25, ఆగస్టు 2026, మంగళవారం

తెలుగు తల్లి

 మొన్న కలలో తెలుగు తల్లి కనిపించింది. "అమ్మా! బాగున్నావా? "అంటే కంట నీరు పెట్టుకుంది.


 "ఏమమ్మా, ఎందుకా కన్నీరు?"  అంటే ఇలా చెప్పుకొచ్చింది.

"కామేశం! అచ్చులలో ఋ ఋ, ఌ , ౡ లను ఎప్పుడో తీసేసేరు. ఋషులంతా రుషులయ్యేరు, లాయం అని రాయడమూ తెలియక దాని అర్ధమూ తెలియక  ఌ, ౡ లను ఖండించేరు. ఇక విసర్గ వాడకం ఎప్పుడో పోయింది. ఇక హల్లుల విషయానికి వస్తే "క"వర్గంలోని అను నాసికం ఎప్పుడు ఎలా వాడాలో ఎవరికీ తెలియకుండాపోయింది. "చ" వర్గంలో ఉన్న మరో ౘ, ౙ లను అందరూ మరచిపోయేరు.

ఇక ఉభయాక్షరాలకొస్తే శకట రేఫ అదేరా!  బండి  "ఱ" వాడకమే లేదు. అందరూ 'ర' తో సరిపెట్టుకుంటున్నారు.


పోనీలే పిల్లలు అని సరిపెట్టుకుంటే ఈ మధ్య మరో సమస్య రా!

'ళ' బదులు 'ల', 'ణ' బదులు 'న' వాడేస్తున్నార్రా!


కళ్ళు, పెళ్ళి అనడానికి కల్లు, పెల్లి అంటునారు. కల్లు అంటే ఏమిటో నీకు తెలుసుగా, తాటి కల్లో ఈత కల్లో కాదూ, అదీ కాకపోతే సన్ని కల్లూ, ఉప్పు కల్లూనూ.


ఇక వీణ, జాణ అనడానికి బదులు వీన,జాన అంటునారు, వేణుని వేను అంటున్నారు.


ఇలా నా శరీరంలోని ఒక్కొక్క అక్షర భాగాన్ని తొలగిస్తూ పోవడం న్యాయమా చెప్పు? " అంటూ వాపోయింది.


పోతనగారైతే 'కాటుక కంటినీరు' అని పద్యం ఎత్తుకునేవారు. ఆయన మహానుభావుడు కనుక, నేను మామూలు భావు(కు)ణ్ణి కనుక ఇదిగో ఇలా!


ఏటికి మాకు కావలయు నేబదియారగు నక్షరమ్ములున్‌  

మాటల తీరు తెన్నులను మార్చిన నేమగునంచు 

నీ నాటికి తల్లినెంతగనొ నవ్వుల పాలొనరించు చుండ తా 

కాటుక కంట నీరొల్కగా తెలుగమ్మయె కుంగి పోదొకో 


మిత్రులూ,  అందరం కలిసి కట్టుగా మన తెలుగమ్మను కాపాడుకుందాం. పిల్లలకు తెలుగు నేర్పుకుందాం, తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుకుందాం. తెలుగు టంకణం (టైపింగ్) నేర్చుకుందాం. వ్యాఖ్యలన్నీ చక్కగా తెలుగులోనే వ్రాసుకుందాం. ఏమంటారు? తెలుగుకు పట్టిన తెగులుకు దేహశుద్ధి చేద్దాం. 

జై తెలుగు తల్లీ!  

🙏🌹🙏🌹🙏


సంగ్రహించిన వ్యాసం, చాలా బావుంది ఎవరు వ్రాసారో వారికి నమస్సులు 🙏🏽

కామెంట్‌లు లేవు: