(బ్రహ్మం నిర్లిప్తం - దుఃఖాదులు జీవుడికే)
ఈ లోకంలో విద్యామాయ, అవిద్యామాయ రెండూ ఉన్నాయి. జ్ఞానం, భక్తి ఉన్నాయి. అలాగే కామినీ కాంచనాలు కూడా ఉన్నాయి. ధర్మాధర్మాలు, మంచి చెడ్డలు ఉన్నాయి. కాని బ్రహ్మం నిర్లిప్తం, మంచి చెడ్డలు జీవుల పట్లే సుమా!
ధర్మాధర్మాలు కూడా జీవులపట్లే! బ్రహ్మాన్ని ఇవేవీ అంటవు. ఒకే దీపం వెలుగులో ఒకడు భాగవతాన్ని చదువుతాడు; మరొకడు దొంగ సంతకాలు చేస్తాడు. కాని దీపం నిర్లిప్తమే సుమా! సూర్యుడు సజ్జనుల మీదా దుర్జనుల మీదా ఒకే రీతిలో ప్రకాశిస్తాడు.
“దుఃఖం, పాపం, అశాంతి ఇవన్నీ ఏమిటని అడుగుతావా -ఇవన్నీ జీవుడిపట్లనే! బ్రహ్మం నిర్లిప్తం. పాముకు విషం ఉంది. అది కాటువేస్తే మరణిస్తారు. కాని పాముకు ఏ హానీ వాటిల్లదు.
(బ్రహ్మం అనిర్వచనీయం)
“బ్రహ్మం ఏమిటో నోటితో చెప్పలేం. వేదాలు, పురాణాలు, షడ్దర్శనాలు అన్నీ నాలుకతో ఉచ్చరించబడినవి. అందుచేత ఎంగిలి అయినవి. బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాని వస్తువు. బ్రహ్మం ఏమిటో నేటిదాకా ఎవరూ చెప్పలేక పోయారు.
ఒక తండ్రికి ఇద్దరు కుమారులుండేవారు. బ్రహ్మవిద్య నేర్వటానికి ఇద్దరినీ ఒక గురువు వద్ద ఉంచాడు. కొన్ని ఏళ్లు గడిచాక వారిద్దరూ గురుకులవాసం నుండి తిరిగివచ్చి, తండ్రికి నమస్కరించారు. వీరికి ఎలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్దకుమారుణ్ణి దగ్గరకు పిలిచి, ‘నాయనా! నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా! బ్రహ్మం ఎలాంటిదో కాస్త వర్ణించు' అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు వేదాలనుండి అనేక శ్లోకాలను వల్లిస్తూ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించసాగాడు. తండ్రి మౌనంగా విన్నాడు. ఆ తరువాత చిన్నకుమారుణ్ణి అలాగే ప్రశ్నిస్తే, అతడు తలవంచుకొని మౌనం పాటించాడు. నోటినుండి ఒక్కమాటైనా వెలువడలేదు. చిన్నకుమారుడి ఈ ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతడితో ‘నాయనా! బ్రహ్మాన్ని గురించి నువ్వు కొంత తెలుసుకోగలిగావు. బ్రహ్మం ఎలాంటిదో నోటితో చెప్పలేం' అన్నాడు.
“భగవంతుణ్ణి తెలుసుకొన్నాం అనుకొంటారు మనుషులు. చీమ ఒకటి చక్కెర పర్వతం వద్దకు వెళ్లింది. ఒక్క చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరో కణాన్ని నోట కరుచుకొని ఇంటి దారిపట్టింది.
దార్లో అది ‘ఈసారి వచ్చి పర్వతాన్నంతా తీసుకెళతాను’ అంటూ తలపోయసాగింది. అల్పజీవులు కూడా బ్రహ్మం విషయంలో ఇలాగే భావిస్తారు. బ్రహ్మం అవాజ్మానస గోచరమని ఎరుగరు. ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని తెలుసుకోగలడా? శుకమహర్షి ప్రభృతులు గండుచీమల వంటివారు. ఏడో, ఎనిమిదో లేక పదో కణాలు నోట్లో పెట్టుకోగలరు. అంతమాత్రమే.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి