🌹🌷🪷🍁🛕🍁🪷🌷🌹
*🌷 బృహస్పతివారం🌷*
*🌷26 నవంబరు 2026🌷*
*🌹జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య🌹*
*🌷రచించిన శివానంద లహరి - 18🌷*శివుణ్ణి ఏమి కోరాలి**🐚🌹🙏
**శ్లోక సంఖ్య – 18**
*త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం*
*వహన్తస్త్వన్మూలాం పునరపి భజన్తే హరిముఖాః |*
*కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ*
*కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా ||*
*తెలుగు అర్థం*
ఓ శివా! లోకంలో నీవొక్కడవే కర్మఫలాన్ని, మోక్షాన్ని ఇచ్చేవాడవు. విష్ణ్వాది దేవతలు సైతం నీవనుగ్రహించిన దివ్య పదవులను అనుభవిస్తూ (ఆ పదవుల రక్షణకై, ఇంకనూ ఉత్తమమైన మోక్షపదవికై) నిన్నే మళ్ళీ మళ్ళీ కొలుస్తున్నారు. భక్తులపై నీకెంత దయ (అది అపరిమితము). నా ఆశ ఎంత (ఇంత అని చెప్పలేని అనంతమైనది). నా అహంభావాన్ని బాపి, సంపూర్ణ కటాక్షంతో నన్ను ఎప్పుడు రక్షిస్తావు?
*విశేష అర్థం*
"ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ" అంటాడు పరమాత్మ భగవద్గీతలో...
సాధారణంగా ఎవరైనా నాలుగు విధాలుగా లేదా నాలుగు సందర్భాల్లో భగవంతుని ప్రార్థిస్తారు:
1. ఆర్తితో: గజేంద్రుని లాగా కష్టంలో ఉన్నప్పుడు...
2. జిజ్ఞాసతో: ఉద్ధవుడిలా తత్త్వం తెలుసుకోవాలనే కుతూహలంతో...
3. అర్థార్థిగా: సుగ్రీవుడిలా ఏదో ఒక కోరిక తీరాలనే ఆశతో...
4. జ్ఞానంతో: ప్రహ్లాదుడిలా పరమాత్మ తత్త్వం తెలిసిన జ్ఞానిగా...
బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలందరికీ ఆయా దివ్య పదవులు లభించడానికి మూలం ('త్వన్మూలాం') పరమశివుని అనుగ్రహమే. అంతటి ఉన్నత పదవుల్లో ఉండి కూడా, అవి శాశ్వతం కావని తెలిసి, అంతకంటే ఉన్నతమైన మోక్షం కోసం వారు నిరంతరం ('పునరపి') శివుడినే ఆరాధిస్తున్నారు.
కానీ ఆదిశంకరులు ఇక్కడ సామాన్య జీవులందరి పక్షాన నిలబడి— "నాకు ఈ నాలుగు విధాలైన స్థితులూ లేవు, నాకు అవి వద్దు కూడా! నాకు దేవతల లాంటి భోగభాగ్యాలు, అధికార పదవులు వద్దు; చివరికి శాస్త్ర పాండిత్యం వల్ల వచ్చే అహంకారపూరిత జ్ఞానం కూడా వద్దు... కేవలం నీ పాద సేవ, నీ కరుణా వీక్షణం చాలు" అంటున్నారు. ఎందుకంటే, పైన చెప్పినవన్నీ రావాలన్నా ఎంతో సమయం పడుతుంది; ఒకవేళ వచ్చాక సంపూర్ణత ఉంటుందా అంటే అదీ లేదు—ఇంకా ఏదో పొందాల్సింది మిగిలే ఉంటుంది. నా 'ఆశకు' అంతం లేదు; ఒక కోరిక తీరగానే మరొకటి ఇలా వస్తూనే ఉంటాయి.
కనుక ఏది పొందితే ఇక పొందాల్సింది ఏదీ ఉండదో దాన్ని ఇవ్వు స్వామి. అది నీవు మాత్రమే ఇవ్వగలవు. నీ 'దాక్షిణ్యానికి' కొలత లేదు. నీ కరుణాపూరిత దృష్టిని నాపై ప్రసరింపజేసి, నీ పాద సేవా భాగ్యాన్ని ఇచ్చి నన్ను రక్షించు తండ్రీ అని శంకరులు శరణాగతి చేస్తున్నారు.
మనం కూడా భగవంతుని అదే కోరుకోవాలి.
*🕉️శివాయ నమః.....🙏*
*మళ్ళీ రేపు కలుసుకుందాం మరొక శ్లోకంతో🙏*
*🌷🌷సేకరణ🌷🌷*
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి