25, నవంబర్ 2026, బుధవారం

శివానంద లహరి - 17

  🌹🌷🪷🍁🛕🍁🪷🌷🌹


      *🌷 సౌమ్యవారం🌷*

*🌷26 నవంబరు 2026🌷*


*🌹జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య🌹* 

*🌷రచించిన శివానంద లహరి - 17🌷*శివుణ్ణి ఏమి కోరాలి**🐚🌹🙏


      **శ్లోక సంఖ్య – 17**


*ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో*

*ప్రసన్నేఽపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళమ్ |*

*కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం*

*నిలింపానాం శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః ||*


               *తెలుగు అర్థం*


ప్రభో! నా పుణ్యముచేతనో నీ కరుణచేతనో నీవు నాపై ప్రసన్నుడవైననూ, స్వామీ! నీ నిర్మల పాదపద్మములను ఎలా చూడగలను? నీకు నమస్కరించుటకై తొందరపడు దేవతల సమూహము తమ రత్నకిరీటములతో నన్ను అడ్డగించుచున్నది.


                 *విశేషార్థం*


నాలుగు శ్లోకాలలో తర్కంతో వాదించి దాని ఫలితంగానో, స్వామి కరుణో, పూర్వ పుణ్యమో చివరకు శంకరులు ఎలాగోలా పరమేశ్వర సన్నిధికి చేరారు (శంకరులు అంటే భక్తుడు; శంకరులకు ఇంత చర్చ అవసరం లేదు, మనకోసం చెప్తున్నారు).


అలా కైలాసం చేరి లోపలికి వెళ్ళాక పరమేశ్వరుని దర్శనం లభించింది. భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. కానీ స్వామి పాదాలను పట్టుకుని నమస్కరిద్దామంటే, కనపడట్లేదు! దేవతలే పోటీ పడుతున్నారు. నేనంటే నేను అని వాళ్ల కిరీటాలు నీ పాదాలకు ఆనించి మరీ నమస్కారం చేస్తున్నారు. కనీసం పాద దర్శనం కూడా అవ్వట్లేదు తండ్రీ అంటున్నారు శంకరులు...


దేవతలు తమ పదవుల కోసం, రక్షణ కోసం ఎప్పుడూ శివుని పాదాల వద్ద తలలు వంచి పోటీ పడుతుంటారు. వారి కిరీటాలలోని మాణిక్యాల వెలుగులో, ఆ గుంపులో సామాన్య భక్తుడికి స్వామి పాదాలు కనబడకుండా పోతున్నాయని శంకరులు పరమశివునికి ఫిర్యాదు చేస్తున్నారు.


అంటే ఎంతో కష్టపడి కైలాసం చేరినా ఆయన పాదాల దగ్గర చోటు దొరకడం సులభం ఏమీ కాదు. అక్కడ ఇప్పటికే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. నీ వంతు రావాలి అంటే ఎంత పుణ్యం చేసుకోవాలి ఆలోచించుకో అని మనకు చెప్తున్నారు ఇక్కడ..


మరి పాదాలే ఎందుకు ముఖం చూడొచ్చు కదా అంటే.. శివుని ముఖం వైపు చూస్తే మూడో కన్ను, పాములు, గంగ వంటివి ఉగ్రరూపంగా కనిపించి జీవుడికి భయం కలగవచ్చు. కానీ పాదాలు అభయాన్ని, చల్లదనాన్ని ఇస్తాయి. వాటిని ఆశ్రయిస్తేనే మన బతుకు ధర్మం వైపు, మోక్షం వైపు పోతుంది. సర్వస్య శరణాగతి ఎప్పుడూ పాదాలకే కానీ ముఖానికి, చేతులకు ఉండదు కదా...


భవసాగరాన్ని దాటించే నావలు భగవంతుని పాదాలే. అందుకే జ్ఞాని అయినా, భక్తుడైనా ముందు కోరుకునేది పాద స్పర్శను, పాద దర్శనాన్ని మాత్రమే.


దేవతలు తమ ఐశ్వర్యానికి, అధికారానికి గుర్తు అయిన కిరీటాలను తెచ్చి శివుని పాదాల వద్ద ఉంచుతున్నారు. అంటే ఎంతటి పదవిలో ఉన్నవారైనా, ఆ పరమేశ్వరుని పాదాల వద్ద తమ అహంకారాన్ని (కిరీటాన్ని) వదిలేయాల్సిందే అనే గొప్ప సందేశం ఇందులో ఉంది.


*🕉️శివాయ నమః.....🙏*


*మళ్ళీ రేపు కలుసుకుందాం మరొక శ్లోకంతో🙏*


   *🌷🪷సేకరణ🪷🌷*

     🙏*న్యాయపతి*🙏 

        *నరసింహారావు*

కామెంట్‌లు లేవు: