13, నవంబర్ 2026, శుక్రవారం

కరివేపాకు యొక్క ఉపయోగాలు -

 కరివేపాకు యొక్క ఉపయోగాలు - 

   

ఇది సామాన్యంగా ప్రతి ఇంటిలోనూ పెంచుతారు. అలాగే ప్రతిరోజూ వంటలలో దీనిని వాడతారు. కాని దీనికి ఆయుర్వేదంలో కొంచం విశిష్టస్థానం ఉన్నది. కాని చాలా మందికి దీని ఉపయోగాలు తెలియవు. వాటిని మొదటిసారిగా మీకు పూర్తిగా వివరిస్తాను. 

  

ఉపయోగాలు - 

 

* కరివేపాకు నీడన ఎండించి చూర్ణం చేసుకుని నిలువ ఉంచుకొని ఆ చూర్ణం 4 చిటికెలు 5 ml గోరువెచ్చటి నీటితో సేవిస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది పరగడుపున మాత్రమే చేయాలి .


 * కరివేపాకు వేరుని కచ్చాపచ్చా కొట్టి నీళ్లలో వేసి కషాయం కాచుకొని అరగ్లాసు సేవిస్తే కడుపులోని ఎలుకపాములు , నులిపురుగులు వంటి క్రిములని చంపును. 

 

* ఈ కషాయం సేవించడం వలన చర్మం మృదువుగా మారును. ఇదే కషాయాన్ని పైన పూతగా రాస్తుంటే చర్మవ్యాధులు హరించును . 


 * కరివేపాకు నూరి ఆ రసం 30ml లొపలికి తీసుకుంటే జ్వరం కలిగినప్పుడు వచ్చే వికారాలు హరించి జ్వరాన్ని అదుపులో ఉంచును. 

 

* కరివేపాకు పచ్చిపుల్ల ఉపయోగించి దంతదావనం చేసుకోవడం వలన చిగుళ్ళని శుభ్రపరచును. నోటి దుర్గంధం పోగొట్టి అరుచి అనగా ఏది తినినను రుచి లేకపోవడం ని నివారిస్తుంది. 


 * కరివేపాకు ముద్దగా నూరి విషకీటకాలు కుట్టినచోట ఉంచి కట్టుకడితే విషం హరించి దద్దుర్లు పోవును . 

 

* పావులీటరు నీటిలో రెండుగుప్పెళ్ళు కరివేపాకు వేసి కషాయం లా కాచి వడకట్టుకొని ఆ కషాయం రెండు స్పూన్ల చొప్పున కొంచంకొంచం సమయం తీసుకుని లోపలికి సేవించడం వలన ఇది బంక మరియు జిగట విరేచనాలను కట్టును. వాంతులు అవుతున్న సమయంలో తీసుకుంటే వాంతులు కట్టును . లోపల ఉండు శ్లేష్మం బయటకి పంపును . విరేచనం మందం పోగోట్టును  

 * కరివేపాకు చూర్ణం రోజూ 4 చిటికెలు 5 gms తేనెతో సేవిస్తుంటే మూత్రం జారీచేయును. 

 

* కరివేపాకు , ధనియాలు సమంగా తీసుకుని దోరగా నూనెలో వేయించి బాగా మెత్తగా చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక టీస్పూన్ చొప్పున రెండుపూటలా ఆహారంతో కలిపి తీసుకుంటూ ఉండిన జీర్ణశక్తి వృద్ది అయ్యి గ్యాస్ సమస్య నివారణ అగును. 

  

* కరివేపాకు 50 గ్రాములు తీసుకుని నూరి ముద్దగా చేసుకోవాలి . ఆవనూనె 50 గ్రాములు తీసుకుని ఒక కొత్తపాత్ర లో పోసి సన్నసెగ మీద పొయ్యి మీద ఉంచి నూనె కాగగానే కరివేపాకు నూరిన ముద్దని నూనెలో వేసి ముద్ద పూర్తిగా కరిగి బాగా ఇగిరిపోయేంతవరకు ఉంచి దించి చల్లార్చి ఒక గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. 

           

      ఇలా తయారుచేసిన తైలముని గజ్జి , చిడుము , దద్దుర్లు మొదలైన చర్మవ్యాధులలో పైకి లేపనంగా వాడితే అద్భుతముగా పనిచేయును. 

 

* కరివేపాకు చూర్ణం 5 గ్రాములు గొరువెచ్చటి నీటితో సేవిస్తే కడుపులో గడబిడ , వికారాన్ని పొగొట్టును. పట్టేసిన గ్యాస్ విడుదల చేయును . 


 * కరివేపాకు వేరు కషాయం తో పగిలిన వ్రణాలని కడిగితే అవి శుభ్రపడును. పిదప అవి మాడుటకు వేరే ఔషదాన్ని సేవించాలి. 

 

* కరివేపాకు , మెంతులు కలిపి నూరి చర్మవ్యాధులు పైన ఆ రసాన్ని పూస్తూ ఉంటే అవి తొందరగా మాడిపోతాయి . 


 

కామెంట్‌లు లేవు: