2, అక్టోబర్ 2026, శుక్రవారం

అబ్బాయి ఏం చేస్తాడు?

  మన దగ్గర అరేంజ్డ్ మ్యారేజ్ అనగానే ముందుగా వచ్చే ప్రశ్న: "అబ్బాయి ఏం చేస్తాడు?"


అప్పారావు కుటుంబం కూడా అబ్బాయికి సంబంధం చూడటానికి అమ్మాయి ఇంటికి వెళ్ళారు. 


టీ బిస్కెట్స్ మరియు కుశలప్రశ్నలు అన్నీ అయిపోయాక, అమ్మాయి తండ్రి నెమ్మదిగా అసలు విషయం మొదలుపెట్టారు:


ఇంతకీ మీ అబ్బాయి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు?"


అప్పారావు కళ్ళద్దాలు సరిచేసుకుని, గొంతు సవరించుకుని, ఇలా చెప్పడం మొదలు పెట్టేడు.


మా వాడు ప్రస్తుతం ఒక అగ్రో-బేస్డ్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ (Agro-based D2C) స్టార్టప్ కి ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. 


మేము ప్రధానంగా ఆర్గానిక్ హెల్త్ అండ్ వెల్నెస్ రంగంలో డీల్ చేస్తున్నాము అన్నాడు.


ఇది వినగానే అమ్మాయి తండ్రి సగం ఇంప్రెస్ అయిపోయాడు. 


 "వావ్! ఇంతకీ మీ ప్రొడక్ట్ ఏంటి?" అన్నాడు.


అప్పుడు అప్పారావు 


"మావాడి పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా హై-ప్రోటీన్ రోస్టెడ్ లెగ్యూమ్స్ (Roasted Legumes) మరియు సాంప్రదాయకమైన కారమెలైజ్డ్ స్వీట్స్ ఉంటాయి.


మేము ముడి పదార్థాలను నేరుగా హోల్ సేల్ సప్లై చైన్ నుండి సేకరించి, మా స్వంత థర్మల్ ప్రాసెసింగ్ యూనిట్ లో డ్రై-రోస్ట్ చేస్తాము.


అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. మా ప్యాకేజింగ్ 100% 

పర్యావరణహితమైనది మరియు బయోడిగ్రేడబుల్!" అన్నాడు.


అమ్మాయి కుటుంబ సభ్యులు ఇదంతా విని ఆశ్చర్యపోయారు. వీరిది ఏదో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలా అనిపించింది వాళ్లకి!



అమ్మాయి బాబాయ్ తట్టుకోలేక  "ఇంతకీ మీ కంపెనీ మెయిన్ ఆఫీస్ ఎక్కడ? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు?"



అప్పారావు తడుముకోకుండా


ఇప్పుడు అంతా. ఆధునిక లీన్ స్టార్టప్ (Lean Startup) యుగం. 


అందుకే షాపు అద్దెలు, కరెంటు బిల్లుల వంటి అనవసర ఖర్చులు మేము చేయము. 


మాకు ఒక మొబైల్ రిటైల్ అవుట్‌లెట్ ఉంది, ట్రాఫిక్ మరియు జనం రద్దీని బట్టి అది రోజుకో చోట ఉంటుంది. ఇక ఆపరేషన్స్ అంతా మా అబ్బాయే చూసుకుంటాడు — హి ఈజ్ ఏ సోలోప్రెన్యూర్ (Solopreneur)!" అన్నాడు.



అమ్మాయి తండ్రికి పూర్తిగా మతిపోయింది. ఈ ఇంగ్లీష్ తన బుర్రకి అస్సలు ఎక్కడం లేదు.


అయ్యా "నాకీ మార్కెటింగ్ భాష సరిగ్గా అర్థం కావడం లేదు. అసలు అబ్బాయి ఏం చేస్తాడో మామూలు మాటల్లో చెబుతారా?"అన్నాడు.


అప్పుడు అబ్బాయి పక్కనే ఉన్న  ప్రాణస్నేహితుడు మెల్లగా నోరు విప్పాడు:


"అంకుల్.. ఆయన చెప్పేది ఏంటంటే.. మా వాడు హైవే పక్కన, 

బండి మీద వేయించిన వేరు శనగ కాయలు, అమ్ముతాడు.


పెనం మీద ఇసుకలో శనగలు వేయిస్తాడు (థర్మల్ ప్రాసెసింగ్).. వాటిని పాత న్యూస్ పేపర్ కాగితాల్లో చుట్టి ఇస్తాడు (బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్)


అమ్మాయి తండ్రి  చేతిలో టీ కప్పు దబాలున నేల మీద పడి ముక్కలైంది.


Of course పెళ్లి చూపులు ఏమై ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా


నీతి: మార్కెటింగ్ పదాల మాయాజాలం చాలా శక్తివంతమైనది. మీ ప్రెజెంటేషన్ గనుక బలంగా ఉంటే, ఒక వేరుశనగ బండి వ్యాపారం  కూడా కార్పొరేట్ స్టార్టప్‌లా చూపించవచ్చు.


వైరల్ అవుతున్న ఒక ఆంగ్ల కథకు తెలుగు స్వేచ్ఛానువాదం.-Marketing at its  best...

కామెంట్‌లు లేవు: