*ॐ శ్రీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు*
*వందే వాల్మీకి కోకిలమ్*
*కూజంతం రామరామేతి*
*మధురం మధురాక్షరం I*
*ఆరుహ్య కవితాశాఖాం*
*వన్దే వాల్మీకి కోకిలమ్॥*
*- కవిత్వం అనే కొమ్మపై ఎక్కి,*
*-"రామరామ" అనే మధురాతిమధురమైన అక్షరాలను కూయు,*
*- వాల్మీకి అనే కోకిలకు వందనము.*
*(కోకిల అంటే*
*"క్రోకతి శ్రోతుచిత్తం లాతీతి కోకిలః"*
*- వినేవారి చెవులను ఆకర్షించేది)*
*వాల్మీకి మహర్షి పేరు వినగానే, వెంటనే మనకు "శ్రీమద్రామాయణం" స్ఫురిస్తుంది. అది ఆదికావ్యం*
*రామాయణం ప్రత్యేకత*
*వాల్మీకి మహర్షి, బ్రహ్మదేవుని అనుగ్రహంతో,*
*రామాయణ కథా - ఆ కథలోని పాత్రలూ, వాటి అంతరంగాలూ కూడా అవగతమయ్యేలా, తన మనో నేత్రంతో చూసి, వ్రాసినదే "శ్రీమద్రామాయణం".*
*ఇదే మొదటి కావ్యం కాబట్టి, దీనిని "ఆదికావ్యం" అంటాం.*
*"వేద ధర్మాన్ని వివరించేదిగా" మహర్షి పేర్కొనడం దీని ప్రత్యేకత.*
*భూమండలం మీద "పర్వతాలూ - నదులూ ఉన్నత కాలమూ" ఈ "రామాయణ" కథ లోకంలో నడుస్తుందని*
*సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వాల్మీకి మహర్షి వద్దకే వచ్చి, తెలిపి, వ్రాయమన్నాడంటే,*
*ఆ కావ్యం ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది.*
*విజ్ఞాన సర్వస్వం*
*జీవనవిధానాలనేవి*
*- ప్రాంతాలబట్టీ వ్యత్యాసాలున్నా,*
*- కాలాలనిబట్టీ మారినా,*
*అందఱికీ, అన్ని కాలాలకీ*
*"ఆలోచన - మాట - చేత"లకి సంబంధించి,*
*చక్కని ప్రవర్తనకి ఉపయోగపడే - విజ్ఞాన సర్వస్వం" శ్రీమద్రామాయణం.*
*వివిధ విద్యావిషయాలకు ప్రామాణిక ఆదర్శం*
*ఒక్కొక్కరూ ఒక్కొక్క విషయంలో మాత్రమే నిష్ణాతులయ్యే అవకాశం ప్రస్తుత విద్యావ్యవస్థలో మనకి కనిపిస్తుంది.*
*అదీకూడా, అనేక పరిశోధనలు చేస్తూ, వచ్చే ఫలితాలు పాత పరిశోధనల ఫలితాలతో విభేదిస్తూ ముందుకువెళ్ళే వ్యవస్థే మనకి తెలుసు.*
*ఉదా॥ పరమాణు నమూనా - ఎలక్ట్రాన్ విషయాలకి సంబంధించి రూథర్ ఫర్డ్, థామ్సన్, నీల్స్ బోర్, సోమర్ ఫీల్డ్ వంటి శాస్త్రవేత్తలు ఒకరి తరువాత ఒకరు భిన్న నిర్వచనాలనివ్వడమే దీనికి గొప్ప ఉదాహరణ.*
*కానీ శ్రీమద్వాల్మీకి రామాయణం ఏ విషయమైనాసరే, దానిపై ప్రత్యేకంగా పరిశోధనతో ముందుకు వెళ్ళవలసిన అవుసరంలేక, ఆ విషయంమీద ఆదర్శంగా కనిపించే విధానంతో, విషయాన్ని లోతుగా సమగ్రంగా వివరిస్తూ, అన్ని విద్యావిషయాలనీ అందిస్తుంది.*
*వాటిలో ప్రధానమైనవి కొన్ని*
*1.చరిత్ర*
*2.సార్వభౌమత్వము - సామ్రాజ్య విధానము*
*3.భూగోళ శాస్త్రము*
*4.ఆర్థిక, వాణిజ్య విషయాలు*
*5.పరిపాలనావిధానం*
*6.గణితం - సంఖ్యాశాస్త్రం*
*7.భౌతిక శాస్త్రాలు*
*8.జీవశాస్త్రం*
*9.సాంకేతిక విజ్ఞానం*
*10.వైద్యశాస్త్రం*
*11.ప్రజా జీవనం - నాగరికత*
*సార్వకాలీనం*
*ఏ కాలంలోనైనా, జీవన విధానాలు కాలాన్నిబట్టీ మారుతున్నా,*
*ఏ కాలానికైనా మౌలిక విషయాలు కొన్ని అత్యవసరం.*
*వాటిలో ముఖ్యమైన కొన్ని*
*- దోపిడీ వ్యవస్థ ఏర్పడకుండానూ, ఒకవేళ ఏర్పడితే, దానిని తొలగించడానికి ముఖ్యమైనవిగా "సత్య - ధర్మా"ల ప్రయోగం.*
*- ప్రకృతిని చెరిపే పర్యావరణ హానికి విరుగుడుగా "ప్రకృతి ఆరాధన - ఆస్వాదన".*
*- మానవీయ సంబంధాలు "రాక్షస ప్రవృత్తికి" దిగజారకుండా*
*"దైవీ" సంబంధమైన స్థాయికి ఎదగడం.*
*ఈ సార్వకాలీన విషయాలు స్పష్టంగా తెలుపుతూ వివరించేదే రామాయణం.*
*ఇది వ్యక్తులకీ, సమూహాలకీ, ప్రకృతికీ సర్వరోగ నివారిణి మాత్రమేకాక, సుఖజీవనానికి దోహదపడుతుంది.*
*"సత్యం వద - ధర్మం చర" అని చెప్పే వేదధర్మం సార్వకాలీనం.*
*"సత్యమేవ జయతే" అనేది ఉపనిషద్వాక్యం.*
*వేదధర్మాన్ని వివరించిన "రామాయణం" కూడా, ఆవిధంగా, సార్వకాలీనమే అవుతుంది కదా!*
*జనబాహుళ్యంలో ఆవశ్యకత*
*వేదం నేర్చుకోవాలంటే, అందఱికీ సాధ్యమయేపనీ కాదు. పైగా సమయం కూడా ఎక్కువ కావాలి.*
*అందుకనే వేదాన్ని వివరిస్తూ (వేద ఉపబృంహణం), వేద ధర్మాన్ని సర్వులకూ రామాయణం తెలుపుతుంది.*
*తద్వారా, వేదధర్మంగా రామాయణం పండితులకేకాక, పామరులకి కూడా సులువుగా అర్థమవుతూ,*
*ఆచరించవలసిన విషయాలు - విసర్జించవలసిన విషయాలూ చక్కగా తెలియజేస్తుంది.*
*విశ్వ ప్రయోగశాల - ప్రయోగ దీపిక*
*ఏఏ పనులు చేస్తే - వాటి పర్యవసానాలు ఏఏ విధంగా ఉంటాయో తెలిపే "ప్రయోగ దీపిక"యే శ్రీమద్రామాయణం.*
*"ప్రపంచమ"నే ప్రయోగశాలలో, "జీవితం" అనే ప్రయోగం చేస్తున్న మానవులందఱికీ ప్రయోగ దీపిక (manual)గా అన్ని సమయాలలోనూ అవుసరమైనది "శ్రీమద్రామాయణం".*
*రచయిత - రాయల్టీ*
*ప్రస్తుత కాలంలో, ఏ పుస్తకమైనా వ్రాసిన రచయితకి అమ్మకం ద్వారా "రాయల్టీ" లభించడం చూస్తూంటాం.*
*కానీ సృష్టికర్త తాను ఎన్నుకొని, సమస్తమానవాళికి సుఖశాంతులని అందించే గ్రంథ - రచయితగా "కారణ జన్ముడైన" వాల్మీకి మహర్షిని ఆదేశించారు.*
*ఆ గ్రంథాన్ని అవగతం చేసికొంటూ, మనం "శ్రీరాముడు"గా అయి, మనలోని "రావణు"ని అంతం చేయడమే*
*- వాల్మీకి మహర్షికి మనం ఇచ్చే "రాయల్టీ"*
*అదే వాల్మీకి జయంతి మనకి అందిచ్చే సందేశం.*
*=x=x=x=*
*— రామాయణం శర్మ*
*భద్రాచలం*
*(ద్వారకా తిరమల మకాం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి