5, ఆగస్టు 2026, బుధవారం

ఆత్మేతరములు

 

 ఆత్మేతరములు 

ఆత్మేతరములు  అనే పదంలోనే ఆత్మకాదు ఆత్మకన్నా వేరుగా వున్నవి అనే అర్ధం స్ఫురిస్తుంది. అంటే మనకు ఒక విషయం గోచరిస్తుంది అదేమిటంటే ఆత్మ ఒక్కటీ ఒక్కటీ ఆత్మకానివి మిగిలినవి. అంటే మిగిలినవి అన్నీకూడా ఆత్మ కన్నా భిన్నంగా ఉన్నాయని అర్ధమే కదా.  దానిని బట్టి మనం అర్ధం చేసుకునేది ఏమిటంటే ఆత్మ అన్నిటిలో లేదు, కలవదు  అది తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞ్యానం లేక ఆత్మజ్ఞానం. 

ఎరుక: ఎరుక అనేపదాన్ని మనం తెలుసుకోవటం అనే దానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాం ఇది మనందరికీ తెలిసినదే.  నీకు రామారావు తెలుసా అంటే నాకు యెరుకలేదు అని అన్నాడు అంటే అతనికి రామారావు తెలియదు అని అర్ధం.  

ఎరుక కలిగి ఉండటమే బ్రహ్మజ్ఞ్యానం లేక ఆత్మజ్ఞానం. ఇప్పుడు ప్రశ్న యేమని వస్తుందంటే దేనిని గూర్చి ఎరుక కలిగి ఉండటం అంటే బ్రహ్మను గూర్చి లేదా ఆత్మను గూర్చి అనే సమాధానం వస్తుంది. 

ప్రతివారు ఏమనుకుంటారటే  ఇన్ని రకాలుగా చెప్పటం ఎందుకు నాకు ఆత్మను గూర్చి తెలియదు తెలపండి అంటే ఏ గురువు  ఆయినా తెలిపారంటే అది ఏమయినా కావచ్చు కానీ ఆత్మకు సంబందించినది కాదు.  అంటే మరి దేనికి సంబందించినది. ఆ తెలిపిన గురువుకు నిజంగా ఆత్మా జ్ఞ్యానం ఉంటే  అతడు తెలుపలేడు అదేవిధంగా ఆత్మజ్ఞ్యానం లేకపోయినా కూడా తనకు తెలియదు కాబట్టి తెలుపలేడు. 

ఇది అసంబద్ధంగా వున్నది తెలియని గురువు తనకు తెలియదు కాబట్టి చెప్పలేక పోయాడు అనటంలో అర్ధం వుంది మరి తెలిసినవాడు ఎందుకు చెప్పలేడు అని ప్రతివారు సందేహించవచ్చు. 

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బ్రహ్మ జ్ఞ్యానం అనేది తెలిసినది కాదు అంటే తెలుసుకోలేదు, ఆలాగే తెలియపడేది కాదు ఒకరికి తెలియనప్పుడు ఇంకొకరికి తెలియపరచటం అస్సలు సాధ్యపడదు  కాబట్టి తెలియపడటం అనేది ఉండదు. అటువంటప్పుడు బ్రహ్మజ్ఞానం పొందటం యెట్లా అనే మీమాంస వస్తుంది. 

నిజానికి  బ్రహ్మజ్ఞానం పొందటం అనేదే ఉండదు. ఎందుకంటె నీవు ఏదైనా పొందుతున్నావంటే అంతకు ముందు నీదగ్గర అది లేకపోతేనే దానిని పొందగలవు. నీ దగ్గర ధనం లేదనుకో నీవు సంపాదించి ధనాన్ని పొందగలవు, నీ దగ్గర ఏదైనా వస్తువు గురించి, కానీ విషయం గురించి గాని జ్ఞ్యానం లేదనుకో దానిని తెలుసుకున్న పండితుడిని గురువుగా భావించి అయన వద్దనుండి తెలుసుకొని పొందవచ్చు. దీనిని బట్టి మనకు ఏమి అర్ధమౌతుంది అంటే నీవు పొందాలసినది అది వస్తువైనా కానీ లేక విషయమైనా గాని అది నీకన్నా వేరుగా  వుంది. అలాగే దానిని నీకు వసంగె వ్యక్తి కానీ మరొకటి గాని నీకన్నా వేరుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకు మూడు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి తెలుసుకోవలసిన వాడు అంటే నీవు రెండోవది తెలుసుకోవలసిన విషయం అది ఏమైనా కావచ్చు అది కూడా నీ కన్నా వేరుగా వుంది. అదేమాదిరిగా తెలియచేసే గురువు కూడా వేరుగా వున్నాడు. 

ఒక మనిషి నేర్చుకునేది, తెలుసుకునేది పూర్తిగా పరోక్ష జ్ఞ్యానం మాత్రమే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలుసుకునే వానికి తెలుసుకోబడే విషయం పూర్తిగా వేరుగా వుంటున్నది.  కాబట్టి సదరు విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుంటున్నారు. ఉదాహరణకు నీకు కారు డ్రైవింగ్ రాదు.  నీకు తెలుసు డ్రైవింగ్ అనేది ఒక విద్య ఆ విద్య వచ్చిన నిపుణుడు కారును అదుపులో ఉంచి సరైన వేగంగా నడుపగలడు.  ఒక సమర్ధుడైన కారు డ్రైవరు ఇరుకు రోడ్లలో, వీధులలో ఎంతోమంది నడుస్తున్నా కూడా ఎవ్వరికీ ఏ మాత్రం తాకకుండా నిపుణతతో నడుప గలడు.  అదే తర్ఫీదు సరిగా లేని వాని చేతికి స్టీరింగ్ ఇస్తే ఆ కారుతో పలువురుకు హాని కలిగించి కారుకు కూడా డామేజ్ చేయవచ్చు.  కాబట్టి విద్య నేర్చిన వానికి విద్య నేర్వనివానికి తేడా వుంటున్నది. విద్యను నేర్వటానికి విద్యలో ఆరితేరిన నిపుణుని శిక్షణ అవసరము. ఈ రకంగా మనం నిత్యం అనేక విద్యలను నేర్చుకుంటున్నాము. కానీ బ్రహ్మ విద్య అలా తెలుసుకోవటానికి సాధ్యపడదు. ఎందుకంటె ఇక్కడ తెలుసుకునే నీవు తెలుసుకోపడేది కేవలం నీలో దాగి వున్న నీ గురునిచే. అదేమిటో చూద్దాం. 

ప్రతివారు వారికి ఉన్న ఇంద్రియముల సహాయముతో ఈ జగతితో సంబంధం కలిగి వున్నారు. కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, ముక్కుతో వాసన చూస్తున్నారు ఇలా ఒక్కొక్క ఇంద్రియముతో ఒక్కొక్క రకమైన పని చేస్తున్నారు. ఇది సర్వసాధారణ విషయం.  కానీ నీలో దాగి వున్నది ఎవరు అదేమిటి నాలో దాగి ఎవరు లేరు నేనే వున్నాను అని నీవనవచ్చు నిజానికి నీవు నీ శరీరం కాదు నీ శరీరంలో నీ కన్నా భిన్నంగా దాగి వున్న నీవు అదే సుద్దచెతన్యమైన ఆత్మ స్వరూపం. ఈ విషయంలో కేనోపనిషత్తు ఈ విషయాన్ని ఇలా వివరిస్తున్నది.

 

కేనేషితం పతతి ప్రేషితం మనః

కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః |

కేనేషితాం వాచమిమాం వదన్తి

చక్షుః శ్రోత్రం క ఉ దేవోయుదక్తి || 1

మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగించబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతున్నారు? నిజంగా ఏ బుద్ధి కళ్ళను, చెవులను నియమిస్తుంది? ఈ మంత్రం మనకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నది. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మనస్సు విషయాలమీదకు వెళుతున్నది.  ఇవ్వన్నీ మనకు తెలిసినవిషయాలే మరి అవి వాటి వాటి నిర్దుష్ట కర్మలు చేయటానికి కారణం ఎవరు? ఎవరి ఆదేశాలమీద అవన్నీ పనిచేస్తున్నాయి అనేది ఒక సందేహాం. 

శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్

వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః |

చక్షుషశ్చక్షురతి ముచ్య ధీరాః

ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి || 2

ఆత్మ శక్తి వలననే చెవి వింటుంది. కన్ను చూస్థుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పని చేస్తాయి. బుద్ధిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాలనుండి వివక్షిస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు.మనకు బౌతికంగా కనపడని ఆత్మా శక్తి మన ఇంద్రియాలను, మనస్సును, బుద్దిని నియంత్రిస్తుంది.

నతత్ర చక్షుర్గచ్చతి నవాగ్ గచ్చతి నోమనః |

న విద్యో న విజానీయో యథైవ దనుశిష్యాత్ || 3

మరి ఆ ఆత్మను మనం చూడగలమా అంటే ఆ బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు. మాటలుగాని మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏ విధంగా నేర్పించవచ్చునో ఆ పద్ధతికూడా మాకు తెలియదు. మహర్షులు వారి దివ్యజ్ఞానంతో మనకు ఆ ఆత్మా శక్తి దాని ఉనికిని తెలుపుతున్నారు. కన్ను దాని ముందర వున్న వాటిని మాత్రమే చూడగలదు మాటలు తన అనుభవంలో ఉన్నవాటిని మాత్రమే తెలుపగలవు. మనస్సు తన ఊహకు అందినవాటిని మాత్రమే తెలుసుకోగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంద్రియాలు శరీరానికి బాహ్యంగా ఉన్నవాటిని మాత్రమే గుర్తించగలవు. 

అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి |

ఇతి శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్ వ్యాచచక్షిరే || 4

నిశ్చయంగా అది తెలిసిన దానికంటే భిన్నమైనది. తరువాత అది తెలియనిదానికంటే అతీతమైనది. దానిని మాకు వివరించిన పూర్వీకులనుండి మేం ఈ విధంగా విన్నాం.ప్రపంచంలో వున్న జ్ఞానం కొంతవరకు మనకు తెలియవచ్చు అంటే దానిని మనము తెలిసిన జ్ఞానంగా పేర్కొనవచ్చు. మరి మనకు తెలియని జ్ఞానం కూడా అంటే మనం తెలుసుకోనిది తెలుసుకోవలసినది కూడా వున్నది.  కానీ ఆత్మా అనేది మనం తెలుసుకున్న జ్ఞానంలోనూ, మనం తెలుసుకోవలసిన జ్ఞానంలోను లేదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం బాహ్యంగా తెలుసుకునే జ్ఞానం పరిధిలోనికి ఆత్మా జ్ఞానం రాదు. అంటే ఆత్మా జ్ఞానం బాహ్యంగా లేదు.

యత్ వాచా నభ్యుదితం యేన వాగభ్యుద్యతే|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 5

మాటలు దేన్ని ప్రకటించలేవో, మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు పూజించేది కాదనీ తెలుసుకో.

యన్మనసా నమనుతే యేనాహుర్మనో మతమ్|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే|| 6

మనస్సుచేత గ్రహించ శక్యం కానిదీ, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యచ్చక్షుషా న పశ్యతియే న చక్షూంషి పశ్యతి|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 7

కన్నులు చూడజాలనిదికాని దృష్టిని చూసేది - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యచ్చోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 8

మానవుడు చెవిద్వారా వినజాలనిదీ దేనిచేత వినికిడి వినబడుచున్నదో - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యత్ ప్రాణేన న ప్రాణిత యేన ప్రాణః ప్రణీయతే|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 9

మానవుడు ఊపిరిచేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.అన్ని మంత్రాలు ఒక్కటే చెపుతున్నాయి. మనం ఆత్మా గురించి తెలుసుకోవటం ఇంద్రియాలవలన, మనస్సు బుద్ధిల వలన సాధ్యం కాదు. మరి అటువంటప్పుడు ఆత్మా జ్ఞానాన్ని పొందటం ఎట్లా?

శరీరం పూర్తిగా ఆత్మస్వాధీనంలో ఉండి శారీరక వ్యాపారాలను చేస్తున్నది.  కానీ ఆత్మా శరీరంలోని అంగం కాదు అది కేవలం శరీరంతో కలువకుండా తామరాకుమీద నీటిబిందువు వలే వుంటూ శరీరాన్ని నియంత్రిస్తుంది. ఆత్మ శరీరంలో ఉన్నంతవరకే శరీరానికి దేహవ్యాపారాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలి వెళుతుందో అప్పుడు పంచ ప్రాణాలు, మనస్సు బుద్ది  పంచేంద్రియాలు లయమైతాయి. శరీరం నిస్చేష్ఠలతో మిగులుతుంది. 

శరీరపు అంగము కాకుండా శరీరంలో పరోక్షంగా వుంటూ శరీరానికి కలసివుండకుండా ఉండి శరీరాన్ని నియంత్రిస్తున్న దివ్య తేజస్సే ఆత్మగా మన మహర్షులు  తెలిపారు. దాని ఉనికిని తెలుసుకొని నిత్యం ఆత్మాసంయమంగా వుంది నిరంతరం ఆత్మలో లయమై ఉండటాన్ని ఆత్మానుభవంగా మహర్షులు తెలిపారు.  అట్లా పొందిన జ్ఞానాన్ని ఆత్మా  జ్ఞానంగా పేర్కొన్నారు. 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

 

శ్రీకృష్ణుడు స్వయంవరంలో

 శ్రీకృష్ణుడు స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఎందుకు బేధించాడు ?


................................……………………..


ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని బేధించాడని మనకు తెలుసు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఒక స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని బేధించి మద్రరాజ పుత్రిక లక్షణను వివాహమాడు.


దీని వెనుక కారణం, మద్రరాజు తన కుమార్తె లక్షణకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అనేకమంది రాజులు వచ్చారు. రాజు నిబంధన ప్రకారం ఆకాశంలో తిరుగుతున్న మత్స్యయంత్రం కంటిని లక్ష్యంగా కొట్టి క్రింద ఉన్న నీటిలోని ప్రతిబింబాన్ని చూసి బాణం వేయాలి. శ్రీకృష్ణుడు క్షత్రియ ధర్మం ప్రకారం స్వయంవరంలో పాల్గొని, తన దివ్య లక్ష్యనైపుణ్యంతో మత్స్యయంత్రాన్ని బేధించి లక్షణను గెలుచుకున్నాడు. ఇది కృష్ణుని వీరత్వానికి, ధర్మపరిరక్షణకు నిదర్శనం.


(1) కుశధ్వజుడు > జనకమహారాజుకు సొంత తమ్ముడు. జనక మహారాజు తన పుత్రిక సీతాదేవిని శ్రీరాముడికిచ్చి పరిణయం చేయగా, కుశధ్వజుడు తన కుమార్తెలైన శ్రుతకీర్తి మాండవిలను శత్రుఘ్న భరతులకిచ్చి వివాహం చేశాడు. జనకమహారాజు పుత్రికలైన సీత, ఉర్మిళలను రామ, లక్ష్మణులు పెండ్లాడారు. ఈ విధంగా సూర్యవంశం, విదేహ వంశాల మధ్య గొప్ప బంధుత్వం ఏర్పడింది.


(2) ఇలబిల > ఈమె కుబేరుని తల్లి. ఈమె భర్త విశ్రవసుడు. ఇలబిల కుమారుడు కనుక కుబేరునకు ఐలబిలుడనే పేరు వచ్చింది.


కుబేరుడు ఉత్తరదిశకు అధిపతి, భార్య చిత్రరేఖ, రాజధాని అలకాపురి, ఇతని ఆయుధం గద, ఇతని వాహనం నరుడు. అందుకే నరవాహనుడని ప్రసిద్ధి. కుబేరుడు ధనానికి అధిపతిగా పూజింపబడతాడు.


(3) జయంతుడు > అజ్ఞాతవాసంలో భీముడికి గల పేరు. వంటలు చేస్తాడు కనుక వలలుడు అన్నారు.


జయత్సేనుడు > అజ్ఞాతవాసంలో నకులుని పేరు. తామగ్రంథి అనే మరో పేరు కూడా ఉంది. గుర్రాలను పాలించడంలో నిపుణుడు. తంత్రీపాలుడు > అజ్ఞాతవాసంలో సహదేవుని పేరు. పశువులను కాచేవాడు.


ధర్మరాజుకు కంకుభట్టు, అర్జునునికి బృహన్నల అనే మారు పేర్లున్నాయని మనకు తెలుసు. ఈ పేర్లతో పాండవులు విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం గడిపారు.


(5) తక్షకుడు > శ్రీరామచంద్రుని తమ్ముడైన భరతుని కుమారుడు. ఇతను తన పేరున తక్షశిలను నిర్మించాడు. ప్రస్తుతం తక్షశిల నగరం పాకిస్తాన్ లో ఉంది. ఇక్కడ గల సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాన్ని శ్వేతహుణులు నాశనం చేశారు. చంద్రగుప్తమౌర్యుడు, చరకుడు, కౌటిల్యుడు ఈ తక్షశిల మహావిశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఇది ప్రపంచంలోని పురాతన విద్యాకేంద్రాలలో ఒకటి.


(6) మత్స్యయంత్రాన్ని చేధించి అర్జునుడు స్వయంవరంలో ద్రుపదరాజ కూతురైన ద్రౌపదిని చేపట్టాడని చదువుకున్నాము కదా ! ఇది వాస్తవం. పాంచాలి స్వయంవరం పాండవుల జీవితాలను మలుపు తిప్పింది.


శ్రీ కృష్ణుడు కూడా ఇటువంటి స్వయంవరంలోనే మత్స్యయంత్రాన్ని చేధించి మద్రరాజ తనయ లక్షణను చేపట్టాడు.


(అ) రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే పదిమంది కొడుకులు కలిగారు. ప్రద్యుమ్నుడు కామదేవుని అవతారం.


(ఆ) సత్యభామ వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే పదిమంది కొడుకులు కలిగారు.


(ఇ) జాంబవతి శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. సాంబుడు చాలా ప్రసిద్ధుడు.


(ఈ) నాగ్నజితి కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, ఆముడు, శంకుడు, వసుడు అనే పిల్లలు కలిగారు.


(ఉ) కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమాసుడు, సోమకుడు అనే కుమారులు జన్మించారు.


(ఊ) లక్షణ కు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.


(ఎ) మిత్రవింద కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాంసుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.


(ఏ) భద్రాదేవి అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. ఈ ఎనిమిది మంది అష్టభార్యలు.


(7) మాతలి > ఇతను దేవేంద్రుని రథసారథి. దేవతల రథాలను నడపడంలో ప్రసిద్ధుడు. అర్జునునికి రథసారథ్యం కూడా చేశాడు.


(8) వృషసేనుడు > కర్ణుని పెద్ద కుమారుడు. మహాభారత యుద్ధంలో 17వ రోజు అర్జునుని చేతిలో వీరస్వర్గం పొందాడు. కర్ణుడికి అత్యంత ప్రియమైన కుమారుడు.


(9) వైశంపాయనుడు> వ్యాసుని శిష్యులలో ముఖ్యుడు. జనమేజయునికి సర్పయాగ సమయంలో భారతకథను వినిపించినవాడు. భారతాన్ని మనకు అందించడంలో ఇతని పాత్ర చాలా గొప్పది.


(10) వ్యాఘ్రేశ్వరుడు > కాశీక్షేత్రంలో శివుడికి గల మరో పేరు. దుంధుభి అనే రాక్షసుడు కాశీలోని వ్యాఘ్రరూపంలో శివభక్తులను హింసిస్తుంటే, శివుడు పులిలా మారి దుంధుభిని సంహరించాడు. కనుక పరమశివుడికి వ్యాఘ్రేశ్వరుడనే పేరు వచ్చింది. వ్యాఘ్రం అంటే పులి.

ఆచరణశీల హిందువు'

 *'ఆచరణశీల హిందువు'గా మారడానికి నాలుగు ముఖ్యమైన స్తంభాలు -*

1. శ్రద్ధ: శాస్త్రం మరియు గురువు (శాస్త్రానుసారం జీవిస్తూ బోధించేవారు) పట్ల జ్ఞానానికి ప్రామాణికమైన లేదా విశ్వసనీయమైన ఆధారాలుగా నమ్మకం కలిగి ఉండటం.

2. స్వాధ్యాయం: హిందూ మూల గ్రంథాలను అధ్యయనం చేయడం. మొదట స్వయంగా చదవడం మరియు సందర్భం వచ్చినప్పుడు సరైన ఆచార్యుని పర్యవేక్షణలో అధ్యయనం చేయడం ఇందులో ఉంటాయి. ప్రసిద్ధ విద్వాంసుల ప్రవచనాలను వినడం కూడా ఇందులో భాగమే. ఈ గ్రంథాలలో ఇతిహాస-పురాణాలు, సాధారణ హిందూ తత్వశాస్త్రం, వేదాంత గ్రంథాలు, మీ సాధనా పద్ధతికి సంబంధించిన గ్రంథాలు, వివిధ దేవతల గురించిన గ్రంథాలు మొదలైనవి ఉండవచ్చు.

3. సాధన: క్రమం తప్పకుండా ఆచరించే కర్మకాండలు లేదా ఆధ్యాత్మిక అభ్యాసం. ఇందులో కులదేవతారాధన, ఇష్టదేవతారాధన, వ్రతాలు ఆచరించడం, పండుగలను శాస్త్రోక్తంగా జరుపుకోవడం, తీర్థయాత్రలు చేయడం, దీక్ష తీసుకున్న తర్వాత మంత్ర సాధన, అలాగే ప్రత్యేక దీక్ష అవసరం లేని స్తోత్ర పఠనం, భగవన్నామ స్మరణ వంటివి ఉండవచ్చు.

4. సదాచారం: సత్యం, అహింస వంటి శాస్త్రోక్త సూత్రాలకు అనుగుణంగా మంచి ప్రవర్తనను పాటిస్తూ నైతిక జీవనాన్ని గడపడం.

*-శృంగేరీ జగద్గురు శ్రీశ్రీవిధుశేఖర భారతీమహాస్వామివారు*

4, ఆగస్టు 2026, మంగళవారం

ధ్రువోపాఖ్యానం

 🌺 *శ్రీమద్భాగవతం - 10: ధ్రువోపాఖ్యానం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భాగవత అధ్యయనం లో భాగంగా 

నిన్నటి రోజున దక్షయజ్ఞం, సతీదేవి ఆత్మాహుతి, వీరభద్రుని ఉగ్రరూపం మరియు దక్షునికి మేక ముఖం అమర్చడం గురించిన విశేషాలు గల వీరభద్ర విజయం గురించి తెలుసుకున్నాం. ఈరోజు **చతుర్థ స్కంధం – అధ్యాయాలు 8 నుండి 12**ఆధారంగా పరమ భాగావతుడైన **ధ్రువుని బాల్యం, చిన్నమ్మ సురుచి పరుషోక్తులు, నారద మంత్రోపదేశం, సుమధుర తపస్సు మరియు అచలమైన ధ్రువ పదాన్ని పొందడం** గురించిన వివరాలు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన మేరకు తెలుసుకుందాం.


---


1. **సురుచి పరుషోక్తులు & ధ్రువుని సంవేదన*


స్వాయంభువ మనువుకు ఇద్దరు కుమారులు వారు ప్రియవ్రతుడు, ఉత్థానపాదుడు.అందులో **ఉత్తానపాదుడికి** ఇద్దరు భార్యలు — సునీతి, సురుచి. పెద్ద భార్య సునీతి కుమారుడు **ధ్రువుడు**, చిన్న భార్య సురుచి కుమారుడు **ఉత్తముడు**. ఉత్తానపాదుడికి చిన్న భార్య సురుచి అంటే మిక్కిలి ప్రేమ.


ఒకరోజు ఐదేళ్ల పసిబాలుడైన ధ్రువుడు తన తండ్రి తొడపై కూర్చోవడానికి వెళ్లాడు. అక్కడ ఉన్న సురుచి ధ్రువుడిని పక్కకు తోసివేసి, రాజాస్థానం ముందు(రాజుగారి ఎదుటే)గర్వంతో ఇలా అంది:


 "బాలా! నువ్వు రాజు తొడపై కూర్చోవడానికి అర్హుడివి కావు. నువ్వు నా కడుపున జన్మించలేదు. అంతగా సింహాసనంపై కూర్చోవాలనుకుంటే, అడవులకు వెళ్లి ఆ శ్రీహరిని గూర్చి తపస్సు చేసి, ఆయన అనుగ్రహంతో నా గర్భాన జన్మించు!"


ఆ మాటలు విన్నా కూడా ఉత్తానపాడుడుసురుచి పై ప్రేమతో మౌనంగా ఉండిపోయాడు. తీవ్రంగా గాయపడిన మనస్సుతో ధ్రువుడు వెక్కి వెక్కి ఏడుస్తూ తన తల్లి సునీతి వద్దకు వెళ్లాడు. సునీతి పిల్లవాణ్ణి ఒడిలోకి తీసుకుని, పిల్లవాణ్ణి సురుచి అన్న మాటలు అప్పటికే అంతఃపుర స్త్రీల ద్వారా విని ఎంతో బాధపడింది.అమాయకురాలైన సునీతి కూడా దీర్ఘముగా నిట్టూర్చుచు, కన్నీరుమున్నీరుగా ఏడువసాగెను. ఆమె దుఃఖమునకు అంతులేకుండెను. 


కొంతసేపడికి నిబ్బరపడి ఆమె తన కుమారునితో ఇలా అన్నది – “నాయనా! ధ్రువా! నీకు తీవ్రమైన బాధయే కలిగినది. ఐనను,


 **నీవు ఇతరులకు అశుభమును కోరుకొనకుము. ఏలయన పరులకు దుఃఖమును కలిగించినవారు ఎన్నటికైనను తామే ఆ దుఃఖమును అనుభవింపవలసి యుండును**. 


 "నాయనా! నీకు బాధయే కలిగిన

నీ చిన్నమ్మ చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఆ శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించడం తప్ప మన దుఃఖాన్ని పోగొట్టే దిక్కు మరొకటి లేదు. ఆయనను ప్రసన్నం చేసుకో" నీవు కోరుకున్నది లబిస్తుంది అని ధైర్యం చెప్పింది.(ఎంత గొప్ప మాటలు అండి ఇది ఈ దైర్యం ఈ భక్తి మన వారసత్వ సంపద)


---


2. *నారద మహర్షి ఆగమనం & మంత్రోపదేశం**


తల్లి అయిన సునీతి చెప్పిన మాటలను ధ్రువుడు శ్రద్ధగా విన్నాడు. అవి ఆయనకు ఎంతో ప్రయోజనకరములుగా అనిపించి. తన అభీష్టము సఫలమగుటకు అదియే సరియైన మార్గమని అతడు నిశ్చయించుకొనెను. అతడు మనస్సును నిగ్రహించుకొని, తన తండ్రియొక్క పురమునుండి వనములకు బయలుదేరెను.


అప్పుడు ధ్రువునియొక్క అభీష్టమును, దానిని సాధించుటకై అతడు వనములకు బయలుదేరిన విషయమును దేవర్షియగు నారదుడు గ్రహించి, అతని దగ్గరకు వచ్చి ఆశ్చర్య పోయి , పవిత్రమైన తన చేతితో అతని శిరస్సును స్పృశించుచు ఇట్లు అనుకున్నాడు.


'ఆహా! ఇదెంతటి ఆశ్చర్యము. ఇసుమంత అవమానమును గూడ సహింపజాలని క్షత్రియులయొక్క స్వాభిమానము అత్యద్భుతము కదా! బాలుడే ఐనప్పటికిని సవతితల్లి దురుసు మాటలకు ఇతడు ఎంతగానో నొచ్చుకొనెను. వాటిని ఇతడు తన మనస్సులో పెట్టుకొని, భగవంతుని ఆరాధించుటకు పూనుకొనెను?'


* **నారదుని పరీక్ష:** "నాయనా ధ్రువా! నువ్వు ఇంకా పసివాడివి. మానవమానాలు, గెలుపోటములు ఈ వయస్సులో పట్టించుకోకూడదు. ఇంటికి తిరిగి వెళ్లు" అని నారదుడు చెప్పాడు.


* **ధ్రువుని పట్టుదల:** ధ్రువుడు ప్రాంజలియై: "మహర్షీ! నా క్షత్రియ హృదయం చిన్నమ్మ బాణాల వంటి మాటలతో గాయపడింది. నా పూర్వీకులు ఎవరూ పొందని అత్యున్నత పదవిని సాధించాలనుకుంటున్నాను. నాకు ఆ మార్గాన్ని చూపండి" అని వేడుకున్నాడు.


ధ్రువుని దృఢ సంకల్పానికి నారదుడు సంతోషించి, యమునా తీరంలో ఉన్న **'మధువనం'** కు వెళ్లమని చెప్పి, భగవంతుని రూప ధ్యానాన్ని మరియు **"ఓం నమో భగవతే వాసుదేవాయ"** అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు.


---


ఉపదేశం చేసాక అంతఃపురానికి వెళ్ళి కుమారుడు వెళ్లిపోయిన బాధలో ఉన్న ఉత్తానపాదున్ని ఓదార్చి దిగులు చెందకు, అతడు దైవానుగ్రహం కలవాడు, అతడు విశ్వవిఖ్యాతుడు, లోకపాలకుడు అవుతాడు. అసాధ్యమైన కార్యాన్ని సాధించి త్వరలోనే నీ దగ్గరకు వస్తాడా అని చెప్పే వెళ్ళిపోయాడు.


---


3. **మధువనంలో ఘోర తపస్సు**

ఇక

మధువనానికి చేరుకున్న ధ్రువుడు నారదుడు చెప్పినట్లు ఆచమనం చేసి, వాసుదేవుని హృదయంలో నిలిపి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు:


* **1వ నెల:** ప్రతి మూడు రోజులకు ఒకసారి వెలగకాయలు, రేగుకాయలు తింటూ తపస్సు చేశాడు.


* **2వ నెల:** ప్రతి ఆరు రోజులకు ఒకసారి ఎండిన ఆకులు, గడ్డి తింటూ తపస్సు చేశాడు.


* **3వ నెల:** ప్రతి తొమ్మిది రోజులకు ఒకసారి కేవలం నీరు మాత్రమే తాగుతూ తపస్సు చేశాడు.


* **4వ నెల:** ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి కేవలం వాయువును (గాలిని) మాత్రమే పీలుస్తూ ఏకపాదంతో నిలబడి తపస్సు చేశాడు.


* **5వ నెల:** శ్వాసను కూడా నిరోధించి (ప్రాణాయామంతో), మనస్సును భగవంతుని యందు సంపూర్ణంగా లగ్నం చేశాడు.


ధ్రువుడు తన శ్వాసను నిరోధించడంతో, సమస్త బ్రహ్మాండంలోని ప్రాణుల శ్వాస ఆగిపోయింది. లోకాలు తలకిందులయ్యాయి. దేవతలందరూ భయపడి శ్రీహరిని శరణుకోరారు.

(తపశ్శక్తి గొప్పతనం అది)

---


4. *శ్రీహరి దివ్య దర్శనం & ధ్రువ పదం*


భక్తుని తపస్సుకు ప్రసన్నుడై శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మధువనంలో ధ్రువుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.


తన హృదయంలో ధ్యానిస్తున్న దివ్యరూపం బయట కనిపిస్తుండటంతో ధ్రువుడు మైమరచిపోయాడు. ఏమి మాట్లాడాలో తెలియక నిలబడిపోగా, పరమాత్మ తన **దివ్య శంఖంతో (పాంచజన్యంతో)** ధ్రువుని చెంపను తాకించాడు. భగవంతుని స్పర్శతో ధ్రువునికి సమస్త వేద విజ్ఞానం, స్తుతిబలం ఆవిర్భవించాయి. ధ్రువుడు అత్యద్భుతంగా భగవంతుని స్తుతించాడు.(ధృవ స్తుతి లోక విఖ్యాతము అత్యంత శక్తివంతమైనది, వైకల్యాలు ఉన్నవారు నిత్యం పారాయణ చేస్తే అవి సరి అవుతాయి అని ప్రతీతి)


**శ్రీహరి అనుగ్రహం:** "ధ్రువా! నీ సంకల్పాన్ని నేను ఎరుగుదును. నువ్వు ముప్పై ఆరు వేల (36,000) సంవత్సరాలు ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తావు. అనంతరం సమస్త గ్రహ నక్షత్రాలకు ఆధారామై, ప్రళయ కాలంలో కూడా నశించనిది సప్తర్షి మండలం కన్నా పైన ఉండేది అయిన పరమోన్నత**'ధ్రువ మండలాన్ని' (ధ్రువ నక్షత్ర పదాన్ని)** పొందుతావు" అని వరమిచ్చాడు.


---


5. స్వగృహ ప్రవేశం & సన్మానం (10, 11, 12 అధ్యాయాలు)


భగవద్దర్శనం పొందిన ధ్రువుడు తన కోరికల పట్ల పశ్చాత్తాపపడ్డాడు. "భగవంతుని దర్శనం పొంది కూడా తుచ్ఛమైన రాజ్యాన్ని కోరుకున్నాను కదా" అని అనుకున్నాడు. అయినా భగవదాజ్ఞ ప్రకారం రాజధానికి తిరిగొచ్చాడు.


తండ్రి ఉత్తానపాడుడు, చిన్నమ్మ సురుచి, తల్లి సునీతి, సోదరుడు ఉత్తముడు ధృవుడు వస్తున్న వార్త తెలుసుకుని ఎదురెళ్లి ధ్రువుడిని అమితమైన ప్రేమతో ఆహ్వానించారు.ప్రజలు అందరూ ఆ చిన్నారి ధ్రువుని ఎంతో ఆత్మీయతతో లాలింపసాగిరి. అప్పుడు ఉత్తానపాదమహారాజు ధ్రువుని, అతని సోదరుడైన ఉత్తముని ఏనుగుపై అధిష్ఠింపజేసి, వారితోగూడి మిగుల సంతోషముతో తన రాజధానిలో ప్రవేశించెను. 


ఆ సమయమున సకలజనులును మహారాజుయొక్క భాగ్యమును కొనియాడసాగిరి.నగరమునందు అక్కడక్కడ ద్వారములు మకర తోరణములతో అలంకరింపబడియుండెను. ద్వారములకు ఇరుప్రక్కల పండ్లగెలలు, పూలగుత్తులుగల అరటి స్తంభములు, పోకమొక్కలు ఏర్పరచబడియుండెను. రాజర్షియైన ఉత్తానపాదుడు అత్యద్భుతమైన ధ్రువకుమారుని ప్రభావమును విని, చూచి ఆశ్చర్యచకితుడయ్యెను.


 ధ్రువుడు క్రమంగా పెరిగి తరుణ(యువకుడు) వయస్కుడయ్యెను. అతని తెలివితేటలకును, ఉత్తమ లక్షణములకు మంత్రులు అబ్బురపడుచుండిరి. అతడు ప్రజల ప్రేమానురాగములకు పాత్రుడగుచుండెను. 


తన తనయునియొక్క ఈ శుభలక్షణములను గాంచి మహారాజు ఒక శుభముహూర్తమున భూమండలమునకు అతనిని పట్టాభిషిక్తుని గావించెను. భూపతి తాను వయోవృద్ధుడగుచున్న విషయమును గమనించెను. ఐహిక విషయములయెడ విరక్తుడై ఆత్మస్వరూపమును గూర్చి ' చింతించుచూ వనములకు వెళ్లెను. 


----


* **యక్షుల యుద్ధం & స్వాయంభువ మనువు హితవు:** కాలక్రమేణా ఉత్తముడు ఒకనాడు వేటకు వెళ్లి అడవిలో యక్షుల చేతిలో మరణించగా, ధ్రువుడు కోపంతో యక్షులపై యుద్ధం ప్రకటించాడు. అప్పుడు తాతగారైన స్వాయంభువ మనువు వచ్చి: "ధ్రువా! కోపం తమోగుణ లక్షణం. సాధువులకు, విష్ణుభక్తులకు అగ్రహం తగదు" అని బోధించగా ధ్రువుడు యుద్ధాన్ని నిలిపివేశాడు. కుబేరుడు ప్రసన్నుడై ధ్రువునికి నిశ్చల విష్ణుభక్తిని వరంగా ఇచ్చాడు.


ధ్రువుడు చక్కని శీలస్వభావముగలవాడు, బ్రాహ్మణ సేవా పరాయణుడు, దీనులయెడ వాత్సల్యభావము గలవాడు, ధర్మమర్యాదలను రక్షించువాడు (తాను పాటించుచు, ఇతరులచే పాటింపజేయువాడు). అట్టి ధ్రువుని ప్రజలెల్లరును పితృతుల్యునిగా భావించుచుండిరి. 


ధ్రువుడు వివిధములగు రాజభోగములను అనుభవించుట వలన తన పుణ్యము క్షీణించునట్లుగను, భోగములపట్ల అనాసక్తుడై యజ్ఞయాగములద్వారా తన పాపములు నశించునట్లుగను జీవించెను. అంటే పాపం పుణ్యం రెండు లేని విదంగా ఆయన జీవించాడు.


ఈవిధముగా అతడు తన రాజ్యమును ముప్పది ఆరువేల సంవత్సరములు పాలించెను. ఈరీతిగా మహాత్ముడైన ధ్రువుడు జితేంద్రియుడై ధర్మార్థకామ పురుషార్థములను పొందుచు పెక్కు సంవత్సరములు తన జీవితమును గడిపి, కడకు తన కుమారుడైన ఉత్కళునకు రాజ్యాధికారమును అప్పగించెను. 


 'ఈ సమస్త దృశ్యప్రపంచము అవిద్యారచితము (ప్రకృతినుండి ఏర్పడినది). 'స్వప్నమున గాంచు గంధర్వనగరమువలె ఈ విశ్వము అంతయు మనఃకల్పితమే' అని ధ్రువుడు భావించి బదరికాశ్రమానికి వెళ్లి దేహ స్పృహను వీడి భగవంతుని విరాట్ స్వరూప ధ్యానంలో మునిగిపోయాడు.కడకు ధ్యానించేవాడు, ధ్యానం అనేది అద్వైత స్తితికి సమాధి స్థితిలో నిలిచి పోయాడు. నేను ధ్రువుడు అనే భావన వారిలో తొలగిపోయింది.అప్పుడు


సాక్షాత్తు విష్ణుదూతలు దివ్య విమానంతో వచ్చి ధ్రువుడిని తీసుకువెళ్లారు. మృత్యు దేవత తన ముందు నిలబడితే, దాని తలపై కాలు పెట్టి దివ్య విమానమెక్కి శాశ్వతమైన **'ధ్రువ పదాన్ని'** చేరుకున్నాడు!


ఆ విమానం లో ఉండగా తల్లిగారైన సునీతి గుర్తుకు వచ్చింది అయ్యో ఉత్తము రాలైన తల్లిని వదిలి ఒక్కడినే పరమ పదం వెళ్ళుట ధర్మమేనా అనుకుంటూ ఉండగా, విష్ణు దూతలు అతనికి అతని ముందు ఉన్న విమానం చూపించారు, అందులో ధృవునికన్నా ముందే సునీతి విష్ణులోకం వెళ్తుంది.


క్రమముగా అతడు ముందునకు పయనించుచు విమానములయందు పయనించుచున్న దేవతలు అతనిని ప్రశంసించుచు పుష్పములను చల్లుచుండిరి. ఆ సూర్యాదిగ్రహములను చూచెను. మార్గమున అచ్చటచ్చట


దివ్యవిమానమునందు ఆసీనుడై యున్న ధ్రువుడు ముల్లోకములను, సప్తర్షిమండలమును గూడ దాటి,ఉన్నతోన్నతమైన విష్ణుభగవానునియొక్కనిత్యనివాసమగు వైకుంఠమునకు చేరెను. ఈవిధముగా అతడు శాశ్వతమగు స్థానమును పొందెను.


ఆహా ధ్రువుడు ఐదారు సంవత్సరముల వయస్సునందే తపస్సుద్వారానే భగవంతుని ప్రసన్నునిగా జేసికొని, పరమపదమును పొందగల్గెను. కాని, అతడు సాధించిన పరమధామమును ఈ భూమండలమునగల ఏ రాజైనను ఎన్ని సంవత్సరములలో నైనను పొంగలడా? (పొందజాలడు)" 


---


ధ్రువుని చరిత్రము మహిమాన్వితము. దానిని విన్నవారును, ప్రవచించిన వారును సంపన్నులగుదురు. అది యశస్కరము. ఆయుర్వృద్ధిని గూర్చునట్టిది, పవిత్రమైనది, మిగుల శుభప్రదమైనది. స్వర్గప్రాప్తికరము. ధ్రువమండలమునకు చేర్చునది. మనస్తాపములను తొలగించునది. ప్రశస్తిని గూర్చునది. పాపములను రూపుమాపునది. భగవద్భక్తుడైన ధ్రువునియొక్క చరితము పదేపదే శ్రద్ధగా వినుచుండువారికి పరమాత్మునియెడ అనన్యభక్తి కుదురుకొనును. తత్ప్రభావమున వారి తాపత్రయములు అన్నియు నశించును. శ్రద్ధాళువులైన శ్రోతలకు అన్నివిధములుగా ఔన్నత్యమును ప్రసాదించును.


సద్గుణములను, సౌశీల్యమును ప్రాప్తింపజేయును. దివ్యతేజస్సును కలిగించును. మనస్వులకు గౌరవమును ఇనుమడింప జేయును. యశోమూర్తియగు ధ్రువుని వృత్తాంతము మహత్త్వపూర్ణమైనది. దీనిని ప్రాతఃకాలము నందును, సాయంసమయమునందును, బ్రాహ్మణాది ద్విజుల సభలలో ఏకాగ్రచిత్తముతో కీర్తింపవలెను. భగవత్పాదారవిందములను సేవించుటయందు నిరతిగలవాడు పూర్ణిమనాడు, చంద్రకళతో గూడిన అమావాస్యనాడు, ద్వాదశినాడు, శ్రవణానక్షత్ర సహితదినమునందు, సాయంసమయమునందు, వ్యతీపాత యోగముగల రోజునను” సూర్యసంక్రమణము నాడును లేదా ఆదివారమునందును శ్రద్ధాళువులైన వారికి వినిపిస్తే భగవంతుడు సంతుష్టుడు అయి అతనికి సిద్ధి కలుగును.


ఈరోజు మన అదృష్టం కొద్ది ఆదివారం కలిసి వచ్చింది మనకు భగవత్ అనుగ్రహ సిద్ది కలిగింది. హరే కృష్ణ 


📝 *నేటి ముఖ్య విషయాలు* 


1. **నిశ్చల సంకల్పం:** వయస్సుతో సంబంధం లేదు; గాఢమైన భక్తి, నిశ్చల సంకల్పం ఉంటే ఐదేళ్ల బాలుడైనా, వందేళ్ల వృద్ధుడు అయినా పరమాత్మను సాధించగలడు.


2. **అపకారికి ఉపకారం:** చిన్నమ్మ సురుచి పరుషోక్తులే తనను భగవంతుని వైపు నడిపించాయని ధ్రువుడు ఆమె పట్ల ఎలాంటి ద్వేషం పెంచుకోలేదు.


3. **ధ్రువ పదం:** లౌకిక రాజ్యాలు నశిస్తాయి, కానీ భగవదనుగ్రహంతో పొందే స్థానం (ధ్రువ పదం) శాశ్వతంగా నిలిచిపోతుంది.


---


...సశేషం

✍️ఇరువంటి కార్తీక్ శర్మ (సనాతన ధర్మ ప్రచార వేదిక)


ఈ పోస్ట్ మీకు నచ్చితే like చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మరిన్ని విషయాల కోసం మన page follow అవ్వండి,ఈ పోస్ట్ share మాత్రమే చేయండి.. హరేకృష్ణ

3, ఆగస్టు 2026, సోమవారం

మంగళవారం*🍁 *🌹04 ఆగష్టు2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

  🍁 *మంగళవారం*🍁

*🌹04 ఆగష్టు2026🌹*  

  *దృగ్గణిత పంచాంగం*              


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢ మాసం - బహుళ పక్షం* 


*తిథి : షష్ఠి* రా 10.03 వరకు ఉపరి *సప్తమి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : రేవతి* రా 09.54 వరకు ఉపరి *అశ్విని*

*యోగం : ధృతి* రా 07.33 వరకు ఉపరి *శూల*

*కరణం  : గరజి* ఉ 10.32 *వణజి* రా 10.03 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*మ12.00-01.00 సా 05.00-06.00*      

అమృత కాలం  :*రా 07.30 - 09.06*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.39*

*వర్జ్యం    : ఉ 09.57 - 11.32*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.14 రా 11.06 - 11.51*

*రాహు కాలం  :మ 03.26-05.02*

గుళికకాళం      : *మ 12.13 - 01.50*

యమగండం    : *ఉ 09.01 - 10.37*

సూర్యరాశి : *కర్కాటకం*           

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం :*ఉ 05.56*

సూర్యాస్తమయం :*సా 06.48*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.49- 08.23*

సంగవ కాలం        : *08.23 - 10.57*

మధ్యాహ్న కాలం    : *10.57 - 01.30*

అపరాహ్న కాలం  : *మ 01.30- 04.04*

*ఆబ్ధికం తిధి :ఆషాఢ బహుళ షష్ఠి*

సాయంకాలం    : *సా 04.04- 06.38*

ప్రదోష కాలం     : *సా 06.38- 08.52*

రాత్రి కాలం         : *రా 08.52 - 11.51*

నిశీధి కాలం        : *రా 11.51 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.20 - 05.04*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

నేనున్నాను

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*స్టేటస్‌లు పెరుగుతున్నాయి... కానీ సంబంధాలు ఎందుకు తగ్గిపోతున్నాయి?*

ఒక ప్రశ్న...

మీ ఫోన్‌లో వెయ్యి కాంటాక్ట్స్ ఉండొచ్చు...

వందల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు...

వేల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు...

కానీ...

అర్ధరాత్రి ఆపద వస్తే" నేనున్నాను అనే భరోసా ఇచ్చి చెప్పగలిగే మనిషి ఎంతమంది ఉన్నారు?

అదే జీవితానికి అసలు సమాధానం.

ఈరోజు మనం చాలా సంపాదిస్తున్నాం.

మంచి ఉద్యోగాలు... మంచి జీతాలు... మంచి ఇళ్లు... మంచి కార్లు...

కానీ...

మనల్ని నిజంగా ప్రేమించే మనుషులను మాత్రం కోల్పోతున్నాం.

ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం కనిపిస్తోంది.

అందరి చేతిలో ఫోన్ ఉంది...

కానీ ఒకరితో ఒకరు మాట్లాడే సమయం లేదు.

అందరూ ఆన్లైన్‌లో ఉన్నారు...

కానీ మనసులు మాత్రం ఆఫ్‌లైన్‌లో ఉన్నాయి.

ప్రతి రోజు "Good Morning" మెసేజ్‌లు వంద వస్తాయి...

కానీ "ఎలా ఉన్నావు?" అని నిజంగా అడిగే మనిషి చాలా అరుదు.

ఇప్పుడు మనం బంధాలను కూడా లాభనష్టాల కోణంలో చూస్తున్నాం.

"వాళ్లు మన ఇంటికి రాలేదు... మనం ఎందుకు వెళ్లాలి?"

"వాళ్లు ఫోన్ చేయలేదు... మనం ఎందుకు చేయాలి?"

ఇలా లెక్కలు వేసుకుంటూ...

మనుషులను ఒక్కొక్కరిని జీవితంలో నుంచి తీసేస్తున్నాం.

ఒక్కసారి ఆలోచించండి...

మన తాతలు, అమ్మమ్మలు వదిలింది కోట్ల ఆస్తులు కాదు...

కలిసిమెలిసి ఉండే సంస్కృతి.

మన తల్లిదండ్రులు నేర్పింది పెద్ద ఇళ్లు కట్టుకోవడం కాదు...

మనుషులను కలుపుకొని వెళ్లడం.

మరి మనం మన పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాం?

"ఫస్ట్ రావాలి..."

"ఎక్కువ సంపాదించాలి..."

"అందరికంటే పైకి వెళ్లాలి..."

అని చెబుతున్నాం.

కానీ...

"ఎవరినీ చిన్నచూపు చూడొద్దు..."

"బంధాలను వదులుకోవద్దు..."

"కష్టంలో ఉన్నవారికి తోడుగా నిలబడు..."

అని ఎంతమంది చెబుతున్నాం?

జీవితంలో ఒక నిజం ఉంది.

మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ అంత్యక్రియలకు రాదు.

మీ హోదా మీకు కన్నీరు పెట్టదు.

మీ కారు మీకు ఓదార్పు చెప్పదు.

మనుషులే వస్తారు.

బంధాలే నిలుస్తాయి.

ప్రేమే గుర్తుండిపోతుంది.

ఈరోజు మనం అహం కోసం మాట్లాడకపోతే...

రేపు మాట్లాడాలనుకున్నా వినే మనిషే ఉండకపోవచ్చు.

ఈరోజు మనం బిజీ అని దూరం పెడితే...

రేపు మన ఒంటరితనాన్ని పంచుకునే భుజం దొరకకపోవచ్చు.

ఒక్కసారి మీ ఫోన్ తీసుకోండి.

నెలలుగా మాట్లాడని ఒక బంధువుకు కాల్ చేయండి.

"ఎలా ఉన్నావు?" అని మాత్రమే అడగండి.

మీరు మొదలుపెట్టిన ఆ ఒక్క మాట...

ఒక విరిగిన బంధాన్ని మళ్లీ కలపవచ్చు.

మనం సోషల్ మీడియాలో వేల పోస్టులు పెడతాం.

ఒక్కసారి...

మన అమ్మానాన్నలతో గంటసేపు మాట్లాడామా?

మన అన్నాచెల్లెళ్లతో మనస్ఫూర్తిగా నవ్వుకున్నామా?

మన బంధువుల ఇంటికి పనిలేకుండా వెళ్లామా?

జీవితం చాలా చిన్నది.

అహం పెట్టుకోవడానికి కాదు...

మనుషులను హత్తుకోవడానికి.

డబ్బు సంపాదించండి...

కానీ మనుషులను కోల్పోయి కాదు.

విజయం సాధించండి...

కానీ బంధాలను త్యాగం చేసి కాదు.

పిల్లలకు ఆస్తులు ఇవ్వండి...

కానీ వాటికంటే విలువైన సంబంధాలను కూడా వారసత్వంగా ఇవ్వండి.

గుర్తుంచుకోండి...

మీ పిల్లలు మీరు సంపాదించిన డబ్బును కొంతకాలం మాత్రమే గుర్తుంచుకుంటారు.

కానీ మీరు ఎలా మనుషులను ప్రేమించారో...

ఎలా బంధాలను కాపాడారో...

అదే తరతరాలకు గుర్తుండిపోతుంది.

ఈరోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం.

అహం తగ్గిద్దాం.

క్షమించడం నేర్చుకుందాం.

ముందుగా మనమే పలకరిద్దాం.

కుటుంబాన్ని మళ్లీ కుటుంబంగా మార్చుకుందాం.

ఎందుకంటే...

మనిషి చనిపోయిన తర్వాత అతని బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎవరూ మాట్లాడరు...

అతను ఎంత మంచి మనిషో... ఎంతమందిని కలుపుకొని జీవించాడో... అదే మాట్లాడుకుంటారు.

మనం వదిలి వెళ్లాల్సింది ఆస్తులు మాత్రమే కాదు...

మన పిల్లలు గర్వంగా చెప్పుకునే బంధాల ప్రపంచం కూడా.

మార్పు ప్రపంచంలో రావాలని ఎదురుచూడకండి...

మీ ఇంటి నుంచే... మీ పలకరింపుతోనే ప్రారంభించండి.


శుభోదయం 🥰


💐🙏💐🙏💐

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 03.08.2026  Monday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం  గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష పంచమి తిథి ఇందు వాసర ఉత్తరాభాద్ర నక్షత్రం సుకర్మ యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: పంచమి



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।

యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ।। 20 ।।



ప్రతిపదార్థ:



యత్ర — ఎప్పుడైతే; ఉపరమతే — ఆంతర సుఖాన్ని రమించునో; చిత్తం — మనస్సు; నిరుద్ధం — నియంత్రించబడిన; యోగ-సేవయా — యోగ అభ్యాసము చేత; యత్ర — ఎప్పుడు; చ — మరియు; ఏవ — నిజముగా; ఆత్మనా — పవిత్రమైన మనస్సు ద్వారా; ఆత్మానం — ఆత్మ; పశ్యన్ — దర్శించుచూ; ఆత్మని — ఆత్మ యందే; తుష్యతి — సంతృప్తి గా ఉండును.



తాత్పర్యము: 



ఎప్పుడైతే, మనస్సు, ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు ఆంతర ఆనందంలో రమించును.



వివరణ:


ధ్యానం చేసే పద్ధతిని మరియు ధ్యానం యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిని వివరించిన పిదప, శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు, దాని పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియపరుస్తున్నాడు. మనస్సు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో, అప్పుడు వ్యక్తి ఆత్మను శరీర-మనో-బుద్దుల కంటే వేరుగా తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి, గ్లాసులో మురికి నీరు ఉంటే, దానిగుండా మనము చూడలేము. కానీ, ఆ నీటిలో పటిక వేస్తే, మురికి వేరైపోయి క్రిందికి దిగి, నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా, మనస్సు మురికిగా ఉన్నప్పుడు, అది ఆత్మ దర్శనాన్ని తెలియకుండా చేస్తుంది; మరియు ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానం, పుస్తకజ్ఞాన స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే, మనస్సు పవిత్రం అవుతుందో ఆత్మ అనేది అంతర్గత విజ్ఞానం ద్వారా నేరుగా అనుభవం లోనికి వస్తుంది.