15, జులై 2020, బుధవారం

ఆశా దీపం -- కధ

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది.  

 అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.

ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు.

 ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు.

ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. 🏚️ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.

ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. 

తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి.  🔥

తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  

తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.😢😢

తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది.

అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. 😀

ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.

“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.

ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు ............ 

 ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి..........     

ఉన్నతులు

ఏ పనిచేస్తే ప్రజలకు ఉపకారం జరుగుతుందో, లోకానికి మేలు చేకూరుతుందో, ఏ పని ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తుందో- ఆ పనిని ఉన్నతమైనదిగా నలుగురూ ప్రశంసిస్తారు. ఆ పని చేసిన వ్యక్తిని లోకం సదా గుర్తుంచుకొంటుంది, స్మరించుకుంటుంది. ఉన్నతుడని కీర్తిస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా సమాజం ఇలాంటివారి పట్ల గౌరవభావాన్ని ప్రదర్శిస్తుంది.

మానవ మనుగడకే కాకుండా సమస్త ప్రాణులూ బతకడానికి కావలసిన సకల పదార్థాలనూ సమకూర్చే భూమాతకు రోజూ నిద్రలేచాక కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ మంచం మీద నుంచి మన పాదాలను నేల మీదికి దించుతాం. భూమాత ఔన్నత్యాన్ని స్మరించుకుంటాం. సర్వకాల సర్వావస్థలయందు సకల జీవుల్నీ సంరక్షించే సర్వేశ్వరుడు సర్వోన్నతుడు. లోకేశ్వరుడి లక్షణ స్వభావాన్ని మానవులమైన మనం ఒంటపట్టించుకొని పరోపకారానికి నడుం బిగించాలి. పంచభూతాలలో ఒకటైన నేలతల్లి కూడా తన శక్తినంతటినీ సకల జీవులకు ధారపోస్తూనే ఉంది. తనలో నిక్షిప్తమైవున్న లోహాలు, చమురు మొదలైన పదార్థాలు ప్రజలకు నిరంతరం ఇస్తూనే ఉంది. భూదేవికి గల ఈ దాతృత్వమే ఆ తల్లి ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. సకల జీవులకూ ప్రాణవాయువును అందిస్తున్న వాయువు, ప్రాణసమానమైన నీటిని ఇస్తున్న వరుణుడు, వేడిమినిస్తున్న అగ్ని... వీళ్లంతా లోకాలను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నందువల్ల ఉన్నతులయ్యారు. పంచభూతాల్లోంచి ఆవిర్భవించి వారికి వారసులమైన మనమంతా ఆ ఔదార్యాన్ని, లోకోపకార గుణాన్ని పుణికిపుచ్చుకోవాలి. సమస్త ప్రాణికోటికీ సేవలు అందిస్తూ ఉండాలి. వారిలాగా మనం కూడా ఉన్నతులమనిపించుకోవాలి.
గోదావరి నది మీద ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించి కాలవల ద్వారా నీటిని సరఫరాచేస్తూ ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు సాగునీటికి తాగునీటికి కొరతలేకుండా చేసి అన్నపానీయాలను అందించి మహోన్నతుడయ్యాడు కాటన్‌ దొర. ప్రజల ఆకలిదప్పులను తీర్చడంలో తమ ధనప్రాణాలను సైతం అర్పించిన సహృదయులు, ఉదారులు ఎంతోమంది ఉన్నతులుగా లోకంలో విఖ్యాతిగాంచారు. ప్రాచీన భారతదేశంలో శిబి చక్రవర్తి, రంతిదేవుడు, దధీచి మొదలైనవారు పరుల కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఉన్నతులుగా ప్రసిద్ధిచెందారు.

నిటారుగా, ఉన్నతంగా ఎదిగివున్న చెట్ల కొమ్మలు పండ్ల భారంతో కిందికి ఒదిగి ఉంటాయి. ప్రజలకు, పక్షులకు తమ ఫలాలను ఆహారంగా అందిస్తాయి. ఆకలిని తీరుస్తాయి. ఇతరులకు సేవచేస్తూ చెట్లు తమ ఔన్నత్యాన్ని నిరూపిస్తున్నాయి. మనం పొలాల్లో ఏతంతో నీరు తోడుతున్న రైతును చూస్తాం. నీటిని బయటకు తెచ్చే ఏతంమాను చేస్తున్న పని వల్ల పొలం చక్కని పంటనిచ్చి ప్రజలకు ఉపకారం చేస్తోంది. ఏతంమానులాగే శక్తిమంతుడు, సమర్థుడు అయిన వ్యక్తి ఏ కారణం చేతనో ఎదుటివారి ముందు తలదించుకోవలసి వచ్చినా అతడిని అసమర్థుడని భావించరాదని పెద్దలు చెబుతారు. అతడు తన ఔన్నత్యాన్ని చాటుతూ- మళ్లీ   నలుగురిలో మన్ననలందుకొనే ఘనకార్యాలు చేస్తూనే ఉంటాడు.
ఈనాటి బాలలే రేపటిపౌరులు అని మనం భావిస్తాం. పెద్దవారయ్యాక ఆ బాలలు మంచి పౌరులుగా అందరి మన్ననలు పొందగలిగినప్పుడే గదా మన ఈ భావన సార్థకమవుతుంది. అందువల్ల పిల్లల్ని సాకే తల్లి, బిడ్డలను పాఠశాలకు పంపి విద్యాబుద్ధులు చెప్పించే తండ్రి తమ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతోపాటూ లోకజ్ఞానం, పారమార్థిక విషయాలను కూడా బోధిస్తారు. పిల్లలూ తమ గురువులు చెప్పిన విషయాలను ఒంటపట్టించుకొని పెద్దవారయ్యాక ఉత్తమపౌరులకు ఉండవలసిన లక్షణాలతో సమాజంలో మెలిగినట్లయితే- తల్లిదండ్రులు, గురువుల శ్రమ ఫలిస్తుంది. ఉన్నత మార్గంలో పయనించే తమ పిల్లల్ని చూసి లోకం ప్రశంసిస్తుంది. సమాజ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమ కర్తవ్యాలను నిర్వర్తించిన వారే ఉత్తమ, ఉన్నత పౌరులు కాగలుగుతారు.
**********

చిట్టికథ

ఒక మహారాజుకి సకల భోగాలు అనుభవిస్తున్నా తెలియని అసంతృప్తి వెంటాడుతుండేది. ఏదో వెలితి బాధ పెడుతుండేది. అదే వ్యాకులతతో రోజూ సాయంకాలం తన ప్రాసాదంపై ఒంటరిగా పచార్లు చేస్తుండేవాడు.

అలా నడుస్తూ దూరంగా ఓ పూరి గుడిసెలో కుండలు చేసుకుని కాలం గడుపుతున్న ఓ పేద కుటుంబాన్ని గమనిస్తుండేవాడు.

పైకి సామాన్యంగా సాగిపోతున్నా ఆ కుమ్మరి కుటుంబంలో ఏదో తెలియని ఆనందం తాండవిస్తున్నట్లు మహారాజుకు అనిపించింది. ఎలాగైనా ఆ ఆనందం రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడాయన.

మరుసటి రోజు చీకటి పడుతున్న వేళ మహారాజు మారువేషంలో ఆ కుమ్మరి ఇంటి తలుపు తట్టాడు.

అనుకోని అతిథి వచ్చినా, ఆ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. సపర్యలు చేశారు. ఉన్నదాంట్లోనే మంచి ఆతిథ్యమిచ్చారు.

అప్పుడా మహారాజు ఇంటి యజమానితో, ‘నేనెవరో తెలియకపోయినా ఆత్మీయంగా ఆదరించారు. నేను పక్క ఊరిలో శ్రీమంతుణ్ణి. నా దగ్గర డబ్బుకు కొదవలేదు. ఇదిగో ఈ కానుక తీసుకోండి’ అంటూ వజ్రాల హారాన్ని బహూకరించబోయాడు.

వెంటనే ఆ కుమ్మరి చిరునవ్వుతో ‘మీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ రోజూ కష్టానికి తగ్గట్టుగా సంపాదించుకుంటూ, అందులోనే ఆనందాన్ని వెదుక్కుంటున్న మా జీవితాలను ఈ  బహుమతి కకావికలం చేస్తుంది. లేనిపోని ఆశలను ప్రేరేపిస్తుంది. కొత్త కోరికలవైపు పరిగెత్తిస్తుంది. కుండల అమ్మకంలో నా ఆదాయం పెరిగితే సంతోష పడతాం. తప్ప ఇలా కాదు. ఆకస్మికంగా వచ్చిపడే సంపద తృప్తి కన్నా అపరిమిత దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది.’ అని చెప్పాడు.

అలా మహారాజుకు కొత్త పాఠాన్ని నేర్పాడా కుమ్మరి.

ఉన్నదానితో తృప్తిపడేవాడు రాజులా ఉండగలడు .

భోగో యస్య సదాహేయ: ప్రియ: స్యాత్‌ నిత్య మస్తిత:

ససర్వ మంగళో పేతోపి అవశ్యం స్యాదంకిచన:* 

భోగము అనగా సుఖమును అనుభవించవలెను అని కోరిక. భోగము ఎంత ఇష్టమైననూ అది శాశ్వతము కాదు కావున దానిని విడువవలెను. భోగమును బాగా అనుభవించవలెనన్న కోరిక కలవారు సకల శుభములు, సంపదలు కలవారైననూ ఏమీ లేనివారే అగును. 

ఉన్నదంతా అనుభవించాలన్న కోరికతో అనుభవించడం మొదలుపెడితే అన్ని సంపదలు తొలగిపోతాయి.

 అనుభవించేది తృప్తి కొరకే కావున ఒకసారి తృప్తి పొందిన వారు మరల కావాలని అర్రులు చాస్తూ తపిస్తూ ఉంటే అన్ని ఉన్నా లేనివారే అగుదురు.

 భోగాని కి, సంపదకు తృప్తి పరమావధి. ఆ తృప్తి లేనివాడు సంపదలు ఉన్నా లేనివాడే.

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిఆలయం

ఆలయం దర్శనం ఉదయం 9:30 నుండి 12:30  వరకు మరియు మధ్యాహ్నం 2:30  నుండి సాయంత్రం 7:30 వరకు 

రాష్ట్రంలోనే అత్యంత పురాతన లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట ఆలయం అంతర్వేది. ఆంధ్ర తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది... అందమైన బంగాళాఖాతం ఒడ్డున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమ స్థానంలో అలరారుతోంది. భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి విశేషాలు.

కృత యుగం లోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్‌, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టుడు ఇక్కడ యాగం చేసినందు మూలంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధిగాంచినది.

 రక్తవలోచనుని కథ..:
ఒకానొక సమయంలో రక్తావలో చనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భ వించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంట కుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణు లను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒక సారి విశ్వామిత్రుడుకి, వశిష్ఠుడుకి జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరి స్తాడు.

వశిష్ఠ మహర్షి శ్రీమహావిష్ణువును ప్రార్థించగా మహా విష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభ త్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుం డి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహారం తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

- ఆలయ విశేషాలు:
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీకొపనాతి కృష్టమ్మ. ఈయన పెద్దాపురపు జమిందారుల కుటుంబీకుడు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణం ఈయన విరాళాలు, కృషి ద్వారానే జరిగి నది. ఆలయ ప్రధాన ముఖద్వారము నకు ముందు ఈయన శిలా విగ్ర హము కలదు. ఈ ఆలయ ము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాల యము రెండు అం తస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా (నడవా) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా వశిష్టానదికి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు. ఈవిధంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసి నారు. ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింప బడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి.

- వశిష్టాశ్రమము:
అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమ ము కలదు. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్ర మ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయము లతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడినది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా నాలుగు అం తస్తులుగా నిర్మించినారు. చుట్టూ సరోవరము మధ్య కలు వపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా ద్యానమందిరం, పఠనా శాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి కల వు. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు కలవు.

- దీప స్తంభం:
దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా దీప స్తంభం (లైట్‌ హౌస్‌) కలదు. దీనిని బ్రిటిష్‌ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్‌, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విధ్యార్ధులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. లైట్‌ హౌస్‌ పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి కలదు. మూడురూపాయల నామమాత్ర రుసుము టికెట్‌ కొరకు వసూలు చేస్తారు. దీని పనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, వశిష్టాశ్రమము, మిగిలిన దేవాలయములు, దూరదూరం గా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీర్రపాంతము వెంబడి కల సర్వితో టలు అత్యద్భుతంగా కానవస్తాయి.

- అశ్వరూ డాంభిక (గుర్రా లక్క) ఆలయము...
నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాల యమునకు ఒక కిలోమీ టరు దూరములో కలదు. స్థల పురాణ రెండవ కధనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపు డు నరహరిఆతన్ని సంహరించేందు కు వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.

- అన్న చెళ్ళెళ్ళ గట్టు:
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సర్వేజనా సుఖినోభవంతు 
 ధర్మశాస్త సేవాసమితి విజయవాడ 7799797799

note: copied from a whatsapp post. 

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

ఆధ్యాత్మిక వేత్త,ప్రసిద్ధ ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు జన్మదినం నేడు. ఆసందర్భంగా వారికి శుభాకాంక్షలు. జననం 14 జూలై 1959

బ్రహ్మశ్రీ చాగంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. వీరు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు.  బ్రహ్మశ్రీచాగంటి సుందర శివరావు, శ్రీమతి సుశీలమ్మల పుణ్య దంపతులకు వీరు 1959 జూలై 14వ తేదిన జన్మించారు. కోటేశ్వరరావు గారి  సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; వీరి ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. వీరు ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. వీరికి ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. సామాన్య కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న, అన్న  స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచే వారి విద్యాబుద్ధులు వికసించాయి.వారు యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

వారి ధారణాశక్తి చాలా గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం తన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.

వారు ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. వారి స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.

చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.

వారు  బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వంటి వారి ఆవశ్యకత ప్రస్తుత మన తెలుగు సమాజానికి ఎంతేనా వుంది. ధర్మం గాడి తప్పుతున్న ఈ తరుణంలో మన హిందూ సంస్కృతీ, సంప్రదాయాలు, ఆచారాలు, దైవ చింతన తెలిపే మహానుభావుల దివ్య ప్రసంగాలు ఈ సమాజపు దారి తెన్నులు మర్చి హిందుత్వం వైపు సమాజాన్ని నడిపించే దిశగా పయనించాలిసిన అవసరం వుంది. ఇతర మతస్తులు మన మతాన్ని హీనంగా విమర్సిస్తూవుంటే వారి విమర్శలను ఎదుర్కొనే శక్తి ప్రతి హిందువుకు కావలి.  అప్పుడే మనం మత మార్పులను ఎదుర్కోగలుగుతాము. 

తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం.


ఇప్పుడు బళ్ళలో కూడా... 
ఎప్పుడో కొన్నేళ్ళక్రితం 
నాయని జయశ్రీ రాసిన వ్యాసం....

"డోర్ లాక్ చెయ్యకండి"

‘నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ?’
ఇందులో ‘కార్’ తప్ప అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
కానీ మనం వాడం.

ఎందుకు? 
ఇది ఈరోజు నాకు హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదు. 
చాలా రోజుల నుంచీ మనసులో నలుగుతున్న ప్రశ్నే.
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 
తలుపు తాళం వేసుకో, 
గడిపెట్టుకో అనే వాళ్ళం. 
ఇవేకాదు, 
చిన్నతనంలో వినిన, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్నమొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం?

మన తెలుగులో మాటలు లేవా? 
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి. 
కానీ మనం పలకం. 

వంటింటిని కిచెన్ చేసాం. 
వసారా వరండాగా మారింది. 
ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.

మన ఇళ్ళకి చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. 
గెస్ట్‌లే వస్తారు. 
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. 
ఏ లంచో, డిన్నరో చేస్తారు. 
భోజనానికి కూర్చొన్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 
అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై, చికెన్, మటన్ వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, కోడికూర, మాంసం తినండి అంటే ఇంకేమన్నా ఉందా,  
వాళ్ళేమనుకుంటారో అని భయం.
అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసికెళ్ళం. 
బ్యాగ్ పట్టుకుని షాప్‍కి వెళ్తున్నాము. 
అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. 
కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడని అడిగా. 
ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి? అని ఎదురు ప్రశ్న వేసింది. 
బిత్తరపోవడం నావంతయింది. 

టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 
వంటా-వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళకి అలవోకగా ఆంగ్లపదాలు పట్టుబడతాయి మరి. 
అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 

టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకి వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 
అది ఏ భాషో మీరే చెప్పండి. 
‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి, 
ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, 
స్టౌవ్ ఆఫ్‍చేసి మసాలాపౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలా సాగుతుంది. 
మరి మన కూరలకి అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?

నిన్న మా పక్కింటాయన వచ్చి 
‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, 
ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ 
అని చెప్పి వెళ్ళాడు. 
మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. 
అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 
అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. 
ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. 
స్కూల్‍కే పంపిస్తాం. 
సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు. 
ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 

మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలని వదిలేస్తున్నాం? 
ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా? 
తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి? 
ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు. 
నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, 
నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 
ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. 
ఒకప్పుడు సంస్కృతం పట్ల ఇదే దృక్పథం అలవరచుకున్న తెలుగు వాళ్ళు 
తూర్పు పడమర మిగిల్చారు 
కానీ ఉత్తరం దక్షిణం మరచిపోయారు. 
ఈ కాలంలో ‘వడ’, ‘తెన్ను’ అంటే ఎవరికి తెలుస్తుంది? 
‘జనని సంస్కృతంబె ఎల్ల భాషలకును’ 
అని భావించిన గొప్పగొప్ప పండితులు 
వారి పాండిత్య ప్రకర్ష కోసం తెలుగు మాటలు వదిలేసి సంస్కృతం వాడటం మొదలుపెట్టారు. 
వారి దగ్గర పాఠం వల్లెవేసిన వాళ్ళకి అదే గీర్వాణం వంటబట్టింది. 

అదే వరవడిలో మనకి పగలు మిగిలింది, మావు చీకట్లో కలిసిపోయింది. 
ఉసురుకి ప్రాణం పోయింది. 
ఎడం దూరం అయింది. 
అన్నం తినడం మొదలు పెట్టాక కూడు చద్దిపట్టింది. ప్రస్తుతం మనం సంతోష పడాలన్నా, 
బాధ పడాలన్నా, 
ఆఖరికి భయపడాలన్నా 
సంస్కృతంలోనే పడుతున్నాం. 
ఇలా చెబుతూ పోతే వీటికి అంతే లేదు.  

వివిధ జానపద కళారూపాలలో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం, 
శాసనాలు దేశీయ ఛందస్సు లోనే ఉండేవి. 
తెలుగు కవులు దేశి కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది. 
ఇంత జరిగినా మన పల్లె పట్టుల్లో మాత్రం 
జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి. 
వారి నోట అచ్చ తెనుగు మాటలే వినిపించేవి. 

ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

ఈ మధ్య ఓ సారి ప్రయాణం మధ్యలో 
ఒక చిన్న పల్లెటూర్లో కారు ఆపి 
ఇక్కడ మంచినీళ్ళ సీసాలు ఎక్కడ అమ్ముతారు బాబూ అని ఒకతన్ని అడిగా. 
అతడు కొంచెం వింతగా నావైపు చూసి, 
మినరల్ వాటర్ బాటిల్సా మేడం? అన్నాడు. 
అవునయ్యా అన్నా. 
అలా చెప్పండి మేడం అర్థం అవుతుంది, 
అని అవి అమ్మే చోటు చూపించాడు. మూలమూలలకి విస్తరించిన టివి ప్రసారాలు, 
ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాల త్వరగా జరుగుతూ ఉంది. 

భాషలో లేని పదాలను 
పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల 
ఆ భాష పరిపుష్టమౌతుంది. 

అలాగని వాడుకలో ఉన్నమాటలని వదిలేసి 
పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది. ఇంకా సమయం మించిపోలేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు 
అంతరించి పోకుండా ఉండాలంటే మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి. 

బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా,కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం. 

-జయశ్రీ నాయని

అయనాలు అంటే ఏమిటి

సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.

ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.

ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే, అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21, సెప్టెంబరు 23. మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.

ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.

శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.

ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాదులు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ ఋణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.

ధ్యానం, మంత్ర జపాలు, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు, పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారికి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయని, పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు.

- సేకరణ

దక్షిణాయనం అంటే ఏంటీ ?

ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం , జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం , సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.
ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన , దాన , జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.

ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ , దక్షిణాయనాలు. 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే , అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21 , సెప్టెంబరు 23.  మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.
ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు , మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.
శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప , దాన , పూజలు ఆరోగ్యాన్ని , అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.

ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహలయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి , ఎంతో ముఖ్యం , శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.

చేయవలసినవి

ధ్యానం , మంత్ర జపాలు , సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు , పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు , సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం , అవసరంలో ఉన్న వారికి దానం చేయడం , అన్నదానం , తిల (నువ్వుల ) దానం , వస్త్ర దానం , విష్ణు పూజ , విష్ణు సహస్రనామ పారాయణ , సూర్యరాధన , ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి , మనసుకు మేలు చేస్తాయని , పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు.

ఓం నమో నారాయణాయ నమః

నారాయణుడే మనలో వాసుదేవుడిగా దిగివస్తాడు. ఇంకొంచెము దిగివస్తే సంకర్షణుడు అవుతాడు. ఇంకొంచెము దిగివస్తే ప్రద్యుమ్నుడు అవుతాడు. మన మనసులోకి పూర్తిగా దిగివస్తే అనిరుద్ధుడవుతాడు. 

అనిరుద్ధుడు మన మనసులో కూర్చుంటే మన ఇంద్రియాలన్నీ చేయవలసిన పనులే చేస్తాయి. 

బుద్ధిలో ప్రద్యుమ్నుడు కూర్చుంటే చేయవలసిన పనులే ఎలా చేసుకోవాలో తోస్తాయి. 

సంకర్షణుడు వాసుదేవునితో ఉంటే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు పనిచేస్తూ ఉంటారు.

రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులలో రాముడు వాసుదేవుడు, లక్ష్మణుడు సంకర్షణుడు, భరతుడు ప్రద్యుమ్నుడు, శత్రుఘ్నుడు అనిరుద్ధుడు అందరూ కలిసి వున్నట్టే.

బాధాతప్త జీవితాలు…



👉అవును, ఎవడి ఖర్మ ఎప్పుడు కాలిపోతుందో అర్థంకాని జీవితమైపోయింది అందరిదీ.. 
👉హమ్మయ్య, ఇవాల్టికి నాకు కరోనా రాలేదు.. గండం గడిచిపోయిందనుకుని సంబరపడిపోయి బతికేసే రోజులు వచ్చేశాయి..
👉ఏదీ ఇంతకుముందులా జీవితం లేదు.. ఇక ముందూ ఉండకపోవచ్చు.. అంతా విచిత్రం. అంతా విడ్డూరం..
అంతా భయం .. భయం .. భయం.

👉పక్కింటోళ్లతో మాట్లాడుకోవడం మానేశాం.. పక్కింటి పిల్లల్ని మన ఇంటికి రానివ్వడం ఏనాడో మర్చిపోయాం..ఎక్కడ కరోనా వస్తుందోనని..మన పిల్లల్ని నాలుగు గోడల మధ్య కట్టేస్తున్నాం.. కరోనా పుట్టుపూర్వోత్తరాల గురించి మాటలు రాని పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పేస్తున్నాం. ఆఖరికి పక్కింటోళ్లు పెట్టిన దేవుడి ప్రసాదం కూడా తినడం మానేశాం.ఎక్కడ ఆ కరోనా పురుగు అందులో ఉందోనని..
👉ఏదో తెలీని అంటరాని తనం తెలియకుండానే మనం అలవాటు చేసేసుకున్నాము..

👉ఇంట్లో కూడా చాలా మంది మాస్క్ లు కట్టుకుని బతికేస్తున్నారు. _కూరగాయలపైనా శానిటైజర్ కొట్టి ఎండలో ఎండబెట్టి వండుకుంటున్నారు..
_రోజుకు వందసార్లు చేతులు కడిగేస్తున్నారు.
_మాస్క్ కట్టీ కట్టీ మూతి తెల్లగా అయిపోయింది..
_చేతులకు శానిటైజర్ రాసీ రాసీ.. పొట్టు ఊడిపోతోంది.. _కషాయాలు తాగీ తాగీ నోరంతా అదోమాదిరిగా తయారైంది..

👉పండగలు, పబ్బాలు నాలుగు నెలల క్రితమే మానేశాం.. 
_నలుగురు కలిసి సంతోషంగా నవ్వుకుని నాలుగు నెలలు దాటిపోయింది.
👉మందు కొట్టేటప్పుడు తాగుబోతులు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసేస్తున్నారు.
_కబుర్లు చెప్పుకుంటూ చాయ్ దుకాణం దగ్గర చాయ్ తాగుతూ.. సిగరెట్ పీకే ఆలోచనలు కల్లోకి కూడా ఎవరికీ రావడం లేదు.
_పాలప్యాకెట్ వేసేవాడు కూడా ఇంటి కింద గేటు దగ్గరే వేసి వెళ్లిపోవాలి..
_ఏ ఆమెజానోడో.. ఫ్లిప్ కార్టోడో ఖర్మకాలి ఇంటి గుమ్మం దాకా వచ్చాడో చచ్చాడే.. గుమ్మానికి ఆవతలెక్కడో ప్యాకెట్ విసిరి పారేస్తే తెచ్చుకుని దాన్ని శానిటైజర్ లో ముంచి లేపి గానీ ఓపెన్ చేయడం లేదు.. ఎక్కడ మహమ్మారిని అందులో ఏమూలో వేసుకొచ్చాడోమోనని..
_స్విగ్గీలు, జొమాటోల్లో ఆర్డర్లు మానేశాం.. ఒకవేళ ఆర్డరిచ్చినా ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ నే ఆర్డరిస్తున్నాం.అంతేగాదు ఆర్డరిచ్చేముందే డెలివరీ బాయ్ కి నో కాంటాక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం..

👉పార్క్ ల్లో ప్రేమ జంటల కిలకిలలు, ముద్దూ ముచ్చటలూ మాయమైపోయాయి..
_స్విమ్మింగ్ పూల్స్ లో స్విమ్మింగ్ మానేసాం..
_అందమైన జలపాతాలు, పర్యాటక ప్రాంతాల్లో ఫ్యామిలీతో కలిసి వెళ్లడం అనేది.. ఊహల్లో మాత్రమే..
_సినిమా దియేటర్ లో పాప్ కార్న్ తింటూ సినిమా చూసే రోజులు పోయాయి.. ఇకపై ఉండకపోవొచ్చు..
_ఆఫీసులన్నీ బోసిపోయాయి… షాపులన్నింటికీ తాళాలు పడిపోయాయి..
_కర్మాగారాలన్నీ మూతబడిపోయాయి..
_వ్యాపారాలన్నీ నాశనమై పోయాయి..ఉద్యోగాలన్నీ ఎగిరిపోయాయి.. జీవితం సంకనాకిపోయింది…

👉అంతా భయం.. భయం.. భయం..
_బయటికెళ్తే కరోనా..
_టీ తాగితే కరోనా..
_సమోసా తింటే కరోనా.. 
_పానీ పూరి తింటే కరోనా..
_కూరగాయల్లో కరోనా..
_పాలల్లో కరోనా..
_షాపుకెళ్తే కరోనా…
_పార్క్ కెళ్తే కరోనా..
_వాకింగ్ కెళ్తే కరోనా..
_గుడికి వెళ్తే కరోనా… చర్చికి వెళ్తే కరోనా..పెళ్లి కి వెళ్తే కరోనా… ఫంక్షన్ కి వెళ్తే కరోనా.. ఎక్కడికి వెళ్లినా కరోనానే..

👉ఏం చేస్తున్నాం..ఎవడు ఏం చెప్పినా వెంటనే పాటించేస్తున్నాం..
_ఎవరో ఏదో తింటే కరోనా రాదంటే అది కసకసా నమిలి మింగేస్తున్నాం..
_ఎవరో ఏదో తాగితే కరోనా రాదంటే పిచ్చి కషాయాలన్నీ తాగేస్తున్నాం..

👉కరోనాతో చచ్చింది కన్నతండ్రైనా.. తోడబుట్టిన సోదరి అయినా కడుపున బుట్టిన పిల్లలైనా ఎవరి దగ్గరకూ వెళ్లలేకపోతున్నాం.. మూటగట్టి నిర్ధాక్షిణ్యంగా శవాన్ని బుల్డోజర్ తో మున్సిపాల్టీ వాళ్లు గోతిలోకి విసిరిపారేస్తే టీవీల్లో చూసి కన్నీళ్లు పెట్టేసుకుంటున్నాం..
👉పక్కింటోడికి చిన్న జ్వరం వచ్చినా కరోనా వచ్చిందేమోనని ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోతున్నాం… రోడ్డుమీద ఎవరైనా తుమ్మితే, దగ్గితే వణికిపోతున్నాం.. అంతా భయం .. భయం.. భయం.. చస్తా మేమోనని భయం..
_చావొస్తుందేమోనని భయం.. బతకాలి..మనం మాత్రమే బతకాలి..
_ఏ కరోనాలు సోకకుండా మనం, మన పిల్లలు మాత్రం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి.. అంతే..అదే కావాలి.

👉రేపటి సంగతి ఏంటో తెలీదు.. 
_వ్యాక్సిన్లు వస్తాయో రావో తెలీదు..
_రేపటి తరం పరిస్థితి ఏంటో తెలీదు..
_బతకడమెలాగో అర్థం కావడం లేదు.
👉డబ్బులు లేనోళ్లకి చాలా మందికి పూట గడవడం లేదు.. డబ్బులెక్కువైనోళ్లకి సమయం గడవడం లేదు..
_ఇంకొన్నాళ్లకి చాలామంది మానసిక వ్యాధి గ్రస్థుల్లా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
_భయంతో ఇప్పటికే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వ్యాపారాలు దెబ్బతిని అల్లాడిపోతున్నారు.

👉ఇలాంటి విపత్కర సమయంలోనూ ఒకరికి ఒకరు సాయం చేసుకునే మంచితనం, మానవత్వం కనీసం మన దరిదాపుల్లోకి కూడా రావడం లేదు.
👉పక్కోడు తిండికి లేక అల్లాడుతున్నా.. ఉద్యోగం లేక బాధపడుతున్నా కనీసం స్పందించే హృదయం లేదు.. డబ్బంతా ఇళ్లల్లో, బ్యాంకుల్లో దాచుకుంటాం. 
👉అంతే అంతా కరోనా జీవితాలు..
👉అన్నీ బాధాతప్త  జీవితాలు….