🌹🌷🪷🍁🛕🍁🪷🌷🌹
*🌷 భానువారం🌷*
*🌷15 నవంబరు 2026🌷*
*🌹జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య🌹*
*🌷రచించిన శివానంద లహరి - 7🌷*శివుణ్ణి ఏమి కోరాలి**🌹🙏
**శ్లోక సంఖ్య – 7**
**సంస్కృత శ్లోకం**
*మనస్తే పాదాబ్జే నివసతు వచస్త్సోత్రఫణితౌ*
*కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ |*
*తవధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తివిభవే*
*పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః || 7 ||*
**తెలుగు అర్థం**
పరమేశ్వరా
ఓ పరమేశ్వరా! నా మనస్సు నీ పాదపద్మములందునూ, నా వాక్కు నీ స్తోత్రపాఠములు చదువుటయందునూ, నా చేతులు నీ పూజయందునూ, నా చెవులు నీ చరిత్రలను వినుటయందునూ, నా బుద్ధి నీ యొక్క ధ్యానమందునూ, నా యొక్క కన్నులు నీ దివ్యమంగళ విగ్రహం చూచుటయందునూ స్థిరపడియుండుగాక. అటులైనచో ఇకమీద నా ఇంద్రియములు నీ స్పర్శ లేని వేరు విషయములు తెలిసికొనుటకు ఇచ్ఛగించవు. కావున అట్లు అనుగ్రహింపుమని భావము.
**వివరణ:**
ఇది నిత్య పూజలో తప్పక చెప్పుకోదగ్గ అద్భుతమైన శ్లోకం.
మనిషిని పక్కదారి పట్టించేవి ఇంద్రియాలు, వాటికి మూలమైనది మనస్సు. వీటిని బలవంతంగా అణచివేస్తే అవి తిరగబడతాయి. అలా కాకుండా, వాటికి అత్యున్నతమైన ఆనందాన్ని ఇచ్చే 'శివతత్త్వం' అనే ఆహారాన్ని అందిస్తే, అవి వాటంతట అవే తక్కువ స్థాయి విషయాలను (ప్రాపంచిక వ్యామోహాలను) వదిలేస్తాయి.
అందుకే శంకరులు అంటున్నారు— *"తండ్రీ! ఈ ఇంద్రియాలు నన్ను విషయసుఖాల వైపు తీసుకుపోతున్నాయి. వీటిని అదుపు చేసే శక్తి నాకు లేదు, ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకో. నా నోటితో నీ నామం తప్ప ఇంకోటి పలకకుండా, చెవులతో నీ చరిత్రలే వినేలా, చేతులతో నీ పూజే చేసేలా, కళ్ళతో నీ దివ్య మూర్తినే చూసేలా, బుద్ధి నిరంతరం నిన్నే ధ్యానించేలా అనుగ్రహించు. ఇలా నా ఇంద్రియాలన్నీ నీ సేవలోనే నిండిపోతే, ఇక లోకంలోని ఇతర విషయాల వైపు వెళ్లడానికి నా దగ్గర సాధనాలే మిగలవు కదా!"*
ఎప్పుడూ ఏదో ఒక పని చేసేవారికి ఖాళీ సమయం ఉండదు; ఖాళీ దొరికితేనే ఇంద్రియాలు పరుగులు పెడతాయి. అందుకే *"క్షణం కూడా ఖాళీ లేకుండా నీ సేవలో నా ఇంద్రియాలను నియోగించు తండ్రీ పరమశివ!"* అని పిలిచారు.
'శివ' అంటే మంగళప్రదుడు. 'పరమశివ' అంటే అత్యున్నతమైన మంగళ స్వరూపుడు. మన ఇంద్రియాలకు, మనస్సుకు ఏది నిజమైన మంగళమో (శ్రేయస్సో) అది తెలిసినవాడు ఆయనే కాబట్టి, ఆయన్నే నేరుగా శరణు వేడుతున్నారు.
ఈ ఒక్క శ్లోకంలో భాగవతంలో చెప్పిన నవవిధ భక్తి మార్గాలన్నింటినీ నిక్షిప్తం చేసి, మనస్సును, ఇంద్రియాలను పూర్తిగా ఈశ్వర సేవలో నింపేస్తే ఇక ఇతర విషయాలు లోపలికి వెళ్ళవు. అలా శుద్ధమైన మనస్సులోనే ఈశ్వరుడు నివాసం ఉంటాడు. నిజానికి భగవంతుణ్ణి మనం అడగాల్సింది ఇదొక్కటే!
*🕉️శివాయ నమః.....🙏*
*మళ్ళీ రేపు కలుసుకుందాం మరొక శ్లోకంతో🙏*
*🌷🌞సేకరణ🌞🌷*
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి