,
అస్సలు జాతకాలు కలవడం అంటే ఏమిటో తెలిస్తే బాగుంటుంది. మీరు సంప్రదించిన ఇద్దరిలో ఒకరు కలవలేదన్నారు, ఒకరు కలిసిందన్నారు. ఇంతకీ ఈ కలవడం అంటే ఏమిటీ?
నాకు తెలిసిన విషయాన్ని క్ఌప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. దీన్ని సాధారణంగా ఈ ప్రక్రియని గుణమేళనం అంటారు. సరళంగా చెప్పాలంటే ఇద్దరి మధ్య వివాహ జీవితం సుఖంగా, స్థిరంగా ఉంటుందా లేదా అని అంచనా వేసే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ ద్వారా ఏమి తెలుస్తుందంటే,
- భర్త భార్యల మధ్య మనస్పర్థలు ఎలా ఉంటాయి?
- ఆరోగ్యం, సంతానం, ఆయుష్షు విషయంలో సమస్యలుంటాయా?
- ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం ఎలా ఉంటుంది?
- భవిష్యత్తులో పెద్ద గొడవలు లేదా విడాకుల ప్రమాదముందా?
వంటి వాటికి స్వాభావికంగా ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి వేసే గణన విధానం. సాధారణంగా అష్టకూట పద్ధతి ప్రకారం 8 అంశాలు చూసి మొత్తం 36 గుణాలు ఇస్తారు. అవి ఏమిటంటే,
౧) వర్ణం : ఇది ఆధ్యాత్మిక స్థాయి గురించి తెలియజేస్తుంది
౨) వశ్యం : దీని ద్వారా పరస్పర ఆకర్షణ ఎలా ఉంటుంది అనేది లెక్కించవచ్చు
౩) తార : ఈ గణన ద్వారా ఆరోగ్యం లేదా ఆయుష్షు వంటి వాటిల్లో ఒకరిపై మరొకరు ప్రభావం ఎంత ఉంటుందో లెక్కించవచ్చు
౪) యోని : ఇద్దరి మధ్య శారీరక/మానసిక అనుకూలత ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది
౫) గ్రహమైత్రి : ఇద్దరి మధ్య మానసిక స్నేహం ఏమాత్రమో తెలియజేస్తుంది
౬) గణం : జాతక అనేది వ్యక్తిత్వాన్ని తెలియజేస్తే, ఈ గణన వారి యడల ఇతరుల స్వభావం తెలుసుకోవచ్చు
౭) భకూటం : లెక్కించడం వల్ల వీరికి ఎంతవరకూ కుటుంబ సుఖం చేకూరుతుందో తెలుస్తుంది
౮) నాడి : ప్రకారం ఇద్దరికీ కలిగే సంతానంతో పాటు ఆరోగ్యానికి సంబందించిన విషయాలు కూడా విశ్లేషించవచ్చు.
సరిగ్గా చదివే వారికి కొన్ని ప్రశ్నలు రావచ్చు. అలాంటి వాటిల్లో ఆరొగ్యం అనే విషయం తారాగణన ద్వారా కూడా లెక్కించ వచ్చన్నారు కదా మరి ఆఖర్లో ఇదేమిటి నాడి లెక్క ద్వారా కూడా ఆరోగ్యం అంటున్నారు అని బుర్ర వాచేలాగా ఆలోచించకండి. నాడీ గణన ద్వారా
- దంపతులకు సంతానం కలగడంలో అడ్డంకులుంటాయా?
- పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుంది?
- వంశపారంపర్య (genetic) సమస్యల అవకాశాలు వంటివి లెక్కించ వచ్చన్నమాట
సాధారణంగా లెక్కించినప్పుడు వచ్చే మొత్తం కనుక 18 గుణాల కంటే ఎక్కువ వస్తే వివాహానికి అనుకూలమని భావిస్తారు. కానీ అక్కడితో సమస్య తీరదు. దోషాలు కూడా చూడాలి. ఉదాహరణకి
- కుజ దోషం, ఉత్తర భారతంలో దీనినే మాంగళిక దోషం లేదా మాంగలిక్ అని ప్రస్తావిస్తారు
- నాడి దోషం
- భకూట దోషం
కొన్ని దోషాలు పరిహారాలతో లేదా ఇద్దరి జాతకాల్లో సమానంగా ఉంటే రద్దు అవుతాయని కూడా చెబుతారు. చివరగా ఓ విషయం. చేదుగా ఉన్నా, అది నిజం. ఈ రోజుల్లో చాలామంది జాతకాల కన్నా, వ్యక్తిత్వం + పరస్పర అవగాహన నే ముఖ్యంగా తీసుకుంటున్నారు. కాబట్టి సతీష్ చంద్ర గారు చెప్పినట్లు విషయాన్ని అర్దం చేసుకుని, ఆడపిల్ల వారిని అంగీకరించే ప్రయత్నాన్ని విరమించుకో మనవి. ఎందుకంటే, చాదస్తపు మొగుడు చెబితే వినడంట, పోనీ గిల్లి చెబుదామంటే .. అసలుకే మోసమొస్తుందని నా అభిప్రాయము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి