2, జులై 2026, గురువారం

అంగదుడు

 వాలి వలెనే మహాబలవంతుడుఈ *అంగదుడు*

సీతాన్వేషణకయి సుగ్రీవునిచే దక్షిణ దిశకు పంపబడిన ఆంజనేయ జాంబవదాది ప్రముఖులకు నాయకత్వము వహించినవాడు ఈ *అంగదుడు*

సీత జాడ తెలుసుకొని తిరిగి వచ్చిన హనుమను నిర్మల హృదయముతో మెచ్చుకొని ప్రోత్సహించిన ఉత్తమ గుణములు కలిగినవాడు ఈ *అంగదుడు*

రావణుని చెంతకు రాయబారిగా వెళ్ళిన సమయమున తనను వధింప వచ్చిన నలుగురు భయంకర రాక్షసులను చంకలలో యిరికించుకొని నింగికెగసి అక్కడనుండి బలముగా విసరివేయగా వారు రావణుడు చూచుచుండగనే నేలపై పడి చావగా తాను నిలబడిన రావణప్రాసాదము బ్రద్దలయి పోగా మీసము దువ్వుచూ తన బలపౌరుషములను ప్రకటించి సింహనాదము చేసి ఆకాశమున కెగిరి వానరులమధ్య ఆసీనుడైయున్న మా శ్రీరామచంద్రమూర్తి చెంతకు చేరి వినమ్రతతో నిలబడిన శత్రుభయంకరుడు ఈ *అంగదుడు*

వజ్రదంష్ట్ర నరాంతక ప్రజంఘ మహాపార్శ్వాది రాక్షస వీరులను వధించినవాడు ఈ *అంగదుడు* 

గ్రహణ ధారణాదులగు అష్టాంగములు గల బుద్ధితో కూడినవాడని... 

బాహుబల మనోబల ఉపాయబల బంధుబలము లనెడు చతుర్బలములు కలిగినవాడని... 

దేశ కాలజ్ఞత మొదలగు చతుర్దశ గుణములతో ఒప్పుచున్న వాడని...

తేజస్సు బలము పరాక్రమము కలిగిన వాడని...

బుద్ధి యందు బృహస్పతి వంటి వాడని...

పరాక్రమముతో తండ్రికి సమానుడని...

సుగ్రీవుని కార్యమునందే దృష్టి పెట్టి శ్రమ పడుచున్నవాడనియూ... సాక్షాత్తుగా ఆంజనేయ స్వామివారిచేత కీర్తింపబడినవాడు ఈ *అంగదుడు*

వానరరాజగు సుగ్రీవునిచే కిష్కింధకు యువరాజుగా 

నియమింపబడినవాడు ఈ *అంగదుడు*

సుషేణుని పుత్రికయునూ... సూక్ష్మ బుద్ధి కలదియునూ... అర్థమును విశ్లేషించుటలో నేర్పరియునూ...రాబోవు ఆపదలను పసిగట్ట గలదియునూ... సమర్థురాలునూ అయిన తారకు జన్మించిన పుత్రరత్నము ఈ *అంగదుడు*

🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: