3, ఫిబ్రవరి 2026, మంగళవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*639 వ రోజు*

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

పితృయజ్ఞము

ధర్మరాజు " పితామహా ! పితృయజ్ఞము గురించి నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! దేవతారాధన కంటే పితృదేవతలను ఆరాధించడం ఎంతో గొప్పది. మనుష్యులకు తమ పితృదేవతలను ఆరాధించడం సర్వశుభములు చేకూరుస్తుంది. ప్రతి అమావాస్య నాడు పితృయజ్ఞము, పిండప్రదానం భక్తిశ్రద్ధలతో చేసిన వాడు నిత్యము పితృదేవతలను ఆరాధించిన ఫలము పొందుతాడు. పితృయజ్ఞము చేయాలో వివరిస్తాను. పాడ్యమి నాడు పితృదేవతలను పూజించిన వాడు అందమైన భార్యను పొందుతాడు. విదియనాడు పితృదేవతలను పూజించిన వాడికి అందమైన కుమార్తెలు జన్మిస్తారు. తదియ, చవితి తిధుల నాడు పితృదేవతల పూజించిన వాడు ధనికుడు ఔతాడు. పంచమినాడు పితృదేవతలను పూజించిన వాడు పుత్రవంతుడు ఔతాడు. షష్ఠి నాడు పితృదేవతల పూజించిన వాడు విద్యావంతుడు ఔతాడు. సప్తమినాడు పితృదేవతల పూజించిన వాడు వ్యవసాయ భూములకు అధిపతి ఔతాడు. అష్టమినాడు పితృదేవతల పూజించిన వాడు వ్యాపారవేత్త ఔతాడు. నవమినాడు పితృదేవతల పూజించినవాడు ఆవుల మందలను పొందుతాడు. దశమినాడు పితృదేవతల పూజించినవాడు లోహసంపదలు పొందుతాడు. ఏకాదశి నాడు పితృదేవతల పూజించినవాడు మంచి కుమారులను పొందుతాడు. ద్వాదశి, త్రయోదశినాడు పూజించినవాడు ధనధాన్యములను పొందుతాడు. చతుర్ధశినాడు పితృదేవతల పూజించినవాడు వీరస్వర్గం పొందుతాడు. పౌర్ణమి అమావాస్యలనాడు పితృదేవతల పూజించినవాడు సకలకోరికలను పొందగలడు.

పితృకార్య విధులు

ధర్మనందనా ! శ్రాద్ధకర్మ చేయుటకు కృష్ణపక్ష తిధులు, అపహార్ణము మంచివి. కాని పాడ్యమి, దశమి, చతుర్ధశి పితృ కార్యముకు పనికి రావు. పితృ కార్యములో తిలలు, పాయసము, నెయ్యి ఉత్తమము. ఆవుల పాలు, పెరుగు, వెన్న, నెయ్యి శ్రేష్టము. మత్స్యములు, మాంసము తగినంతగా ఉపయోగించిన ఫలితము లభిస్తుంది. పితృదేవతల అర్చనలో గొర్రె మాంసం, ఖడ్గ మృగ మాంసం, గండ మృగ మాంసం, మేక మాంసం, ఒక దాని కంటే ఒకటి మేలైనవి.

నక్షత్రాలు పితృకార్య విధులు

కృత్తిక నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన శత్రుభయం ఉండదు. రోహిణి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన పుత్రసంతానప్రాప్తి కలుగుతుంది. మృగశిర నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఓజస్సు ప్రాప్తిస్తుంది. ఆరుద్ర నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన క్రూరుడౌతాడు. పునర్వసు నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన తన కృషిఫలిస్తుంది. పుష్యమి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన మంచి పుష్టిగా ఉంటారు. ఆశ్లేష నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన వీరకుమారులు జన్మిస్తారు. మఖ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన కులము వర్ధిల్లుతుంది. పూర్వ ఫల్గుణి నక్షత్రము పితృకార్యం నిర్వహించిన సౌభాగ్యవంతులు ఔతారు. ఉత్తర ఫల్గుణి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన సంతానవంతులు ఔతారు. హస్త నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన కార్యసఫలత సిద్ధిస్తుంది. చిత్త నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన 'అందమైన సంతానం కలుగుతుంది. స్వాతి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన వర్తక వాణిజ్యములు వృద్ధి చెందుతాయి. విశాఖ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనూరాధ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన రాజ్యాధికారం దక్కుతుంది. జ్యేష్ట నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన రాజపూజితులు ఔతారు. మూల నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన సకలశోకాలు తొలగి పోతాయి. శ్రవణ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. ధనిష్ఠ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన రాజ్యాధికారం ప్రాప్తిస్తుంది. శతభిష నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన కార్య సాఫల్యత సిద్ధిస్తుంది. పూర్వాబాధ్ర నక్షత్రము, ఉత్తరాబాధ్ర నక్షత్రములలో పితృకార్యం నిర్వహించిన గోసంపద పెరుగుతుంది. రేవతి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన లోహవృద్ధి కలుగుతుంది. అశ్వని నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన అశ్వసంపదవృద్ధి చెందుతుంది. భరణి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఆయుః ప్రమాణం వృద్ధి చెందుతుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: