*ॐ కృతఘ్నత*
*"కృతఘ్నత" (ఇతరులు మనకు చేసిన మేలు మరచి పోవడం) మహాపాపం.*
*అన్ని పాపములకు "ప్రాయశ్చిత్తం" శాస్త్రములలో చెప్పబడి ఉంది.*
*కానీ "కృతఘ్నతా దోషానికి" మాత్రం ప్రాయశ్చిత్తం లేదు.*
*భగవంతుడు కూడా ఈ దోషాన్ని పోగొట్టలేడు.*
*ఒక్క సద్గురువు మాత్రమే ఈ దోషమునుండి భక్తులను కాపాడగలరు.*
*కృతఘ్నతా దోషము పాలుగాకుండా, ఒక మహా పండితుని శ్రీ కంచి పరమాచార్యులవారు అనుగ్రహించిన సంఘటన ఒకటి ఇప్పుడు చెప్పుకుందాము.*
*అనంతపురంలో "మొదలి శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు" అనే వేద విద్వాంసులు ఉండేవారు.*
*వారు అనేకమంది శిష్యులకు వేదము చెప్పేవారు. సంస్కృతములో కూడా గొప్ప పండితులు.*
*అనంతపురం, ప్రభుత్వ కళాశాలలో సంస్కృత భాషోపన్యాసకులుగా ఉద్యోగం చేసే వారు.*
*మా బావమరిది శ్రీ అమ్మనమంచి శివప్రసాదు, అనంతపురం వైశ్యాబాంక్ లో పనిచేస్తుండగా వీరి సాంగత్యం లభించి, వీరి శిష్యులైనారు. వీరిదగ్గర "అరుణము", మొదలైనవి అధ్యయనం చేశారు.*
*వారికి శ్రీ శర్మగారు స్వయముగా చెప్పినదే ఈ వృత్తాంతమంతా.*
*శ్రీ శాస్త్రిగారు నిత్యము " సప్తశతి"పారాయణ చేసేవారు.*
*అనేకమంది చేత చండీయాగములు చేయించారు.*
*ఆగమ శాస్త్ర పండితులు కూడా కాబట్టి అనేక దేవాలయ ప్రతిష్టలు కూడా నిర్వహించారు.*
*నెల్లూరు దగ్గరవున్న" పెంచలకోన" లో శ్రీ విజయేశ్వరి అమ్మవారు అనేకసార్లు వీరిచేత తమ ఆశ్రమంలో చండీయాగములు చేయించారు.*
*ఒకసారి శ్రీ కంచి పరమాచార్యులవారు అనంతపురంలో పదిరోజులు బస చేశారు.*
*శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు రోజూ వారిని దర్శించుకునేవారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామివారు వీరితో మాట్లాడేవారు కాదు.*
*అందరితో మాట్లాడుతూ, ప్రత్యేకంగా, ఆ ఊరిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వీరితో మాత్రం శ్రీ స్వామివారు మాట్లాడక పోవడము అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించేది.*
*శ్రీ స్వామి వారు తనతో మాట్లాడక పోవడముతో శ్రీ శర్మగారు ఎంతో మనస్తాపం చెందారు.*
*కారణము తెలియక వారికి రోజు రోజుకు దుఃఖము అధిక మవుతుండేది.*
*ఇలా పదిరోజులు గడిచినై.*
*శ్రీ స్వామివారు అక్కడనుండి "ధర్మవరము" నకు ప్రయాణమయినారు.*
*శ్రీ శర్మగారు చింతాగ్రస్తులయినారు. ఏమైనా సరే, శ్రీ స్వామివారు మాట్లాడేదాకా వారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.*
*"నేను ఎప్పుడు వస్తానో తెలియదు.అప్పటివరకు సెలవు మంజూరు చేయ వలసినది" అని కళాశాలకు సెలవు చీటీ పంపించి, శ్రీ స్వామివారి వెంట ధర్మవరము వెళ్లారు.*
*శ్రీ స్వామివారు నదీ స్నానం ఆచరిస్తుండగా అక్కడ నిలబడి " అఘమర్షణ " సూక్తము మొదలైన స్నాన మంత్రములు చదివారు.*
*మంత్రములు చదవటం పూర్తి అయినా, శ్రీ స్వామివారు, ఇంకా స్నానం చేస్తూనే ఉన్నారు.*
*శ్రీ శర్మగారు కొంత తటపటాయిస్తూ "రుద్రము" చదవటం మొదలుపెట్టారు.*
*శ్రీ స్వామివారు చదవమని చేయి ఊపి సైగ చేశారు.*
*పది రోజుల తరువాత అదే మొదటిసారి శ్రీ స్వామివారు, శ్రీ శర్మగారివంక చూడటము.*
*శ్రీ శర్మగారు మహదానంద భరితులయినారు.*
*సాయంకాలము ఊరి వారందరితో కూడిన సభ జరుగుతున్నది. శ్రీ స్వామివారు ఉన్నట్లుండి శ్రీ శర్మగారిని పేరు పెట్టి పిలిచి, వేదికపైకి రమ్మన్నారు.*
*శ్రీ శర్మగారు వేదికపైకి వెళ్లి శ్రీ స్వామివారికి " న కర్మణా న ప్రజయా" అని వేదమంత్రం చదువుతూ సాష్టాంగ నమస్కారం చేశారు.*
*శ్రీ పరమాచార్యులవారు వీరితో సంస్కృతములో సంభాషణ ప్రారంభించారు.*
*"మీరు మీ గురువులను విస్మరించారు*
*మీ కుటుంబము వారందరికి శ్రీ శృంగేరీ జగద్గురువులతో ఎన్నో తరములనుండి అనుబంధము ఉన్నది.*
*మీకు చిన్న తనములో నత్తి వల్ల మాటలు సరిగా రాకపోవడంతో మీ ఇంట్లో వారందరు దిగులు పడ్డారు.*
*మీ తాతగారు, మిమ్ములను, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములవారి సన్నిధికి తీసుకు వెళ్లి విషయం విన్నవించారు.*
*జగద్గురువులు మీ నోరు తెరవమన్నారు. ఎంతో అనుగ్రహంతో మీ నాలుకమీద వారి అమృతదృష్టి ప్రసరింపజేసి, చిరునవ్వు నవ్వుతూ "ఈ అబ్బాయి గొప్ప పండితుడు అవుతాడు. చాలా ప్రఖ్యాతి సంపాదిస్తాడు" అని ఆశీర్వదించారు.*
*ఆ క్షణం నుండీ మీకు నత్తి పోయింది స్పష్టమైన ఉచ్ఛారణ వచ్చింది. వేదము, సంస్కృతము అధ్యయనం చేసి మంచి పండితులైనారు.*
*అటువంటి సద్గురువులను మీరు విస్మరించారు" అన్నారు.*
*శ్రీ శర్మగారు నిశ్చేష్టులైనారు.*
*ఒక్కసారిగా వారికి గతమంతా గుర్తుకు వచ్చింది.*
*తనను తన తాతగారు, శృంగేరీ తీసుకువెళ్లడము, జగద్గురువులు ఆశీర్వదించడము,తన విద్యాభ్యాసము, క్రమంగా శ్రీ జగద్గురువులను మరచి పోవడము అన్నీ జ్ఞప్తికి వచ్చినవి.*
*ఎంతో సిగ్గు పడ్డారు.*
*వారికి ఆశ్చర్యం కూడా వేసింది.*
*ఎప్పుడో తన చిన్నతనంలో జరిగిన ఈ విషయాలు శ్రీ స్వామివారికి ఎలా తెలుసు?*
*శ్రీ స్వామివారు సాక్షాత్తూ భగవంతుని అవతారం అనటానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలి?*
*తనకు "నత్తి" పోగొట్టి, వాక్పటుత్వము ప్రసాదించిన శ్రీ శృంగేరీ జగద్గురువులు కనులకు గోచరించారు. వారి మనస్సు భక్తి భావంతో నిండిపోయింది.*
*శ్రీ పరమాచార్యులవారికి సాష్టాంగ నమస్కారము చేశారు.*
*తాను శ్రీ శృంగేరీ జగద్గురువులను విస్మరించి గొప్ప పాపం చేశానని, మీరు నన్ను కాపాడాలని, శ్రీ పరమాచార్యులవారిని వేడుకున్నారు.*
*శృంగేరీ వెళ్తానన్నారు.*
*ఆ తరువాత వారిద్దరూ అనేక విషయములు మాట్లాడుకున్నారు.*
*శ్రీ శర్మగారి సందేహాలు ఎన్నో శ్రీ స్వామివారు తీర్చారు.*
*వారిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి అనుజ్ఞ ఇచ్చి పంపారు.*
*శ్రీ శర్మగారు అప్పటినుండి శ్రీశృంగేరీ వారితో తమ అనుబంధం కొనసాగించారు. అనేకమందికి,వేదము, సంస్కృతము చెప్పారు. అనేక గ్రంధాలు రచించారు.*
*అనేక సత్కార్యాలు చేసి జన్మ చరితార్ధము చేసుకొన్నారు.*
*దేహత్యాగ పర్యంతము ఏటువంటి రుగ్మతా లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో వున్నారు.*
*కృతఘ్నతా మహా దోషం నుండి తనను కాపాడిన శ్రీ పరమాచార్యులవారిని ఆ జన్మాంతమూ, స్మరించుకుంటూనే ఉండేవారు.*
*కేవలము తమ భక్తులనే కాదు, సన్మార్గంలో ఉండే వారందరినీ శ్రీ పరమాచార్యులవారు ఇలా కాపాడుతూ ఉంటారు.*
*శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః.*
*శుభమస్తు.*
*తూములూరి మధుసూదనరావు.*
*25-12-'21.*
**********
*పరమాచార్య నడిచే దైవం.*
*ఇప్పుడూ సమాధినించీ నడిపించే ఆ దైవానికి ప్రణామాలు.*
*"కృతఘ్నత" గురించి శ్రీరాముడు లక్ష్మణుని వాలివద్దకు పంపుతూ లక్ష్మణునితో అన్న మాట*
*కృతార్థా హ్యకృతార్థానాం*
*మిత్రాణాం న భవన్తి యే I*
*తాన్మృతానపి క్రవ్యాదాః*
*కృతఘ్నాన్నోపభుఞ్జతే ॥*
*- కిష్కింధకాండ 30/73*
*మిత్రులసహాయముతో తమ పనులను పూర్తి చేసికొని,*
*పిదప వారికి సహాయపడనివారు కృతఘ్నులు.*
*అట్టివారు చనిపోయిన పిమ్మట వారి కళేబరములను పచ్చిమాంసములను తినెడి క్రూరమృగములుగూడ ముట్టవు.*
*Even the carnivorous animals*
*dislike to eat the body of such ungrateful men*
*who do not help their friends even though they have received help and have achieved their objective.*
*— రామాయణం శర్మ*
*భద్రాచలం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి