధానమైంది ఓజస్సును పెంపుదల చేయడం. ఈ వైద్యరహస్యం నేటికీ ఆంగ్లవైద్యులకు తెలియదు. అందరికీ రోగనిరోధక శక్తి గురించి తెలుసు. కానీ ఈ శక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే కర్మాగారం ఎక్కడ ఉందో అల్లోపతి వారికి తెలియదు. శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేసేదే ఓజస్సు. ఆయుర్వేదం ఈ ఓజస్సు అనే అణువిద్యుత్తుకర్మాగారంలో సమిధలు వేయడం ద్వారా వ్యాథులను అంతం చేస్తుంది. అంటే శరీరంలో ఓజస్సును పెంచితే, అది రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. ఈ రోగనిరోధక శక్తి వ్యాథులతో పోరాడి వాటిని శరీరం నుంచీ పారదోలుతుంది. ఈ రహస్యం నేటికీ ఆయుర్వేదం దగ్గర మాత్రమే ఉంది.

దీన్నే ఆయుర్వేద గ్రంథాలు ఈ విధంగా చెప్పాయి.
---------------------------------------------------------
తేజో యత్సర్వంధాతూనామోజస్తత్ పరముచ్యతే
మృదు సోమాత్మకం శుద్ధం రక్తమీషత్సపీకమ్
యత్సారమాదౌ గర్భస్య యచ్చ గర్భరసాద్రసః
సంవర్తమానం హృదయం సమాశ్రయతి యత్పురా
ఓజస్తు తేజో ధాతూనాం శుక్రాంతానాం పరం స్మృతం
హృదయస్థమపి వ్యాపి దేహస్థితినిబంధనమ్
న్నిగ్ధం సోమాత్మకం శుద్ధమీషల్లోహితపీతకమ్
యన్నాశే నియతం నాశో యస్మిం స్తిష్ఠతి తిష్ఠతి
నిష్పద్యం తె యతో భావా వివిధా దేహసంశ్రయాః
ఓజః క్షియేత కోపక్షుద్ధ్యానశోకశ్రమాదిభిః
బిభేతి దుర్బలో2భీక్ష్ణం ధ్యాయతి వ్యథితేంద్రియః
విచ్ఛాయో దుర్మనా రూక్షో భవేత్ క్షామశ్చ తత్క్షయే
జీవనీయౌషధక్షీరరసాద్యాస్తత్ర భేషజమ్
ఓజోవివృద్ధౌ దేహస్య తుష్టిపుష్టిబలోదయః


(శరీరంలో ఉన్న అన్నిధాతువులకూ మూలం ఓజస్సు, ఇది చాలా ఉత్తమమైనది. చాలా మృదువైనది. నీటి తత్త్వం ఉన్నది. పరిశుద్ధమైనది. ఎరుపు పసుపు మిశ్రమ రంగులో ఉంటుంది. గర్భంలో శుక్రశోణితాల కలయికతో ఏర్పడే మొదటికణం జీవికి ప్రధానమైనది. అంటే స్త్రీ అండం, పురుష వీర్యం ఫలదీకరణం చెందిన తరువాత ఏర్పడిన పిండకణంలో కూడా ఈ ఓజస్సు ఉంటుంది. అప్పటి నుంచీ ఇదే హృదయంగా (కేంద్రంగా) ఉంటుంది.  ఇదే శరీరంలోని అనేక అంగాలను, భాగాలను ఏర్పరస్తుంది. కనుక శరీరం మొత్తం ఆవరించి, దీని అదుపులో ఉంటుంది. దీని ద్వారానే శరీరం మొత్తం పనిచేస్తుంది. ప్రాణ శక్తి మొత్తం ఈ ద్రవపదార్థం మీదే ఆధారపడి ఉంటుంది.

శరీరంలో ఓజస్సు నష్టం అయ్యే కొద్దీ కోపం పెరుగుతుంది. ఆకలిలో తేడాలు వస్తాయి. ధ్యానం చేయలేరు. దుఃఖం పెరుగుతుంది. శరీరం తొందరగా అలసిపోతుంది. ఎక్కవగా భయం ఏర్పడుతుంది. ఇంద్రియాలు అదుపులో ఉండవు. ఫలితంగా మానసిక వ్యథ పెరుగుతుంది. డిప్రషన్ లోకి వెళిపోతారు. శరీరం కాంతి రహితం అవుతుంది.

ఈ ఓజస్సును పరిరక్షించేవి, వృద్ధి చేసే పదార్థాలను తీసుకోవాలి. ఇది ఔషథాల ద్వారా పెరుగుతుంది. తీపి పదార్థాలతో పెరుగుతుంది. పాలలో ఉంటుంది. మాంసకృత్తులలో ఉంటుంది. నెయ్యిమొదలైన వాటిలో ఉంటుంది.

పై వస్తువులను సేవించడం వలన మరలా శరీరంలో సంతోషం, బలం, ధాతుపుష్టి పెరుగుతాయి. వీర్యవంతులు అవుతారు.)
---------------------------------------------------------

ఆయుర్వేదం శరీరానికి కీలకమైన ఓజస్సును కనుగొంది. నేటికీ ఆంగ్ల వైద్యం దీన్ని సాధించలేదు. కనుకనే రోగి చెప్పే ప్రతీ లక్షణానికి ఒక మందు చొప్పున వేస్తూ క్వింటాళ్ళ కొద్దీ తినిపిస్తుంది. ఈవిధంగా వారు ఇచ్చే మందులు మింగి హరాయించుకోలేక మైఖేల్ జాక్సన్ అనే డాన్సర్ చనిపోయాడు. అతని శవాన్ని పరీక్షిస్తే జీర్ణం కాని అనేక మందుబిళ్ళలు కనిపించాయి.

నేటికీ లక్షణాలకు వైద్యం చేస్తూ ఆంగ్ల వైద్యం కారణాన్ని చేరుకోలేదు. దీనికి సంపూర్ణ వ్యతిరేకంగా ఆయుర్వేదం శరీరంలో రోగనిరోధక శక్తిని కల్పించే పవర్ హౌస్ను పనిచేయించే మందులు కనిపెట్టింది.

ఇటువంటి మందులు ఆయుర్వేదంలో చాలా కీలకం.

అవే అశ్వగంధ, అమృతం అనిపిలిచే తిప్పతీగ, ఉసిరి వంటివి. వీటికి తోడుగా మరో మహిమాన్వితమైన మూలిక ఉంది. అదే తులసి. ఆధ్యాత్మికంగా కూడా తులసికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆయుర్వేదంలో కూడా తులసికి అంతే ప్రాధాన్యత ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే శరీరం అనే జీవ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన యురేనియం వంటిది తులసి.

నిజానికి మరణించేవాని నోట్లో తులసి తీర్థం పోయడం అంటే నాలుగు చేతుల వాడిని చేర్చే ద్రవం కాదు. రోగి శరీరంలో ప్రాణవాయువులను కూడా పనిచేయించే ఓజశ్శక్తిని తిరిగి ప్రజ్వలింప చేసేటటువంటి జలకర్మ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గుండె ఆగిపోయిన వ్యక్తికి ఆధునిక వైద్యులు ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్ వంటిది. ఈ విధంగా తులసి తీర్థం పోయడం వలన కొట్టుమిట్టాడుతున్న కొనప్రాణదీపంలో మరలా నూనె పోసి వత్తిపెద్దది చేయడం వంటిది. దీన్నే దింపుడు కళ్ళం ఆశ అంటారు. దీనితరువాత కూడా రోగి కోలుకోపోతే అతడు మృతుడైనట్టు లెక్క.

చాలా ఆశ్చర్యమేమంటే తులసిలోని ఈ పవర్ హౌస్ లక్షణాలు ఆధునిక వైద్యలు గ్రహించారు. అయితే ఇది బయటికి చెబితే తమ వైద్యవ్యభిచారం బయటపడుతుందని నొక్కిపెడుతున్నారు. ఆధునిక పరిభాషలో   ఎడాప్టోజెన్స్ పేరుతో కొందరు  తులసి, ఉసిరి, తిప్పతీగ వంటివాటి మీద పరిశోధనలు చేస్తున్నారు. అయితే వీరు అత్యంత ప్రమాదకారులు. ఎందుకంటే వీరు రేపు పసుపు మాదిరిగా తులసి, ఉసిరి కూడా మావే అని దోపిడీ లైసెన్సులు పొందుతారు. వీటి మీద మందులు చేయరాదని శాసిస్తారు.

తులసిని సేవించడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

మార్చి నెల నుంచీ మేము అనేక మందిని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు, సైనికులు, పారిశుధ్య కార్మికులు, వైద్యులు, వైద్యసిబ్బంది, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు, డ్రైవర్లు, బ్యాంకు ఉద్యోగులు, వ్యాపారులు. ఇలా ఎన్నో వర్గాల వారిని పరిశీలించాము. వీరందరిలో మానసికంగా ఒక భయం గుర్తించడం జరిగింది. ఇది మానసిక వత్తిడి వల్ల కలుగుతున్న భయం. దీన్ని మానసిక శాస్త్రంలో అనేక విధాలుగా విశ్లేషించినా సూక్ష్మంగా చెప్పాలంటే కరోనా భయంవల్ల వచ్చిందని చెప్పవచ్చు. కరోనా భయం వల్ల వస్తున్న మానసిక సమస్యలు.

ఇటువంటి వారిలో సి క్లాసు ఉద్యోగులు నిర్భయంగా ఉంటున్నారు. హాయిగా పనిచేస్తున్నారు. సాయంత్రానికి స్వర్గం చేరుకుంటున్నారు. కానీ మధ్యతరగతి ఎగువ తరగతి ఉద్యోగులు ఈ విధమైన మానసిక నరకయాతన పడుతున్నారు. వీరికి అతి తేలిక పరిష్కారం ఆయుర్వేదంలో ఉంది. అది తులసి నుంచీ లభిస్తుంది.

పైన చెప్పిన ఉద్యోగులు తమ వద్ద ఎప్పుడూ పదో ఇరవయ్యో తులసీ దళాలు ఉంచుకోవాలి. వీటిలో కొన్నింటిని వాటర్ బాటిల్లో నలిపి వేసి ఉంచుకోవాలి. మరికొన్నింటిని చిన్న భరిణలోనో జిప్ప్డ్ ప్లాస్టిక్ చిన్న కవర్ లోనో పెట్టుకోవాలి. తాము తాగే టీలో వాటిని వేసుకోవాలి. అన్నంతిన్నతరువాత, టిఫెన్ చేసినప్పుడూ మౌత్ రిఫ్రషర్గా ఒక తులసీదళం నోట్లో వేసుకోవాలి.

గృహిణులు కూడా నీటిలో ఈ తులసీదళాలు వేసి ఉంచుకోవాలి. ఇలా చేయాలంటే తులసికోటల సంఖ్య పెంచుకోవాలి. నిర్ణీత ప్రమాణాన్ని మించి మొక్కల నుంచీ తులసి తుంచకూడదు. కుటుంబ సభ్యులు అందరినీ తరచుగా తులసి ఉన్న నీటిని తీసుకునేలా చేయాలి. దీని వల్ల ప్రధానంగా మానసిక సమస్యల నుంచీ దూరం అవుతారు. అందువల్ల ఇతర సమస్యలు రావు.

ఈ చిట్కాలు ఆయుర్వేదం చెప్పిందని భారతప్రభుత్వ ప్రత్యామ్నాయ వైద్యాభివృద్ధి సంస్థ బుద్ధి ఉన్నరోజుల్లో చెప్పింది. (ఇప్పుడు బుద్ధిలేని దయింది.)

దీనికి ప్రత్యేకమైన కారణాలు చాలా ఉన్నాయి.

తులసి అద్భుతమైన స్ట్రెస్ రిలీవర్. మానసిక వత్తిడిని క్షణంలో దూరం చేస్తుంది. అజీర్ణతను నిరోధించి ఆహారం జీర్ణం అయ్యేందుకు సహకరిస్తుంది. ఈ విధంగా చెప్పుకొంటూ పోతే ఒక పుస్తకం చాలదు. మహా ఉద్గ్రంథాలు వ్రాయాల్సి వస్తుంది. కనుక క్లుప్తంగా చెప్పాలంటే శరీరంలో రోగనిరోధక శక్తిపెంచి, రక్త మాంస ఎముక మూలుగు చర్మ కేశాది సమస్తధాతువుల చేతా పనిచేయించే పవర్ హౌస్ ఓజోస్సును క్షణంలో పెంచుతుంది.

కనుక నిన్నమొన్నటి వరకూ అమ్మానాన్నలు తాతమామ్మలు తిడతారని  తులసిమొక్కను కోటలో కాకుండా విరిగిపోయిన ప్లాస్టిక్ పాత్రల్లో పెంచినవాటిని  విరివిగా ఎపార్ట్ మెంట్లలో పెంచుకొని ప్రతి ఒక్కరూ కనీసం పది తులసి దళాలు స్వీకరిస్తే కరోనా కాదు కదా దాని బాబులు, అక్రమబాబులు వెయ్యిమంది కూడా ఏమీ చేయలేరు.

లేదా, మీకు ఓపిక ఉంటే ఆయుర్వేద మందుల దుకాణాలు గాలించి తులసీ ఘనవటీ సాధించండి. లేదా తులసితో తయారు చేసిన ఏ ఔషథం దొరికినీ సేవించండి. అయితే ఇవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఉత్తరాదిలో ఉత్పత్తి అవుతున్న ఈ తులసీ ఘనవటి అక్కడే ఖర్చైపోతోంది. వారి పంపిణీ ఇక్కడి వరకూ రావడంలేదు.

తులసి ఒక నమ్మకం కాదు. వైద్య శాస్త్ర నిజం. ఒక మతానికి పరిమితం అయింది కాదు. విశ్వమానవశ్రేయస్సు కోసం పరమాత్మ ఇచ్చిన దివ్యఔషథం.

తులసి మానసిక వ్యాధులకు పనిచేస్తుంది. కిడ్నీని, లివర్ ను కాపాడుతుంది. చర్మవ్యాథుల నుంచీ కాపాడుతుంది. జ్వరాలు రానివ్వదు. ఊపిరితిత్తులు, గుండెజబ్బులు, కేన్సర్ వంటివాటిని చేరనివ్వదు. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

నిజానికి గత మూడు నెలల నుంచీ ఈ అంశాలు చెబుతున్నారు. వీటిని పాటిస్తున్నవారు నిర్భయంగా ఉన్నారు. కనీసం నేడైనా దీన్ని పాటిస్తే రేపు సుఖంగా ఉండవచ్చు. వంగదేశంలో సామాజికవ్యాప్తి మొదలైందనే వార్తల నడుమ ఇదే చివరి అవకాశం. కనుక కరోనాతో యుద్ధం చేయాలంటే ఒక బిళ్ళ గిల్లోయ్ ఘనవటి, ఒక గోళీ అశ్వగంధ, పదో ఇరవయ్యో తులసీ దళాలు, నాలుగు చుక్కల నువ్వుల నూనె  చాలు. మొత్తం మీద 4 రూపాయలు మించదు. కాదంటే? లాల్ దర్వాజా దగ్గర నుంచీ లాల్ ఖిల్లా వరకూ అన్నీ  అమ్ముకోవడానికి సిద్ధం అయినా కరోనాను జయించలేరు. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఆంగ్లవైద్యబకాసురులకు చాలవు.

 చివరిగా ఒకమాట,
‘‘ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామ నామాసి విశ్వమసి, విశ్వాయుః సర్వమసి ......‘‘

 అనే మంత్రాన్ని రోజుకు మూడు సార్లు స్మరించేవారున్నారు. వేలకొలదీ సంవత్సరాల నుంచీ ఉన్న ఆయుర్వేదం ఈ మంత్రంలోని ఓజస్సును ప్రమాణంగా చేసుకొని దీన్ని అందించే తులసిని పరదేవతగా చేసి పెరటి వైద్యం చేస్తోంది.

ఈ సమయంలో తులసి ప్రాధాన్యలతో పాటు ఆయుర్వేద రహస్యాలు మరిన్ని ముందు ముందు తెలుసుకుందాం.

స్వామి అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
గుంటూరు, హైదరాబాద్.
*******************************************

*పిల్లలందరికీ నాలుగు మాటలు*

ఏమిటంటే?
1.
మీరు భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
మీకు హితమైందే తినాలి. మితంగా తినాలి.
హితం కాని ఆహారాన్ని తినకూడదు.
మితాన్ని దాటి తినకూడదు.

2.
మీరు గాలి పీల్చి విడిచిపెడుతున్నారు కాబట్టి,
గాలి పీల్చి విడిచిపెట్టడాన్ని,
క్రమబద్ధమైన పద్ధతిగా గాలి పీల్చి, విడిచిపెట్టడాన్ని 'ప్రాణాయామం' అంటారు.
ఒక క్రమం లేకుండా చేస్తే, అది ప్రాణాయామం కాదు.
దాని వల్ల నీకేమీ ప్రయోజనం లేదు.
"నీకు రకరకాలైనటువంటి ఆవేశకావేశ క్రోధాలు రావడానికి కారణం,
నువ్వు సరైనటువంటి శ్వాస గమనాన్ని క్రమబద్ధీకరించుకోకపోవడమే"!
- అని మన యోగశాస్త్రం స్పష్టంగా చెప్పింది కాబట్టి,
పిల్లలందరూ చిన్నప్పటి నుంచి, ఈ ప్రాణాయామాన్ని....
ప్రధానంగా అనులోమ, విలోమ, సమ ప్రాణాయామాన్ని...
చిన్నప్పటి నుంచి అందరూ నేర్చుకోవాలి.
దానివలన మీరు 'ఉచ్ఛారణ' ఎక్కువ సేపు నిలుపుకోగలుగుతారు.
ముఖ్యంగా పెద్ద పెద్ద పాటలు, పెద్ద పెద్ద శ్లోకాలు, పెద్ద పెద్ద పద్యాలు...
అట్లా పాడేటప్పుడు, కీర్తనలు పాడేటప్పుడు...
ఎక్కువ సేపు శ్వాసను నిలుపుకోవల్సిన అవసరం వుంటుంది.
అది మీకు అప్పుడు సాధ్యమౌతుంది.
కాబట్టి, రోజులో తప్పనిసరిగా,
5, 10, 15 నిమిషాల పాటు ప్రాణాయామానికి కేటాయించి,
దాని మీద దృష్టి పెట్టి, అభ్యాసం చేస్తే,
అది మీకు జీవితమంతా ఉపయోగపడుతుంది.
ఇది రెండవ మాట.

3వ మాట:-
సరియైనటువంటి జపం.
మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు.
ఆ ఇష్టదైవ నామస్మరణ ఒక ఐదు నిమిషాలు
తప్పక రోజూ నిద్రపోయే ముందు, నిద్రలేవగానే...
తప్పక నామస్మరణ (జపం) చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇది 3వ మాట.

4వ మాట:-
తప్పక సరియైనటువంటి గ్రంథాలు చదవటం.
సరియైన గ్రంథం చదివితే,
అది 100 మంది స్నేహితులతో సమానమైనటువంటిది.
మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నా,
ఒక గ్రంథం అందించేటటువంటి,
ప్రామాణికమైన గ్రంథం అందించేటటువంటి,
ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం,
ఒక మహర్షుల చరిత్రలు, ఒక రామకృష్ణ బోధామృతం,
ఒక అరవింద సూక్తులు,
ఒక భగవాన్‌ రమణుల యొక్క ఉపదేశ సారం...
వారి యొక్క సద్దర్శనం,
అరవిందుల యొక్క పూర్ణయోగం...
ఇట్లాంటి అనేకమైన గ్రంథాలు,
వీటన్నింటిని మన సనాతన ధర్మం మనకు అందించింది.
(వీటిని తప్పక మనం....)
ఆది శంకరులు అందించినటువంటి
అద్వైత స్తోత్ర రత్నాలు ఎన్నో వున్నాయి!
వీటన్నింటినీ తప్పక మీరందరూ...
రాబోయే రోజులలో, భవిష్యత్‌ కార్యక్రమాలలో....
మీరందరూ నేర్చుకుని,
భావితరాలకి ఆదర్శవంతమైనటువంటి,
మహానుభావులుగా తీర్చిదిద్దాలని,
జ్ఞాన వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని,
ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ....

హరిః ఓం
శ్రీ గురుభ్యోన్నమః
హరిః ఓం

*కాసేపు మళ్లీ పాతరోజుల్లోకి*

*‘ప్రయాణం టైమవుతోంది. బట్టలు సర్దుకోవాలబ్బాయ్!’*

తను నన్నిలా ‘అబ్బాయ్’ అని పిలిచిందంటే తన మూడ్ బావున్నట్టే! అదొక లిట్మస్ టెస్ట్. మళ్లీ తనే అంది..

‘మా ముగ్గురివీ అయిపోయాయి సర్దుకోడం. నువ్వెన్ని జతలు పెట్టుకుంటున్నావు? అంతాచేసి అయిదురోజులేగా ఉండేదీ? ఆ ఎర్రపెట్టి సరిపోతుందిగా?’

రాపిడ్ ఫైర్ ప్రశ్నలు, సమాధానాలు అయిన తరవాత నా బట్టల అల్మైరా తెరిచి ఓ ఆరేడు చొక్కాలూ, పేంట్లూ తీసి మంచమ్మీద పెట్టుకున్నాను.

ఇప్పుడంటే ఒళ్లొచ్చిందిగానీ అయిదారేళ్లక్రితం మరీ అరవింద్ స్వామిలా కాకపోయినా రమేష్ అరవింద్ లా వుండేవాణ్ణి. అప్పుడు కొన్న బట్టలే ఓ ఇరవై జతలదాకా వుంటాయి. ఆ చొక్కాలు ఇప్పుడేసుకుంటే ‘పిటపిటలాడే పచ్చివయసూ పైపైకొచ్చిందీ...’ పాట గుర్తొస్తుంది ఎవరికైనా! పేంట్లన్నీ సర్కస్ లో మోటార్ సైకిల్ ఫీట్లు చేసేవాళ్ల పేంటుల్లా టైట్ గా వుంటాయి.

అలాగని చూస్తూ చూస్తూ అంతంత డబ్బోసి కొన్న బట్టల్ని ఎవరికైనా ఎలా ఇచ్చేస్తాం? అవన్నీ కొత్తవాటితో కలిసి బీరువా నిండా ఇండియా పాకిస్తాన్ మ్యాచప్పుడు ఈడెన్ గార్డెన్స్‌లో జనాల్లా కిక్కిరిసి వుంటాయి.

మానవుడు ఆశాజీవి. కాదంటారా? ఎప్పటికైనా మళ్లీ సన్నబడి ఆ బట్టలన్నీ వేసుకోకపోతానా అని ఏమూలో స్పెషల్ స్టేటస్ లాంటి చిన్న ఆశ! కానీ అమితాబ్ బచ్చన్ పొట్టిగా అయినా అవుతాడేమోగానీ నేను సన్నబడనుట! ఇది మా ఇంటావిడిచ్చిన శాపం!

‘అయినా చంద్రమోహన్లా ఇలా బానేవున్నావులెద్దూ!’ అనికూడా అనేస్తుంది ఒక్కోసారి మరీ ముద్దొస్తే!

బీరువాలోకి తొంగిచూసి ‘బాబోయ్ ఎన్ని బట్టలో! మీరు వేసుకోనివి పక్కనబడేస్తే ఆ వాచ్ మన్ కైనా ఇచ్చేస్తాను. ఎందుకలా బీరువాల నిండా?’  అంది!

జలుబొచ్చినపుడు రోజూ మూడుపూటలా వేసుకునే యాంటీబయాటిక్ మాత్రల్లా రోజుకి మూడుసార్లు వేసుకునే గొడవే ఇది! ముందుగానే అనుకుంటాం ‘భోజనానికి ముందేసుకుందామా తరవాతా?’ అని!

సరే, తనని సమాధానపరచడం కోసం ‘పొట్టివానికి పుట్టెడంగీలని ఊరికే అనలా!’ అనన్నానో లేదో ‘ఈమాట మన పెళ్లయినప్పటినుండీ వింటున్నాగానీ త్వరగా సర్దుకో!’ అనేసి గదిలోంచి నిష్క్రమించింది.

బ్లాక్ జీన్స్ వుండాలి. ఉతకడానికేసిందా? అదయితే చాలా సౌకర్యంగా వుంటుంది.

ఈ కిల్లర్ జీన్స్ మీదకి బ్లూషర్టేదబ్బా? ఆఁ, వుంది. అయ్యో! పై బటన్ ఊడిపోయిందే! సరే, ఈ గ్రీన్ షర్టేసేద్దాం.

అంతేగానీ పాపం తను ఆఫీసుకెళ్లే హడావిడిలో వున్నప్పుడు ఈ బొత్తాలవీ కుట్టమనడం, పెసరట్లలోకి ఉప్మా కూడా చెయ్యమనడం... ఇలాంటివన్నీ కోరి ‘గొంతెమ్మ’గా పేరుపొందడం నాకిష్టంలేదు. ఆమాత్రం సహాయం చేస్తాను భర్తగా మారినందుకు.

రోజూ హాస్పిటలుకి వేసుకెళ్లే డ్రెస్సు కూడా అంతే! చిన్నచిన్న తేడాలుంటే పట్టించుకోను. ఎలాగూ అక్కడికెళ్లిన అయిదునిమిషాల్లో విప్పిపడేసేదే కదా? అపార్ధం చేసుకోకండి. మత్తు డాక్టర్ని కదూ, ఓటీ కాంప్లెక్స్ లోకి అడుగెట్టగానే ఆపరేషన్ డ్రెస్సేసుకుంటానని అంతరార్ధం.

బట్టలన్నీ ముందేసుకుని మ్యాచింగ్ అయ్యేలా జతలు జతలుగా పెడుతున్నాను. పూర్వం పెద్దపెద్ద సూట్ కేసులు నిండిపోయేలా బట్టలన్నీ కుక్కేసి, చివరాఖర్న పట్టకపోతే దాని పీకమీద కూర్చుని మరీ తాళం వేసేవాళ్లం. గుర్తుందిగా? ఇప్పుడలాంటి బాధల్లేవు. బట్టలకన్నా తేలికైన పెట్టెలొచ్చేసాయి. మళ్లీ వాటికి చక్రాలు, కర్రలూ కూడానూ! పిల్లలెంతో ఇష్టంగా తోస్తాఁవంటారు ఈ తోపుడు పెట్లని!

అన్నీ సర్దేశాకా నా అసలైన సరంజామా ముందుపెట్టుకున్నాను. అదేనండీ మీరెరిగిందే! మొబైల్ చార్జర్లు, వైఫై డాంగిల్సు, బ్లూటూత్ స్పీకర్లు, ఓటీజీ పెన్ డ్రైవులు, రకరకాల కేబుళ్లు...! నేనైనా వెళ్లడం మానేస్తానేమోగానీ ఇవిమాత్రం తప్పకుండా బయల్దేరి తీరాలి!

ఇవన్నీ ఎంతో శ్రద్ధాసక్తులతో సర్దుతానా, మళ్లీ బ్రష్షూ పేస్టు లాంటివి మర్చిపోతాను. అయినా ఏవూరెళ్లినా మనం దిగే హొటళ్లన్నింట్లోనూ మనుగుడుపుల్లో పెళ్లివారికిచ్చినట్టు సబ్బులు, తువ్వాళ్లు, షాంపూలూ ఇస్తూనే వుంటారుగా? పాపం, ఒక్క కుంకుడుకాయలు తప్ప సమస్తం ఇస్తారు.

అంచేత వాటిగురించయితే బెంగలేదు. కానీ ఈ చార్జర్లవీ ఎవడిస్తాడు? ఒకవేళ ఇచ్చినా ఈ ఆపిల్ ఫోనులాంటి ఒంట్రెత్తు చార్జర్లు ఎవరి దగ్గరా వుండవాయె! అందువల్ల మన జాగ్రత్తలో మనఁవుండాలి.

తను కాసేపటి తరవాత గదిలోకొచ్చేటప్పటికి రిపేర్లో వున్న రోబోలా చుట్టూ వైర్లతోనూ, రకరకాల పరికరాలతోనూ కనబడ్డాను.

‘ఏంటీ, ఇవన్నీ మోసుకొస్తావా? ఎక్కడికెళ్లినా ఇంత వ్యవహారమూ ఉండాల్సిందేనా?’ అంది కొంత విచిత్రాన్నీ విసుగునీ అల్లం వెల్లుల్లి పేస్టులా తయారుచేసి చూస్తూ!

‘తప్పదు బన్నీ! మనం ఊరంతా తిరిగి రకరకాల ఫొటోలు తీసేసుకుంటాం. రాత్రి గదికి చేరగానే ఆ ఫొటోలవీ హొటల్ టీవీలో పెట్టుకుని చూడాలనిపించడం సహజం కదా? అందుకే ఇవన్నీ! ఎస్సెల్లార్ కెమెరాలోంచి మెమరీకార్డు తీసి ఈ కార్డ్ రీడర్లో పెట్టి టీవీకి తగిలిస్తే ఎంచక్కా ఏరోజు ఫొటోలు ఆరోజే చూసెయ్యొచ్చు!’ అంటూ టీవీ అడ్వర్టైజ్మెంట్లో మోడల్లా విపులంగా చెప్పడం మొదలెట్టాను.

‘ఆ గోలేదో నువ్వూ, ఆ పెద్దాడూ పడండి. వాడికీ నీ పోలికలే వచ్చాయి! నేనాఫీసుకెళ్లి పెందరాళే వచ్చేస్తాను. వచ్చేటప్పటికి ఇంకా ఇలాగే బాంబ్ బ్లాస్టయినట్టు చెల్లాచెదురుగా కనబడితే ఊరుకోను. త్వరగా తెమలండి. ఆ వెధవలిద్దర్నీ కూడా లేపి, నీకు హెల్ప్ చెయ్యమను!’ అంటూ పదోతరగతి ర్యాంకులు చదివే అమ్మాయిలా గడగడా మాటాడేసి వెళిపోయింది.

మొత్తానికి ఆడపిల్లని కాపరానికి పంపేటప్పుడు సర్దే సారె సామానులా అన్నీ సరిగ్గా వున్నాయో లేదో అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని తయారయిన పెట్లని పక్కనబడేశాను.

‘నాన్నా! రేజర్లూ, బ్లేళ్లూ, సిజర్సూ హేండ్ లగేజిలో లేదుగా? డియోలు కూడా!’ అంటూ మా పెద్దాడొచ్చాడు. వాడు బెంగుళూరు, వైజాగ్ మధ్య గంధర్వరాజు గయుడిలా ఎక్కువగా విమానాల్లో తిరుగుతూ వుంటాళ్లెండి! అంచేత వాడికివన్నీ బాగా జ్ఞాపకం.

మావాడన్నది కరెక్టే! నేను హడావిడిలో రేజర్లూ, కత్తెరా నా చేతిసంచిలో పెట్టేశాను. పైపెచ్చు స్ప్రే బాటిల్ కూడా అందులోనే వుంది. అదిగనక సెక్యూరిటీ వాళ్లు తీసేసుకుంటే రెండొందల ముప్పై రూపాయలూ బూడిదలో పోసిన డియో అవుతుంది. డియో అంటే పన్నీరేగా?

మళ్లీ అన్నీ తెరిచి, ఈసారి వాడి సాయంతో మరింత జాగ్రత్తగా సర్దాను. హమ్మయ్య! ఇక తనొచ్చేటప్పటికి నేను రెడీగా వున్నట్టే! అదో తుత్తి!

ఎప్పట్లాగే మేఁవిద్దరం ఇంత కుస్తీలూ పడుతున్నా మా రెండోవాడు మాత్రం ప్రతిపక్షం ఎన్ని మాటలన్నా పట్టించుకోని అధికారపక్షంలా తను అనుకున్నదే చేస్తూ కూర్చున్నాడు. అదేనండీ, మొబైల్ చూసుకోవడం! వాడి ఏకాగ్రతంటే నాకు చాలాయిష్టం. పక్కనే దావూద్ ఇబ్రహీం వచ్చి కూర్చున్నా పట్టించుకోనంత శ్రద్ధగా చేస్తాడు ఏ పనయినా!

మొత్తానికి తను ఆఫీసునుండి వచ్చేటప్పటికి ముగ్గురు కొడుకులు సినిమాలో కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబుల్లా తయారైపోయి కూర్చున్నాం ముగ్గురమూ!

ముచ్చటగా బంగార్తండ్రుల్లా తయారైపోయిన మమ్మల్ని చూసిన ఆనందం కళ్లలో కనబడకుండా జాగ్రత్తపడుతూ గబగబా లగేజంతా బయటికి చేరేసేసింది. మా ముగ్గుర్నీ సామానంతా కారెక్కించమని చెప్పి తను పూజగదిలోకెళ్లింది. ప్రయాణం సుఖంగా, సురక్షితంగా, శుభప్రదంగా సాగాలని! మేఁవెళ్లేది ఆర్టీసీ బస్సులో కాకపోయినా అలా దణ్ణం పెట్టుకోవడంలో తప్పులేదుగా?

డిక్కీలో పట్టినంత పెట్టేసి మిగిలిన బ్యాగుల్ని భూకైలాస్ సినిమాలో వినాయకుడు శివలింగాన్ని పట్టుక్కూచున్నట్టు ఒళ్లో పెట్టుకుని డెబ్భై స్పీడులో విశాఖపట్నం చేరాం!

అన్నయ్య ఇంట్లో కార్ పార్క్ చేసేసి, నాలుగు మెతుకులు తిని, ఫ్లైట్ టైమవుతుండగా క్యాబ్ బుక్ చెయ్యాలని చూశాం. సహజంగా వైజాగ్ లో క్యాబ్ వాళ్లు నాలుగుసార్లు డ్రైవర్లే కాన్సిల్ చేసేస్తారు. అయిదోసారి ఎవరో అమాయకుడు ఉంచుకున్నాడు. అడ్రెస్ అందరం తలోరకంగా చెప్పి అతణ్ణి కావలసినంత తికమకపెట్టేసి కాసేపు దోబూచులాడుకుని ఎట్టకేలకి ఓ కారెక్కాం!

ఎయిర్‌పోర్ట్ ముఖద్వారంలో సెక్యూరిటీ వాళ్లు ప్రయాణికులందరినీ ఆధార్ కార్డులు చూసి లోపలికి పంపించేస్తున్నారు. అలా ఎలా పంపించేస్తారో కదా అస్సలు పోలికల్లేకపోయినా?

నేనడిగేద్దాఁవనుకున్నాను...‘ఇది నేనేనని గ్యారంటీ ఏఁవిటోయ్?’ అని! కానీ అంత హిందీ రాని కారణంగా ఆగిపోయాను!

బోర్డింగ్ పాసులూ, స్కానింగులూ పూర్తయ్యాక మా పెట్లన్నీ కౌంటర్లో కూర్చున్న పిల్లకి సారె సామానిచ్చేసినట్టు ఇచ్చేసి స్వేచ్ఛగా చేతులూపుకుంటూ బయటపడి, సెక్యూరిటీ చెకింగ్ లైన్లో నిలబడ్డాం.

ఈ ఎయిర్‌పోర్ట్  సెక్యూరిటీ వాళ్లు మనల్ని అంగుళం అంగుళం తడిమి సిగ్గుతో చితికిపోయేలా చేస్తారు. మన బ్యాగుల్ని కూడా అంత మమకారంతోనూ విప్పి చూస్తారు.

ఒకతను నా జేబులన్నీ తడిమి తడిమి మొత్తానికి ఓ పెన్ డ్రైవొకటి సంపాయించాడు. ‘యే క్యా హై?’ అన్నాడు.

అది రొటీన్ పెన్ డ్రైవ్ కాదు. వైఫైతో పనిచేస్తుంది. 64జీబీ సాన్ డిస్క్ మెమరీ పెన్ డ్రైవ్. అంత విజ్ఞానం అతనికి బోధిద్దామని ‘యే సాధారణ్ పెన్ డ్రాయివ్ నహీహైఁ! ఏ వైఫై సే కామ్ కర్తీ హైఁ....’ అన్నానో లేదో నా బోర్డింగ్ పాస్ మీద దఢేలని స్టాంపేసేసి ’ఆప్ అందర్ జాయియే!’ అంటూ గెంటేశాడు!

లేకపోతే... నాతో పెట్టుకుంటాడా??

గేట్ నెంబర్ వన్ ముందున్న సోఫాల్లోను, కుర్చీల్లోను భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, అన్నదమ్ములు ఒకరికొకరు ఏమవుతారో అన్న విషయాన్ని మర్చిపోయి లాప్ టాపులూ, మొబైళ్లూ చూసుకుంటూ కూర్చున్నారు.

కొంతమంది ఇథియోపియా నుంచి వచ్చినవాళ్లలా వచ్చినప్పటినుంచీ పిజ్జాలు తింటూనేవున్నారు. మా చిన్నతనాల్లో రైలు మారడానికి తుని స్టేషన్లో కూర్చున్నప్పుడు దిబ్బరొట్టి తినడం గుర్తొచ్చింది.

నో అనౌన్స్మెంట్ ఎయిర్‌పోర్ట్ అన్నారుగానీ గొంతుచించుకుని ‘బోర్డింగ్!’ అని అందర్నీ పిలిస్తే తప్ప ఒక్కరూ కదల్లా! మళ్లీ క్యూలో నిలబడిన తరవాత తొందరపడిపోతున్నారు.

‘మీరెక్కకుండా విమానం కదలదర్రా!’ అని అనౌన్స్ చేద్దామనిపించింది.

సరిగ్గా పదినిమిషాల్లో బయల్దేరుతుందనగా ఫ్లైట్లోకొచ్చి పడ్డాం. పెళ్లలు పెళ్లలుగా వేసుకున్న మేకప్పుతోను, అప్పుడే టొమాటో పండు తిన్నట్టున్న పెదాల్తోను బోల్డుమంది అమ్మాయిలు స్వాగతం పలుకుతోంటే మా నెంబర్లు వెతుక్కుని కూర్చున్నాం.

కాసేపటికి ఓ చైనా కళ్ల చిన్నదొచ్చి ఏకపాత్రాభినయం చెయ్యడం మొదలెట్టింది. ఒకవేళ ఈ విమానం నీళ్లలో పడిపోతే ఏంచెయ్యాలి, నిప్పుల్లో పడిపోతే ఎలా బయటపడాలంటూ వెనకనించి హిందీలోనూ, ఇంగ్లీషులోను చెబుతున్నారు. పాపం, వాళ్ల ఉద్యోగధర్మం వాళ్లు నిర్వర్తిస్తున్నారు. మన ధర్మం ప్రకారం చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కళ్లు మూసుకు పడుకున్నాను.

‘గాల్లో తేలినట్టుందే...!’ అంటూ సాగుతున్న ఎనర్జిటిక్ పాటతో మనసంతా గాల్లో తేలుతుండగా వెంటనే నిద్రలోకి జారుకున్నాను
🌷 *జగదీశ్ కొచ్చెర్లకోట* 🌷

గ్రుహస్థుని ధర్మములు


1. గ్రుహస్థుడు, బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసులను, పోషించుటతో పాటు కుటుంబ సభ్యుల ను, జంతువులను, పోషించడము వల్ల అన్ని ధర్మములు నెరవేరినట్లే, ఆశ్రమం లోనికి గ్రహస్థాశ్రమము శ్రేష్ఠమైనది.
2. వేదాధ్యయనం చేత, ఋషి పుంగవులను, హోమముల ద్వారా, దేవతలను, శ్రాద్ధములచే పిత్రదేవతలను, అన్నం చేత అతిథులను, బలియొసగుటచేత, పవిత్ర జంతువులను పూజించుచూ తన జీవితాన్ని ధన్యతపరచుకోవాలి.
3.పిత్రుయఙ్ఞ నిమిత్తం ఒక్క బ్రాహ్మణునికైననూ భోజనము పెట్టాలి.
4.భూత యఙ్ఞములో ఒక్క బ్రాహ్మణునికైననూ భోజనం పెట్టాలి. అలా కాకపోతే బలి మాత్రకైనూ ఇవ్వాలి (జంతుబలి కాదు, అన్నం బలి రూపం లో ఇవ్వాలి.)
5.దేవతల కోసం గ్రుహాగ్నిలో హోమం ప్రతీ రోజూ చేయాలి. (ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారో లేదో తెలియదు. పూర్వం చేసేవారు.)
6.తనకున్నంతలో బీదలకు, రోగులకు, పశుపక్ష్యాదులు కు ఆహారం ఇవ్వాలి.
7.ముందు అతిథిని, పిదప సన్యాసి కి, ఆ పిదప బ్రహ్మచారి కి ఆహారమివ్వవలెను. ఈ విధంగా అన్నదానం చేసిన వారికి గోదాన ఫలితం దక్కును.
8.అతిథి భగవత్స్వరూపుడు కాబట్టి, ఇంటికి వచ్చిన అతిథి కి కాళ్ళు కడిగి, కూర్చునుటకు, ఆసనమిచ్చి, త్రాగుటకు మంచి నీళ్ళు ఇచ్చి, మ్రుష్టాన్నములతో భోజనం పెట్టాలి.
9.విప్రులును,అతిథులను, సేవకులు, భోజనం చేసిన తరువాత దంపతులు ఇద్దరూ భుజించాలి. 🌸
**************************

7, ఆగస్టు 2020, శుక్రవారం

#మౌనం_వహించు

మౌనం వహించు - కోపం వచ్చినపుడు
మౌనం వహించు - నీకు వాస్తవాలు తెలియనప్పుడు
మౌనం వహించు - నీకు రూడీ గా తెలియనప్పుడు
మౌనం వహించు - నీ మాటలు బలహీనుడిని గాయ పరుస్తున్నపుడు
మౌనం వహించు - నువ్వు వింటున్న సందర్భంలో
మౌనం వహించు - నీ మాటలు తప్పుడు సంకేతాలను పంపిస్తూ ఉంటె
మౌనం వహించు - నీ తప్పును జోక్ గా చెప్పవలసి వస్తే
మౌనం వహించు - నీ మాటలకు తర్వాత         పశ్చాత్తాప పడవలసి వస్తుంది అనుకుంటే
మౌనం వహించు - నీకు సంబంధం లేని విషయంలో మాట్లాడవలసివస్తే
మౌనం వహించు - అబద్ధం చెప్పవలసిన సందర్భంలో
మౌనం వహించు - ఇతరుల గౌరవానికి భంగం  కలిగేలా మాట్లాడవలసివస్తే
మౌనం వహించు - స్నేహానికి భంగం కలుగుతోంది అనుకుంటే
మౌనం వహించు - క్లిష్టమైన సందర్భాలలో
మౌనం వహించు - నీవు అరచి చెప్పవలసిన సందర్భాలలో
మౌనం వహించు - భగవంతుని విషయంలో ,
మౌనం వహించు - స్నేహితుల విషయంలో, కుటుంబం విషయంలో
మౌనం వహించు -సమాధానం చెప్పలేని సందర్భంలో
మౌనం వహించు - ఒకసారి ఇంతకు ముందే చెప్పి ఉంటె
మౌనం వహించు - ఒక చెడ్డవాడిని పొగడవలసిన సందర్భంలో
మౌనం వహించు - పని చేసుకోవలసిన సందర్భంలో

(ఎవరు తన నోటినీ, నాలుకనూ అదుపులో ఉంచుకుంటారో, వారు జీవితంలో సమస్యలను దూరంగా ఉంచుకోగల్గుతారు)