....☘️1 వాలి రాములు వారితో నన్ను చెట్టు చాటు నుండి చంపినావుఅది అధర్మం కదా అని అన్నప్పుడు రాములు వారి సమాధానం చూడండి🙏
*వాలి ఆక్షేపణలకు రాముని సమాధానం*
"వానరరాజా! ధర్మం గురించి సంశయం వస్తే పెద్దలను అడిగి తెలుసుకుని ఆపైన మాట్లాడాలి. ఇలా పరుషంగా మాట్లాడకూడదు.
సత్పురుషులు ఆచరించే ధర్మం చాలా సూక్ష్మమైనది. విశేషించి నేర్చుకుంటే తప్ప తెలుసుకోవడం చాలా కష్టమైనది.
చపలశ్చపలైః సార్ధం వానరైరకృతాత్మభిః, జాత్యస్ధ ఇవ జాత్యక్షైర్మన్తయన్ ప్రేక్షసే ను కిమ్.
పుట్టుగుడ్డివాడు మరికొందరు పుట్టుగుడ్డివాళ్ళతో ఆలోచించి ఏం చూడగలడు? అలాగే చపలుడివైన నువ్వు మరి కొందరు చపలురితో ఆలోచించి ధర్మం గురించి ఏం తెలుసుకోగలవు?
ధర్మార్ధకామాల గురించి, లోకమర్యాదను గురించి తెలుసుకోకుండా నీ యిష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. ఫలితం అనుభవించ వలసివస్తే నన్ను నిందిస్తున్నావు. నిన్ను చంపడం అధర్మమని వాపోతున్నావు. ఎందుకు చంపానో చెప్పమంటున్నావు..
*నిన్ను చంపడం ధర్మమే.* అది ఎలాగో విను.
నీ దేశం వేరు, నాదేశం వేరు అన్నావు. నా దేశంలో ఏ అపరాధమూ చెయ్య లేదన్నావు. కొండలతోనూ, మహాపర్వతాలతోనూ, మైదానాలతోనూ, చిట్టడవులతోను, ఘోరారణ్యాలతోనూ; జనపదాలతోనూ, నగరాలతోనూ కూడిన చతుస్సముద్ర పరివేష్టితమైన యీ భూమండలమంతా మహాపరాక్రమవంతులైన మా ఇక్ష్వాకువంశీయులదే. ఇదంతా మా రాజ్యమే. *మనుష్యులను, మృగాలను, పక్షులను నిగ్రహించడం, అనుగ్రహించడం మా అధికారంలో ఉన్నాయి.* నువ్వు మా రాజ్యంలోని అరణ్యంలో నివసిస్తున్నావు. మారాజ్యంలో అమలులో ఉన్న ధర్మాన్ని పాటించాలి.
ఈ రాజ్యంలో ధర్మం అవిచ్ఛిన్నంగా ఉండేలా పితృపితామహుల నుంచీ మేము కాపాడుతున్నాం. ఇప్పుడు ఈ రాజ్యాన్ని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలిస్తున్నాడు. తన రాజ్యంలో అధర్మం ఎక్కడా తలెత్తకూడదని భరతుడు ఆదేశించాడు. మేమే కాదు. అనేకమంది రాజులు భరతుడి ఆదేశానుసారం ధర్మపరిరక్షణ చేస్తున్నారు. మేమిద్దరమూ రాజాజ్ఞను పాటిస్తూ అరణ్యాలలో తిరుగుతున్నాము.
*శ్రేష్ఠమైన మాధర్మాన్ని మేము పాటిస్తూ భరతుడి ఆజ్ఞ ప్రకారం ఎవరైనా ధర్మాతిక్రమణం చేసారా అని పరిశీలిస్తాం.* అదీ మాకు తోచినట్లు కాదు. శాస్త్రానుసారంగా ధర్మవిచారణ చేస్తాం. ధర్మాన్ని అతిక్రమిస్తే శిక్షిస్తాం. *నువ్వు ధర్మాతిక్రమణం చేసావు. రాజదండనకు గురయ్యావు.*
ధర్మమార్గంలో ఉన్న ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. జన్మనిచ్చిన తండ్రి, విద్యనిచ్చిన గురువు, అన్నగారు ఈ ముగ్గురూ తండ్రులే అని తెలుసుకోవాలి.
అలాగే కన్నకొడుకు, గుణవంతుడైన శిష్యుడు, తమ్ముడు ఈ ముగ్గురూ తనకుమారులే అని భావించాలి.
కామంతో కళ్ళు మూసుకుపోయి వరుసకు కూతరైనతమ్ముడి భార్యనుగాని పొందేవాడిని శిక్షించాలని శాస్త్రం చెప్తోంది. నువ్వు తమ్ముడు భార్యని తీసుకొని వెళ్ళావునువ్వు ధర్మమార్గం తప్పావు. మేము రాజాజ్ఞప్రకారం ధర్మాన్ని నిలబెట్టాలి. అందువలన నీకు ఈ శిక్ష విధించక తప్పదు. ఇది మా కర్తవ్యం.
ఇక సుగ్రీవుడితో మైత్రి విషయానికి వస్తే, అతడు నువ్వు చేస్తున్న పాపకార్యం గురించి నలుగురిమధ్య చెప్పాడు. అది విని నీకు మరణదండన అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రకారమే నిన్ను వధించాను.
ఒక సంన్యాసి నువ్వు చేసిన పాపం వంటిదే చేస్తే, సంన్యాసి కదా అని మా పూర్వుడైన మాంధాత చక్రవర్తి అతణ్ణి శిక్షించకుండా వదిలేసాడు. అతణ్ణి వదలినందుకు ఆ పాపం మాంధాతకు చుట్టుకుంది.
ఇక నిన్ను చాటుగా ఉండి చంపానన్నావు. వానరరాజ్యానికి రాజువైనా *నువ్వు వానరుడివే. మానవులు జంతువులను వలలతోను, ఉచ్చులతోను, చిత్రమైన శబ్దాలు చేసి, ఇంకా అనేక కపట ఉపాయాలతోను బంధిస్తారు. ఇది తప్పు కాదు.* *రాజులైతే ఏకంగా మాటువేసి వేటాడుతారు. నువ్వు నాతో ఎదురుగా నిలిచి యుద్ధం చేసినా, మరొకడితో యుద్ధం చేస్తున్నా నువ్వు వానరుడివే. నిన్ను చాటుగా ఉండి చంపవచ్చు.*
జీవులు తమంత తాముగా సంపాదించలేని ధర్మాన్నీ, పవిత్రమైన జీవితాన్నీ రాజులే ఇస్తారు. . జీవులు తమంత తాముగా సంపాదించలేని ధర్మాన్నీ, పవిత్రమైన జీవితాన్నీ రాజులే ఇస్తారు.. *అనేక తరాలుగా అనుసరిస్తున్న ధర్మమార్గంలో నియమంగా నడిచే నన్ను దూషించడం నీకు తగదు.”*
రాముడి మాటతో వాలికి కనువిప్పు కలిగింది.
“ *రామా! నువ్వు చెప్పినదే సత్యం, ధర్మస్వరూపాన్ని ఇంత స్పష్టంగా నువ్వు తప్ప ఇంకొకరు తెలుసుకోలేరు. కార్యాకార్యాలను విశ్లేషించడంలో నీకు ఎవరూ సాటిరారు. కార్యం చేసినవారిని రక్షిస్తావు. అకార్యం చేసిన వారిని శిక్షిస్తావు."* అతడి గొంతు క్షీణించడం మొదలు పెట్టింది. వణుకుతున్న గొంతుకతో మెల్లగా రాముణ్ణి ప్రార్ధించాడు.🙏....
సేకరణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి